‘మత్తు, పెయిన్‌కిల్లర్స్ ఇవ్వకుండానే ఆపరేషన్లు, నొప్పి తట్టుకోలేక రోదిస్తున్న రోగులు’

ఫొటో సోర్స్, AFP
- రచయిత, అలీస్ కడ్డీ
- హోదా, బీబీసీ న్యూస్, జెరూసలేం
హెచ్చరిక: ఈ కథనంలో కలచివేసే వివరాలు ఉన్నాయి.
రోగులకు మత్తు ఇవ్వకుండానే ఆపరేట్ చేస్తున్నామని, దీర్ఘకాలిక సమస్యలున్న వారిని అలాగే వదిలేస్తున్నామని, పరిమిత వైద్య సరఫరాలతోనే కుళ్లిన గాయాలకు చికిత్స చేస్తున్నామని గాజాలోని డాక్టర్లు చెప్పారు.
‘‘పెయిన్‌కిల్లర్స్ కొరతతో నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్న, రోదిస్తున్న రోగులను గంటల పాటు అలానే వదిలేస్తున్నాం’’ అని ఒక డాక్టర్ బీబీసీకి చెప్పారు.
గాజాలో వైద్య సంరక్షణ సేవలు ప్రస్తుతం మాటల్లో చెప్పలేనంత దయనీయంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది.
ఆదివారం నాటికి గాజాలో 23 ఆస్పత్రులు సేవలు అందించడం పూర్తిగా మానేశాయని, 12 పాక్షికంగా, ఒకటి సాధారణ సేవలు అందిస్తున్నాయని తెలిపింది.
సరఫరాల కొరత, ఇప్పటికే వనరులు లేక ఇబ్బంది పడుతున్న ఆరోగ్య వ్యవస్థను గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరింత క్షీణించేలా చేశాయని ఈ సంస్థ చెప్పింది.
ఐడీఎఫ్ ఏం చెబుతోంది?
‘‘హమాస్ తన ఉగ్రవాద కార్యకలాపాల కోసం వైద్య కేంద్రాలను, ఆస్పత్రులను వ్యవస్థాగతంగా వాడుకుంటుంది’’ అని ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) చెప్పాయి.
ఆస్పత్రులపై తాము ఎలాంటి దాడి చేయలేదని బీబీసీకి ఐడీఎఫ్ చెప్పింది. కానీ, హమాస్ మౌలిక సదుపాయాలను, పరికరాలను ధ్వంసం చేసేందుకు, ‘హమాస్ ఉగ్రవాదుల’ను పట్టుకునేందుకు అత్యంత జాగ్రత్తతో కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు తెలిపింది.
గాజాలోకి వైద్య సరఫరాల లాంటి మానవతా సాయాలను అనుమతిస్తున్నామని ఐడీఎఫ్ వెల్లడించింది. కానీ, మానవతా సాయాన్ని అందించే సమయంలో ఇజ్రాయెల్ దళాల నుంచి పదేపదే ఆంక్షలు, తిరస్కరణలు ఎదురవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో లాంటి సహాయ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
చాలా ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయని, వైద్య సేవలందించే పరికరాలు చాలా తక్కువగా ఉంటున్నాయని వైద్యసంరక్షణ అధికారులు చెప్పారు.
దక్షిణ గాజాలో కొన్ని ఆస్పత్రులు తమ బెడ్ల సామర్థ్యం కంటే 300 శాతం అధికంగా ఆపరేట్ చేయాల్సి వస్తోందనే వార్తలు వస్తున్నాయి.
డబ్ల్యూహెచ్‌వో వివరాల ప్రకారం గాజాలో 305 బెడ్ల సామర్థ్యంతో నాలుగు ఫీల్డ్ ఆస్పత్రులు ఏర్పాటయ్యాయి.
ఇజ్రాయెల్ బలగాల దాడితో దక్షిణ గాజాలోని నాసెర్ ఆస్పత్రి సేవలు అందించడం ఆపివేసిందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
ఆస్పత్రిలో ఆయుధాలను కనుగొన్నామని, హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారి ఫోటోలు, పేర్లతో మెడిసిన్లను, అక్కడ దాక్కుని ఉన్న వందల మంది ‘ఉగ్రవాదులను’ పట్టుకున్నట్లు ఆదివారం రాత్రి ఐడీఎఫ్ తెలిపింది.
ఉగ్రవాదం కోసం హమాస్ ఆస్పత్రులను వాడుకుంటూ గాజాలో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పౌరులను మరింత ప్రమాదంలో పడేస్తోందని ఐడీఎఫ్ అంతకుముందు బీబీసీకి చెప్పింది.
తాము దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఖాన్ యూనిస్‌లోని గాజా యూరోపియన్ హాస్పిటల్ డైరెక్టర్ యూసెఫ్ అల్-అక్కద్ తెలిపారు. రోగులకు చికిత్స చేసేందుకు ఆస్పత్రిలో సరిపడా బెడ్లు లేవని, ఇనుప పెట్టెలు, కర్రలపై సీట్లను పరిచి రోగులకు వైద్యులు చికిత్స చేస్తున్నారని చెప్పారు. చాలా మంది రోగులను నేల మీదే ఉంచుతున్నామని తెలిపారు.
గాజా స్ట్రిప్‌లోని ఇతర డాక్టర్లు కూడా ఇదే రకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు వివరించారు.
ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ లేదా కార్డియాక్ సమస్యలతో వస్తే, వారిని నేలపైనే పడుకోబెట్టి, చికిత్స చేస్తున్నామని రఫాలోని మొహమ్మద్ యూసఫ్ అల్-నజ్జర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మర్వాన్ అల్-హామ్స్ చెప్పారు.
గాజాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డైరెక్టర్లను హమాస్ పొలిటికల్ కమిటీ ఎంపిక చేసి నియమించింది. గాజా స్ట్రిప్ హమాస్ నియంత్రణలోకి తీసుకోక ముందే కొందరు డైరెక్టర్లు నియమితులయ్యారు.

‘ఆక్సిజన్ దొరకడం లేదు’
పరిమిత వైద్య సరఫరాలతో తాము సేవలందించేందుకు ఇబ్బంది పడుతున్నామని వైద్యులు చెప్పారు. కాస్త ఆక్సిజన్ కూడా దొరకడం లేదని ఒక డాక్టర్ బీబీసీతో చెప్పారు.
‘‘అనస్తీసియా డ్రగ్స్, ఐసీయూకు కావాల్సిన పరికరాలు, యాంటీబయాటిక్స్, చివరికి పెయిన్‌కిల్లర్స్ కూడా దొరకడం లేదు’’ అని డాక్టర్ అల్-అక్కద్ అన్నారు. చాలా మంది ప్రజలు తీవ్ర గాయాల పాలయ్యారని, వారికి అవసరమైన పెయిన్‌కిల్లర్స్ తమ వద్ద లేవని చెప్పారు.
మత్తు ఔషధం ఇవ్వకుండానే తాము ఆపరేషన్లు చేస్తున్నట్లు ఒక డాక్టర్ ధ్రువీకరించారు.
‘‘75 శాతం కాలిపోయిన చర్మంతో యూరోపియన్ గాజా ఆస్పత్రిలో చేరిన ఒక ఏడేళ్ల బాలికను మేం కలిశాం, వైద్య సరఫరాలు సరిపడా లేకపోవడంతో నొప్పికి ఉపశమనం కలిగించే మందు ఆమెకు అందలేదని ఆ చిన్నారి తెలిపింది’’ అని డబ్ల్యూహెచ్‌వో టీమ్ పేర్కొంది.
చికిత్స కోసం రోగుల్ని గుర్రాలు, గాడిదలపై తీసుకొస్తున్నట్లు ఉత్తర గాజాలోని అల్-అవ్దా ఆస్పత్రి యాక్టింగ్ డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ సల్హా చెప్పారు.
రెండు లేదా మూడు వారాలకు పైగా గాయాలకు వైద్యం చేయకుండా అలానే తెరుచుకుని ఉంటుండటంతో, గాయాలు కుళ్లిపోతున్నాయని, దీంతో రోగులు తీవ్ర దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కరెంట్ కొరతతో తలపై టార్చులను పెట్టుకుని ఆ వెలుతురులోనే డాక్టర్లు సర్జరీలను చేస్తున్నారని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
కుటుంబాలకు దూరంగా వైద్య సిబ్బంది
గాజాలో సుమారు 20 వేల మంది వైద్యసంరక్షణ సిబ్బంది ఉంటారని, వారిలో చాలా మంది ప్రస్తుతం తమ కుటుంబాలను కాపాడేందుకు, చూసుకునేందుకే ఇబ్బందులు పడుతూ ఆస్పత్రుల్లో పనిచేయలేకపోతున్నారని డబ్ల్యూహెచ్‌వో చెప్పింది.
తమ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది, వాలంటీర్ల సంఖ్య కాస్త పెరిగిందని, ఇతర ప్రాంతాల్లో నిరాశ్రయులైన వారు చాలా మంది సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని డాక్టర్ అల్-అక్కద్ తెలిపారు. కానీ, పెరుగుతున్న రోగులకు, గాయాలకు చికిత్స చేసేందుకు ఈ సిబ్బంది సరిపోవడం లేదని చెప్పారు.
‘‘ఒకే వ్యక్తి బ్రెయిన్‌లో గాయాలై, పక్కటెముకలు, మోకాళ్లు విరిగిపోయి, కొన్నిసార్లు కళ్లు పోయి ఆస్పత్రికి రావడం చూస్తున్నాం. ప్రతి గాయాన్ని మీరు మా ఆస్పత్రిలో చూడొచ్చు. ఒక వ్యక్తికి అయిన గాయాలకు చికిత్స అందించేందుకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ వైద్య నిపుణులు అవసరం. కొంత మంది డాక్టర్లు వారి కుటుంబాల నుంచి విడిపోయి మరీ నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు’’ అని డాక్టర్ అల్-అక్కద్ చెప్పారు.
‘‘మూడు నెలలుగా నా కుటుంబం నాకు దూరంగా ఉంటోంది’’ అని ఉత్తర గాజాలోని డాక్టర్ సల్హా చెప్పారు.
‘దీర్ఘకాలిక సమస్యలున్న రోగులకు బెడ్లు లేవు’
గాజాలో దీర్ఘకాలిక సమస్యలున్న రోగులు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోందని డాక్టర్లు బీబీసీకి చెప్పారు.
‘‘నిజం చెప్పాలంటే వారి కోసం లేదా వారికి సేవలందించేందుకు మా వద్ద బెడ్లు లేవు’’ అని డాక్టర్ అల్-అక్కద్ చెప్పారు.
‘‘వారంలో ఎవరైనా నాలుగుసార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటే, వారు ప్రస్తుతం వారానికి ఒక్కసారే చేయించుకుంటున్నారు. అంతకుముందు వారంలో మొత్తం 16 గంటలు డయాలసిస్ చేసుకునే వ్యక్తి, ప్రస్తుతం గంటే డయాలసిస్ పొందుతున్నారు’’ అని తెలిపారు.
కొందరు మహిళలు వైద్య సహాయం అందక టెంట్లలోనే పిల్లలకు జన్మనిస్తున్నారు.
‘‘ఒక విభాగంలో ఒక వ్యక్తి మరణిస్తే, మరో విభాగంలో ఒక కొత్త జీవితం పురుడుపోసుకుంటుంది’’ అని డాక్టర్ సల్హా చెప్పారు. పిల్లలు పుడుతున్నారు, కానీ వారి కోసం పాలు ఉండటం లేదన్నారు. పుట్టే ప్రతి బిడ్డకు ఒక మిల్క్ బాక్సును తాము అందజేస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఇస్లామిక్ చరిత్రలో అత్యంత తెలివైన అందాల మహరాణి జైనబ్... ఆమెను 'జాదూగర్' అని ఎందుకు అనేవారు?
- ఎలక్టోరల్ బాండ్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు ఎలా దెబ్బ పడనుంది?
- విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎందుకు కదలట్లేదు... తప్పు రాష్ట్రానిదా, కేంద్రానిదా?
- ఆంధ్రప్రదేశ్: 'ట్రాన్స్‌జెండర్ మహిళగా సర్జరీ చేయించుకున్నా... ఇప్పుడు జీవితం ఎలా ఉందంటే... ' - మదనపల్లె భాను
- ఎజియావో: మనుషుల యవ్వనం కోసం గాడిదలను చంపేస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















