పశువుల దాణాతో ఆకలి తీర్చుకుంటున్న చిన్నారులు, గాజాలో దుర్భర పరిస్థితులు

గాజాలో ప్రజలు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, గాజాలో 23 లక్షల మంది ప్రజలకు మంచినీరు అందించే పైపులు ధ్వంసమయ్యాయి
    • రచయిత, లూసీ విలియమ్‌సన్
    • హోదా, బీబీసీ న్యూస్

ఉత్తర గాజాలో దుర్భర పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. పిల్లలు ఆకలితో అల్లాడిపోతున్నారు. చిన్నారులకు ఆహారంగా ఇవ్వడానికి ఏమీ లేకపోవడంతో చాలామంది పశువుల దాణాను పిండిగా మార్చి వారి ఆకలి తీర్చుతున్నారు. కానీ ఇప్పుడీ దాణా కూడా నిండుకుంటోందని ఉత్తర గాజాలోని ప్రజలు బీబీసీకి చెప్పారు.

తాగునీరు, దుస్తులు ఉతుక్కోవడానికి ప్రజలు మంచినీటి పైపులు ఉన్న ప్రాంతాలలో గుంతలు తవ్వుతున్నారు.

ఉత్తర గాజాలో చిన్నపిల్లల్లో పౌష్ఠికాహార లోపం తీవ్రంగా పెరుగుతోందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ లోపం పిల్లల్లో 15 శాతాన్ని మించిపోతోందని తెలిపింది.

కిందటి నెలలో ఉత్తర గాజాకు అందాల్సిన సాయాన్ని ఇజ్రాయెల్ దళాలు అడ్డుకోవడంతో సగానికి పైగా సాయం అందకుండా పోయిందని ఐక్య రాజ్య సమితి మానవతా వ్యవహారాల సంస్థ ఓచా తెలిపింది. అలాగే సాయాన్ని అందించే చోట ఇజ్రాయెలీ దళాల జోక్యం పెరిగిందని తెలిపింది.

ఉత్తర ప్రాంతాలలో నివసిస్తున్న సుమారు మూడు లక్షలమందికి సాయం అందకుండా పోతోందని, దీనివల్ల కరువు ఏర్పడే ముప్పు ఎక్కువవుతోందని తెలిపింది

గాజాకు అందించే సాయాన్ని సమన్వయం చేసే ఇజ్రాయెలీ మిలటరీ ఏజెన్సీ అధికార ప్రతినిధి కిందటి నెలలో మాట్లాడుతూ ‘‘గాజాలో ఎవరూ ఆకలితో అలమటించడం లేదని’’ చెప్పారు. అయితే గాజాకు అందించే మానవతా సాయం విషయంలో ఎటువంటి పరిమితులు పెట్టుకోలేదని కోగట్ (ఇజ్రాయెలీ రక్షణ శాఖలో ఓ భాగం) ఏజెన్సీ పదే పదే చెప్పింది.

గాజా నగరం, బీట్ లాహియాలో నివసిస్తున్న ముగ్గురితో బీబీసీ మాట్లాడింది.

స్థానిక జర్నలిస్ట్ జబాలియాలో చిత్రీకరించిన దృశ్యాలను, ఇంటర్వ్యూలను బీబీసీ వీక్షించింది.

పశువుల దాణాను పిండిలా మార్చి ప్రజలు జీవనం గడుపుతున్నారని, ఇప్పుడా నిల్వలు కూడా అయిపోతున్నాయని బెయిట్ లాహియాలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న మహమ్మద్ షలాబీ చెప్పారు.

‘‘ఇప్పుడా దాణా కూడా మార్కెట్‌లో దొరకడం లేదు’’ అని చెప్పారు. ‘‘ఇప్పుడవి ఉత్తర గాజాలోనూ, గాజా నగరంలోనూ దొరకడం లేదు. ఫుడ్ టిన్నులు కూడా కనిపించడంలేదు’’అని ఆయన తెలిపారు.

‘‘ఇప్పుడు మేం తింటున్నది నవంబరులో 6,7రోజులపాటు అమలులో ఉన్న సంధి కాలం నాటివి. అప్పట్లో ఉత్తర గాజాలోకి అనుమతించిన పదార్థాలు ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు ప్రజలు తింటున్నది కేవలం బియ్యం మాత్రమే’’

ఉత్తర గాజాకు పంపిన ఐదు కాన్వాయ్‌లలో నాలుగింటిని ఇజ్రాయోలీ దళాలు నిలిపివేశాయని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ బీబీసీకి తెలిపింది.

దీంతో గాజా నగరానికి సాయం అందించడంలో రెండు వారాల గ్యాప్ వచ్చింది.

గాజా

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, మంచినీటి కోసం చేతితో గుంతలు తవ్వుతున్న గాజా ప్రజలు

తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు

‘‘క్రమం తప్పకుండా తగినంత మొత్తంలో ఆహార సాయాన్ని అందించకపోతే గాజా కరువు కోరల్లో చిక్కుకుంటుందని’’ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ప్రాంతీయ అధినేత మాటల్ హోలింగ్ వర్త్ చెప్పారు.

ఉత్తర గాజాకు పంపే సాయాన్ని అడ్డుకోవడం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయిందని ఐక్య రాజ్య సమితికి చెందిన మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం తెలిపింది. అక్టోబర్, డిసెంబర్‌లో 14 శాతం సహాయాన్ని అడ్డుకోగా, జనవరిలో 56 శాతం సాయానికి ప్రవేశం నిరాకరించారని తెలిపింది.

ఆరోగ్య అవసరాలకు వినియోగించే ఇంధన పరిమాణాలపై ఇజ్రాయెలీ సైన్యం ‘సమయానుకూల సమర్థన’ విధిస్తోందని, అలాగే ఆహార పదార్థాల పరిమాణాన్ని తగ్గించాలనే ఆంక్షలు విధిస్తోందని తెలిపారు.

ఈ విషయంపై స్పందిమచని ఇజ్రాయెలీ సైన్యాన్ని బీబీసీ సంప్రదించింది. అయితే సైన్యానికి వేసిన ప్రశ్నలకు కోగట్ సమాధానం చెపుతుందని వారు తెలిపారు.

బెయిట్ లాహియాలో నివసించే నలుగురు పిల్లల తల్లి దుహా అల్ ఖలీదీ బీబీసీతో మాట్లాడుతూ, తన బిడ్డలు అప్పటికే మూడురోజులుగా ఏమీ తినకపోవడంతో, వారికి ఏదైనా ఆహారం దొరుకుతుందేమోనని రెండు వారాల కిందట ఆరుమైళ్ళ దూరం (9.5 కిలోమీటర్లు) నడిచి గాజా నగరంలోని తన సోదరి ఇంటికి చేరుకున్నట్టు చెప్పారు.

‘‘నా దగ్గర డబ్బుల్లేవు. ఒక వేళ ఉన్నా, పట్టణంలోని మార్కెట్లో కొనడానికి వస్తువులేవీ లేవు’’ అని ఆమె చెప్పారు. ‘ నా సోదరి, ఆమె కుటుంబం కూడా ఇలాగే బాధ పడుతున్నారు. ఆమె ఇంట్లో ఉన్న చివరి పాస్తాను మాతో పంచుకుంది’’

‘‘మాకు చావు అనివార్యమనిపిస్తోంది’’ ఖలీదీ సోదరి వాద్ మాట్లాడుతూ ‘‘మా ఇంటిపై ఫ్లోర్‌ను పోగొట్టుకున్నాం. ఇల్లు కులిపోతుందనే భయం వెంటాడుతున్నా ఇక్కడే ఉంటున్నాం. గడిచిన రెండు వారాలుగా మార్కెట్లో ఏమీ దొరకడం లేదు. ఒకవేళ ఏమైనా దొరికినా , అవి వాటి ధరకంటే పదిరెట్లు ఎక్కువగా ఉంటున్నాయి’’ అని చెప్పారు.

గాజా యుద్ధం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మానవతా సాయం అందక గాజాలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నాయి

గాజాలోని ఉత్తర ప్రాంతాలు ఆహార కొరత కారణంగా తీవ్రమైన కరువు ముప్పును ఎదుర్కొంటున్నాయని ఐక్య రాజ్య సమితికి చెందిన అనేక ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాంతంలో పర్యటించేందుకు తీవ్రమైన ఆంక్షలు ఉన్న నేపథ్యంలో యథార్థస్థితిని అంచనా వేయడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

ఉత్తర ప్రాంతాలలోని కుటుంబాలు మంచినీరు దొరకక ఇబ్బందులు పడుతున్నాయి.

‘‘ఇప్పుడు మాలో చాలామందికి మంచినీరు దొరకడం లేదు. మంచినీటి పైపులు లేవు. మేం గుంతలు తవ్వి నీరు తాగాల్సి వస్తోంది.’’ అని బెయిట్ లాహియాలో నివసించే మహమ్మద్ సలాహ్ చెప్పారు.

ఉత్తర గాజా నగరానికి పొరుగున ఉన్న జబాలియాలో బాంబులతో ధ్వంసమైన వీధుల్లో తీసిన వీడియోలో, భూగర్భంలో ఉన్న పెద్ద పెద్ద పైపుల నుంచి మంచినీరు తీసుకోవడానికి గుంతలు తవ్వడాన్ని చిత్రీకరించింది.

‘‘మాకిక్కడ 15 రోజులకోసారి మంచినీళ్ళు వస్తున్నాయి’’ అని యూసుఫ్ అల్ అయోతి చెప్పారు. ‘‘నీరంతా మురికిగా ఉంది. మా పిల్లలు మండిపడుతున్నారు. వారి పళ్ళు ఈ మురికి నీటి కారణంగా క్షీణించిపోతున్నాయి. నీళ్లలో మట్టి ఉంటోంది. పైగా విపరీతమైన ఉప్పగా ఉంటోంది’’

నాలుగు నెలల యుద్ధం తరువాత ఆకలి తీర్చే మార్గాలు పూడుకుపోతున్నాయి. అయితే గాజాలో ఆహారపదార్థాలను నిల్వ చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.

యుద్ధానికి ముందు ఈ ప్రాంతం ఆహారసాయంపై ఆధారపడేది. ఇప్పుడు ఈ ప్రాంత వ్యవయసాయ పరిశ్రమ మూతపడిపోయింది.

గాజా యుద్ధం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, గాజా చిన్నారులలో పౌష్ఠికాహార లోపం ప్రమాదకరస్థాయిని దాటుతోంది

పెను విధ్వంసం

డేర్ అల్ -బలాహ్‌లోని మధ్య ప్రాంతంలో సగానికి పైగా వ్యవసాయ భూమి దెబ్బతిందని ఐక్య రాజ్య సమితి కొత్త గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో బస్సెమ్ యూనిస్, అబు జాయెద్‌కు చెందిన ఆలివ్ ప్రెస్, వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి.

‘‘ఇప్పుడా భూములను చూస్తే భూకంపం వచ్చిన తరువాత ఎలా ఉంటాయో అలా ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు. ‘‘ విధ్వంసం చాలా ఎక్కువగా ఉంది. ఇది చుట్టుపక్కల భవనాలను, పశువులను కూడా కప్పేసింది. ఇక్కడ మిల్లులు తెరిచే అవకాశం ఉన్నప్పటికీ 80, 90 శాతం ఆలివ్ చెట్లు పోయాయి. ఇది ఈ ఏడాదికి మాత్రమే కలిగే నష్టం కాదు. రాబోయే కొన్నేళ్ళ వరకు ఈ నష్టం కొనసాగుతుంది’ అని చెప్పారు.

సరిహద్దు పట్టణమైన రఫాలో దక్షిణాన నిరాశ్రయులైన దాదాపు పదిలక్షలమంది ప్రజలు పట్ణణంలోని మూడు లక్షల మంది ప్రజలతో ఇంత చోటు కోసం పోరాడుతున్నారు.

గాజా దక్షిణ భాగంలో హడావుడిగా ఉండే మార్కెట్లు, రెస్టారెంట్ల ఫుటేజీని ఇజ్రాయెలీ సైన్యం తరచూ ప్రచురిస్తోంది. కిందటి నెలలో 114 మానవతా సాయ మిషన్స్‌లో ఎక్కువభాగం గాజా దక్షిణ భాగం చేరుకోగలిగాయి. కానీ అక్కడి ప్రజలు, సహాయక ఏజెన్సీలు మాత్రం ప్రజలు ఇంకా ఆకలితో పస్తులుంటున్నారని, ఇళ్ళు లేకపోవడం, సరైన పారిశుధ్య వ్యవస్థ లేకపోవడం, ఆరోగ్య సాయం అందకపోవడంతో ప్రజారోగ్యం సంక్షోభంలో పడిందని చెపుతున్నారు.

సహాయాన్ని నిరోధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అధికారం ద్వారానో, యుద్ధం ద్వారానో, శిథిలాల ద్వారానో దీనిని అడ్డుకోవచ్చు. కిందటివారం గాజాలో ఉత్తర భాగంలో వేచి ఉన్న ఓ ఆహార సహాయ కాన్వాయ్‌పై నావికాదళం కాల్పులు జరిపింది.

గాజా ప్రజలలో పెరిగిపోతున్న నిస్పృహ కారణంగా సాయం అందించడమూ కష్టంగా మారుతోందని మాట్ హోలింగ్ వర్త్ చెప్పారు.

‘‘శాంతి భద్రతల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆకలితో నకనకలాడిపోతున్న జనంతో సంప్రదింపులు జరపలేం. ఇంకా మేం చేరుకోవాల్సిన ప్రజలు అవతల ఉన్నారు’’ అని చెప్పారు.

‘‘ఈ నిస్సహాయత నన్ను బాధిస్తోంది. ప్రజలు ఆశలు వదిలేసుకుంటున్నారు’’

గాజాలోకి మరింత సాయం అందడానికి, ఇజ్రాయెలీ బందీలు విడుదలకు ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందం ఒక్కటే పరిష్కారంగా చాలామంది చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)