పీటర్ రోబక్: లైంగిక దాడి కేసుతో 'తీవ్ర నిరాశ'కు గురైన ఈ క్రికెటర్ 13 ఏళ్ళ కిందట ఆత్మహత్య చేసుకున్నారని తేల్చిన కోర్టు

పీటర్ రోబక్
ఫొటో క్యాప్షన్, పీటర్ రోబక్ 1974 నుంచి 1991 దాకా సోమర్‌సెట్ తరఫున ఆడారు.
    • రచయిత, ఎమ్మా ఎల్జీ, పీఏ మీడియా
    • హోదా, బీబీసీ న్యూస్

మాజీ క్రికెటర్ పీటర్ రోబక్ చనిపోవడానికి ముందు 'తీవ్ర నిస్పృహ'కు లోనైనట్లు అక్కడి కోర్టు విచారణలో వెల్లడైంది.

సోమర్‌సెట్ మాజీ కెప్టెన్, క్రికెట్ జర్నలిస్ట్ అయిన పీటర్ రోబక్ కామెంటేటర్‌గా పని చేస్తున్నప్పుడు 2011 నవంబర్‌లో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మృతి చెందారు.

చనిపోవడానికి కొద్దిరోజుల ముందు ఆయన తన హోటల్ గదిలో 26 ఏళ్ళ యువకుడిపై లైంగిక దాడి చేశారనే ఆరోపణలతో కేసు నమోదైంది.

ఆ కేసును చెషైర్ కొరోనర్స్ కోర్టు విచారించింది. ఆ విచారణ సమయంలోనే రోబక్ మృతిచెందారు.

ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయారని కూడా కోర్టు నిర్ధరించింది.

అసలేం జరిగింది?

1974 నుంచి 1991 వరకు సోమర్సెట్‌ జట్టు తరపున రోబక్ క్రికెట్ ఆడారు. కౌంటీ క్రికెట్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అలాగే, బీబీసీ రేడియో టెస్ట్ మ్యాచ్‌ స్పెషల్‌లో మాజీ సమ్మరైజర్‌గానూ పనిచేశారు.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మ్యాచ్ పై కామెంటరీ చెప్పేందుకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కాలమిస్ట్ గానూ ఉన్న రోబక్ సదరన్ సన్ హోటల్లో బస చేశారు.

రొబక్ నవంబర్ 7న తనగదిలో ఒక వ్యక్తి (26)తో సమావేశమయ్యారు. యూనివర్సిటీ ద్వారా ఓ విద్యార్థికి రొబక్ ఆర్థిక సాయం అందించే విషయమై వీరు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రొబక్ లైంగికంగా వేధించారని ఆ వ్యక్తి కేసు వేశారు. నవంబర్ 12న దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రొబక్‌ను అరెస్ట్ చేసేందుకు అధికారులు హోటల్ గదికి వెళ్ళారు.

పరువు పోతుందని...

రోబక్ స్నేహితుడు, కామెంటేటర్, ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ కోసం పనిచేసిన జిమ్ మాక్స్ వెల్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఆ రోజు సాయంత్రం తన గదికి త్వరగా రమ్మన్నట్లు తనకు ఫోన్ కాల్ వచ్చినట్టు చెప్పారు.

రోబక్ గది ఉన్న అంతస్తులోనే మాక్స్‌వెల్ కూడా ఉన్నారు. రోబక్ గదిలోకి మాక్స్‌వెల్ వెళ్లేముందు ఆయనను ఓ పోలీసు అధికారి పలకరించారు. ఆ సమయంలో రొబోక్ బెడ్‌పై కూర్చుని ఉన్నారు.

అతను పూర్తి నిరాశలో ఉన్నారని మాక్స్‌వెల్ చెప్పారు.

పోలీసులు తనను గది నుంచి బయటకు వెళ్ళిపోమ్మని చెప్పేలోపే రోబక్ తన కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓ లాయర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పారని మాక్స్‌వెల్ తెలిపారు.

‘‘క్రికెట్ ప్రపంచానికి తాను బాగా తెలుసునని, తన అరెస్ట్ మొదటి పేజీ వార్త అవుతుందని రోబక్ చెప్పారు’’ అని ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసాఫీసర్ డెట్ అబ్రే మెక్ డోనాల్డ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఓ ఫోన్ చేయడానికి హోటల్ గది నుంచి బయటకు వచ్చినప్పుడు రోబక్‌పై ఆయన స్నేహితుడు లెఫ్టినెంట్ సెసిల్ జాకబ్స్ అరవడం తాను విన్నట్టు మెక్ డోనల్డ్ చెప్పారు.

ఆ తరువాత జరిగిన పరిణామమే రోబక్ మరణానికి కారణమైందని విచారణలో వెల్లడైంది.

"ఈ సంఘటన జరిగిన సమయంలో రొబక్ చాలా ప్రశాంతంగా, తనను తాను అదుపులో ఉంచుకున్నట్టుగా కనిపించారు" అని మెక్‌డోనల్డ్ చెప్పారు.

అనేక గాయాల వల్ల రోబక్ మరణించాడని దక్షిణాఫ్రికా, యూకే లో నిర్వహించిన పోస్టుమార్టమ్ నివేదికలను కూడా కోర్టు ఈ విచారణలో విన్నది.

ఇదే కారణాన్ని దక్షిణాఫ్రికాలో జరిగిన కోర్టు విచారణలోనూ నమోదు చేశారు.

అయితే, దక్షిణాఫ్రికాలో జరిగిన విచారణకు రోబక్ కుటుంబసభ్యులెవరూ హాజరు కాలేదు.

‘‘ రొబక్ కు అయిన గాయాలలో మరొకరి ప్రమేయం ఉందా అని చెప్పడానికి ఆధారాలేవీ లేవు. కానీ ఈ పరీక్షలను ఆధారం చేసుకుని మూడో వ్యక్తి ప్రమేయాన్ని కొట్టిపారేయడానికి కూడా లేదు’’ అని యూకేలో పోస్ట్ మార్టం చేసిన ఫోరెన్సిక్ ఫాథాలజిస్ట్ డాక్టర్ మాథ్యూ ల్యాల్ చెప్పారు.

విచారణను ముగిస్తూ సీనియర్ న్యాయాధికారి జాక్వెలిన్ డెవోనిష్ కోర్టుకు హాజరైన కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

‘‘ఈ కేసును తేల్చడానికి దీర్ఘకాలం పట్టినందుకు క్షమాపణలు. కానీ దక్షిణాఫ్రికాలో పునురుద్ధరించిన కేసు గురించి తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది’’ అని జాక్వెలిన్ తెలిపారు.

అయితే, రోబక్ మరణంపై మీడియాలో అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆయన హోటల్ గది కిటికీ నుంచి దూకి మరణించినట్లు ఆ కథనాలలో ఉంది.

ఇవి కూడా చదవండి :

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)