పిల్లలకు నత్తి ఉంటే ఎలా తగ్గించాలి? తల్లిదండ్రులు, టీచర్లు ఏం చేయాలి?

ఫొటో సోర్స్, Getty Images
‘‘స్కూల్‌లో ఉదయం అటెండెన్స్ చెప్పేటప్పుడు నాకు చాలా భయంగా అనిపించేది. అటెండెన్స్‌ను సాధారణంగా, ‘ప్రజెంట్, మ్యామ్’ లేదా ‘యెస్, మ్యామ్’ అని చెబుతుంటాం. నేను ఎప్పుడూ ‘యెస్, మ్యామ్’ అనే చెప్పేందుకే చూసేవాడిని. ఎందుకంటే, ఏది తేలికగా అనిపిస్తే దాన్నే పలికే వాడిని.’’ - ఇది 35 ఏళ్ల ఆదిత్య (పేరు మార్చాం) బీబీసీతో షేర్ చేసుకున్న అనుభవం.
ఆదిత్య ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మాట్లాడేటప్పుడు భయంగా, నత్తిగా అనిపిస్తుండటంతో ఆదిత్య స్పీచ్ థెరపీని తీసుకున్నారు.
‘‘ఒకవేళ మేం నత్తిగా మాట్లాడుతుంటే, దీనిలో మా తప్పేంటి? మమ్మల్ని దేవుడు ఈ విధంగా పుట్టించాడు. నా చిన్నతనంలో ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేసేవారు. ఎందుకంటే, నత్తిగా మాట్లాడేవాడిని. నా జీవితాంతం ఇలానే మాట్లాడాల్సి వస్తుందేమోనని భయపడే వాడిని’’ అని బీబీసీ ప్రతినిధి పాయల్ భుయాన్‌కు ఆదిత్య చెప్పారు.
ఎనిమిది శాతం మంది పిల్లలు ఏదో ఒక సమయంలో నత్తిగా మాట్లాడుతుంటారని ఒక అధ్యయనంలో తెలిసింది. కానీ, చాలా మంది పిల్లల్లో ఇది పెరిగే కొద్దీ నయమవుతుంది. కొందరికి దీనిలో ఎలాంటి మార్పూ ఉండదు. కొందరిలో మరింత తీవ్రమవుతుంది కూడా!

ఫొటో సోర్స్, Getty Images
తల్లిదండ్రులకు సహనం అవసరం
పిల్లలు నత్తిగా మాట్లాడటం తల్లిదండ్రులకు బాధాకరమైన విషయం. ఈ సమస్య పరిష్కారం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ, ఈ ప్రయత్నాల వల్ల నత్తి పూర్తిగా నయమవుతుందా?
రెండు మూడేళ్ల వయసు నుంచే తన కొడుకు నత్తిగా మాట్లాడటం ప్రారంభించాడని బీబీసీ సౌండ్స్ గర్ల్స్ పాడ్‌కాస్ట్‌లో జెర్రీ తెలిపారు.
‘‘అది నిజంగా నత్తే అనే విషయాన్ని మా కొడుక్కు ఐదేళ్లు వచ్చాక మేం గుర్తించాం. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సాధారణంగా ఇలానే మాట్లాడతారని అనుకున్నాం. మా కొడుక్కు ఎలా సాయం చేయాలో తెలియడం లేదు. సొంతంగా తనకు తానే ఈ సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటున్నాం’’ అని చెప్పారు.
కానీ, ఎదిగే కొద్ది జెర్రీ కొడుకు చాలా అసహనానికి గురవుతున్నాడు. తన అభిప్రాయాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోతున్నాడు. అంతకుముందు కంటే ఎక్కువ నత్తిగా మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న విషయాలకే చాలా కోప్పడుతున్నాడు.
‘‘బాబుకు సాయం చేసేందుకు నత్తిగా పలికే పదాలను నేర్పించేందుకు మేం ప్రయత్నించాం. అవి పలకడానికి రాక చాలాసార్లు కోప్పడేవాడు. తన ముఖంలో నిస్సహాయత కనిపించేది’’ అని జెర్రీ తెలిపారు.
‘‘చాలాసార్లు ఎవరైనా నత్తిగా మాట్లాడుతుంటే వారి మాటలను పక్కవారు పూర్తి చేయాలని చూస్తుంటారు. కానీ, అది తప్పు. వారు చెప్పే విషయాన్ని పూర్తిగా వినాలి. నాకు తెలుసు, మీరు సహృదయంతో వారికి సాయం చేయాలని చూస్తారు. కానీ, కొన్నిసార్లు అది వారికి చిరాకు తెప్పిస్తుంది. మా విషయంలో కొంత సహనాన్ని మేం కోరుకుంటాం’’ అని నోయిడాలో నివసిస్తున్న ఆదిత్య తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
నత్తి - మూడు దశలు
నోయిడాలోని ‘ది లెర్నింగ్ హబ్‘ స్పీచ్, హియరింగ్ సెంటర్‌కు చెందిన స్పీచ్ థెరపిస్ట్ శిశు పాల్‌తో బీబీసీ ప్రతినిధి పాయల్ భుయాన్ మాట్లాడారు. అంతకుముందుతో పోలిస్తే ప్రస్తుతం నత్తి సమస్యను తగ్గించుకునేందుకు ప్రజలు ఎక్కువగా స్పీచ్ థెరపీ సాయం తీసుకుంటున్నారని శిశు పాల్ చెప్పారు.
నత్తిని మూడు దశలుగా విభజించవచ్చని శిశు పాల్ తెలిపారు.
- స్వల్పం
- సాధారణం కంటే మధ్యస్థంగా ఉండటం
- తీవ్రంగా ఉండటం
‘‘పిల్లల్లో నత్తి సమస్య మధ్యస్థంగా ఉంటే, త్వరగానే కోలుకుంటారు. ఇలా ఉన్న వారు 4 నుంచి 5 నెలలు థెరపీ తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత పిల్లల్లో మంచి రికవరీని చూడొచ్చు’’ అని శిశు పాల్ చెప్పారు.
పరిస్థితి తీవ్రంగా ఉన్న పిల్లలకు చికిత్స అందించడం కాస్త సవాలుతో కూడుకున్న విషయమే అన్నారు.
‘’30-40 శాతం నయమయ్యేందుకు అవకాశం ఉంటుంది. థెరపీతో పాటు, వారి కుటుంబ ప్రయత్నం, ఖర్చులు కూడా ముఖ్యమైనవే’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పీచ్ థెరపీతోపాటు కౌన్సిలింగ్ అవసరం
‘‘నా చిన్నతనంలో, నత్తి సమస్య నయమవుతుందని నేనసలు అనుకోలేదు. ఈ థెరపీలు చాలా ఖరీదైనవి. ఆ సమయంలో మా వద్ద చికిత్స తీసుకునేందుకు సరిపడా డబ్బులు కూడా లేవు’’ అని ఆదిత్య చెప్పారు.
‘‘స్కూల్‌లో బుక్ చదువుతున్నప్పుడు నా కొడుకు నత్తిగా మాట్లాడే వాడు. నా కొడుకు చాలా నిదానంగా ఉన్నాడని టీచర్ ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. బాబులో ఆత్మవిశ్వాసం లేదని ఫిర్యాదు చేసేవారు. సాహిత్యం నేర్చుకునేటప్పుడు పిల్లలకు చాలా విషయాలు అర్థం కాక అక్కడే ఆగిపోతారు. మీరు అర్థం చేసుకుని, నా కొడుకు లాంటి పిల్లలకు కాస్త అదనపు సమయం ఇవ్వాలి. నిదానంగా ఉన్నాడనడం సరైన పద్ధతి కాదు’’ అని టీచర్‌తో అన్నట్లు బీబీసీ సౌండ్స్ పాడ్‌కాస్ట్ ప్రోగ్రామ్‌లో జెర్రీ తెలిపారు.
ఈ సమస్య ఉన్నవారికి స్పీచ్ ట్రైనింగ్‌తో పాటు కొన్నిసార్లు మానసిక వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ కూడా అవసరమేనని స్పీచ్ కోచ్ శిశు పాల్ చెప్పారు.
‘‘నత్తిగా మాట్లాడే పిల్లల్లో ఆత్మ విశ్వాసం కోల్పోవడం నేను చాలాసార్లు చూశాను. నేనేమైనా తప్పు మాట్లాడితే నవ్వుతారేమో అని వారి మనసులో ఉంటుంది’’ అని తెలిపారు.
నత్తిగా మాట్లాడేవాళ్లు గ్రూప్ డిస్కషన్స్‌లో మాట్లాడేందుకు కూడా మొగ్గు చూపరు. గ్రూప్‌లో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే, నత్తిగా మాట్లాడకుండా ఎలా సమాధానమివ్వాలా అని ఆలోచిస్తుంటారు. దీని వల్ల ఆఫీసుల్లో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని శిశు పాల్ చెప్పారు.
ఆదిత్య తను జాబ్ సర్చ్ చేసేటప్పుడు ప్రారంభ రోజులను గుర్తుకు చేసుకున్నారు.
‘‘నేను రాతపరీక్ష అన్ని రౌండ్లను పూర్తి చేసే వాడిని. కానీ, ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్‌లో ఎంపిక అయ్యే వాడిని కాదు. నా నత్తినే దీనికి సమస్య అని అర్థం చేసుకున్నాను. తర్వాత ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు, నాకు నత్తి ఉన్న సమస్యను వారికి చెప్పాను. వారు అర్థం చేసుకున్నారు. నా స్పీచ్ ట్రైనింగ్ గురించి అడిగారు. నాకు ఆ ఉద్యోగం వచ్చింది’’ అని ఆదిత్య గుర్తు చేసుకున్నారు.
ఆదిత్య స్పీచ్ థెరపీకి సంబంధించి పలు సెషన్లు తీసుకున్నారు. తను కూడా నత్తిని పోగొట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఆదిత్య నత్తి సమస్య చాలా వరకు నయమైపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
నత్తి ఉన్న వారితో ఎలా వ్యవహరించాలి?
నత్తి సమస్య ఉన్న వారిని కలుసుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాల గురించి బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసు పలు సూచనలు చేస్తోంది. అవి:
- వారు చెబుతున్న వాక్యాలను త్వరగా ముగించేందుకు ప్రయత్నించవద్దు.
- సహనంగా ఉండండి. వారు మాట్లాడేటప్పుడు మధ్యలో వెళ్లొద్దు.
- త్వరగా లేదా చిన్నగా మాట్లాడాలని అడగవద్దు.
- వారు మాట్లాడేటప్పుడు కళ్లలోకే చూడండి. వారు ఎలా చెబుతున్నారో కాక, ఏం చెబుతున్నారనే దానిపై శ్రద్ధ పెట్టండి.
- పిల్లలతో నిదానంగా మాట్లాడండి. చిన్న చిన్న వాక్యాలను వాడండి. సులభతరమైన భాషలోనే మాట్లాడండి.
- మీరు చెప్పేదాన్ని అర్థం చేసుకునేందుకు వారికి సరిపడా సమయం ఇవ్వండి.
నత్తికి చాలా కారణాలుంటాయని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసు చెప్పింది. కొన్నిసార్లు భయం కూడా దీనికి కారణం కావొచ్చని పేర్కొంది. దీని ప్రభావాన్ని తగ్గించవచ్చు.
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ స్పీచ్ ట్రైనింగ్ తీసుకోవచ్చు. ఎంత త్వరగా స్పీచ్ ట్రైనింగ్ తీసుకుంటే అంత మంచిది. ఏ వయసులోనైనా ఈ థెరపీని తీసుకోవచ్చు.
‘‘మాలో లోపాలున్నాయని అనుకోకండి. మమ్మల్ని చూసి నవ్వకపోతే, మాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మేం మరింత ముందుకు వెళ్లగలం’’ అని ఆదిత్య బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ చలో: కేంద్రంతో రైతుల చర్చలు ఎందుకు విఫలమయ్యాయి?
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- లాభాల మోత మోగుతున్నా టెక్ కంపెనీలు జాబ్ కోతలకు ఎందుకు దిగుతున్నాయి?
- హిజాబ్‌ను నిషేధించిన ఈ ముస్లిం దేశంలో ప్రజలు తమ హక్కుల కోసం ఎలా పోరాడుతున్నారంటే...
- ఖతార్‌లో మరణశిక్ష ఎదుర్కొన్న 8 మంది భారత నేవీ మాజీ అధికారుల విడుదల
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















