పోలీసు కావాల్సినవాడు హంతకుడు అయ్యాడు, ఆపై జైల్లో హతమయ్యాడు, పగబట్టిన అతని మూడేళ్ళ కొడుకు ఏం చేశాడంటే...

ఫొటో సోర్స్, GETTY IMAGES
గమనిక: ఈ కథనంలో మిమ్మల్ని కలిచివేసే అంశాలు ఉంటాయి.
ఏప్రిల్ 9, 1996.
సమయం: తెల్లవారుజామున 3.30 గంటలు
నాగర్ కోయిల్ సబ్ జైలులోని ఖైదీలు గాఢనిద్రలో ఉన్నారు.
20 మంది వ్యక్తులు నిచ్చెన ద్వారా జైలు ప్రహరీ ఎక్కి లోపలకు దూకారు. దీన్ని గమనించిన జైలు గార్డులు ఆ ఆగంతుకులపై కలబడ్డారు. కానీ ఈ గార్డులను తప్పించుకుని ఓ ఆగంతకుడు తనకు కావాల్సిన సెల్లులోకి చొరబడ్డాడు. అక్కడున్న ఖైదీని చితకబాదాడు. ఆపైన అతని తలను నరికాడు. ఆ తలను నాగర్ కోయిల్ బస్‌స్టేషన్ వద్ద పడేసి ఆ దుండగుడు తన దారిన తాను పోయాడు.
తమిళనాడులో జైలులో ఉన్న ఓ ఖైదీ హత్యకు గురికావడం అదే మొదటిసారి. చనిపోయిన ఖైదీ పేరు ముత్తులింగం అలియాస్ లింగం.
1990 ప్రాంతంలో జరిగిన అనేక హత్య కేసులలో ఇతను నిందితుడు. చనిపోయేనాటికి లింగం వయసు 36 సంవత్సరాలు.
అతనికి ఐదేళ్ళ కుమార్తె, మూడేళ్ళ కుమారుడు సుజిత్ ఉన్నారు.
తరువాత 2013లో సుజిత్ 17వ ఏట తన తండ్రి హత్యకేసులో నిందితుడిగా ఉన్న సహాయం అనే వ్యక్తిని హత్య చేశాడు.
అసలింతకీ లింగం ఎవరు? ఆయన రౌడీగా ఎందుకు మారాడు? ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
కబడ్డీ ఆటలో హత్య
అరివాడి ప్రాంతంలోని కబడ్డీ టీముల మధ్య 1987లో జూన్ 15న పోటీలు జరిగాయి. ఈ ప్రాంతంలో లింగం కబడ్డీ టీమ్‌కు మంచి పేరుంది.
లింగం కబడ్డీ టీమ్ జయశీలన్ టీమ్‌తో పోటీపడింది. జయశీలన్‌కు నేర చరిత్ర ఉంది.
అయితే ఆట మధ్యలో ఇరుజట్ల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. ఆట సాగుతున్నప్పుడు అప్పుడప్పుడు కరెంట్ పోయి వస్తుండేది. అలా ఓసారి కరెంట్ పోయి వచ్చేలోపు లింగం కబడ్డీ టీమ్ వద్దకు కూతకు వెళ్ళిన జయశీలన్ నెత్తురోడుతూ చనిపోయే స్థితిలో కనిపించాడు.
ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే లింగం టీమ్ అక్కడి నుంచి పరారైంది.
‘‘దీనివల్ల లింగం సాధించిందేమిటనేది ఇప్పటికీ అంతుపట్టడం లేదు. కానీ ఒకటిమాత్రం నిజం. అప్పట్లో జయశీలన్‌కు అనేకమందితో శత్రుత్వం ఉండేది. కానీ జయశీలన్ హత్యతో ఎక్కువగా ఇబ్బంది పడింది మాత్రం లింగమే’’ అని నాగర్ కోయిల్ జిల్లా రిటైర్డ్ డిఎస్పీ ఇళంగో చెప్పారు.
జయశీలన్ హత్య జరిగిన సమయంలో ఇళంగో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు.
దీని గురించి ఆయన మరింత వివరిస్తూ ‘‘ ఆ సమయంలో లింగం 24 ఏళ్ళ యువకుడు. అతను పోలీసు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే మిగిలి ఉంది. కానీ ఈ హత్య కారణంగా అతను పోలీసు ఉద్యోగంలో చేరలేకపోయాడు’’ అని చెప్పారు.
జయశీలన్ హత్య కేసులో లింగాన్ని మూడో ముద్దాయిగా చేర్చారు. లింగంపై నమోదైన తొలి కేసు అదే. అయితే సంఘటన జరిగిన రోజునుంచి తప్పించుకు తిరుగుతున్న లింగాన్ని పోలీసులు పట్టుకోలేకపోయారు. దీంతో అతని స్నేహితుడు ప్రభును అరెస్ట్ చేశారు.
ప్రభు నాగర్‌కోయిల్ జిల్లాలోని అగస్తేశ్వరానికి చెందినవాడు. బీఏ చదివాడు. ఆపైన న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు. న్యాయవాది అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఈ సంఘటన లింగం, ప్రభు అక్రమ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడానికి దారితీసింది అని ఇళంగో చెప్పారు.
తరువాత పోలీసులు జయశీలన్ హత్య కేసులో లింగాన్ని కూడా అరెస్ట్ చేసి వీరిద్దరిని పాలయంకోట జైల్లో ఉంచారు. దీని తరువాతే వారు తమ నేర ప్రయాణం మొదలుపెట్టారు. ముందు చిన్నచిన్న నేరాలలో పాల్గొనడం మొదలైంది. ఆపైన పెద్ద పెద్ద నేరాలవైపు అడుగులేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
లింగం.. ప్రభు మధ్య గొడవ
స్నేహితులుగా మొదలైన వీరి నేర ప్రయాణం 1990లో విడిపోయింది. దీంతో వీరు శత్రువులుగా మారిపోయారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని ఈ కేసును విచారించిన పోలీసులు తెలిపారు.
వీరి మధ్య గొడవలు రావడానికి ఓ అంబాసిడర్ కారు కారణమైందంటారు పోలీసులు. లింగం తనకోసం ఓ అంబాసిడర్ కారు కొనుగోలు చేశాడు. దీనిని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. కారును సీజ్ చేశారు. కానీ ప్రభు సోదరుడి సాయంతో కేసును క్లోజ్ చేయించి, లింగం ఈ కారును బయటకు తెచ్చుకోగలిగాడు.
‘‘తరువాత లింగం ఈ కారును ప్రభుకే అమ్మేశాడు. తరువాత ప్రభు దానిని పెద్ద మొత్తానికి వేరొకరికి అమ్మిన విషయం తెలుసుకున్న లింగం ప్రభుతో గొడవకు దిగాడు. దీంతోపాటు ఆడవాళ్ల విషయంలో ప్రభు ప్రవర్తించే తీరు కూడా వీరిద్దరి మధ్య గొడవలు పెరగడానికి కారణమైందని’’ అధికారులు తెలిపారు.
ఇక అప్పటి నుంచి ఇరువర్గాలకు చెందిన వారు వరుసగా హత్య కేసుల్లో చిక్కుకున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రభుపై పెట్రోల్ పోసి..
1990 ప్రారంభంలో తమరైకుళం పోలీసులు ప్రభు అనుచరులను ఓ హత్య కేసులో అరెస్ట్ చేశారు. నిజానికి ఈ కేసులో లింగం, ప్రభు వర్గాలను పోలీసులు అనుమానించారు. కానీ ప్రభు పోలీసుస్టేషన్‌పై దాడి చేసి తన అనుచరులను విడిపించుకున్నాడు.
దీని తరువాత గుర్తు తెలియని వ్యక్తులు ప్రభు నడుపుతున్న మద్యం దుకాణానికి నిప్పుపెట్టారు. దీనికి లింగమే కారణమని ప్రభు అనుమానించాడు.
దీనికి ప్రతీకారంగా ప్రభు, అతని అనుచరులు కలిసి లింగం ఇంటిని తగులబెట్టారు.
దీంతో లింగం అనుచరులు కన్యాకుమారిలోని ప్రభుకే చెందిన మరో మద్యం షాపును ధ్వంసం చేశారు.
దీని తరువాత ఇరువర్గాల వారు హత్యకు గురయ్యారు. ఆపై లింగం అతని అనుచరులు కలిసి పెట్రోల్ బాంబులతో అగస్తేశ్వరంలోని ప్రభు ఇంటిపై దాడి చేసి ప్రభు మంటల్లో కాలిపోయేలా చేశారు.
ఈ కేసులో 1994 ఏప్రిల్ 7న లింగాన్ని పోలీసులు అరెస్ట్ చేసి 1995 జులై 30న నాగర్‌కోయిల్ సబ్‌జైలుకు తరలించారు.
1996 ఏప్రిల్ 9న తెల్లవారుఝామున 3.30గంటల ప్రాంతంలో కొందరు దుండగులు జైలులోకి ప్రవేశించి లింగాన్ని పట్టుకున్నారు. అతని తలను నరికారు. ఆ పైన మీనాక్షిపురం బస్‌స్టేషన్ ప్రాంతంలో తలను వదిలేసి పోయారు.
మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చిన ఈ కేసులో 12మంది దోషులుగా తేలారు. ఇద్దరు నిందితులు మాత్రం ఏళ్ళ తరబడి తప్పించుకుని తిరుగుతున్నారు.
ఇలా 27 ఏళ్ళుగా తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులలో సెల్వం అనే నిందితుడిని నాగర్‌కోయిల్ పోలీసులు కిందటేడాది అక్టోబరులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కోర్టులో ఊరట
ఈ సంఘటన తరువాత జైలులో పోలీసుల రక్షణలో తన భర్త లింగం హత్యకు గురవడానికి జైలు అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆ పిటిషన్‌లో కోరారు.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం బాధితురాలికి ఆరులక్షల రూపాయలను నష్టపరిహారం కింద వడ్డీతోపాటు చెల్లించాలని ఆదేశించింది.
ఈమేరకు లింగం భార్య రోహిణికి 8 లక్షల రూపాయల నష్టపరిహారం అందింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
17 ఏళ్ళ తరువాత ప్రతీకారం
లింగం హత్యకు గురయ్యే సమయానికి ఆయన వయసు 36 సంవత్సరాలు.
అతనికి అప్పటికే ఐదేళ్ళ కుమార్తె, మూడేళ్ళ కుమారుడు సుజిత్ న్నారు.
పెరిగి పెద్దవాడవుతున్న సుజిత్ తన తండ్రి హత్య కేసులో 12 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన సహాయంతో స్నేహం మొదలుపెట్టాడు.
ఇలా వీరిద్దరి మధ్య ఐదేళ్ళ స్నేహం నడిచాకా 2013 జూన్ లో సుజిత్, అతని ఇద్దరి స్నేహితులు కలిసి సహాయాన్ని ఉరివేసి చంపేశారు.
తన తండ్రి హత్యకు ప్రతీకారం తీర్చుకున్న 17 ఏళ్ల సుజిత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అతరువాత అతను చిన్నచిన్న నేరాల్లో పాల్గొంటున్నాడని గ్యాంగ్‌స్టర్ యాక్ట్ 2022 కింద అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- పీతలకు ‘రక్షణ కవచం’గా బాటిల్ మూతలు.. హృదయం ముక్కలైందన్న శాస్త్రవేత్తలు
- గురక ఎందుకు వస్తుంది? రాత్రిపూట పదేపదే నిద్ర చెడిపోతే మెదడు పనితీరు దెబ్బతింటుందా?
- మూడుసార్లు ఉరికంబం వరకు వెళ్లాడు.. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు.. అయినా బతికి బయటపడ్డాడు
- అమెజాన్ అడవుల్లో బయటపడ్డ పురాతన నగరం.. అత్యాధునిక రహదారి వ్యవస్థ, కాల్వల నిర్మాణంతో వేలమంది నివసించిన ఆనవాళ్లు
- ఐకాన్ ఆఫ్ ద సీస్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక తొలి ప్రయాణం షురూ.. దీనిపై విమర్శలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














