Add your title (COPY)
Combine large, bold images with the beautifully crafted words of your story.

నరేంద్ర మోదీ నుంచి‘‘బ్రాండ్ మోదీ’’ వరకు

జుబైర్ అహ్మద్
ఈ జనవరి 22న వేదమంత్రోచ్చారణల నడుమ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించడం చూస్తే ఆయన హిందూ ‘హృదయ సామ్రాట్’ ఇమేజ్‌కి అనుగుణంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. ఆయన అదే వారసత్వాన్ని కొనసాగించాలనుకుంటున్నారు.
ఇదంతా మోదీ హిందూ జాతీయవాద భావజాలాన్ని బలంగా నమ్మే జనాభాపై బలమైన ముద్ర వేసేందుకు రూపొందించిన కార్యక్రమంలో భాగమని విశ్వసిస్తున్నారు.
టెలివిజన్‌లో మతపరమైన వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ‘‘హిందూ ఓటర్ల’’ను ప్రసన్నం చేసుకొనే వ్యూహంగా విమర్శకులు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

2014, 2019 ఎన్నికల్లో ‘‘హిందూత్వ జాతీయవాద’’ భారతీయ జనతా పార్టీని విజయపథంలో నరేంద్ర మోదీ నడిపారు. భారతీయ జనతా పార్టీకి ఒక ముఖంగా మారిన మోదీ 2024 ఎన్నికలు కూడా గెలుస్తారని చాలా మంది భావిస్తున్నారు. మతపరంగా సమాజాన్ని విభజించినప్పటికీ ఆయనకు ఇది ఎలా సాధ్యమవుతోంది?
నిరుడు జూన్‌లో, వైట్‌హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కిన గౌరవం ఆయన జీవితంలో గర్వించదగిన క్షణాలలో ఒకటని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు.
యూఎస్ కాంగ్రెస్ ఉమ్మడి సెషన్‌లో మోదీ ప్రసంగం సందర్భంగా హర్షధ్వానాలతో పాటు ఓవల్ కార్యాలయంలో కౌగిలింతలు, కరచాలనాలతో మోదీ దేదీప్యమానంగా వెలిగిపోయారు.
ఒకప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన కింద ఆయన తమ దేశానికి రాకుండా నిషేధాజ్ఞలు విధించిన దేశం అమెరికా. కాబట్టి మోదీకి లభించిన గౌరవం వ్యక్తిగత విజయంగా భావించాలి.

అమెరికా రాజధానిలో మోదీకి దక్కిన ప్రశంసలను ప్రపంచం చూసిందని, ఆయనకిప్పుడు పాశ్చాత్య దేశాలలో విస్తృతంగా గౌరవం దక్కుతోందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

క్రిస్టోఫ్ జాఫ్రెలాట్
క్రిస్టోఫ్ జాఫ్రెలాట్
అయితే, పాశ్చాత్య దేశాలలో భారత ప్రధానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు, ఫ్రెంచ్ స్కాలర్ ప్రొఫెసర్ క్రిస్టోఫ్ జెఫ్రెలో చెప్పారు:
"పాశ్చాత్య దేశాల ప్రభుత్వాల మధ్య స్పష్టమైన విభజన ఉంది. నిరుడు జులైలో నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌కు వెళ్లారు. అయితే మణిపుర్‌లో హింసపై అదే యూరోపియన్ పార్లమెంటు తీర్మానం చేసింది, దీనర్థం ఆయనకు ఏకగ్రీవ మద్దతు లభించినట్లు కాదు. ఇది మణిపుర్, ఇతర ప్రాంతాలలో భారత్, భారత ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ చాలా బలమైన పదాలతో చేసిన తీర్మానమది. రెండోది ఆయనకు లభిస్తున్న మద్దతు వ్యక్తిగతమైనదీ కాదు, ఎందుకంటే చైనాతో సమంగా నిలబడే ఒక దేశం కోసం పశ్చిమ దేశాలు తీవ్రంగా వెతుకుతున్నాయి" అని ఆయన అన్నారు.
కొన్ని పాశ్చాత్య-ప్రజాస్వామ్య దేశాలకు మోదీ పాలనలో భారత రాజకీయ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం. కొందరికి మోదీ భారతదేశంలోని అత్యంత శక్తిమంతుడు, మరికొందరికి నిరంకుశుడు.
భారత్‌కు మోదీ నాయకత్వంలోనే ప్రపంచ వేదికపై సముచిత స్థానం దక్కిందని ఆయన మద్దతుదారులు భావిస్తారు.
అసమ్మతి స్వరాలను, పత్రికా స్వేచ్ఛను అణచివేయడం ద్వారా మోదీ భారత ప్రజాస్వామ్యం వెనుకబడిపోయేలా చేస్తున్నారని ఆయన విమర్శకులు ఆరోపిస్తున్నారు.
హిందూత్వ, అతి జాతీయవాదాన్ని ఆయన నొక్కిచెప్పడం భారత్‌లోని భిన్నత్వానికి, లౌకిక ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన వ్యతిరేకుల అభిప్రాయం. చాలా మంది తటస్థులు మాత్రం మోదీ తనను తాను టెక్నోక్రాట్‌గా మలుచుకోగలరని, అటు వ్యాపారం, ఇటు అభివృద్ధికి అనువైన పరిపాలన అందించగలరని నమ్ముతున్నారు.
మిత్రులు, శత్రువుల్లో మోదీ బలమైన అభిప్రాయాలను నాటినప్పటికీ ఆయన విశేష ప్రజాదరణ పొందిన నాయకుడు. దేశంలో ఎన్నికలు చాలా వరకూ స్వేచ్ఛగా జరుగుతాయి. 2014, 2019 ఎన్నికల్లో మోదీ భారతీయ జనతా పార్టీని విజయాల వైపు నడిపించారు.

నరేంద్ర మోదీ దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్నారు. ఇతరుల కంటే ఈయనకు ఎక్కువ ప్రజాదరణ కనిపిస్తోంది.
ఆయన ప్రతి చోటా ఉన్నారు. అన్ని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్నారు. అన్ని మంత్రిత్వ శాఖల వెబ్‌సైట్‌ల మొదటి పేజీలలో కనిపిస్తారు. రేడియోలో ఉన్నారు. టీవీల్లోనూ ఉన్నారు. బిల్ బోర్డుల మీద కూడా ఉన్నారు. మీకు మోదీతో సెల్ఫీ కావాలంటే చాలా రైల్వే స్టేషన్లలో సెల్ఫీ-కియోస్క్‌లు కూడా ఉన్నాయి. ఆయన పేరు మీద వ్యక్తిగత వెబ్‌సైట్, ఒక యాప్ కూడా ఉన్నాయి. నగర కూడళ్లు, విమానాశ్రయ టెర్మినల్స్, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ ఖాదీ దుకాణాలు, రైల్వే ప్లాట్‌ఫారమ్‌లు ఇలా అన్నింటిలో మోదీ నవ్వుతున్న చిత్రాలు, కటౌట్‌లు దర్శనమిస్తాయి.
మోదీ నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించింది. మరికొద్దిరోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మోదీ సిద్ధమవుతున్నారు.
మోదీ ప్రత్యర్థులలో చాలా వరకూ అనైక్యత ఉంది, భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. అయితే గత జులైలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు సహా 26 పార్టీలు మోదీని, ఆయన ప్రభుత్వాన్ని "సమష్టిగా సవాలు" చేయడానికి ఒక కూటమిని ఏర్పాటు చేశాయి.
'మితిమీరిన జాతీయవాదం'పై అధికార బీజేపీ ఆధారపడడాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈ కూటమి తనకు తాను ఇండియాగా పేరు పెట్టుకుంది. ‘ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్’కి సంక్షిప్త రూపం ఇండియా. అయితే ఇప్పటికే ఈ కూటమికి బీటలు వారాయి.
మోదీని బీజేపీ తన స్టార్ క్యాంపెయినర్‌గా, ఎన్నికల్లో అత్యంత శక్తిమంతమైన ప్రచారాస్త్రంగా చూస్తోంది. ఈ 73 ఏళ్ల ప్రధానమంత్రికి సోషల్ మీడియాలో వస్తున్న ఆదరణ చూసి ఆయన ప్రత్యర్థులు కూడా అసూయపడుతున్నారు.
అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్ అయిన ప్యూ రీసర్చ్ సెంటర్ ఆగస్టు 2023 సర్వే ప్రకారం, భారతదేశంలోని 10 మందిలో ఎనిమిది మందికి భారత ప్రధాని పట్ల సానుకూల దృక్పథం ఉంది, వీరిలో 55 శాతం మందికి "అత్యంత అనుకూలమైన" అభిప్రాయం లేదా మంచి అభిప్రాయం ఉంది.
అమెరికాలో గత జూన్‌లో మోదీకి ఘన స్వాగతం పలికారు అధ్యక్షుడు జో బైడెన్. అయితే అమెరికాలో సర్వే చేస్తే 37 శాతం మందికి ఆయనపై సానుకూల అభిప్రాయం లేదు, 21 శాతం మందికి అనుకూల అభిప్రాయం ఉంది, 42 శాతం మందికి ఎలాంటి అభిప్రాయం లేదు, లేదా వ్యాఖ్యానించేందుకు ఇష్టపడలేదు.


కాబట్టి, మోదీకి లభిస్తున్న ప్రజాదరణ.. ఎన్నికల విజయంగా మారుతుందా? వచ్చే ఎన్నికల్లో మోదీ గెలుస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదని ఆయన మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు.
కానీ, ఫ్రెంచ్ స్కాలర్ ప్రొఫెసర్ క్రిస్టోఫ్ జెఫ్రెలో ఒక విషయాన్ని నొక్కి చెబుతున్నారు.
ఏ నాయకుడూ అజేయుడు కారని చెబుతూ:
"(బ్రెజిల్) బోల్సోనారో ఎన్నికల్లో ఓడిపోయారు, ట్రంప్ కూడా ఓడిపోయారు. పేదరికం, అసమానతలు పెరిగితే.. ప్రభుత్వాన్ని మార్చాలనుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ప్రాథమికంగా జరిగేదిదే. దీనినే జవాబుదారీతనం అని పిలుస్తారు. ఏ నాయకుడూ జవాబుదారీతనానికి అతీతులు కారు. లేదంటే మనం ప్రజాస్వామ్యంలో లేనట్లే"
అన్నింటికంటే ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, మోదీని సవాల్ చేసేది ఎవరు?

దేశంలో దాదాపు 80 నమోదిత జాతీయ రాజకీయ పార్టీలు, వందల మంది రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ, మోదీ పాపులారిటీకి ముప్పు తెచ్చేంత శక్తిమంతులు ఎవరూ కనిపించడం లేదు. మోదీ తిరుగులేని హవాకు ప్రతిపక్షాల బలహీనతే కారణమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు.

"నేను అజేయుడినని, నన్ను ఎవరూ ఓడించలేరని చెప్పడం ఒకటి. నా ప్రత్యర్థి బలహీనంగా ఉన్నందున నేను గెలుస్తాను అని చెప్పడం మరొకటి. మోదీని సవాలు చేసేవారు ఎవరూ లేకపోవడంతో ఆయన బలంగా కనిపిస్తున్నారనుకుంటున్నా" అని అన్నారు ప్రశాంత్ కిషోర్.
అనేక ప్రభుత్వ పథకాలు నిత్యం కోట్ల మంది ప్రజలకు చేరుతున్నాయి. గతంలో వీళ్లలో చాలా మందికి పథకాలు అందలేదు. కొన్ని కోట్ల మంది ప్రజలు తమ జీవితంలో తొలిసారి బ్యాంకు ఖాతాలు తెరిచారు. అనేక మందికి సొంత ఇల్లు కల సాకారమైంది. కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల రూపంలో నేరుగా ప్రజలకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ‘మోదీ గ్యారెంటీ’ పేరుతో అమలవుతున్న ఇటువంటి సంక్షేమ పథకాలు ‘మోదీ బ్రాండ్’కు మరింత బలాన్ని ఇచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మోదీకి ప్రధాన ప్రత్యర్థిగా కనిపిస్తున్నారు. అయితే, ఆయన ఇప్పటికే మోదీపై పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పరాజయాలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పలు పరాజయాలను ఎదుర్కొన్నారు. మోదీ ప్రభుత్వాన్ని నిలదీయాలని రాహుల్ గాంధీ రోజూ ప్రయత్నిస్తున్నారు కానీ, మోదీని రాజకీయంగా ఢీకొట్టడంలో విజయం సాధించలేకపోతున్నారు.
బ్రాండ్ బిల్డింగ్‌లో సంతోష్ దేశాయ్‌ది సుపరిచితమైన పేరు.
మోదీని సవాలు చేయడంలో రాహుల్ గాంధీ చిత్తశుద్ధిని శంకించలేమని, అయితే ఆయన మోదీకి ఇంకా సరిపోలడం లేదని సంతోష్ దేశాయ్ అభిప్రాయపడ్డారు.
‘’రాహుల్ గాంధీ చాలా ప్రయత్నించారు, నిజాయతీగా పనిచేశారు, కానీ ఆయన ప్రజలతో అంతగా మమేకం కాలేకపోయారు. ఆయన ఎంత ప్రయత్నిస్తున్నా ఎప్పుడూ విద్యార్థిలాగే కనిపిస్తారు. ప్రయత్నానికి లోటు లేదు కానీ సహజ సామర్థ్యం లోపించింది"

సంతోష్ దేశాయ్
సంతోష్ దేశాయ్
బీజేపీ దీనిని "రాహుల్ గాంధీని తిరిగి లాంచ్ చేసే రోడ్ షో" అని కొట్టిపారేసినప్పటికీ, ప్రజాస్పందన ఈ కాంగ్రెస్ నాయకుడి రాజకీయ ప్రతిష్టను పెంచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జనవరి 14న ఆయన ప్రారంభించిన భారత్ జోడో న్యాయ యాత్ర మొదటిదాని కంటే ఎక్కువ దూరం కొనసాగనుంది, పార్లమెంట్ ఎన్నికల ముందు ప్రజలతో కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
కోట్ల మంది భారతీయ ఓటర్లు బీజేపీ కోసం కాకుండా మోదీ కోసం ఓటు వేసినట్లు కనిపిస్తోంది.
ఐదేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత దిల్లీకి చెందిన థింక్ ట్యాంక్, సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్‌డీఎస్) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో, ఒకవేళ బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీ కాకపోతే మూడింట ఒక వంతు మంది ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేసి ఉండరని తేలినట్లు వెల్లడించింది.
రాజకీయాలు, ఇతర రంగాల్లో కుటుంబ వారసత్వాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా విజయాలు వరించిన దేశంలో, మోదీ సొంతంగా ఎదిగిన తీరు ఓటర్లకు బాగా తెలుసు.
మోదీ సాధారణ నేపథ్యం నుంచి వచ్చినందున ఓటర్లు బాగా కనెక్ట్ అయ్యారు. తొలినాళ్లలో మోదీ జీవితం కూడా ఆయన రాజకీయంగా ఎలా ఎదిగారనేదానికి ప్రతీకగా నిలుస్తుంది.
మోదీ చిన్న వయస్సులో, సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఓ సాధారణ పార్టీ కార్యకర్త.
నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్ ప్రకారం, ఆయన గుజరాత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో ఆఫీస్ బాయ్. ఆయన పని రోజూ కార్యాలయాన్ని శుభ్రపరచడం, అవసరమైన వస్తువులను తీసుకురావడం.

మోదీ స్వయంగా రైల్వే స్టేషన్లలో టీ అమ్మడం సహా తన గతం గురించి ధ్రువీకరణ కాని కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను పేద తల్లిదండ్రుల సంతానమని పదేపదే చెప్పుకొచ్చారు.
అయితే, తోటివారి నుంచి మోదీని వేరు చేసింది ఏమిటి? భారత్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా ఆయన ఎలా ఎదిగారు?
మాస్టర్ కమ్యూనికేటర్, ఈవెంట్ మానిప్యులేటర్?

మోదీ మద్దతుదారులు ఆయనను మంచి వాక్చాతుర్యం ఉన్న నేతగా భావిస్తారు. కానీ, తన ప్రయోజనాల కోసం పెద్దపెద్ద సంఘటనలను తారుమారు చేశారని ఆయన విరోధులు ఆరోపిస్తారు. అయితే మోదీ షో మ్యాన్, ఆకర్షణీయమైన వక్త అని ఇరువర్గాలు అంగీకరిస్తున్నాయి. ప్రసంగాలను శక్తిమంతమైన సాధనంగా ఉపయోగించి, జనాలతో కనెక్ట్ అయ్యే బలమైన మార్గముంది ఆయనకు.
మోదీ "చాయ్ పే చర్చా" సెషన్‌లు లేదా ర్యాలీల కోసం 3డీ హోలోగ్రామ్ టెక్నాలజీని ఉపయోగించడం వంటి సమర్థవంతమైన రాజకీయ ప్రచారాన్ని రూపొందించుకున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా మోదీ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ప్రశంసిస్తారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్, మోదీని ప్రశంసిస్తూ ఆయనను మాస్టర్ కమ్యూనికేటర్ అని పిలిచినందుకు శశి థరూర్‌పై పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అని ఆయన అన్నారు:
"ప్రధాని ప్రసంగాలు ప్రభావవంతంగా ఉంటాయి. అసమాన రీతిలో నినాదాలు, సౌండ్ బైట్‌లు, ఫోటో ఆప్షన్లతో ముందుకు వస్తారు. మనమందరం మాస్టర్ కమ్యూనికేటర్‌ని చూస్తున్నామనడంలో సందేహం లేదు"

శశి థరూర్
శశి థరూర్
రొటీన్ ఈవెంట్‌ను కూడా బ్రాండ్ బిల్డింగ్‌కు మెగా వేదికగా మార్చే నేర్పు మోదీకి ఉందని కొందరు అంటున్నారు.
ఉదాహరణకు నిరుడు అక్టోబర్‌లో ప్రధాని దిల్లీలో 'NaMo కమ్యూటర్ రైలు సేవలను' ప్రారంభించినప్పుడు, ఆయన రైలులో పాఠశాల బాలికలు సహా సాధారణ ప్రయాణికులతో సంభాషిస్తున్నట్లు చూపించారు.


దీని ద్వారా మోదీ సాధారణ వ్యక్తులతో ఎంత సులభంగా కలిసిపోతారు, వారి సమస్యలను అర్థం చేసుకుంటారు అనే సందేశం మరోసారి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది.
కమ్యూనికేషన్స్‌పై మోదీకి ఉన్న పట్టులో ముఖ్యమైన భాగం ఆయన ధీమా. సంతోష్ దేశాయ్ చెప్పిన దాని ప్రకారం, ఒక సంఘటనను ఎలా వాడాలో మోదీకి తెలుసు
"మోదీ జీ దీన్ని చాలా బాగా చేస్తారు. జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని తీసుకోండి, సమ్మిట్‌ను రొటేషన్ ప్రకారం ఒక సభ్య దేశం నిర్వహిస్తుంది. ఈ ఆతిథ్యం సభ్య దేశానికి ఏ విధంగానూ విజయం కాదు. అంతకుముందు ఇండోనేషియా చేసింది. ఈసారి బ్రెజిల్ వంతు, కానీ మోదీ జీ20ని ఒక మెగా ఈవెంట్‌గా మార్చారు. ఈ ఈవెంట్ ఏంటి? దానిని ఎలా వాడాలి? అనే దానిపై ఆయనకు అవగాహన ఉంది.’’

దేశ ప్రధాని ఎవరనే దానితో సంబంధం లేకుండా భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రధాని వ్యక్తిగత విజయంగా ప్రచారం వేసింది.
జీ20 వంటి ఒక శిఖరాగ్ర సమావేశాన్ని రాజకీయాల కోసం ఒక ఈవెంట్‌గా మార్చారని ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. జీ20 అధ్యక్ష బాధ్యతల చుట్టూ మోదీ, బీజేపీ "హై-వోల్టేజ్ డ్రామా" చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్ ఆరోపించారు.
భారత ప్రధాని జాతీయంగా జరిగిన ప్రతిదానికీ క్రెడిట్ తీసుకుంటారని మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ జోయోజీత్ పాల్ ఆరోపించారు:
“దిల్లీ మెట్రో రూపకర్త శ్రీధరన్ అని వినే ఉంటారు, ఒకవేళ ఇప్పుడు దిల్లీ మెట్రో ఏర్పాటు చేసినట్లయితే, దానిని మోదీ స్వయంగా తయారు చేశారని చెప్పేవారు"

జోయోజీత్ పాల్
జోయోజీత్ పాల్
మోదీ ప్రజలతో కేవలం వాక్చాతుర్యం, బాడీ లాంగ్వేజ్ ద్వారా మాత్రమే దగ్గరవ్వరు. ఆయన విభిన్న వేషధారణలు, శిరస్త్రాణాలను ధరించి భావోద్వేగాలను బహిరంగంగా ప్రదర్శిస్తారు. ఆయన బహిరంగంగా కన్నీళ్లు పెట్టగలరు. మోదీ కన్నీళ్లు తన మద్దతుదారుల దృష్టిలో ఆయన్ను మానవీయంగా కనిపించేలా చేస్తుంది. ఇలాంటి ఉద్వేగభరితమైన క్షణాలు ఓటర్లను సమీకరించడంలో ప్రభావవంతమైనవిగా నిరూపితమయ్యాయి.
మోదీ తన వేషధారణలోనూ ప్రజలతో కనెక్ట్ అయ్యేలా చూసుకుంటారు. కొన్నిసార్లు కూల్ లుకింగ్, మోడరన్ డ్రెస్సులు ధరిస్తారు. మరికొన్నిసార్లు ప్రాంతీయ దుస్తులు, తలపాగా నుంచి హిందూ ఋషులు ధరించే కాషాయ వస్త్రాల వరకూ రంగురంగుల ఇండియన్ డ్రెస్సులు ధరిస్తారు.
రాజకీయాల్లో ఒక బ్రాండ్‌గా ఆయనను పాఠ్యపుస్తకాల్లో చూసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఒక సాధారణ పార్టీ కార్యకర్త నుంచి ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా మోదీ చేసిన రాజకీయ ప్రయాణం చెప్పుకోదగ్గ విజయం అని ఆయన విమర్శకులు కూడా అంగీకరిస్తున్నారు. ఎందుకంటే, ఇదంతా ఊరికే జరిగిపోలేదు.
దర్శన్ దేశాయ్ గుజరాత్‌లోని సీనియర్ జర్నలిస్ట్, మోదీ సాధారణ బీజేపీ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనకు తెలుసు.
మోదీ రాజకీయ జీవితానికి ప్రధాన రూపశిల్పి మోదీ మాత్రమేనని, ఆయన మాత్రమే తన ప్రయాణాన్ని జాగ్రత్తగా రూపొందించుకున్నారని, తనను తాను పొలిటికల్ బ్రాండ్‌గా మార్చుకున్నారని దర్శన్ చెప్పారు.
"నరేంద్ర మోదీ చాలా ఆలోచిస్తారు. భవిష్యత్ ఆలోచన చేస్తారు. దేశ ప్రధాని కావడానికి ఆయన చాలా కాలం క్రితమే స్క్రిప్ట్‌ను రూపొందించారని నాకు తెలుసు" అని దర్శన్ దేశాయ్ చెప్పారు.

దర్శన్ దేశాయ్
దర్శన్ దేశాయ్
కానీ మోదీ తన కెరీర్ ప్రారంభంలో భారీ ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు, అవి ఆయన రాజకీయ ఆశయాలను ప్రమాదంలో పడేశాయి కూడా. 2001 నుంచి 2014 మధ్య మూడుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మోదీ. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన ఒక సంవత్సరం తర్వాత, అంటే 2002లో గుజరాత్‌లో హింసాకాండ జరిగింది. దాంతో మోదీ ప్రభుత్వం కుదేలైంది, ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా మరణించారు, ఇందులో ఎక్కువ మంది ముస్లింలున్నారు. ఆ ఘటనతో ఆయన ఇమేజ్ దెబ్బతినడంతోపాటు అమెరికా కూడా మోదీకి వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. హత్యలను ఆపేందుకు ఆయన ఎంతమాత్రం ప్రయత్నించలేదని ఆరోపించింది. కానీ, చాలా కాలం తరువాత భారత సుప్రీంకోర్టు ఆయనపై మోపిన అన్ని ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది.

గుజరాత్ ప్రజల ఆత్మగౌరవాన్ని’ అడ్డు పెట్టుకోవడం ద్వారా మోదీ ఈ వివాదాస్పద సమస్య అంతు తేల్చేందుకు ప్రయత్నించారని దర్శన్ దేశాయ్ పేర్కొన్నారు.
"2002 అల్లర్ల తర్వాత మోదీపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆయన నేరుగా ప్రజల వద్దకు వెళ్లి, ఇది గుజరాత్ ఆత్మగౌరవంపై వేస్తున్న ప్రశ్నఅన్నారు. తనపై దాడి గుజరాత్ ప్రజలపై దాడేనని అన్నారు" అని ఆయన చెప్పారు.
ఇమేజ్ మేకోవర్

మోదీ 2003 నుంచి తన ఇమేజ్ మేకోవర్‌పై దృష్టి పెట్టారు. అందులో ఉన్న ప్రధాన అంశాలు ఏంటంటే...:
వైబ్రంట్ గుజరాత్
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించడం ద్వారా గుజరాత్‌ను ప్రపంచ వేదికపై నిలబెట్టే ప్రయత్నం చేశారు.

‘‘అల్లర్లకు ముందు మోదీ ‘హిందూ హృదయ సామ్రాట్’ అనే పేరు సంపాదించుకునే ప్రయత్నం చేశారు. హిందుత్వ కోసం పోరాడే వ్యక్తిగా తనను తాను చూపించుకోగలిగారు. ఇది ప్రభావవంతమైన రాజకీయ వ్యూహం’’ అని మిషిగాన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జోయోజీత్ పాల్ అన్నారు. రాజకీయంగా అది ఆయనకు మంచి మైలేజీ తెచ్చిందని పాల్ అభిప్రాయపడ్డారు.
‘‘అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా తనను తాను చూపించుకోవాలని మోదీ కోరుకున్నారు.
గుజరాత్‌ను విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడం ద్వారా అది సాధ్యమవుతుందని ఆయన భావించారు. అందుకే, వైబ్రంట్ గుజరాత్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను 2003లో ప్రారంభించారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది’’ అని దర్శన్ దేశాయ్ అభిప్రాయపడ్డారు.
‘‘గుజరాత్‌లో పరిశ్రమలు ఉన్నాయి. వాటికి పెట్టుబడులు రావాల్సి ఉంది. అల్లర్ల కారణంగా అప్పటికే కార్పొరేట్ సంస్థలు అక్కడ పెట్టుబడులను తగ్గించాయి. పెట్టుబడులను తిరిగి రాబట్టగలిగితే గుజరాత్ ఇమేజ్ తిరిగి వస్తుందని ఆయన భావించారు’’ అని దేశాయ్ అన్నారు.
మోదీ ఈ ప్రయత్నం గురించి ప్రొఫెసర్ పాల్ మరింత వివరించారు. ‘‘సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ను రంగంలోకి దించడం ద్వారా మోదీ తన పాత ఇమేజ్‌ను తుడిచేసే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియాలో దీనికి విస్తృతంగా కవరేజ్ లభించింది. ఆ తర్వాత పారిశ్రామికవేత్త రతన్ టాటా గుజరాత్ వెళ్లారు. ఆపై నారాయణమూర్తి వెళ్లారు.
‘‘పెద్ద మనుషులు నాకు తోడుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారు. దేశమంతా గౌరవించే వీళ్లే నాతో ఉన్నప్పడు ఇక నాలో లోపం ఉందని ఎలా చెప్పగలరు’’ అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.
మీడియా మేనేజ్‌మెంట్
తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల నుంచి మోదీ ఎదుర్కొంటున్న విమర్శ ఏంటంటే, ఆయన జర్నలిస్టులకు దూరంగా ఉంటారు. చాలా అరుదుగా మాత్రమే మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారన్న ఆరోపణలు ఎటూ ఉన్నాయి.
‘‘మోదీ సీఎంగా ఉన్న కాలంలో గుజరాత్‌లో కొన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు జరిగాయి. బహుశా ఒకట్రెండు కంటే ఎక్కువ లేవు. అయితే, ఆయన అవసరమైనప్పుడు మీడియాను ఉపయోగించుకున్నారు. కొన్నిసార్లు దుర్వినియోగం కూడా చేశారు’’ అని దర్శన్ దేశాయ్ అభిప్రాయపడ్డారు.
‘‘ఈ రోజు కూడా ఆయన మీడియాను అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు. నేను ఈ విషయాన్ని నెగెటివ్ కోణంలో చెప్పడం లేదు. మీడియా ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తుంది. ఆయన ఏం కోరుకుంటారో అది చేస్తుంది. మీడియా బలహీనపడిందని మనకు అనిపిస్తుంది’’ అన్నారాయన.

మోదీ హయాంలో జర్నలిస్టులపై విమర్శలు, ట్రోల్స్, వేధింపులు, అరెస్టులు జరగడంతో , భారతదేశంలో మీడియా స్వేచ్ఛ తీవ్ర ప్రమాదంలో ఉందని ఆయన విమర్శకులు వాదిస్తారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికలో భారత ర్యాంకింగ్ గత 10 సంవత్సరాలుగా స్థిరంగా పడిపోతూ వస్తోంది. పారిస్‌కు చెందిన 'రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్' సంస్థ 2023నాటి తన నివేదికలో పత్రికా స్వేచ్ఛ విషయంలో భారతదేశం 180 దేశాల జాబితాలో 161వ స్థానంలో ఉందని పేర్కొంది. ఇటీవల సోషల్ మీడియాను పర్యవేక్షించడానికి, వాస్తవాలను చెక్ చేయడానికి ఒక ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది సెన్సార్‌షిప్ పరిధిని విస్తృతం చేస్తుందని చాలా మంది జర్నలిస్టులు భయపడుతున్నారు. అయితే, నకిలీ వార్తలను అరికట్టడమే దీని లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.
కాకపోతే, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న సమయంలో కూడా మీడియా వేధింపులను ఎదుర్కొంది. గతంలో ఇది కనిపించింది. ముఖ్యంగా ఇందిరా గాంధీ హయాంలో మీడియాపై అనేక ఆంక్షలు విధించారు. మీడియా వాటిని ఎదుర్కొంది. కానీ, ప్రస్తుత మీడియాలో అలాంటి ధోరణులు కనిపించకపోగా, ప్రభుత్వాల ముందు సాగిలపడినట్లు కూడా కనిపిస్తోంది.
సీఎం నుంచి పీఎం అభ్యర్థిగా మారడం

2011 నాటికి లేదా ఆ తర్వాత కొన్నాళ్లకు తాను తన పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్ధిగా మారగలనని ఆయనలో నమ్మకం కలిగింది. అది చాలా పెద్ద బాధ్యత. అప్పటికే తన రాజకీయ గురువు లాల్ కృష్ణ అడ్వాణీ హిందూత్వకు అతి పెద్ద రూపంగా ఉన్నారు. పార్టీలో అడ్వాణీ స్థాయి ఏంటో మోదీకి బాగా తెలుసు. అందుకే తన గురువైన అడ్వాణీకి కూడా సవాల్‌గా మారగల స్థాయికి ఎదిగేందుకు ఆయన తన పొలిటికల్ బ్రాండ్‌ను పెంచుకునే పనిలో పడ్డారు.
మోదీ ఇమేజ్ మేకోవర్, బ్రాండ్ బిల్డింగ్ కోసం ఫోటోలు, వీడియోలలో ఆయనను పెద్ద నాయకుడిగా చిత్రించే ప్రయత్నం జరిగింది. 2011-12లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఒక ఫోటోషూట్ సెషన్‌కు సంబంధించిన ఫోటోలలో మోదీ ఉదయంపూట, నిర్మలమైన వాతావరణంలో కూర్చుని ది ఎకనమిక్ టైమ్స్ పత్రిక చదువుతూ కనిపిస్తారు. ఆయన పక్కన బరాక్ ఒబామా రాసిన పుస్తకంతోపాటు మరొక పుస్తకం తెరిచి కనిపిస్తుంది. ఎదురుగా యాపిల్ ల్యాప్‌టాప్ కూడా ఉంటుంది. శాంతికి సూచికగా పక్కనే తెల్లని బాతులు తిరుగుతూ కనిపిస్తాయి.

2016లో బ్రాండ్ మోదీపై ఒక క్యాంపస్ లెక్చర్ సందర్భంగా ప్రొఫెసర్ పాల్ ఈ ఫోటోలను విద్యార్థులకు చూపించారు. తాను ఆధునిక రాజకీయవేత్తనని చెప్పుకోవడానికి ఆయన ఈ ఫోటోలను, వీడియోలను ఎలా వాడుకున్నారో తన విద్యార్థులకు ప్రొఫెసర్ పాల్ వివరించారు.
ఆ రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తిని ప్రధాని అభ్యర్థిగా ఎలా ప్రమోట్ చేయాలన్నది బ్రాండ్ గురులకు పెద్ద సవాల్‌గా ఉండేదని ప్రచార వ్యూహకర్త ప్రహ్లాద్ కక్కర్ చెప్పారు.
‘‘ట్రేడ్ సీక్రెట్ ఏంటంటే, ఒక సాధారణ రాజకీయ నాయకుడి స్థాయి నుంచి రాజనీతిజ్ఞుడిగా మారడం ఎలా అన్నదే. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మీరు కేవలం ఒక రాజకీయ నాయకుడే తప్ప రాజనీతిజ్ఞుడు కాలేరు. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన దేశమంతా తెలియాలని ఏమీ లేదు’’ అన్నారు ప్రహ్లాద్ కక్కర్. మోదీ ప్రధాని కాకముందు మోదీ బ్రాండ్ కోసం పనిచేసిన బృందంలో ప్రహ్లాద్ కక్కర్ కూడా ఒకరు. 'గుజరాత్ మోడల్' అనే ఆలోచనను తాము అప్పట్లో ప్రచారం చేశామని ఆయన చెప్పారు.

ప్రహ్లాద్ కక్కర్
ప్రహ్లాద్ కక్కర్
"మోదీ గుజరాత్‌ను ఎలా మార్చారో ప్రజలకు అర్థమైంది. అదే నమూనాతో దేశాన్ని కూడా గొప్పగా మారుస్తారని ఆయన ప్రచారం చేసుకున్నారు’’ అని కక్కర్ చెప్పారు.
ఇక అప్పటి నుంచి గుజరాత్ మోడల్‌ను దేశవ్యాప్తంగా ప్రచారంలో పెట్టారు. ఇలా మోదీ బ్రాండ్ బిల్డింగ్ వ్యూహం విజయవంతమైందని ప్రొఫెసర్ పాల్ అన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యే సమయానికి, నరేంద్ర మోదీ నేషనల్ బ్రాండ్‌గా మారారని ఆయన చెప్పారు.

బ్రాండ్ బిల్డింగ్‌లో సోషల్ మీడియాను క్రియేటివ్‌గా వాడుకున్నారు.
నరేంద్ర మోదీకి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయర్లు ఉన్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఆయనకంటే ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న నాయకులు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు.
బ్రాండ్ మోదీ వ్యాప్తి, ప్రచారంలో సోషల్ మీడియా పాత్రపై ప్రొఫెసర్ పాల్ లోతుగా అధ్యయనం చేశారు. 2009 నుంచి 2015 వరకు మోదీ చేసిన 6,000 ట్వీట్లను ఆయన విశ్లేషించారు. అప్పట్లో ఆయన్ను మించిన నేత ప్రపంచంలోనే లేరు అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగిందని ప్రొఫెసర్ పాల్ అన్నారు.
‘‘మోదీ బ్రాండ్ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఎలా సాగిందంటే, మోదీ చేయలేని పని లేదు అన్నట్లుగా ఉండేది. ఆయన మన్ కీ బాత్‌లో మాట్లాడతారు. యోగా చేస్తారు. రాజకీయ ప్రసంగాలు ఇస్తారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులకు టీచర్‌లాగా లెక్చర్లు ఇవ్వగలరు. ఇలా ప్రతి చోటా ఆయనే కనిపిస్తుంటారు. అందుకే దేశం ముందుకు పోతోందని, ఆయన చేసినట్లుగా దేశానికి ఎవరూ సేవ చేయడం లేదన్న భావన ఏర్పడింది’’ అని పాల్ అభిప్రాయపడ్డారు.
అయితే, సోషల్ మీడియా ఒక్కటే నరేంద్ర మోదీని దేశానికి ప్రధానిని చేసిందని చెప్పలేమని ప్రొ. క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ అన్నారు.
‘‘డోనాల్డ్ ట్రంప్ గెలుపునకు, హంగరీలో విక్టర్ ఓబ్రాన్ విజయానికి, బ్రెజిల్‌లో బోల్సోనారో సక్సెస్ వెనక సోషల్ మీడియా ఎలా పని చేసిందో, మోదీకి కూడా అలాగే పని చేసింది. మనం ఇప్పుడు నేషనల్ పాపులిజం (జాతీయ స్థాయిలో ఆదరణ పొందడం) యుగంలో ఉన్నాం. ఈ యుగంలో వ్యక్తులతో నేరుగా కనెక్ట్ కావడం చాలా ముఖ్యం. అందుకు సోషల్ మీడియా ఒక మంచి సాధనం’’ అని ప్రొఫెసర్ జాఫ్రెలాట్ అభిప్రాయపడ్డారు.
మోదీ మొదట ఆర్కుట్(ఇప్పుడు అందుబాటులో లేదు) ద్వారా సోషల్ మీడియాలోకి ప్రవేశించారు.
‘‘ఆర్కుట్‌లో ఉన్నప్పుడు ఆయన థర్డ్ పర్సన్‌గా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ట్విటర్ (ఎక్స్)లోకి వచ్చిన తర్వాత ఆయన ఫస్ట్ పర్సన్‌గా మాట్లాడుతున్నారు. ఆయన ట్వీట్‌లను చదివేవారికి, ఆ మాటలు ఆయనే అంటున్నట్లుగా వినిపిస్తుంది’’ అని ప్రొఫెసర్ పాల్ అన్నారు.

మోదీ మూడు దశల్లో ఆయన తనను తాను ఒక బ్రాండ్‌గా మార్చుకున్నారని ప్రొఫెసర్ పాల్ చెప్పారు. మొదటి దశలో మోదీ తన బ్రాండ్‌ను ప్రజలతో ఆమోదింపజేయడానికి , ప్రచారం చేయడానికి సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలను ఉపయోగించుకున్నారు.
మోదీ తన ప్రభుత్వం కోసం ప్రచారం చేయడం రెండో దశ అని పాల్ అన్నారు. ‘‘క్లీన్ ఇండియా, డిజిటల్ ఇండియా, సేవ్ ద గర్ల్ చైల్డ్‌లాంటి క్యాంపెయిన్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా కనిపించాయి. నేను సోషల్ మీడియాను నా కోసమో, పార్టీ కోసమో ఉపయోగించుకోవడం లేదని, దేశ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నానని చెప్పే ప్రయత్నం చేశారు మోదీ. తాను ఏది చేసినా దేశం కోసమేనని చెప్పేందుకు ప్రయత్నించారు" అని పాల్ వివరించారు.


మూడో దశలో 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో మోదీ మళ్లీ మరింత శక్తిమంతంగా కనిపించడం ప్రారంభించారని, అప్పుడాయన పాత మోదీ కాదని పాల్ అభిప్రాయపడ్డారు.
‘‘నేను లేకుండా ఈ దేశం నడవదు, నేను లేకుండా ఈ దేశం సురక్షితం కాదు’’ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు’’ అని ప్రొఫెసర్ పాల్ చెప్పారు. ఇలా మోదీ బ్రాండ్ ఎప్పటికీ ముగిసిపోయేది కాదని పాల్ అభిప్రాయపడ్డారు. ‘‘గత నాలుగైదు సంవత్సరాలుగా 'విశ్వ గురు' బ్రాండ్ మొదలైంది. ఆయన ప్రపంచ నాయకులతో మాట్లాడుతూ కనిపిస్తున్నారు. వారితో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కోవిడ్ సమయంలో గడ్డం, జుట్టు పెంచుకున్నారు. మోదీ ఇమేజ్ ప్రొజెక్షన్‌కు ప్రస్తుత దశ చాలా కీలకమైంది. ఆయన వయసు కూడా అందుకు ఉపయోగపడింది. నేను మీ గురువును అయినట్లే ప్రపంచం మొత్తానికి గురువును కాగలను అనే సందేశాన్ని ఆయన పంపిస్తున్నారు. ఈ దశ 2024 ఎన్నికలలో కూడా కనిపిస్తుంది.’’ అని పాల్ వివరించారు.
బ్రాండ్ మోదీ ప్రధాన బలహీనత
ఇప్పుడు దేశంలోని చాలా మంది మోదీ ఒక మెగా బ్రాండ్‌గా అవతరించారని నమ్ముతున్నారు. పార్టీ కన్నా మోదీకే ఎక్కువ పేరున్నట్లుగా భావిస్తారు. మోదీ లేకుంటే బీజేపీ అంత ప్రభావంగా ఉండదని దర్శన్ దేశాయ్ అన్నారు.
‘’నేను ఈ మాట పూర్తి ఆత్మ విశ్వాసంతో చెబుతున్నా. ఆయన పాలసీయే బీజేపీ పాలసీ. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంవో పాలసీని రూపొందించి ప్రభుత్వాన్ని నడిపింది. నేడు ఆయన ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో), పాలసీలను రూపొందిస్తోంది. ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఆయనకు పార్టీ అవసరం కంటే బీజేపీకే ఆయన అవసరం ఎక్కువ ఉంది.’’
క్యాబినెట్, పార్టీలో మోదీని అందరిలోకెల్లా అగ్రనేతగా చూస్తారని సంతోష్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఆయన విడిగా కూర్చుంటారు. అందరిలో తానొకడిని కాదని ఆయనకు బాగా తెలుసు. ఆయన నాయకుడు, మిగతా వారు అనుచరులు. నాయకుడిగా తన వైభవాన్ని ఆయన సులభంగా చాటుకుంటారు. నేను లీడర్‌ను, మీకంటే భిన్నమైన వ్యక్తిని, మీ కంటే ఎక్కువగా నేను అర్థం చేసుకుంటాను అనే భావనను పంపిస్తారు.’’
మోదీ మహోన్నత గుర్తింపు దీర్ఘకాలంలో పార్టీకి మంచిది కాదని ప్రొఫెసర్ జాఫ్రీలాట్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకవేళ మోదీ పాపులారిటీ అలాగే ఉన్నప్పటికీ, ఆయన పార్టీ పాపులారిటీ మాత్రం అలా ఉండబోదు. మళ్లీ అలాంటి ఒక బ్రాండ్‌ను తయారు చేసే స్థితిలో బీజేపీ లేదు. ఎందుకో తెలుసా? ఈ రోజు బీజేపీ అంటే ఏంటి? బీజేపీ అంటే మోదీ. గతంలో కూడా ఇలాంటిదే మనం చూశాం. ఇందిరాగాంధీ 1960, 70లలో కాంగ్రెస్ పార్టీని మార్చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు పడింది. బహుశా బీజేపీ కూడా ఇదే దశలో ఉండొచ్చు. కాబట్టి ఇది స్పష్టంగా సంఘ్ పరివార్‌కు బలహీనతే. మోదీ తర్వాత ఎవరు అనే ప్రశ్న ఏదో ఒకరోజు రావొచ్చు. ఆ మార్పు చాలా కష్టం అవుతుంది.’’

ప్రహ్లాద్ కక్కర్ ప్రకారం, మోదీకి అసలైన వారసుడు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. యూపీలో యోగి ఒక బ్రాండ్ అని ఆయన అభివర్ణించారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన మెజారిటీతో ఆయనను గెలిపించారని చెప్పారు. మోదీకి అసలైన వారసుడిగా యోగి నిరూపించుకుంటున్నారని ఆయన అన్నారు. జనవరిలో అయోధ్యలో రామాలయంలో ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో మోదీతోపాటు టీవీ స్క్రీన్ల మీద కనిపించిన కొద్ది మంది నాయకుల్లో యోగి ఆదిత్యనాథ్ ఒకరు. రామమందిరం నిర్మించిన రాష్ట్ర సీఎంగా ఆయన అక్కడ ఉన్నారా? లేక మోదీ తర్వాత ఆయన వారసుడిగా యోగి ఉంటారనే సందేశమేదైనా అందులో ఉందా? దీని గురించి ఎవరికీ ఏం తెలియదు. పార్టీ నుంచి కూడా మోదీ వారసుడు ఎవరనే విషయంలో ఎలాంటి స్పందనా లేదు. మోదీ తర్వాత ఎవరనే అంశం మీద పార్టీ ఇప్పటివరకు కసరత్తు చేయలేదు.
బ్రాండ్ మోదీ బలహీనత పడడమనే ఆలోచన ఆశావాద దృక్పథమని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. మోదీ, ఆయన పార్టీ బలాల గురించి తెలిసిన ఆయన, వాటికి సరిపోయే బలాలు మోదీ సమీప ప్రత్యర్థుల్లో ఎవరికీ లేవన్నారు.
‘‘బీజేపీ విజయం సాధించగలిగే బలం ఏంటి? అది హిందూత్వ భావజాలం, హిందూ మతం పేరిట ఆయనకు ఓటు వేసే పెద్ద హిందూ ఓటు బ్యాంకు వారి బలం. రెండో బలం నియో నేషనలిజం లేదా హైపర్ నేషనలిజం. ఎలాగైనా దీన్ని పిలవొచ్చు. మూడోది ఏంటంటే, మరుగుదొడ్లు, ఇళ్ల నిర్మాణ పథకాలు, రైతులకు సాయం వంటి పథకాలతో ప్రత్యక్ష లబ్ధిదారులకు సహాయం చేయడం. నాలుగోది ఆయన ఎన్నికల నిర్వహణపై పట్టు, ఆర్థిక వనరులు. ఒకవేళ మీరు బీజేపీని లేదా ఆయన్ను ఓడించాలనుకుంటే ఈ బలాల్లో రెండు లేదా మూడింటిని మీరు ఎదుర్కోవాలి’’ అని ప్రశాంత్ కిశోర్ వివరించారు.
మోదీ లెగసీ

గాంధీ కన్నా మోదీ ఎక్కువ పాపులర్ అని ఒకసారి హరియాణా మంత్రి ఒకరు అన్నారు. ఆ ప్రకటన సృష్టించిన ప్రకంపనలతో ఆయన మాటలు మసకబారి ఉండొచ్చు. కానీ, నవ భారత్, ఆత్మనిర్భర్ ఇండియా రూపశిల్పిగా తనను చూడాలనే కాంక్షను మోదీ చాటుకున్నారు. ఒకవేళ నెహ్రూ, గాంధీలను స్వతంత్ర భారతానికి ప్రతీకలుగా చూస్తే, ఒక ఆత్మనిర్భర్-ఆత్మవిశ్వాసం-సంపన్న భారతదేశ రూపశిల్పిగా తనను చూడాలని మోదీ అనుకుంటున్నారు.
పురాతన కాలంలో కొంత మంది రాజులు అధికారంలో ఉన్నప్పుడు తమ కోసం సమాధులను కట్టుకున్నారు. కొందరు భవిష్యత్ తరాలు తమను గుర్తుపెట్టుకునేలా కొత్త నగరాలను నిర్మించారు. అలాగే ఈ నవభారతంలో మోదీ తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.
‘‘ముంబయికి పునరుజ్జీవం పోస్తున్న తీరు, దిల్లీని పునరుద్ధరించిన విధానం రాబోయే తరాలకు ఒక సందేశం ఇస్తున్నారనడానికి సంకేతం. నవ భారతాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నం ఇది. చరిత్రలో చాలా మంది చేసిన దానికి ఇది కొత్త వర్షన్. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కట్టారు. కొత్త పార్లమెంట్ నిర్మించారు. నగరాలు ఆధునీకరిస్తున్నారు’’ అని ప్రొఫెసర్ క్రిస్టోఫ్ జాఫ్రీలాట్ అన్నారు.
మోదీ హయాంలో భారత రాజకీయాలు హిందూత్వ భావజాలం వైపు మళ్లాయని ‘ద క్రూక్డ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా’ అనే పుస్తక రచయిత పరకాల ప్రభాకర్ అన్నారు. లౌకికవాదం అనే భావన నుంచి హిందూత్వకు మళ్లిందని చెప్పారు.
‘‘పది, పదిహేనేళ్ల క్రితం లౌకికవాదం ఆధారంగా దేశ రాజకీయ చర్చలు జరిగేవి. మేం అసలైన లౌకికవాదులం అని బీజేపీ చెబుతుండేది. కాంగ్రెస్ సెక్యులర్, కానీ, అది సూడో సెక్యులర్. మిగతా పార్టీలన్నీ సూడో సెక్యులరే. సెక్యులరిజం అనే పదాన్ని బీజేపీ విస్మరించలేదు. కానీ, మోదీ హయాంలో ఆ పదాన్ని పూర్తిగా వదిలేశారు’’ అని ఇటీవల కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పరకాల ప్రభాకర్ అన్నారు.
భారత్‌లో నేడు ఉన్న వ్యవస్థ కన్నా మరింత సమతూకమైన వ్యవస్థ కావాలని ప్రహ్లాద్ కక్కర్ కోరుకుంటున్నారు. మోదీని ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఆయన అన్నారు. మధ్యతరగతి ప్రజలు, మోదీ భక్తులు కాకపోయినా కూడా దేశాన్ని మోదీ ఏకతాటిపైకి తెచ్చారని నమ్ముతూ, ఆయనపై ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. గుజరాత్ అల్లర్ల కళంకం ఎప్పటికీ ఓ మాయని మచ్చగా ఉన్నప్పటికీ, దేశ ప్రజలు మోదీని ‘ఉక్కు మనిషి’గా గుర్తుంచుకుంటారని ఆయన, ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు.
మోదీ ముద్రలో ‘‘స్ట్రాంగ్ మ్యాన్’’ ఇమేజ్ నిస్సందేహంగా ఉంటుంది. కానీ వ్యవస్థలోని నిర్మాణపరమైన బలహీనత చివరకు బీజేపీని వెంటాడొచ్చు. మోదీ తర్వాత ఎవరు అనే గుసగుసల్ని మనం త్వరలోనే వినే అవకాశం లేకపోలేదు. నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకుడు పూడ్చలేని లోటును మిగుల్చుతారు.
కానీ, 140 కోట్ల మంది జనాభా, ఎన్నో జాతులు, మతాలు, భాషలు, సామాజిక వైవిధ్యం కోణంలో చూస్తే మోదీ లెగసీ భారత్‌ను ఎలా నిలబెడుతుందనేది అంతకుమించిన ప్రశ్న. భారతీయ భిన్నత్వం కోలుకోలేని విధంగా ధ్వంసం అయిందని భయపడేవారు కొందరు ఉండగా, దీర్ఘకాలంగా మసకబారి ఉన్న భారత గుర్తింపునకు ఇది పునరుజ్జీవం అని భావించేవారు మరికొందరు ఉన్నారు.
