పోలీస్ స్టేషన్‌పై భీకర దాడి.. పాకిస్తాన్‌లో 10 మంది అధికారుల మృతి

పోలీస్ స్టేషన్‌పై దాడి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో పోలీస్ స్టేషన్‌పై తీవ్రవాదులు చేసిన దాడిలో 10 మంది పోలీసు అధికారులు మృతి
    • రచయిత, కరోలిన్ డేవీస్, ఫ్లోరా డ్రూరీ
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

పాకిస్తాన్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో పోలీస్ స్టేషన్‌పై తీవ్రవాదులు చేసిన దాడిలో 10 మంది పోలీసు అధికారులు మృతి చెందగా, ఆరుగురు గాయాల పాలయ్యారు.

తీవ్రవాదులు, పోలీసుల మధ్య రెండున్నర గంటలపాటు భీకర కాల్పులు కొనసాగాయి.

తీవ్రవాదుల దాడిలో మృతిచెందిన 10 మంది పోలీసు అధికారుల పేర్లను బీబీసీ ప్రతినిధి అజిజుల్లా ఖాన్‌కు పంపుతూ- ఈ దాడిని ఆ ప్రాంత సీనియర్ పోలీసు అధికారి ధ్రువీకరించారు.

30 మందికి పైగా మిలిటెంట్లు సోమవారం జరిపిన దాడిలో తమ పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయారని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రొవిజనల్ పోలీసు చీఫ్ చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎఫ్‌పీ రిపోర్టు చేసింది.

మరో మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 8న పాకిస్తాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ దాడికి కారణం ఏంటి, గురువారం జరగబోయే ఎన్నికలతో దీనికి సంబంధం ఉందా అనే వివరాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు.

కొన్ని వారాలుగా పాకిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జనవరి 31 బుధవారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని నేషనల్ అసెంబ్లీకి చెందిన అభ్యర్థిని చంపేశారు.

పోలీసు స్టేషన్‌పై జరిగిన ఈ దాడిని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అర్షద్ హుస్సేన్ షా ఖండించారు. పోలీసు అధికారుల మృతిపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

పోలీస్ స్టేషన్‌పై దాడి

ఫొటో సోర్స్, Getty Images

చౌద్వాన్ పోలీసు స్టేషన్‌ను మూడు దిక్కుల నుంచి 30 మందికి పైగా తీవ్రవాదులు చుట్టుముట్టారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రొవిజనల్ పోలీసు చీఫ్ అఖ్తర్ హయత్ గందాపూర్ తెలిపారు. తొలుత స్నైపర్ గన్‌లతో కాల్పులు జరిపారని, ఆ తర్వాత గ్రనేడ్లతో దాడి చేసినట్లు చెప్పారు.

పూర్తిగా పోలీస్ స్టేషన్‌ను వారు తమ అధీనంలోకి తీసుకున్నారని తెలిపారు.

దాడి జరిగిన సమయంలో పోలీసు స్టేషన్‌లో 30 మందికి పైగా పోలీసులున్నారని ఆ ప్రాంత డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు అనిసుల్ హసన్ బీబీసీ ప్రతినిధి అజిజుల్లా ఖాన్‌కు చెప్పారు.

పోలీస్ స్టేషన్‌కు దగ్గర్లోని భవనం నుంచి మిలిటెంట్లు దాడి జరిపినట్లు తెలిపారు.

రెండేళ్లుగా తీవ్రవాదుల దాడులు, భద్రతా బలగాలతో, పోలీసులతో ఘర్షణలు, చంపడమే లక్ష్యంగా జరుగుతున్న ఘటనలు ఖైబర్ ఫఖ్తుంఖ్వా దక్షిణ ప్రాంతంలో బాగా పెరుగుతున్నాయి.

పాకిస్తాన్‌ ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. దేశంలోని 90,675 పోలింగ్ స్టేషన్లలో సగం స్టేషన్లను ‘సున్నితమైన’ అంటే ఘర్షణలు చోటు చేసుకునే ముప్పున్న స్టేషన్లుగా, లేదా ‘అత్యంత సున్నితమైన’ అంటే ఎక్కువ ముప్పున్న స్టేషన్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. స్థానిక భద్రతా పరిస్థితులు, ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనల చరిత్రను పరిగణనలోకి తీసుకుని వీటిని ఇలా వర్గీకరించింది.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌ ఎన్నికలు: మహిళా ఓటర్లపై బీబీసీ ప్రత్యేక కథనం ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)