ఖతార్‌లో మరణశిక్ష ఎదుర్కొన్న 8 మంది భారత నేవీ మాజీ అధికారుల విడుదల

ఫొటో సోర్స్, ANI
ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలతో మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులను ఆ దేశం విడుదల చేసినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వారిలో ఏడుగురు సోమవారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నట్లు వెల్లడించింది.
నేవీ మాజీ అధికారుల విడుదలపై భారత విదేశాంగ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ''దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న భారతీయులను ఖతార్ జైలు నుంచి విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఎనిమిది మందిలో ఏడుగురు భారత్‌కు చేరుకున్నారు. అధికారులను విడుదల చేస్తూ ఖతార్ ఎమిర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు'' అని భారత విదేశాంగ శాఖ తెలిపిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడి చేసింది.
"ప్రధాని మోదీ జోక్యం లేకపోయి ఉంటే భారత్‌కు తిరిగిరావడం సాధ్యమయ్యేది కాదు. భారత ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల కారణంగానే ఇది సాధ్యమైంది'' అని భారత్‌కు చేరుకున్న ఏడుగురు మాజీ నేవీ అధికారుల్లో ఒకరు అన్నారు.
ఎట్టకేలకు మరణ శిక్ష నుంచి విముక్తి పొంది ఖతార్ నుంచి దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం నేవీ మాజీ అధికారులు 'భారత్ మాతా కీ జై' నినాదాలు చేశారు.
ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తానీతో సంప్రదింపులు, దౌత్య ప్రయత్నాల ద్వారా తమ విడుదలకు కారణమయ్యారంటూ ప్రధాని మోదీని నేవీ మాజీ అధికారులు ప్రశంసించారు.
గూఢచర్యం కేసులో 2022 అక్టోబర్‌లో ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులు అరెస్టయ్యారు. వారికి ఖతార్ న్యాయస్ధానం మరణ శిక్ష విధించింది. అనంతరం జీవిత కాల శిక్షగా మార్చింది.

ఫొటో సోర్స్, ANI
"మేము భారతకు తిరిగి రావడం కోసం 18 నెలలుగా ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్ళకు స్వదేశానికి రాగలిగాం. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఆయన వ్యక్తిగత జోక్యం, ఖతార్‌తో సంప్రదింపుల కారణంగానే ఇది సాధ్యమైంది. భారత ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రభుత్వం జోక్యం లేకుండా ఈ రోజు ఇది సాధ్యమయ్యేది కాదు.'' అని ఖతార్ నుంచి భారత్ చేరుకున్న తెలుగు వ్యక్తి పాకాల సుగుణాకర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
''ఎట్టకేలకు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. ప్రధాని మోదీ వ్యక్తిగత జోక్యం లేకుంటే మా విడుదల సాధ్యమయ్యేది కాదు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి కూడా నా కృతజ్ఞతలు” అని నేవీ మాజీ అధికారి ఒకరు అన్నారు.

ఫొటో సోర్స్, ANI
చిరునవ్వుతో ప్రశాంతంగా కనిపిస్తున్న మరో నేవీ మాజీ అధికారి ఏఎన్‌ఐతో మాట్లాడుతూ " భారత ప్రభుత్వం, ప్రధాని నిరంతర ప్రయత్నాల వల్లనే మేం ఈ రోజు మీ ముందు నిల్చున్నాం. మా విడుదల కోసం అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరిగాయి." అన్నారు.

ఫొటో సోర్స్, ANI
"దీని కోసం మేము, మా కోసం మా కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఖతార్ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులతో సంప్రదింపులు జరిపి, మమ్మల్ని విడుదల చేయించారు. ఖతార్ ఎమిర్‌కి కృతజ్ఞతలు తెలియజేసేందుకు నా దగ్గర మాటలు లేవు'' అన్నారు మరో నేవీ మాజీ అధికారి.

ఫొటో సోర్స్, ANI
"తిరిగి రావడం చాలా సంతోషం. ప్రధానమంత్రి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఖతార్ ఎమిర్‌కు కూడా ధన్యవాదాలు" అని మరో నేవీ మాజీ అధికారి ఏఎన్‌ఐతో అన్నారు.
అసలేం జరిగింది?
ఖతార్ న్యాయస్థానం తీర్పు వెల్లడించిన సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందిస్తూ, “అల్ దహ్రా ఉద్యోగులైన ఎనిమిది మంది భారతీయులపై ‘కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ ఖతార్’ తీర్పు ఇచ్చిందన్న ప్రాథమిక సమాచారం అందింది” అని ప్రకటనలో తెలిపింది.
“వారికి మరణశిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు దిగ్భ్రాంతిని కలిగించింది. మేం వారి కుటుంబ సభ్యులు, లీగల్ టీంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా తీసుకుని, ఖతార్ అధికార యంత్రాంగాన్ని సంప్రదిస్తాం. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోవడం లేదు” అని పేర్కొంది.
కొన్ని నెలలుగా ఈ మాజీ అధికారులను విడిపించాలని భారత ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. తీర్పు నేపథ్యంలో ఈ విషయాన్ని ‘అత్యధిక ప్రాధాన్యం’ ఉన్న అంశంగా చూస్తున్నామని విదేశీ వ్యవహారాల శాఖ గతంలో చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
గూఢచర్యం అభియోగాలు
2022 సెప్టెంబరులో ఖతార్ ప్రభుత్వం ఈ ఎనిమిది మందిని అరెస్టు చేసింది. నిరుడు మార్చిలో వారిపై గూఢచర్యం అభియోగాలు నమోదు చేసింది.
వీరు గతంలో ఖతార్ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ ‘జహీరా అల్ అలామి’లో పని చేశారు.
ఈ సంస్థ ఖతార్ నావికాదళానికి సంబంధించిన సబ్‌మెరైన్ కార్యక్రమం కోసం పనిచేసేది.
రాడార్ దృష్టిని తప్పించుకునే అత్యున్నత ఇటాలియన్ టెక్నాలజీతో కూడిన జలంతర్గాముల కొనుగోలు ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఈ సంస్థలో 75 మంది భారత పౌరులు ఉద్యోగాలు చేసేవారు. వీరిలో అత్యధికులు భారత నౌకాదళ మాజీ అధికారులు.
2022 మే 31 నుంచి సంస్థ కార్యకాలాపాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.
మీడియా కథనాల ప్రకారం జహీరా అల్ అలామి సంస్థ అధినేత ఖమిస్ అల్ అజామీతోపాటు ఎనిమిది మంది భారత ఉద్యోగులపై వచ్చిన ఆరోపణల్లో కొన్ని సాధారణమైనవైతే, మరికొన్ని ప్రత్యేకమైనవి.
గూఢచర్యం అభియోగాలపై అరెస్టైన ఈ ఎనిమిది మందిని సంస్థ నుంచి తొలగించారు. వారి వేతనాలను కూడా సెటిల్ చేశారు.
2022 మేలో సంస్థను మూసివేయాలని, పనిచేస్తున్న దాదాపు 70 మంది ఉద్యోగులను 2023 మేలోగా దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ప్రభుత్వం ఆదేశించింది.

ఫొటో సోర్స్, ANI
ఇవీ ఆరోపణలు?
మీడియా కథనాల ప్రకారం- ఇప్పుడు మరణ శిక్ష పడ్డ భారతీయులు ఖతార్‌కు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు చేరవేశారని ఆరోపణలు ఉన్నాయి.
భారత మీడియా, ప్రపంచ మీడియా కథనాల ప్రకారం- ఈ నేవీ మాజీ అధికారులు అత్యాధునిక ఇటాలియన్ జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇజ్రాయెల్‌కు చేరవేశారని ఖతార్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఇజ్రాయెల్ కోసం వీరు గూఢచర్యం చేశారని, ఇందుకు తమ వద్ద ‘ఎలక్ట్రానిక్ ఆధారం’ ఉందని ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెప్తోంది.
అరెస్టైన మాజీ అధికారులు జహీరా అల్ అలామి సంస్థ తరపున ఖతార్ నౌకాదళానికి పలు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఖతార్, భారత్ మధ్య ఒప్పందంలో భాగంగా అప్పట్లో ఈ నియామకాలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
జహీరా అల్ అలామి ఏం చేస్తుంది?
ఖతార్ రక్షణ శాఖ, భద్రత, ఇతర ప్రభుత్వ ఏజెన్సీలకు తాను స్థానిక వ్యాపార భాగస్వామినని ‘జహీరా అల్ అలామీ’ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. రక్షణ పరికరాల నిర్వహణ, మరమ్మతులలో తాము నిష్ణాతులమని చెప్పింది.
వెబ్‌సైట్‌లో సంస్థ సీనియర్ అధికారుల వివరాలు, వారి పదవుల గురించిన పూర్తి సమాచారాన్ని పొందుపర్చింది. ఈ జాబితాలో చాలా మంది భారతీయులు ఉన్నారు.
ఖతార్‌లో రక్షణ పరికరాల నిర్వహణ, మరమ్మతుల్లో ఈ సంస్థ అగ్రగామి అని దీని లింక్డ్ఇన్ పేజీలో ఉంది.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం:ధోనీ హెలీకాప్టర్ షాట్లను పరిచయం చేసిన ఈ స్టేడియం పిచ్ బ్యాటర్ల పాలిట స్వర్గమా?
- దివ్య దేశ్‌ముఖ్: చెస్ క్రీడాకారిణులకు ఎదురయ్యే వేధింపులు ఏమిటి? ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టుపై చర్చ ఎందుకు?
- పాడేరు: మేఘాలు తాకే వంజంగి కొండపైకి టూరిస్టులు రాకపోతేనే బావుండని స్థానికులు ఎందుకంటున్నారు?
- బీజేపీ 'వైట్ పేపర్' x కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్': ఆర్థిక వ్యవస్థ ఎవరి పాలనలో ఎలా ఉంది?
- పేటీఎం: ఈ డిజిటల్ పేమెంట్ యాప్ చేసిన తప్పేంటి... ఈ గండం నుంచి అది గట్టెక్కుతుందా?















