కృష్ణా జలాల వివాదం: సాగర్, శ్రీశైలం కేఆర్ఎంబీకి ఇవ్వకూడదని తెలంగాణ చేసిన తీర్మానంతో ఏం జరగనుంది.. తెలంగాణకు లాభమా, నష్టమా?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో జల రాజకీయం నడుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్.. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులపైకి మళ్లింది. ఈ విషయంలో తెలంగాణ అసెంబ్లీలో రెండు రోజుల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఓ తీర్మానం చేసింది.
అంతిమంగా చర్చ ముగిశాక.. బీఆర్ఎస్ కూడా తీర్మానానికి మద్దతు తెలిపింది.
ఇంతకీ ఈ తీర్మానం ఏమిటంటే.. ‘‘కృష్ణా నదిపై ఏపీ, తెలంగాణకు ఉన్న కామన్ ప్రాజెక్టులు.. అంటే నాగార్జున సాగర్, శ్రీశైలంను కేఆర్ఎంబీ (కృష్ణా నది యాజమాన్య సంస్థ)కి అప్పగించేది లేదు.’’.
అంతేకాదు ఇప్పటికే నాగార్జున సాగర్ వద్ద ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని కూడా తీర్మానంలో ఉంది.
ఇప్పుడు ఈ తీర్మానం చుట్టూ చర్చ సాగుతోంది. ఒకవైపు కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్‌పై వివాదం నడుస్తుండగానే.. మరోవైపు కృష్ణా నది మీద ప్రాజెక్టులపై తీర్మానం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంతకీ ఈ తీర్మానంతో తెలంగాణకు లాభమా..నష్టమా..? కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించకపోతే ఏం జరుగుతుంది.. అప్పగిస్తే ఏమవుతుందనేది ఒకసారి చూద్దాం…

ఫొటో సోర్స్, LEGISLATURE.TELANGANA.GOV.IN
అసెంబ్లీ ఈ తీర్మానం ఎందుకు చేసింది?
ముందుగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడానికి గల కారణాలు తెలుకోవాలంటే.. రెండున్నర నెలలు వెనక్కి వెళ్లాలి.
సరిగ్గా 2023 నవంబర్ 29న తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరుగుతున్న రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సగ భాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు.
ఈ వ్యవహారం పెద్ద రాజకీయ దుమారం రేపింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ చూస్తుండగా.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణ చూస్తోంది.
అలాంటిది సాగర్ నుంచి నీటిని తీసుకునేందుకు ఏపీ ఒక్కసారిగా పోలీసులను పంపించి విడుదల చేయించింది. 13వ గేటు వద్ద పోలీసులు కంచె వేశారు.
కుడి కాలువ నుంచి దాదాపు 5,450 క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది ఏపీ. సరిగ్గా తెలంగాణలో ఎన్నికల రోజున జరిగిన ఈ వ్యవహారం దుమారానికి తెరలేపింది.
ప్రాంతీయ సెంటిమెంటు లేపి బీఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చేందుకే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం డ్రామాకు తెరలేపిందని కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపించాయి అప్పట్లో.
ఆ తర్వాత పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్ర హోం శాఖ.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించింది.
ఆ సందర్భంగా నాగార్జున సాగర్ డ్యాంను సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలో ఉంచేందుకు రెండు రాష్టాలు అంగీకరించాయి.
అప్పటి నుంచి సాగర్ ప్రాజెక్టుపై సీఆర్పీఎఫ్ బలగాలే బందోబస్తు కాస్తున్నాయి.

ఫొటో సోర్స్, UGC
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే శ్రీశైలం, నాగార్జున సాగర్ రాష్ట్ర పరిధిలోంచి చేజారిపోయి కేఆర్ఎంబీకి వెళ్లిపోతున్నాయని కాంగ్రెస్ ప్రచారం చేస్తూ వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫిబ్రవరి 2వ తేదీన కేఆర్ఎంబీ సమావేశంలో కామన్ ప్రాజెక్టులు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ నీటి పారుదల శాఖాధికారులు ప్రకటించారు. ఈ సమావేశం తర్వాత అప్పటి ఈఎన్సీ మురళీధర్ ఇదే విషయాన్ని చెప్పారు.
ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ విమర్శలు సంధించింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించేందుకు సిద్ధమైందని విమర్శించింది. ఈ పరిణామాలు కేఆర్ఎంబీకి నాగార్జునసాగర్, శ్రీశైలం బాధ్యత అప్పగించేది లేదని తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణమైందని చెప్పవచ్చు.
‘‘ఏపీ పునర్వ్యస్థీకరణ చట్టం-2014 ప్రకారం.. కేఆర్ఎంబీని ఏర్పాటు చేసి రెండు రాష్ర్టాల మధ్య నిర్దేశితంగా నీటిని పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. గత ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించింది. ఇది తెలంగాణ ప్రయోజనాలకు నష్టం చేసేది. అందుకే రెండు ప్రాజెక్టులను కూడా కేఆర్ఎంబీకి అప్పగించకూడదని నిర్ణయించాం.’’ అని చెప్పారు తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి.
‘‘కేఆర్ఎంబీకి అప్పగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తీర్మానాలు చేశారు. దీనిపై ఈఎన్సీ స్పష్టమైన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు అప్పగించాలని తీర్మానాలు చేశారన్నది అవాస్తవం. మేం షరతులకు లోబడి సమీక్షిస్తామని చెప్పాం. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడాన్ని బీఆర్ఎస్ తరఫున వ్యతిరేకిస్తున్నాం.’’ అని చెప్పారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

కేఆర్ఎంబీ అంటే..
కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 85(1), (4), (5) అనుసరించి కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)ను 2014 మే 28న కేంద్ర జలవనరుల శాఖ (ఇప్పుడు జల్ శక్తి శాఖ) ఏర్పాటు చేసింది. ఇదొక స్వయంప్రతిపత్తి గల సంస్థ.
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల నుంచి తాగునీరు, సాగునీరు, కరెంటు ఉత్పత్తి ఏపీ, తెలంగాణకు నిర్ధేశిత పరిమితుల ప్రకారం పంపిణీ చేయడం కేఆర్ఎంబీ ఉద్దేశం. దీనికి అపెక్స్ కౌన్సిల్‌కు కేంద్ర జల్ శక్తి మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు.
కృష్ణా నది మహారాష్ర్ట, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో కలిపి 1,401 కిలోమీటర్లు ప్రవహిస్తోంది.
ఇందులో 612 కిలోమీటర్లు తెలుగు రాష్ర్టాల్లో పారుతోంది. దీని పరిధిలో తెలంగాణలో 50,155 చదరపు కిలోమీటర్లు, ఏపీ పరిధిలో 26,097 చదరపు కిలోమీటర్ల క్యాచ్ మెంట్ ఏరియా ఉంది.
దేశంలో ప్రవహిస్తున్న పెద్ద నదుల్లో కృష్ణ నది నాలుగో స్థానం. మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రహహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది పొడవు గంగ, బ్రహ్మపుత్ర, గోదావరి తర్వాత స్థానంలో ఉంటుంది. దాదాపు 1,300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కొన్నిచోట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచే మహారాష్ట్ర, కర్ణాటకతో నీటి కేటాయింపులపై వివాదాలు నడుస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జల వివాదాలు ఏపీ, తెలంగాణల మధ్య కూడా రాజుకున్నాయి.

ఫొటో సోర్స్, UGC
అసెంబ్లీ తీర్మానంతో తెలంగాణకు ప్రయోజనమెంత?
- కృష్ణా బేసిన్‌లో ఏపీ, తెలంగాణకు కామన్ ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్.
- ఏపీ పరిధిలో బైరవానితిప్ప రిజర్వాయర్, హంద్రీనీవా, పులించింతల, సాగర్ కుడి కాల్వ, ప్రకాశం బ్యారేజీ, సంజీవయ్య సాగర్ గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేశుల, తెలుగుగంగ, తుంగభద్ర హైలెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్, వైకుంఠపురం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులు ప్రధానమైనవి.
- తెలంగాణ పరిధిలో ఏఎమ్మార్పీ, దిండి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, లంక సాగర్, కల్వకుర్తి, జూరాల, బీమా, రాజోలిబండ డైవర్షన్, వైరా, ఒకచెట్టివాగు సహా మరికొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి.
- కృష్ణా జల వివాదాలపై 1969లో ఏర్పాటైన బచావత్ ట్రిబ్యునల్ 1976 మే నెలో తుది తీర్పు వెలువరించింది. దీని ప్రకారం కృష్ణానది బేసిన్‌లో 811 టీఎంసీల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడం జరిగింది.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజారావు కమిటీ సిఫార్సుల మేరకు ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా నీటి కేటాయింపులపై ఒక అవగాహన ఒప్పందం జరిగింది. దీని ప్రకారం.. 298.96 టీఎంసీలు తెలంగాణకు కేటాయించగా.. 512.04 టీఎంసీలు ఏపీకి కేటాయించడం జరిగింది.
- రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇవే కేటాయింపులు కొనసాగుతూ వచ్చాయి. ఈ విషయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
‘‘కృష్ణా నది నీటి పంపిణీలో గతంలో వివక్ష జరిగింది. క్యాచ్ మెంట్ ఏరియా, కరవు ప్రాంతాలు, బేసిన్ జనాభా, సాగు విస్తీర్ణం ఆధారంగా నీటి పంపిణీ జరగాలి. తెలంగాణ హక్కుల కోసం, నీటి వాటా కోసం పోరాడతాం’’ అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఇదే విషయంపై తెలంగాణ నీటి పారుదల శాఖ రిటైర్డు ఇంజినీరు నైనాల గోవర్దన్ బీబీసీతో మాట్లాడారు.
‘‘బచావత్ ట్రిబ్యునల్ లెక్కించిన నికర జలాల ఆధారంగా అప్పట్లో కేటాయింపులు జరిగాయి. ఈ కేటాయింపులు మార్చాలంటే మళ్లీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచే జరగాలి. గతంలో బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులపై రివ్యూ చేయాలి. క్యాచ్ మెంట్ ఏరియాను పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే గతంలో తెలంగాణకు నీటి కేటాయింపులు న్యాయంగా జరిగే వీలుంది.’’ అని చెప్పారు.
తెలంగాణకు నీటి కేటాయింపులు 50శాతం ఉండాలని కేఆర్ఎంబీ సమావేశాల్లో తెలంగాణ నీటి పారుదల శాఖ వాదిస్తూ వస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీన జరిగిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు మాజీ ఈఎన్సీ మురళీధర్ మీడియాకు చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తే ఏమవుతుంది..
ఏపీ ప్రాజెక్టులు ప్రధానంగా క్రష్ణా జలాలపై ఆధారపడి కట్టినవే ఎక్కువ. వీటి సామర్ధ్యం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ప్రభుత్వాలు ముందుకు వెళుతున్నాయి. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44 వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులు ఏపీ పెంచుతోంది.
తెలుగు గంగ కాల్వ సామర్థ్యాన్ని 11,500 క్యూసెక్కుల నుంచి 18 వేలకు పెంచారు. ముచ్చుమర్రి (హంద్రీనీవా) విస్తరణతో 2,200 క్యూసెక్కుల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచడం జరిగింది. వెలిగొండ ద్వారా రోజుకు టీఎంసీ నీరు తీసుకుంటున్నారు. అలా ఏపీకి రోజుకు 10-11 టీఎంసీల నీరు తీసుకుంటుంటే.. అందులో 8 టీఎంసీల నీరు గ్రావిటీ ద్వారానే వెళుతున్నాయి.
ఇప్పుడు ఇదే విషయంపై తెలంగాణలోని ఇంజినీర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ ఏపీ పరిధిలో ఉండటంతో అక్కడి నుంచి నీటి తరలింపునకు ఏపీ ప్రభుత్వం సులువుగా మారిందని తెలంగాణ ఇంజినీర్ల వాదన.
తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులు జరిగే నాటికి అక్కడి ప్రాజెక్టులు పూర్తి కాలేదు.
నేటికీ ప్రాజెక్టులది అదే పరిస్థితి. పాలమూరు-రంగారెడ్డి రోజుకు రెండు టీఎంసీల నీరు తీసుకోవాలని డిజైన్ చేశారు. అది పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ ద్వారా రోజుకు నాలుగువేల క్యూసెక్కులు తీసుకోవచ్చు. అది పూర్తి కాలేదు, కల్వకుర్తి ఒక్కటే తీసుకునేందుకు ఉంది. ఐదు పంపులు పూర్తిగా పనిచేస్తే 4 వేల క్యూసెక్కులు తీసుకోవచ్చు. కానీ, మూడు పంపులే పనిచేస్తుండటంతో 2,400 క్యూసెక్కులే తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ర్టాలు కామన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి ఇస్తే పర్యవేక్షణ కారణంగా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను న్యాయబద్ధంగా తీసుకునే వీలుంటుంది.

నీటి పంపిణీపై పర్యవేక్షణకు వీలు..
కామన్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలో ఉంటేనే తెలంగాణకు మేలు జరిగే అవకాశం ఉందని చెప్పారు తెలంగాణ నీటి పారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీరు శ్యాంప్రసాద్ రెడ్డి.
‘‘కేఆర్ఎంబీకి ఇవ్వకపోవడం విషయంలో రాజకీయంగా వ్యత్యాసాల కారణంగానే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం శ్రీశైలం అనేది ఏపీ పరిధిలో ఉంది. అక్కడి నుంచి నీటిని తీసుకుంటుంటే తెలంగాణ ఏ విధంగా అడ్డుకోగలదు..? తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే, కేఆర్ఎంబీకి ఇస్తేనే ప్రయోజనం జరుగుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నడుస్తున్నవివాదంతోనే ఇలా జరిగింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇస్తే, ఆంధ్రాకు ఇచ్చినట్లు అవుతుందని కొందరు చెబుతున్నారు. అదెలా అవుతుంది..?’’ అని శ్యాంప్రసాద్ రెడ్డి బీబీసీతో అన్నారు.

కేంద్రం జోక్యం పెరుగుతుంది..
ఈ విషయంలో నీటి పారుదల శాఖ రిటైర్డు చీఫ్ ఇంజినీర్ ఎన్.రంగారెడ్డి భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు.
‘‘కేఆర్ఎంబీకి లేని ప్రాధాన్యాన్ని కల్పించారు. ట్రిబ్యునల్ కేటాయింపులు పర్యవేక్షించడమే బోర్డు పని. వచ్చిన నీటిని పంపిణీ చేయడమే దాని పని. అలాంటిది ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించినా.. నీటి పంపిణీనే చేస్తుంది తప్ప కేటాయింపులతో సంబంధం ఉండదు. నిర్వహణ కేఆర్ఎంబీకి వెళ్లిపోతే, మన అజమాయిషీ కోల్పోతాం. కేంద్ర జోక్యం పెరిగే అవకాశం ఉంది.’’ అని చెప్పారు.
కేఆర్ఎంబీని పూర్తి స్వయం ప్రతిపత్తిగల సంస్థగా ఏర్పాటు చేస్తేనే ప్రయోజనం జరుగుతుందనేది మరికొందరి వాదన.
ఈ విషయంపై రిటైర్డు ఇంజినీరు నైనాల గోవర్దన్ బీబీసీతో మాట్లాడారు.
‘‘కామన్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఇస్తేనే నీటిపంపిణీపై పర్యవేక్షణ సాధ్య పడుతుంది. కానీ, కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ కాకుండా స్వతంత్రంగా కేఆర్ఎంబీ వ్యవహరించాలి. స్వతంత్ర ఇంజినీర్లను నియమించాలి. ప్రస్తుతం చేసిన తీర్మానం వెనుక పార్లమెంటు ఎన్నికల రాజకీయంగా స్పష్టంగా కనిపిస్తోందే తప్ప నీటి కేటాయింపులు, లభ్యత ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు లేదు.’’ అని చెప్పారు.
2015లోనే ఒప్పుకున్నప్పటికీ…
వాస్తవానికి 2015లోనే కామన్ ప్రాజెక్టులు ఇస్తామని రెండు రాష్ట్రాలు ఒప్పుకున్నాయి.
అప్పట్లో ఏపీ జీవో ఇచ్చింది కానీ, తెలంగాణ ప్రాజెక్టులు ఇవ్వడానికి ఒప్పుకొంటేనే అమలులోకి వస్తుందని నిబంధన విధించింది.
ఈ విషయంలో అప్పటి నుంచి సాగదీత ధోరణి నడుస్తూ వచ్చింది.

సర్ ప్లస్ వస్తే ఏం చేయాలి?
కృష్ణా నదిలో వరద ఏటా ఒకే రకంగా ఉండదు. ప్రతి ఏటా మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆగస్టులోనే అన్ని ప్రాజెక్టులు నిండిపోతాయి. లేకపోతే, మరో ఏడాది ప్రాజెక్టుల్లోకి నీళ్లు చేరక డెడ్ స్టోరేజీకి ప్రాజెక్టులు చేరుకుంటాయి.
ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాల ఆధారంగానే కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు ఆధారపడి ఉంటాయి. వర్షాలు సరిగా పడకపోతే ప్రాజెక్టులు ఒట్టిపోతుంటాయి.
ఒకవేళ నీరు తక్కువగా ఉంటే దానికి తగ్గట్టుగా ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ జరిగేలా కేఆర్ఎంబీ పర్యవేక్షిస్తోంది.
కానీ, ఏదైనా ఏడాది సర్ ప్లస్ (మిగులు జలాలు) వస్తే ఎలా పంపిణీ చేయాలనే విషయంపై పీటముడి పడింది.
2022లో 276.95 టీఎంసీల నీరు అదనంగా రావడంతో సముద్రంలో కలిసిపోయాయి.
నీటి ప్రవాహం ఎంత వస్తుందనేది స్పష్టత ఉండదు. ఒక రాష్ర్టానికి కేటాయించిన తర్వాత మరో రాష్ట్రానికి కేటాయించాలంటే నీరు సరిపడకపోవచ్చు. ఈ నేపథ్యంలో సర్ ప్లస్ పంపిణీ ఏ విధంగా చేయాలనే విషయంపై స్పష్టత ఉండటం లేదు.
దీనివల్ల కేఆర్ఎంబీకి పర్యవేక్షణ అప్పగిస్తే, దానికి తగ్గట్టుగా పంపిణీ చేసేందుకు వీలుంటుందని సాగునీటి శాఖ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- గుల్బదన్: ఒట్టోమాన్ సుల్తాన్‌ను ఎదిరించిన మొఘల్ యువరాణి కథ...
- నరేంద్ర మోదీ నుంచి‘‘బ్రాండ్ మోదీ’’ వరకు..
- ప్రపంచంలోనే ‘అతిపెద్ద నౌక’ను సద్దాం హుస్సేన్ సైన్యం ఎలా ముంచేసిందంటే..
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- కేజీ బేసిన్: కాకినాడ తీరంలో తొలిసారిగా చమురు వెలికితీత...భారతదేశపు చమురు అవసరాలను ఇది తీర్చగలదా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














