'నా పుట్టినరోజున మా అమ్మను నాన్న చంపేశాడు, అదంతా టిక్‌టాక్ వీడియోలో ఎందుకు చెప్పానంటే...'

ఫొటో సోర్స్, LIV SHELBY
- రచయిత, కిర్‌స్టీ గ్రాంట్, జొనెల్లె అవొమొయి
- హోదా, బీబీసీ 'ది రిలయెబుల్ సాస్ పాడ్‌కాస్ట్'
టిక్‌టాక్‌లో తన తల్లి మరణం గురించి వీడియో పోస్ట్ చేసేప్పుడు ఇంతమంది చూస్తారని లివ్ షెల్బీ అస్సలు ఊహించలేదు.
కారులో కూర్చుని, కెమెరా ముందు షెల్బీ మాట్లాడింది. 2005లో తన తల్లి లిసాకు ఏం జరిగిందో బహిరంగంగా ఆమె మాట్లాడడం ఇదే మొదటిసారి.
ఆ ఏడాదితో లివ్‌కు మూడేళ్లు వచ్చాయి. లివ్ బర్త్ డే పార్టీలోనే ఆమె తండ్రి, తన తల్లిని చంపేశాడు.
అమ్మ ఇకలేదని, అందుకు నాన్నే కారణమని తెలుసుకుంటూ పెరిగానని, అయితే తన తల్లి మరణం గురించి తన కుటుంబం ఎప్పుడూ మాట్లాడలేదని, అందువల్ల అసలు ఏం జరిగిందో తనకు సరిగ్గా తెలియదని లివ్ చెప్పింది.
ఎనిమిదేళ్ల తర్వాత స్కూల్లో కంప్యూటర్ క్లాస్‌లో, సెర్చ్ ఇంజిన్‌లో తన తల్లి పేరు ఎంటర్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా అంతా మారిపోయింది.
ఒక దశాబ్దం తర్వాత, తన 21 ఏళ్ల వయసులో, లివ్ తన కథను ప్రపంచంతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు.
40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చిన ఆమె ఏడు నిమిషాల వీడియోలో, ఆ నేరం తన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించిందో బహిరంగంగా, భావోద్వేగంతో చెప్పారు.
లివ్ తన టిక్‌టాక్ చానెల్‌లో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. ఆమెకు 2,70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంట్లోని హింసాత్మక సంబంధాలను అందంగా చూపించాలనుకోవడం, అలాంటి వాటి గురించి వింటూ ఉండడమే, అలాంటి సంబంధాల కారణంగా జరిగే వినాశకరమైన పరిణామాలను తెలియజేయాలని తాను అనుకోవడానికి ఒక కారణమని ఆమె తెలిపింది.
దానితో పాటు, తల్లిదండ్రులలో ఒకరిని (లేదా ఇద్దరినీ) కోల్పోవడం వల్ల పిల్లలపై పడే ప్రభావాన్ని కూడా ఆమె ప్రత్యేకంగా చెప్పాలనుకున్నారు.

ఫొటో సోర్స్, LIV SHELBY
'పంచుకునేందుకు సిద్ధంగా లేను'
దాడి జరిగిన రోజు లివ్ కెనడాలో ఉన్నారు, ఆమె అక్కడే పుట్టారు.
తన కుటుంబంలోని ఇరువర్గాల్లో ఎవరు ఆమెను చూసుకోవాలనే దానిపై సుదీర్ఘంగా సాగిన, కఠిన న్యాయ పోరాటం తర్వాత, యూకేలోని తన అమ్మమ్మ ఇంటికి రావడడానికి, ఆమెకు ఎనిమిదేళ్లు వచ్చే వరకూ వేచివుండాల్సి వచ్చింది.
ఆమె తండ్రి బ్రాడ్లీ బెన్హామ్‌పై 2008 నవంబర్‌లో హత్యా నేరం రుజువైంది. ఆయనకు జీవిత ఖైదు పడింది. కనీసం 12 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
బీబీసీ రిలయెబుల్ సాస్ పాడ్‌కాస్ట్ ప్రకారం, ఆమె తండ్రి ఇప్పటికే జైలు నుంచి విడుదలయ్యారు, కానీ ఆయనతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు.
ఇప్పటి వరకూ తన భావాలను తనలోనే ఉంచుకున్నానని, ఎప్పుడూ తన అమ్మమ్మకి, లేదా తన బాయ్‌ఫ్రెండ్‌తో కూడా చెప్పలేదని ఆమె తెలిపారు.
''అవన్నీ నాలోనే దాచుకున్నాను. నా జీవితంలో ఎవరితోనూ వాటిని పంచుకోలేదు'' అని ఆమె చెప్పారు.
చివరికి స్కూల్ కౌన్సెలర్‌తో చెప్పేందుకు కూడా, ''చాలా మొండిగా'', ''ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడలేదు'' అని ఆమె ఒప్పుకున్నారు.
''అదేమంత అర్థం లేని పనేమీ కాదు, ఎందుకంటే, ఒక గంటసేపు, లేదా అరగంట కూర్చుని మాట్లాడడానికి ఆమె స్పెషలిస్ట్ కాదు. ఆమె ఒక సాధారణ కౌన్సెలర్'' అని ఆమె వివరించారు.
''నాలో దాచుకున్న విషయాలను చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నానని కూడా అనుకోవడం లేదు.''

ఫొటో సోర్స్, LIV SHELBY
''అది చాలా బాధాకరం''
తన అనుభవానుసారం, గృహ హింస కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని లివ్ అభిప్రాయపడ్డారు.
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాల ప్రకారం, 2023 మార్చి వరకూ ఇంగ్లండ్, వేల్స్‌లో హత్యకు గురైన మహిళల్లో (వయోజన మహిళలు) దాదాపు సగం మంది (45 శాతం) గృహ హింస కారణంగానే చనిపోతున్నారు.
ఈ లెక్కల ప్రకారం, ఒక్క కేసులో మినహా మిగిలిన అన్నింటిలోనూ వారిని హత్య చేసినట్లు అనుమానిస్తున్న వ్యక్తి ఒక పురుషుడే.
గృహ హింస సంబంధిత హత్య కేసుల్లో మరణించిన మగవారు కేవలం 8 శాతం మాత్రమే. మొత్తం 30 మంది మగవారు హత్యకు గురైతే, అందులో 11 కేసుల్లో మహిళలు అనుమానితులుగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
మహిళలు, బాలికలపై హింస, వాటిని ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నాలు తరచుగా వార్తల్లో కనిపిస్తుంటాయి. కానీ, వాటి వల్ల దు:ఖంలో కూరుకుపోతున్న పిల్లల గురించి అంత చర్చ జరగదు, వాటి గురించి తక్కువ ఆలోచిస్తారు.
''అధికారికంగా గణాంకాలు లేకపోయినప్పటికీ, యూకేలో ఏడాదికి గృహ హత్యల కారణంగా తల్లిదండ్రులు కోల్పోతున్న చిన్నారులు 100 నుంచి 250 మంది మధ్య ఉండొచ్చు'' అని ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీలో సోషల్ వర్క్ ప్రొఫెసర్ జాన్ డెవానె చెప్పారు.
ప్రస్తుత భాగస్వామి (పార్టనర్), లేదా మాజీ భాగస్వామి చేతిలో గురయ్యే హత్యలకు, దాదాపు సవతి తల్లిదండ్రులే కారణమవుతున్నారని ఆమె చెప్పారు. అయితే, అలాంటి ఘటనలకు బలిపశువులుగా మారే చిన్నారులపై మరింత శ్రద్ధ వహించాలని ఆమె అన్నారు.
అలాంటి ప్రతి చిన్నారికి ఒక ప్రత్యేక కౌన్సెలర్‌ను ఏర్పాటు చేయడం మంచిదని లివ్ భావిస్తున్నారు. ఆ ఏర్పాటు ఉండి ఉంటే తనకు చిన్నతనంలో సాయపడేదన్నది ఆమె భావన.
''మీరు ఎవరితో కలిసి వెళ్లాలో, లేదా మీ గతం తెలిసిన వారినో కౌన్సెలర్ మీకు సూచిస్తారు. అప్పుడు మీ గతం గురించి వివరించాల్సిన అసవరం ఉండదు''
ఆ వీడియోకు స్పందిస్తూ తనలాంటి గృహ హింస బాధితులు తమ సొంత అనుభవాలను పంచుకోవడం, లివ్‌లో తాను ఒంటరిననే భావన తగ్గేందుకు సాయపడింది.
''అలాంటి వారు చాలా మంది ఉన్నారు'' అని ఆమె చెప్పారు.
''వారిలో చాలా మందికి ఇతరుల జీవితాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని తెలుసు, కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక అవినాభావ సంబంధం కలిగి ఉంటారు.''
''అది చాలా బాధాకరం'', అయితే, ''మనలాంటి వాళ్లు ఇంకా చాలా మంది ఉంటారు'' అనే విషయాన్ని గ్రహించగలగడం అవసరమని ఆమె గుర్తించారు.
ఇవి కూడా చదవండి:
- మరణ శిక్షను ఏయే పద్ధతుల్లో అమలు చేస్తున్నారు?
- గర్భవతులను చేసే జాబ్: ‘మహిళతో ఒకరాత్రి గడిపితే రూ.5 లక్షలు, ఆమె ప్రెగ్నెంట్ అయితే రూ.8 లక్షల గిఫ్ట్...’అంటూ సాగే ఈ స్కామ్ కథ ఏంటి?
- అక్క ఆత్మహత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు 20 ఏళ్లు ఎదురు చూసిన తమ్ముడు...ఆ తర్వాత ఏమైందంటే?
- ముస్సోరీ హోటల్లో ఒంటరి మహిళ హత్య అగాథా క్రిస్టీ క్రైమ్ నవలకు ఎలా ప్రేరణగా మారింది?
- కర్ణాటక : హిందూ యువకుడితో కలిసి హోటల్ గదిలో ఉన్నందుకు గ్యాంగ్ రేప్ చేశారన్న ముస్లిం మహిళ, మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













