కేజీ బేసిన్: కాకినాడ తీరంలో తొలిసారిగా చమురు వెలికితీత...భారతదేశపు చమురు అవసరాలను ఇది తీర్చగలదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
కృష్ణా-గోదావరి బేసిన్(కేజీ బేసిన్)లో ముడి చమురును తొలిసారిగా వెలికితీసింది ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ).
ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని బంగాళాఖాతంలో అత్యంత లోతైన కేజీ-డీడబ్యూఎన్-98/2 బ్లాక్ నుంచి ముడి చమురును బయటకు తీసింది.
ఈ బ్లాక్ లోని ‘ఎం’ ఫీల్డ్ నుంచి ఫేజ్ -2లో ముడి చమురు తీసినట్లు ఓఎన్జీసీ ప్రకటించింది.
దేశంలోని పెట్రోలియం అవసరాలు తీర్చడంలో సరికొత్త ఆశాదీపంగా ఇప్పుడీ క్షేత్రం మారింది. దీనివల్ల ఇతర దేశాల నుంచి ముడి చుమురు కొనుగోళ్లు కొంతమేర తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గత నెలలో కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఓ ప్రకటన చేశారు.
‘‘కాకినాడ తీరానికి 30 కిలోమీటర్ల దూరంలోని కేజీ బేసిన్ లో మొదటిసారిగా ఒక బ్లాక్ నుంచి ఓఎన్జీసీ తరఫున ఆయిల్ వెలికితీశాం. దీనికి సంబంధించిన పనులు 2016-17లోనే మొదలయ్యాయి. కొవిడ్ కారణంగా ఆలస్యమైంది.’’ అని హర్దీప్ సింగ్ ప్రకటించారు.
ఇప్పటికే ఓఎన్జీసీ ఫేజ్ -1 కింద మార్చి 2020 నాటికి ఇదే కేజీ-డీడబ్యూఎన్-98/2 బ్లాక్ లోని ‘యూ’ క్షేత్రం నుంచి గ్యాస్ వెలికి తీస్తోంది.
ప్రస్తుతం చేపట్టిన ముడిచమురు ఉత్పత్తితో ఓఎన్జీసీ ఉత్పత్తి సామర్థ్యం 11 శాతానికి పెరగనుండగా.. గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యం 15శాతానికి చేరుకోనుంది.
ఈ ప్రాజెక్టు చేపట్టిన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదురైనా అధిగమించి గ్యాస్ ఉత్పత్తి చేసినట్లు ఓఎన్జీసీ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
సవాళ్లను అధిగమించి మరీ..
కేజీ బేసిన్ లోని కేజీ-డీడబ్యూఎన్-98/2 ఎంతో భిన్నమైనది. ఇక్కడ ముడి చమురు వెలికితీత కష్టంతో కూడుకున్న పని.
ఆయిల్ జిగురు ఎక్కువగా ఉండటంతో ముడిచమురు తీయడంలో ఇబ్బందులు ఎదురైనట్లు ఓఎన్జీసీ ప్రకటించింది.
ఇందుకుగాను ఇక్కడ ఆయిల్ వెలికితీత కోసం పైప్ ఇన్ పైప్(ఒక పైపు లో మరొక పైపు) టెక్నాలజీ ఓఎన్జీసీ వినియోగించింది.
ఈ తరహా టెక్నాలజీ వాడటం దేశంలోనే తొలిసారి.
ఈ ఏడాదిలోనే ఈ బ్లాక్ నుంచి పూర్తిస్థాయిలో ముడిచమురు, గ్యాస్ వెలికితీతకు ప్రణాళికలు రూపొందించినట్లు బీబీసీతో అన్నారు ఓఎన్జీసీ ప్రతినిధి అక్షయ జీనా.
‘‘ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్ లో ఇదొక కీలక అడుగు. కాకినాడ క్షేత్రంలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి మొదలైతే రోజుకు గరిష్ఠంగా 45వేల బ్యారెల్స్ ముడి చమురు, 10 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పర్ డే(ఎంఎంఎస్సీఎండీ) నేచురల్ గ్యాస్ ఉత్పత్తి చేసే వీలుంది.’’ అని బీబీసీకి చెప్పారు.
దీనివల్ల దేశ అవసరాల్లో మరో ఏడు శాతాన్ని తీర్చేందుకు వీలుకలుగుతుందని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, ONGC
40 వేల చ.కి.మీ. మేర సంపద.. కేజీ బేసిన్
కృష్ణా, గోదావరి బేసిన్.. కృష్ణా(కే), గోదావరి(జీ) నదులు బంగాళాఖాతంలో కలిసే ప్రాంతానికి మధ్యలో ఉన్న ప్రాంతం.
ఇది 40వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో 15 వేల చదరపు కిలోమీటర్లు తీర ప్రాంతం. మరో 25వేల చదరపు కిలోమీటర్ల సముద్రంలోని ప్రాంతం.
ఈ బేసిన్ లో చమురు నిక్షేపాలు గుర్తించేందుకు 1959లో తొలిసారి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ ఏడాది నుంచి 4220 చదరపు కిలోమీటర్ల పరిధిలో జియోలాజికల్ మ్యాపింగ్ చేపట్టింది ఓఎన్జీసి.
ఇది కాకుండా గ్రావిటీ-మాగ్నెటిక్ సర్వేను కూడా మరో 19200 చదరపు కిలోమీటర్ల తీర ప్రాంతంలో చేపట్టింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రైవేటు కంపెనీలు సైతం…
వివిధ రకాల సర్వేలు, రిఫ్రాక్షన్ డాటా విశ్లేషించిన తర్వాత 90లలో దాదాపు 225 ప్రాంతాల్లో 557 బావులు ఓఎన్జీసీ ఏర్పాటు చేసింది. ఇందులో 22 ఆయిల్ బావులు, 53 గ్యాస్ బావులున్నాయి.
అలాగే ప్రైవేటు, జాయింట్ వెంచర్లు కలిపి 19 చోట్ల ఆయిల్ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సెయిల్, జీఎస్పీసీ, టోరెంట్, గెయిల్ వంటి కంపెనీలున్నాయి.
గత నెలలో ఆయిల్ వెలికితీసిన బావిలో 2018 ఏప్రిల్ నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఓఎన్జీసీ. ఈ బ్లాక్ లో మొత్తం 26 బావులుండగా.. నాలుగింటిలో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
కేజీ బేసిన్ లో ఆయిల్ తీయడం సులువేనా..?
చమురు, గ్యాస్ వెలికితీసే విషయంలో కేజీ బేసిన్ ఎంతో ప్రత్యేకమైనది. ఇక్కడ ఆయిల్ తీయడం ఎంతో క్లిష్టతరమైనదని చెప్పారు కాకినాడ జేఎన్టీయూ పెట్రోలియం కోర్సుల డైరెక్టర్ ప్రొ.కేవీ రావు.
ఆయన గతంలో డెహ్రాడూన్ లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ లో గౌరవ ప్రొఫెసర్ గా పనిచేశారు.
కేజీ బేసిన్ లోని చమురు నిక్షేపాలపై బీబీసీతో ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో రోజుకు 70 వేల బ్యారెల్స్ చమురు వెలికితీయొచ్చని ఓఎన్జీసీ అంచనా వేసింది.
ఇప్పుడు కేవలం 45 వేల బ్యారెల్స్ మాత్రమే చేయగలమని చెబుతోంది. ఎందుకంటే కేజీ బేసిన్ రిజర్వాయర్లు ఇతర బేసిన్లతో పోల్చితే ఎంతో క్లిష్టతరమైనవి.
మిగిలిన రిజర్వాయర్లతో పోల్చితే అంత మందంతో నిల్వలు ఉండకపోవచ్చు. అందుకే ఇక్కడ ఆయిల్ ఉత్పత్తి సవాల్ తో కూడుకున్నది.’’ అని చెప్పారు.

కేజీ బేసిన్ కాకుండా ఎక్కడెక్కడ ఆయిల్ తీయొచ్చంటే..
దేశంలో మూడు కేటగిరీల పరిధిలో 26 బేసిన్లు ఉన్నాయి. ఇవి 3.36 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి.
కేటగిరీ-1 పరిధిలో ఏడు సెడిమెంటరీ బేసిన్లలోనే క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ వెలికి తీస్తున్నారు.
అవి.. కాంబే, అస్సాం షెల్ఫ్, ముంబయి తీరం, కేజీ, కావేరీ బేసిన్లు, అస్సాం అరకన్ ఫోల్డ్ బెల్ట్, రాజస్థాన్.
కేటగిరీ-2 పరిధిలో మరో ఐదు బేసిన్లలో పెట్రోలియం వనరులు ఉన్నట్లుగా గుర్తించినా, అక్కడ కమర్షియల్ పద్ధతిలో వెలికితీత ప్రారంభించలేదు.
అవి కచ్, మహానది-ఎన్ఈసీ, అండమాన్-నికోబార్, వింధ్యాన్, సౌరాష్ట్ర బేసిన్లు ఉన్నాయి.

ఇండియా ఇప్పుడెంత ఉత్పత్తి చేస్తోందంటే..
ప్రస్తుతం భారత దేశంలో రోజుకు 10.16లక్షల బ్యారళ్ల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతోంది.
క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి పరంగా చూస్తే ప్రపంచంలో ఇండియాది 20వ స్థానం.
కానీ, రోజుకు దేశంలో క్రూడ్ ఆయిల్ వినియోగం 44.43 లక్షలు. ముడి చమురు వినియోగంలో భారతదేశం ప్రపంచంలో మూడో స్థానం.
మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి.
మొత్తం ప్రపంచ వినియోగంలో భారత దేశం వాటా 5శాతం.
భారతదేశంలో వెలికి తీస్తున్న చమురులో 71శాతం ఓఎన్జీసీ తీస్తుండగా, మిగిలిన 29శాతం ప్రైవేటు, జాయింట్ వెంచర్ల నుంచి తీస్తున్నారు.
ఒక్క కేజీ బేసిన్ లోనే 5.౦7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఉన్నాయి.
85శాతం అవసరాలకు దిగుమతులే కీలకం
భారతదేశం తన చమురు అవసరాలు తీర్చుకునేందుకు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతోంది.
పెట్రోలియం అండ్ ప్లానింగ్ అనాలసిస్ సెల్(పీపీఏసీ) నివేదిక ప్రకారం 2021-22లో భారతదేశం 85.5శాతం చమురు కోసం దిగుమతిపై ఆధారపడింది.
2021-22 సంవత్సరంలో 122.45 బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురును దిగుమతి చేసుకుంది.

కేజీ బేసిన్ ఆయిల్ తో దిగుమతులు తగ్గుతాయా..?
గతంలో కేంద్ర ప్రభుత్వం లోక్ సభకు ఇచ్చిన నివేదిక ప్రకారం చూస్తే.. కేజీ బేసిన్ లో క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ 698 మిలియన్ మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది.
ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి రోజుకు 19,190 బ్యారెల్స్ ఉండగా.. నేచురల్ గ్యాస్ 9.8 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పర్ డే గా ఉంది.
దేశంలో ఇతర బేసిన్లతో పోల్చితే ఇక్కడ ఉత్పత్తి ఖర్చు కూడా తక్కువేనని కేంద్రం ప్రకటించింది.
ఇక్కడ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి బ్యారెల్ కు 12-42 యూఎస్ డాలర్లు ఉండగా.. మిగిలిన క్షేత్రాల్లో అది బ్యారెల్ కు 15-62 యూఎస్ డాలర్లుగా ఉంది.
అందుకే ఓఎన్జీసీ, రిలయన్స్ వంటి కీలక కంపెనీలు కేజీ బేసిన్ లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.
మున్ముందు గరిష్ఠంగా 45వేల బ్యారెల్స్ ముడి చమురును రోజుకు ఉత్పత్తి చేయనుంది ఓఎన్జీసీ.
‘‘ప్రస్తుతం రోజుకు 42,55,300 బ్యారెల్స్ ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. అంటే నెలకు వచ్చేసరికి 11 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతోంది. బ్యారెల్ విలువ పెరిగితే, ఖర్చు మరింత పెరుగుతోంది. కేజీ బేసిన్ లో మున్ముందు రోజుకు 45వేల బ్యారెల్స్ వెలికితీస్తామని ఓఎన్జీసీ ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే నెలకు 1.16 మిలియన్ డాలర్లను ఆదా చేసుకునే వీలుంటుంది.’’ అని బీబీసీతో చెప్పారు ప్రొ.కేవీ రావు.

ఫొటో సోర్స్, Getty Images
ఓఎన్జీసీ సామర్థ్యం ఎంత..?
పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్(పీపీఏసీ) ప్రకారం, 2023 డిసెంబరులో భారత్ లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 2.5 మిలియన్ మెట్రిక్ టన్నులు(ఎంఎంటీ)కి చేరుకుంది.
ఇందులో ౦.3మిలియన్ మెట్రిక్ టన్నులు ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్) నుంచి ఉండగా, 1.6 మిలియన్ మెట్రిక్ టన్నులు ఓఎన్జీసీ ఉత్పత్తి చేసింది. మరో ౦.6 ఎంఎంటీ ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్టులతోపాటు రెవెన్యూ షేరింగ్ కాంట్రాక్టుల నుంచి ఉత్పత్తి జరిగింది.
అయితే, ఇది 2022 డిసెంబరుతో పోల్చితే 1.03శాతం తక్కువగా ఉంది.
మొత్తంగా చూస్తే.. డిసెంబరు, 2023లో భారత్ లో క్రూడ్ ఆయిల్ వినియోగం 22.7 ఎంఎంటీగా ఉంది. ఇది అంతకుముందు ఏడాదితో పోల్చితే 1.9శాతం అధికం.
దేశీయంగా 2.6ఎంఎంటీ ఉత్పత్తి జరగ్గా, 20.1ఎంఎంటీ దిగుమతి చేసుకోవడం జరిగింది.

వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల వైపు అడుగులు
ముడి చమురు కోసం ఎక్కువగా ఇతర దేశాలపై ఆధారపడుతున్నందున నిల్వలు అనేవి కీలకంగా మారుతున్నాయి.
అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలతో దేశాలు చాలావరకు వ్యూహాత్మక నిల్వల వైపు అడుగులు వేస్తున్నాయి.
ఈ విషయంలో భారత్ కూడా తన ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సూచన ప్రకారం.. కనీసం మూడు నెలలకు సరిపడా స్టాక్ పెట్టుకోవాలి. దీనికి తగ్గట్టుగా ముందుస్తుగా 5.33 మిలియన్ టన్నుల ముడి చమురును పది రోజుల కోసం తూర్పు, పశ్చిమ తీరంలో మూడు చోట్ల భూగర్భ నిల్వలు చేయడానికి భారత్ ఏర్పాట్లు చేస్తోంది.
ఇందుకు ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్(ఐఎస్పీఆర్ఎల్) మూడు ప్రాంతాల్లో భూగర్భ రాతి గుహలను నిర్మించింది. మంగళూరు, పాడూరు, విశాఖపట్నంలో ఇవి ఉన్నాయి.
అండమాన్ తీరంలోనూ నిల్వలు గుర్తింపు
అండమాన్ తీరంలోనూ నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. 70ఏళ్లకు సరిపడా అండమాన్ తీరంలో 120 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిల్వలు ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అండమాన్ అండ్ నికోబార్ వద్ద 22వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే చేశారు. డ్రిల్లింగ్, రిగ్గింగ్ చేయనున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ డ్రిల్లింగ్ చేయనుంది.
ఈ ఏడాది మే నెలలో డ్రిల్లింగ్ మొదలు పెట్టనున్నట్లు రెండు కంపెనీలు ప్రకటించాయి. ఇది కూడా అందుబాటులోకి వస్తే భారత్ తన ముడి చమురు అవసరాలను చాలావరకు దేశీయంగా తీర్చుకునే వీలు కలుగుతుందని ఈ రంగంలోని నిపుణులు ఆశాభావంతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- రేవంత్ రెడ్డి X కేసీఆర్: ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడొచ్చా? నేతల దిగజారుడు భాషను ఎలా చూడాలి?
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














