గాజా యుద్ధభూమి నుంచి తనను కాపాడమని కోరిన ఆరేళ్ళ చిన్నారి మృతి... 'నా బిడ్డ మరణానికి బాధ్యులెవరో చెప్పాలి' అని దుఃఖిస్తున్న తల్లి

ఫొటో సోర్స్, Rajab Family
- రచయిత, లూసీ విలియమ్సన్
- హోదా, బీబీసీ న్యూస్
గాజా యుద్ధ భూమిలో కొద్దిరోజుల కిందట తప్పిపోయిన ఆరేళ్ల బాలిక హింద్ రజాబ్ చనిపోయింది. ‘మీరు వచ్చి నన్ను తీసుకువెళ్ళండి, నాకు చాలా భయంగా ఉంది’ అని ప్రాధేయపడిన ఆ పాప గొంతు మూగబోయింది.
జనవరి 29న హింద్ రజాబ్ తన అత్త, మామ, ముగ్గురు కజిన్లతో కలిసి నగరం నుంచి కారులో పారిపోతోంది.
ఒక కారులో బంధువుల మృతదేహాల మధ్య హింద్ అనే ఆరేళ్ల పాప దాక్కున్నట్లు, ఎమర్జెన్సీ కాల్ ఆపరేటర్, ఆ బాలిక మధ్య కాల్ ఆడియో రికార్డింగ్‌ల ద్వారా తెలిసింది.
అయితే, తనను రక్షించమని బాలిక విజ్ఞప్తి చేస్తుండగానే తుపాకీ కాల్పుల శబ్దంతో ఫోన్ లైన్ కట్ అయింది.
ఇజ్రాయెల్ ట్యాంకుల కాల్పుల్లో చిక్కుకుపోయిన బాలికను ఆమె బంధువులు, ఇద్దరు పారామెడిక్స్ రక్షించే ప్రయత్నం చేశారు.

అంబులెన్స్ వెళ్లినా...
పాలస్తీనియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (పీఆర్సీఎస్) పారామెడిక్స్ శనివారం ఆ బాలిక ఉన్న ప్రాంతానికి చేరుకోగలిగారు. అది పోరాటం తీవ్రంగా జరుగుతున్న ప్రాంతమని అప్పటికే దారులు మూసేశాారు.
అక్కడే హింద్ ప్రయాణించిన నల్లటి కియా కారును కనుగొన్నారు. దాని కిటికీ స్క్రీన్, డ్యాష్‌బోర్డ్ పగిలిపోయాయి, బుల్లెట్‌ల ధాటికి కారుకు రంధ్రాలు పడ్డాయి.
కారులో దొరికిన ఆరు మృతదేహాలలో హింద్ కూడా ఉందని, అవన్నీ తుపాకీ కాల్పుల గుర్తులని ఒక వైద్యాధికారి పాత్రికేయులతో చెప్పారు.
కొన్ని మీటర్ల దూరంలో మరొక వాహనం ఆనవాళ్లు ఉన్నాయి, అది పూర్తిగా కాలిపోయింది, దాని ఇంజిన్ నేలపై పడి ఉంది. అది హింద్‌ని తీసుకురావడానికి పంపిన అంబులెన్స్ అని రెడ్ క్రెసెంట్ చెబుతోంది.

ఇజ్రాయెల్ దళాలు అంబులెన్స్‌పై బాంబు దాడి చేయడంతో దాని సిబ్బంది యూసుఫ్ అల్-జీనో, అహ్మద్ అల్-మధౌన్‌లు మరణించారని ఆ సంస్థ తెలిపింది.
జనవరి 29న సంఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్‌ను ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుందని పీఆర్సీఎస్ ఒక ప్రకటనలో ఆరోపించింది.
"హింద్‌ను రక్షించడం కోసం అంబులెన్స్ సంఘటనా స్థలానికి పయనమైంది, దీనిపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా రెడ్ క్రెసెంట్ సిబ్బందిని టార్గెట్ చేసింది" అని ఆ సంస్థ తెలిపింది.
హింద్ వద్దకు పారామెడిక్స్‌ను పంపేందుకు ఇజ్రాయెల్ సైన్యంతో సమన్వయం చేసుకోవడానికి తమకు గంటలు పట్టిందని బీబీసీతో పీఆర్సీఎస్ తెలిపింది.

ఫొటో సోర్స్, RAJAB FAMILY
'ఆ దేవుడిని నిలదీస్తా' - పాప తల్లి విస్సామ్
"మాకు వెళ్లడానికి దారి దొరికింది, గ్రీన్ సిగ్నల్ వచ్చింది" అని పీఆర్సీఎస్ ప్రతినిధి నిబాల్ ఫర్సాఖ్ ఈ వారం ప్రారంభంలో బీబీసీకి చెప్పారు.
"మా సిబ్బంది హింద్ చిక్కుకున్న కారును చూశారు, ఆమె కనిపించినట్లు ధ్రువీకరించారు. కానీ, చివరికి కాల్పుల శబ్ధం విన్నాం" అని అన్నారు.
కాల్ ఆపరేటర్‌లతో హింద్ సంభాషణల రికార్డింగ్‌లు రెడ్ క్రెసెంట్ బహిరంగ పరచడంతో ఆమెకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి దాదాపు ఒక ఉద్యమమే జరిగింది.
‘‘ప్రతి క్షణం నా బిడ్డ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. ఏ క్షణమైనా నా బిడ్డ రావచ్చు’’ అని హింద్ తల్లి విస్సమ్ ఇంతకుముందు అన్నారు.
ఇప్పుడు ఆమె తన కూతురి మరణానికి బాధ్యులు ఎవరో తేల్చి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
''నా గొంతు, రక్షించాలని వేడుకున్న నా కూతురి గొంతు విని కూడా ఆమెను రక్షించని వారందరినీ ఆ దేవుడి ముందు ప్రశ్నిస్తాను'' అని విస్సమ్ బీబీసీకి చెప్పారు.
"నెతన్యాహు, బైడెన్‌లతో పాటు గాజా ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారందరికీ వ్యతిరేకంగా నేను దేవుడ్ని ప్రార్థిస్తా" అని తెలిపారు.
ఇన్నిరోజులు విస్సమ్ తన కూతురి కోసం ఆసుపత్రిలో వేచి చూస్తూనే గడిపారు. హింద్‌కు ఇవ్వడానికి చిన్న గులాబీ బ్యాగు పట్టుకొని ఉన్నారు. అందులో హింద్ చేతి రాత ప్రాక్టీస్ చేసే నోట్‌బుక్ ఉంది.
"ఇంకా ఎందరు తల్లులు ఈ బాధ అనుభవించాలి అనుకుంటున్నారు? ఇంకా ఎంతమంది పిల్లల్ని చంపాలనుకుంటున్నారు?" అని విస్సమ్ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
అంబులెన్స్‌లపై దాడి ఎందుకు చేస్తున్నారు?
హింద్ అదృశ్యమైన ప్రాంతంలో సైన్యం కార్యకలాపాలు, బాలిక ఆచూకీ, ఆమెను తీసుకురావడానికి పంపిన అంబులెన్స్ వివరాలపై మేం రెండుసార్లు ఆరా తీశాం, సైన్యం చూస్తున్నామని చెప్పింది.
పాలస్తీనా రెడ్ క్రెసెంట్ చేసిన ఆరోపణలపై శనివారం సైన్యం ప్రతిస్పందనను కూడా అడిగాం.
ఘర్షణలో వైద్య సిబ్బంది లక్ష్యం కాకూడదు, వారిని తప్పని సరిగా రక్షించాలి, గాయపడిన వ్యక్తులకు సాధ్యమైనంత తొందరగా అవసరమైన వైద్యం అందించాలని యుద్ధ నియమాలు చెబుతున్నాయి.
అయితే, హమాస్ ఆయుధాలు, ఫైటర్లను రవాణా చేయడానికి అంబులెన్స్‌లను ఉపయోగిస్తోందని ఇజ్రాయెల్ గతంలో ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
- పశువుల దాణాతో ఆకలి తీర్చుకుంటున్న చిన్నారులు, గాజాలో దుర్భర పరిస్థితులు
- మాల్దీవులకు సైన్యానికి బదులు టెక్నికల్ టీమ్‌ను పంపించడం వెనుక భారత్ వ్యూహమేంటి?
- పీవీ నరసింహారావుకు భారతరత్న: ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
- శ్రీలంకలో రోజుకు ఒక ఏనుగు ఎందుకు చనిపోతోంది?
- కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎందుకు ధర్నా చేస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















