విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎందుకు కదలట్లేదు... తప్పు రాష్ట్రానిదా, కేంద్రానిదా?

ఫొటో సోర్స్, Lakkojusrinivas
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాట్లకు సంబంధించిన డీపీఆర్ 2019 సెప్టెంబర్‌లో రైల్వే బోర్డుకు అందజేశారు. ఇది ఆమోదం కూడా పొందింది. కానీ ఇప్పటివరకు రైల్వేజోన్ పనులకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడలేదు.
రైల్వే జోన్ కోసం కేంద్రం కోరిన భూములు సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అంటుంటే, ఆ భూములు వివాదంలో ఉన్నాయని కేంద్రం చెబుతోంది.
అయితే, ఏపీ ఇస్తామని అంటున్న భూమిని కేంద్రం ఎందుకు తీసుకోవడం లేదు? ఆ భూములు కాకుండా మరో చోట రాష్ట్రం ఇవ్వలేదా? ఆ భూముల్లోనే రైల్వే జోన్ పనులు ప్రారంభించాలా? ఆ భూముల చుట్టూ ఉన్న వివాదం ఏంటి?

ఫొటో సోర్స్, Lakkojusrinivas
అసలేం జరిగింది?
2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ప్రకటించింది. ఆ వెంటనే అంటే 2019 మార్చి 8న సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) నియమాకం జరిగింది.
2019 సెప్టెంబర్ మొదటి వారంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు అందజేశారు. కానీ, ఇప్పటికీ జోన్‌కు సంబంధించిన ఎటువంటి పనులు ప్రారంభం కాకపోవడంతో ఇంకా తూర్పుకోస్తా రైల్వేగానే విశాఖ జోన్ కొనసాగుతోంది.
సాధారణంగా డీపీఆర్ సమర్పించిన ఆరు నెలల్లోనే పనులు ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ దక్షిణ కోస్తా రైల్వే డీపీఆర్ సమర్పించి నాలుగున్నరేళ్లు దాటిపోయినా కనీసం ఒక్క ఇటుక కూడా జోన్ విషయంలో పడలేదు. పైగా ఇప్పుడు ఈ జోన్ పనుల ప్రారంభానికి కేటాయించిన భూమి విషయంలో కేంద్రం, రాష్ట్రం ఒకరిపై మరొకరు నెపాన్ని నెట్టుకుంటూ కాలం గడిపేస్తున్నారు.
విశాఖలో రైల్వే జోన్ నిర్మాణానికి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2024 ఫిబ్రవరి 2న దిల్లీలో చెప్పారు. విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించాలంటే భూమి అవసరమని, దాని కోసం ఏపీ ప్రభుత్వం 52 ఎకరాలు ఇవ్వాల్సి ఉందని, దానిని కేటాయిస్తే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

భూములు సిద్దం, వివాదాలు లేవు: విశాఖ కలెక్టర్
దక్షిణ కోస్తా రైల్వేజోన్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 52 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున అన్నారు.
అది ముడసర్లోవలోని శ్రీకృష్ణాపురంలో సర్వే నెంబరు 26లోని భూమిని సిద్ధం చేశామని విశాఖ జిల్లా కలెక్టర్ తెలిపారు.
అక్కడ భూమికి సరిహద్దులు నిర్ణయిస్తూ పొడవాటి గోతులు కూడా తవ్వామని, ఆ భూమినే కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధం చేశామని, ఆ విషయాన్ని కేంద్రానికి కూడా తెలియపర్చామని చెప్పారు.

ఫొటో సోర్స్, Lakkojusrinivas
సమస్యేంటి?
పదేళ్ల కిందట రెండు BRTS (బస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం) రోడ్ల నిర్మాణం కోసం రైల్వే భూములను జీవీఎంసీ ( గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్) తీసుకుంది. అంతేకాకుండా 1987 నుంచి 2007 వరకు వివిధ అవసరాల కోసం రైల్వే భూములను ఏపీ ప్రభుత్వం తీసుకుంది. దీంతో ఆ భూములకు బదులుగా ముడసర్లోవలోని శ్రీకృష్ణాపురంలో 52 ఎకరాలను జీవీఎంసీ ద్వారా రైల్వేకి కేటాయించింది.
ఇప్పుడు రైల్వే జోన్ కార్యాలయాలు, ఇతర నిర్మాణాల కోసం రైల్వే శాఖ ఆ భూములను పరిశీలించగా.. అవి విశాఖ తాగు నీటి అసవరాలను తీర్చే ముడసర్లోవి రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ భూములను తీసుకునేందుకు కేంద్రం నిరాకరించింది.
కానీ భూముల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేవని, ఈ భూములనే కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు విశాఖ జిల్లా కలెక్టర్ చెబుతున్నారు.
మరోవైపు ఆ భూములే తమకు జీవనాధారమని అక్కడి గిరిజనులు చెబుతున్నారు.
రైల్వే జోన్ కోసం జీవీఎంసీ కేటాయించిన భూములు ముడసర్లోవలో శ్రీకృష్ణాపురంలో ఉన్నాయి. ఈ భూముల్లో జీడి తోటలు ఉన్నాయి. ఈ తోటల చుట్టూ సరిహద్దు నిర్ణయించే విధంగా పొడవాటి గోతులు తవ్వేసి ఉన్నాయి. ఈ పనులు జీవీఎంసీ అధికారులు ఇటీవలే చేసినట్లు ఈ భూముల్లో జీడి తోటలు వేసిన గిరిజన రైతులు చెబుతున్నారు.
రైల్వేజోన్ కోసం కేటాయించిన 52 ఎకరాల భూములు తమవేనని, మొత్తం ఇక్కడ 78 ఎకరాల భూమిపై తమకు డి-పట్టాలున్నాయని శ్రీకృష్ణాపురం గిరిజనులు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Lakkojusrinivas
1976లో ఇందిరాగాంధీ తమకు ఒక్కొ కుటుంబానికి ఎకరం చొప్పున 66 కుటుంబాలకు సాగు చేసుకునేందుకు డి-పట్టా భూములను ఇచ్చారని వారు తెలిపారు.
“66 ఎకరాలతో పాటు ఇతర అవసరాల కోసం మరో 12 ఎకరాలు, ఇలా మొత్తం 78 ఎకరాలు శ్రీ కృష్ణాపురంలో ఇచ్చారు. అప్పట్లో మా కుటుంబాలు దారపాలెంలో ఉండేవి. అక్కడ అగ్నిప్రమాదం జరిగి మా ఇళ్లు కాలిపోతే, మాకు ఇక్కడ భూములు ఇచ్చారు. ఈ భూములే మాకు జీవనాధారం. ఇక్కడే జీడితోటలు, కూరగాయలు పండించుకుంటూ జీవిస్తున్నాం. ఇప్పుడు రైల్వే జోన్‌కు ఈ భూములు ఇచ్చేస్తున్నామంటే, ఇదెక్కడి న్యాయం” అని ప్రశ్నించారు శ్రీకృష్ణాపురానికి చెందిన గిరిజన రైతు మారిక జయలక్ష్మీ.
ఎటువైపు నుంచి వెళ్లినా విశాఖ రైల్వే స్టేషన్‌కు 15 నుంచి 20 కిలోమీటర్లు దూరంలో ఉండే శ్రీకృష్ణాపురంలో రైల్వేజోన్ భూముల్ని కేటాయించడమేంటో అర్థం కావడం లేదని మరో గిరిజన రైతు పైడిరాజు బీబీసీతో అన్నారు.
‘‘భూముల్ని రైల్వే జోన్‌కే ఇవ్వాలని అనుకుంటే రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న భూములు ఇవ్వాలి, లేదు ఇక్కడే ఇవ్వాలని అనుకుంటే ఆ విషయాన్ని మాకు తెలియజేస్తూ నోటీసు అయినా ఇవ్వాలి. కానీ మేం సాగు చేసుకుంటుంటే అవి జీవీఎంసీ భూములంటూ ఎలా ఇచ్చేస్తారు?’’ అని పైడిరాజు ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Lakkojusrinivas
ఇంతకీ ఈ భూములు ఎవరివి?
ముడసర్లోవ రిజర్వాయర్ పరివాహక ప్రాంతంగా సుమారు 800 ఎకరాలు గుర్తించారు. ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదంటూ నిషేధిత జాబితాలో చేర్చారు.
వ్యవసాయం చేస్తుంటే 2021లో రైల్వే అధికారులు కొందరు వచ్చి ఈ భూములు రైల్వేశాఖవని చెప్పారని, మాకు పట్టాలు ఉండగా, ఈ భూములను రైల్వేశాఖకి ప్రభుత్వం ఎలా ఇస్తుందని అప్పటి నుంచి ప్రశ్నిస్తున్నామని, అయినా ఎవరు సమాధానం చెప్పడం లేదని గిరిజనులు అంటున్నారు.
అయితే, గిరిజనులు ఈ భూముల్లో తోటలు వేసుకున్నప్పటికీ ఈ భూములు మున్సిపాలిటీకి చెందినవేనని జీవీఎంసీ అధికారి ఒకరు చెప్పారు. పైగా డి-పట్టా భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చునని చెప్పారు.
నోటీసులిచ్చి, అప్పుడు వాటిపై ప్రభుత్వం, జీవీఎంసీ ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, కానీ మేం సాగు చేస్తూ ఉండగా, వాటిని రైల్వేశాఖకు ఎలా ఇస్తారంటూ శ్రీకృష్ణాపురం గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
ఒకవైపు ఈ భూములు తమవేనని గిరిజనులు, మరో వైపు రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలో భూములని వివాదం ఉండగా... ఈ భూములనే రాష్ట్ర ప్రభుత్వం రైల్వేజోన్ కోసం ఇవ్వడంతో సమస్య మరింత జఠిలమైందని పొలిటికల్ ఎనలిస్ట్ ఎం. యుగంధర్ రెడ్డి అన్నారు.

ఫొటో సోర్స్, Lakkojusrinivas
భూముల పేరుతో డ్రామా: రైల్వే జోన్ సాధన కమిటీ
రైల్వే జోన్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం, ఇతర పనులు ప్రారంభం కాకపోవడంపై రాష్ట్రం, కేంద్రం ఆడుతున్న డ్రామగానే చూడాలని రైల్వే జోన్ కోసం పోరాటాలు చేసిన సంఘాలు అంటున్నాయి.
విశాఖ రైల్వే జోన్ సాధన కమిటీ కన్వీనర్ జేవీ సత్యనారాయణ (నాని) బీబీసీతో మాట్లాడుతూ... కేవలం భూమి సమస్య వలనే ఇంకా రైల్వే జోన్ పనులు ప్రారంభం కాలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
‘‘నిజానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాల్సి ఉంది. ఎటువంటి వివాదాల్లేని భూములు ఇవ్వాలి. అంతేకానీ వివాదస్పద భూములు ఇవ్వడం, దానికి కేంద్రం మాకు భూములు అందలేని చెప్పడం చూస్తుంటే ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటూ ఇక్కడ రైల్వేజోన్ లేకుండా చేస్తున్నారు’’ అని జేవీ సత్యనారాయణ ఆరోపించారు.
డీపీఆర్ అమోదం పొందిన తర్వాత ఏదో ఒక పని ప్రారంభిస్తే జోన్ పనులు మొదలైనట్లు అవుతుంది. అంతేకానీ ఈ భూములిస్తేనే పనులు ప్రారంభిస్తామని చెప్పడం కేంద్రం ఆడుతున్న నాటకంలా అనిపిస్తోందని పొలిటికల్ ఎనలిస్ట్ ఎం. యుగంధర్ రెడ్డి బీబీసీతో అన్నారు.
జోన్ ఏర్పాటు సౌకర్యాలు, సమస్యలు, భూ సేకరణ, ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలతో కూడిన డీపీఆర్ ఆమోదం పొందితే చాలు రైల్వే జోన్ పనులు ప్రారంభించవచ్చు అని గతంలో బీబీసీతో మాట్లాడిన అప్పటీ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఎస్.ఎస్ శ్రీనివాస్ అన్నారు.

ఫొటో సోర్స్, Lakkojusrinivas
‘రైల్వే జోన్ పై చిత్తశుద్ధి లేదు’
విశాఖపట్నం పర్యావరణ పరంగా చాలా సెన్సిటివ్ ప్రాంతం. రైల్వే జోన్‌కు ముసర్లోవ పరివాహక ప్రాంతంలోని స్థలాలు కేటాయిస్తే.. రేపు అక్కడ నిర్మాణాలు చేపట్టకూడదంటే పరిస్థితి ఏంటని యుగంధర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
అందుకే రైల్వేశాఖ ఆ భూములను తీసుకోలేదని, రైల్వేజోన్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన భూములను ఇంకా మాకు ఇవ్వలేదని కేంద్రం అందుకే చెప్పిందన్నారు.
''ఈ వివాదానికి ముగింపు పలికి, కేంద్రానికి భూములను అప్పగించాలంటే.. గిరిజనులు తమ అధీనంలో ఉన్నాయని అంటున్న భూములపై వివాదాన్ని పరిష్కరించడంతో పాటు ఆ భూములు ముడసర్లోవ పరివాహన ప్రాంతంలో లేవని నిరూపించాలి. వాటిని నోటి మాట ద్వారా చెప్పడం కాకుండా రైల్వే అధికారులు మీడియాను అక్కడికి తీసుకుని వెళ్లి, కొలతలు, లెక్కలు వేసి ఆ భూములను అప్పగిస్తే సరిపోతుంది'' అని యుగంధర్ రెడ్డి అన్నారు.
''ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చినప్పుడు అనేక విషయాల్లో ప్రభుత్వమే ఫ్యాక్ట్ చెక్ చేసి వాటిలో తప్పొప్పులు చెప్తున్నది. మరి ఎంతో కీలకమైన రైల్వే జోన్ భూముల విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదు, అంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు ఏదో తప్పుందని, రైల్వే జోన్ విషయంలో చిత్తశుద్ధి లేదని లేదా కేంద్రంతో ఈ విషయంలో పొట్లాడేందుకు భయపడుతుందని భావించాల్సి వస్తుంది'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కృష్ణా జలాల వివాదం: సాగర్, శ్రీశైలం కేఆర్ఎంబీకి ఇవ్వకూడదని తెలంగాణ చేసిన తీర్మానంతో ఏం జరగనుంది.. తెలంగాణకు లాభమా, నష్టమా?
- ఎజియావో: మనుషుల యవ్వనం కోసం గాడిదలను చంపేస్తున్నారు
- నరేంద్ర మోదీ నుంచి‘‘బ్రాండ్ మోదీ’’ వరకు..
- ప్రపంచంలోనే ‘అతిపెద్ద నౌక’ను సద్దాం హుస్సేన్ సైన్యం ఎలా ముంచేసిందంటే..
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














