'నా జ్ఞాపక శక్తి బాగానే ఉంది' అంటూ స్పెషల్ కౌన్సిల్‌పై అధ్యక్షుడు బైడెన్ ఆగ్రహం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మ్యాక్స్ మెట్జా
- హోదా, బీబీసీ న్యూస్
అత్యంత రహస్య పత్రాలను (టాప్ సీక్రెట్ ఫైల్స్) బహిర్గతం చేశారని, జీవితంలోని కీలక సంఘటనలను గుర్తుకు తెచ్చుకునేందుకు చాలా కష్టపడ్డారంటూ ఆయన జ్ఞాపక శక్తి గురించి ప్రస్తావిస్తూ స్పెషల్ కౌన్సిల్ విడుదల చేసిన నివేదికపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
''నా జ్ఞాపక శక్తి బాగానే ఉంది'' అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నొక్కిచెప్పారు.
తన కొడుకు ఎప్పుడు చనిపోయారనే విషయాన్ని ఆయన జ్ఞాపకం తెచ్చుకోలేకపోయారని నివేదికలో పేర్కొనడంపై భావోద్వేగానికి గురైన బైడెన్ తీవ్రంగా స్పందించారు. ''ఆ విషయం ఎత్తడానికి అతనికి ఎంత ధైర్యం'' అన్నారు.
బైడెన్ రహస్య పత్రాలను ఉద్దేశపూర్వకంగానే తన వద్ద ఉంచుకుని, వాటిని బహిర్గతం చేసినట్లు ఈ విచారణలో గుర్తించారు. అయినప్పటికీ ఆయనపై అభియోగాలు నమోదు చేయాల్సిన పని లేదని నిర్ణయించారు.
బైడెన్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన తర్వాత, అఫ్గానిస్తాన్‌లోని సైనిక కార్యకలాపాలు, విదేశాంగ విధానానికి సంబంధించిన రహస్య పత్రాలను సముచితంగా ఉంచలేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ హుర్ నిర్ధరించారు. స్పెషల్ కౌన్సిల్ అంటే ప్రత్యేక న్యాయవాది. (యూఎస్ ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ అనేది అమెరికాకి చెందిన ఇండిపెండెంట్ ఫెడరల్ ఇన్వెస్టిగేటివ్ అండ్ ప్రాసెక్యూటోరియల్ ఏజెన్సీ. ఇది ఫెడరల్ చట్టాలను అనుసరించి పనిచేస్తుంది.)
అంతకు ముందు రోజు విడుదలైన 345 పేజీల కటువైన నివేదికలో అధ్యక్షుడి జ్ఞాపకశక్తికి ''స్పష్టమైన పరిమితులు'' ఉన్నాయని నివేదిక పేర్కొంది.
తన వయసు, మానసిక పరిస్థితిపై జర్నలిస్టు ప్రశ్నలను బైడెన్ తిప్పికొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆయన అనుకోకుండా ఈజిప్ట్ నేత అబ్దుల్ ఫత్తాహ్ అల్-సిసిని 'మెక్సికో అధ్యక్షుడు'గా పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ - గాజా యుద్ధం తాజా పరిస్థితిపై ఏమంటారని అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు. ''మీకు ఇంతకుముందే తెలిసినట్లుగా, మానవతా సాయం పంపించేందుకు వీలుగా గేట్లు తెరిచేందుకు మెక్సికో అధ్యక్షుడు సిసి ఇష్టపడడంలేదు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
విచారణలో భాగంగా ప్రత్యేక న్యాయవాది హుర్ 81 ఏళ్ల అమెరికా అధ్యక్షుడిని ఐదు గంటలకు పైగా ప్రశ్నించారు.
తాను ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి విషయాలు (2009 నుంచి 2017), 2015లో ఆయన కుమారుడు బ్యూ మృతి చనిపోయిన విషయాన్ని అధ్యక్షుడు జ్ఞాపకం తెచ్చుకోలేకపోయారని బైడెన్ అటార్నీ జనరల్ మెరిక్ గార్లండ్ నియమించిన రిపబ్లికన్, ప్రత్యేక న్యాయవాది పేర్కొన్నారు.
తన జ్ఞాపకశక్తి గురించి లేవనెత్తిన సందేహాలపై గురువారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో బైడెన్ తీవ్రంగా స్పందించారు.
''నిజం చెప్పాలంటే, నన్ను ఆ ప్రశ్న అడిగినప్పుడు ఇది వారి పనికిమాలిన పని మినహా మరోటి కాదని నేను అనుకున్నా'' అని ఆయన చెప్పారు.
''బ్యూ మరణం గురించి నాకెవరూ గుర్తు చేయాల్సిన అవసరం లేదు.'' అన్నారు.
నిరుడు అక్టోబర్ 8, 9 మధ్య ప్రత్యేక న్యాయవాది ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇజ్రాయెల్ - గాజా యుద్ధం చెలరేగడం వంటి ఘటనలతో ''అప్పటికి చాలా ఆలోచనల్లో ఉన్నా.. అంతర్జాతీయంగా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన సమయమది'' అన్నారు బైడెన్.
తన జ్ఞాపకం కోసం, చేతిరాతతో రాసిన కొన్ని నోట్‌బుక్‌లలోని కొంత సున్నితమైన సమాచారాన్ని ఘోస్ట్‌రైటర్‌తో పంచుకున్నారని విచారణ నివేదికలో పేర్కొన్నారు. అయితే, వాటిని అధ్యక్షుడు తిరస్కరించారు.
అధికారిక పత్రాల నిర్వహణలో అధ్యక్షుడిని దోషిగా నిర్ధరించడం కష్టమని ప్రత్యేక న్యాయవాది పేర్కొన్నారు. ‘‘ఎందుకంటే, మా ఇంటర్వ్యూలో చేసినట్లుగా, అధ్యక్షుడు సానుభూతి పొందేలా, లేదా మంచి ఉద్దేశంతో చేసినట్లుగా, లేదా జ్ఞాపకశక్తి తక్కువైన వృద్ధుడిగానో తనను తాను జ్యురీ ఎదుట చూపించుకునే అవకాశం ఉంది'' అన్నారు.

ఫొటో సోర్స్, DOJ
ఈ నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధ్యక్షుడి వయసుపై అమెరికా ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఒపీనియన్ పోల్స్ సూచిస్తున్నాయి. అయితే, ఆయన గురువారం మాట్లాడుతూ తాను అన్ని విధాలా అర్హుడినని ఆయన అన్నారు.
''నేను చాలా బావున్నా. నేను వయసులో పెద్దవాడినే, అలాగే నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నేను ఈ దేశాన్ని సగర్వంగా నిలబెట్టా. నాకు అతని సిఫార్సులు అవసరం లేదు'' అన్నారాయన.
ఇంట్లో రహస్య పత్రాలు బయటపడినందుకు బాధ్యత వహిస్తారా అని అడిగినప్పుడు, బైడెన్ తన సిబ్బందిని నిందించారు. అవి గ్యారేజీలో ఉన్నాయని తనకు తెలియదని ఆయన అన్నారు.
అవి గ్యారేజీలో కుక్క మంచం పక్కన ఉన్నాయని ప్రత్యేక న్యాయవాది పేర్కొన్నారు.
వైట్‌హౌస్‌లోని డిప్లొమాటిక్ రిసెప్షన్ రూమ్‌లో వాతావరణం ఉద్రిక్తంగా ఉందని బీబీసీ ప్రతినిధి వివరించారు.
అమెరికా ప్రజలు మీ వయసు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు ''అది మీ మాట, అది మీ మాట'' అంటూ స్వరం పెంచారు.
అధ్యక్షుడిగా తన జ్ఞాపక శక్తి బావుందని, ఎలాంటి ఇబ్బందీ లేదని ఆయన నొక్కిచెప్పారు.
అయితే, బైడెన్ జ్ఞాపకశక్తి లోపాల గురించి ప్రత్యేక న్యాయవాది వాదనలపై బైడెన్ న్యాయవాద బృందం కూడా విమర్శలు చేసింది.
''ఏళ్లనాటి ఘటనలను గుర్తుకు తెచ్చుకోలేకపోయినప్పుడు, ఒక సాధారణ ఘటనను సాక్షులు వివరించినప్పుడు అత్యంత నిష్పక్షపాతమైన భాషను నివేదికలో ఉపయోగించాలి'' అని నివేదిక గురించి వైట్‌హౌస్ న్యాయవాది రిచర్డ్ సౌబర్ ఒక లేఖ రాశారు.
డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లోని బైడెన్ నివాసం, 2022-2023 వరకూ ఆయన ఉపయోగించిన పాత ప్రైవేట్ కార్యాలయంలో టాప్ సీక్రెట్ ఫైల్స్‌ను గుర్తించారు.
డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతల నుంచి దిగిపోయిన తర్వాత, ఆయనపై రహస్య పత్రాలను బహిర్గతం చేశారనే అభియోగాలు నమోదైన అనంతరం ఈ రహస్య పత్రాలను గుర్తించారు. ఈ కేసులో బైడెన్ మే నెలలో విచారణను ఎదుర్కోనున్నారు.
వి కూడా చదవండి:
- అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిపై దొంగల దాడి, సయ్యద్ మజార్ అలీకి తీవ్ర గాయాలు.. ఇది షాక్ కలిగించిందన్న బాధితుడు
- పాల్ మెకంజీ: ఆకలితో చనిపోతే స్వర్గానికి వెళ్తారని చెప్పి 191 మందిని హత్య చేశారంటూ పాస్టర్‌పై కేసు
- Turkey: భూగర్భంలో మహానగరం, 18 అంతస్తుల్లో సొరంగాలతో అనుసంధానం
- ఇజ్రాయెల్-గాజా యుద్ధం: 'మిలటరీ ట్యాంకు ఇటే వస్తోంది, నాకు చాలా భయంగా ఉంది.. ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి' -దాడుల మధ్య చిక్కుకున్న ఆరేళ్ళ చిన్నారి
- మిస్ జపాన్: వివాహితుడితో అఫైర్ బయటపడినందుకు ‘కిరీటం’ కోల్పోయిన విజేత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














