హిజాబ్‌ను నిషేధించిన ఈ ముస్లిం దేశంలో ప్రజలు తమ హక్కుల కోసం ఎలా పోరాడుతున్నారంటే...

హిజాబ్
    • రచయిత, అసైంబోట్ టొకోయేవా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్, కరగండ

పాఠశాల విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని కొన్ని ముస్లిం దేశాలు నిషేధించాయి. అందులో కజకిస్తాన్ కూడా ఉంది.

2016లో ప్రవేశపెట్టిన ఈ నిషేధం గురించి ఇప్పటికీ అక్కడ వాదనలు జరుగుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల రాజ్యాంగ హక్కును రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు.

కరగండకు చెందిన ఏడో తరగతి విద్యార్థి అనెల్యా కల సాకారమైంది. ఆమె వయస్సు 13 ఏళ్లు. ప్రతిష్టాత్మక నజర్‌బయేవ్ ఇంటెలెక్చువల్ స్కూల్ (ఎన్‌ఐఎస్)లో ఆమెకు సీటు వచ్చింది. కజకిస్తాన్ మాజీ అధ్యక్షుడు నూర్‌సుల్తాన్ నజర్‌బయేవ్ పేరునే ఈ పాఠశాలకు పెట్టారు. దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా నిలవాలనేది ఆమె తదుపరి కల.

సన్నగా, పొడవుగా ఉండే అనెల్యా స్థానిక, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి మంచి ర్యాంకును తెచ్చుకొని ఎన్‌ఐఎస్‌లో సీటు సంపాదించారు. దాదాపు 800 మంది పరీక్ష రాయగా ఆమెకు 16వ ర్యాంకు వచ్చింది.

ఆగస్టులో ప్రిపరేటరీ క్లాసుల కోసం ఆమె పాఠశాలకు వెళ్లారు. అదే రోజున, ఫోన్ చేసి ఆమె తల్లిదండ్రుల్ని పాఠశాలకు పిలిపించారు. మీ కూతురు ఈ పాఠశాలలో చదవడం కుదరదని వారికి చెప్పారు.

దానికి కారణం ఆమె ధరించిన హెడ్‌స్కార్ఫ్. ముస్లిం సంప్రదాయం ప్రకారం యుక్తవయస్సు రాగానే బాలికలు తలమీద స్కార్ఫ్ ధరించాలి.

హిజాబ్

‘‘ఎన్‌ఐఎస్‌లో నేను హెడ్‌స్కార్ఫ్ ధరించినప్పుడు నాకేమీ భిన్నంగా అనిపించలేదు. ఇది కేవలం ఒక వస్త్రం మాత్రమే. దీని వల్ల నా చదువుపై, తోటి విద్యార్థులతో సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపదు. నేను దీన్ని ధరించడం వల్ల నా క్లాస్‌మేట్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని అనెల్యా చెప్పారు.

కజకిస్తాన్‌లో ప్రధానంగా ముస్లింలే ఉంటారు. 2022 జనాభా లెక్కల ప్రకారం కజకిస్తాన్ జనాభాలో 69 శాతం మంది తమను తాము ముస్లింలుగా చెప్పుకుంటారు.

కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిమ్ జోమార్ట్ టొకాయెవ్ బహిరంగంగానే ఇస్లాం పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేస్తారు. 2022లో ఆయన మక్కా యాత్రకు వెళ్లారు. తన నివాసంలో అధికారులు, ప్రజప్రతినిధుల కోసం ‘‘రంజాన్ మీల్’’ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే, రాజ్యాంగబద్ధంగా కజకిస్థాన్ ఒక లౌకిక దేశం.

కరగండలో అనెల్యా వంటి పదుల సంఖ్యలో విద్యార్థులు ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నారు. కరగండ అనేది రష్యన్ మాట్లాడే ప్రజలు అధికంగా ఉండే పారిశ్రామిక నగరం.

రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్‌లోని విద్యా చట్టాలు సూచించిన ప్రకారం బాధ్యతల్ని నిర్వర్తించడంలో విఫలమయ్యారంటూ 47 మంది విద్యార్థినుల తల్లిదండ్రులు సివిల్ దావాలు ఎదుర్కొంటున్నారని అక్టోబర్‌లో వెల్లడైంది.

‘‘పాఠశాల యూనిఫామ్‌లో ఎలాంటి మతపరమైన దుస్తుల్ని చేర్చకూడదంటూ’’ 2016లో అక్కడి విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

హిజాబ్

కజకిస్తాన్ రాజ్యాంగం కన్నా ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలకే పాఠశాల అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని విద్యార్థుల తల్లిదండ్రులు, మానవ హక్కుల న్యాయవాదులు వాదిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల్లో పౌరులకు ఉచిత విద్యా హక్కును కజకిస్తాన్ రాజ్యాంగం అందిస్తుంది.

ప్రాసిక్యూటర్ కార్యాలయం, విద్యా మంత్రిత్వ శాఖ నుంచి అనెల్యా తండ్రి వివరణ కోరారు. కానీ, ఆయనకు సరైన స్పందన దక్కలేదు.

2018లో అక్టోబ్ ప్రాంతంలో "స్కూల్ యూనిఫాం నియమాలను పాటించకుండా హెడ్‌స్కార్ఫ్‌ను ధరించినందుకు" విద్యార్థిని తల్లిదండ్రులకు జరిమానా విధించారు. అయితే, అదే ఏడాది అక్మోలా ప్రాంతంలో ఇలాంటి సమస్య పరిష్కారానికే ఒక కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

"పాఠశాల అధికారుల ఒత్తిడితో బాలికలు తమ హెడ్‌స్కార్ఫ్‌లను తొలగించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది తొలగించడానికి ఇష్టపడరు. కాబట్టి తరగతులకు హాజరు కావడం మానేస్తారు. పాఠశాలల్లో మత విశ్వాసాలను పాటించే వారి సంఖ్యను తగ్గించేందుకు ఒక మార్గంగా హెడ్‌స్కార్ఫ్‌పై నిషేధం విధించారు’’ అని ఇలాంటి కేసుల్లో మతపరమైన కుటుంబాలకు సహాయం చేసే మానవ హక్కుల కార్యకర్త జాసులన్ అయిత్మాగంబెటోవ్ చెప్పారు.

కజకిస్తాన్ ప్రభుత్వం, పాఠశాలలో హెడ్‌స్కార్ఫ్‌ నిబంధనల గురించి ప్రస్తావించేటప్పుడు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన జాతీయ లౌకిక స్వభావాన్ని గురించి నొక్కి చెబుతుంది.

"పాఠశాల అనేది ప్రాథమికంగా పిల్లలు జ్ఞానాన్ని పొందేందుకు వచ్చే విద్యాసంస్థ అని మనం గుర్తుంచుకోవాలి. పిల్లలు పెద్దయ్యాక తమకు నచ్చిన ఎంపికలు చేసుకోవడం మంచిదని నేను నమ్ముతున్నా’’ అని అక్టోబర్‌లో అధ్యక్షుడు టోకయేవ్ పేర్కొన్నారు.

"అధికారులు, నిపుణుల మధ్య లౌకిక రాజ్యానికి ఒక స్పష్టమైన, కచ్చితమైన నిర్వచనం లేదు. మన సమాజంలో ఇంకా పరిపక్వత లేదు. ప్రతీ ఒక్కరూ లౌకికవాదం అంటే తమ సొంత నిర్వచనం ఇస్తున్నారు. కొందరు పౌరులు లౌకికవాదం అంటే నాస్తికత అని అనుకుంటున్నారు " అని ఆల్మటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్ అండ్ రిలిజియస్ స్టడీస్ స్కాలర్ అసిల్టే టాస్బోలాట్ అన్నారు.

హిజాబ్

కజకిస్తాన్ ప్రభుత్వానికి మతంపై నియంత్రణ అనేది జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. 2005 నుంచి అఫ్గానిస్తాన్-పాకిస్తాన్ రీజియన్‌లోని ఉత్తర కాకసస్ అలాగే సిరియా, ఇరాక్‌లలో ఇస్లామిస్ట్ ఉద్యమాల ప్రభావంతో దేశంలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని పరిశోధకులు గమనించారు.

2011లో కజకిస్తాన్‌లో తొలి ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. 2016లో ఆయుధాల దుకాణాలు, ఒక సైనిక స్థావరంపై జరిగిన సాయుధ దాడుల్లో 25 మంది మరణించారు. అప్పటి అధ్యక్షుడు నూర్‌సుల్తాన్ నజర్‌బయేవ్ దాడి చేసిన వారిని ఇస్లాం మత ఛాందసవాద సలాఫీ శాఖకు అనుచరులుగా ప్రకటించారు.

తర్వాతి సంవత్సరాల్లో ప్రభుత్వం చాలా నిబంధనల్ని అమలు చేసింది. మతపరమైన సంఘాలను ప్రభుత్వం వద్ద చట్టబద్ధంగా రిజిస్టర్ చేయించడంతో పాటు ప్రైవేట్ ఇళ్లలో మతపరమైన సేవలను నిర్వహించడంపై నిషేధం విధించారు.

హిజాబ్

అనెల్యా విషయానికొస్తే, హెడ్‌స్కార్ఫ్ ధరించవద్దంటూ పలుమార్లు హెచ్చరించిన తర్వాత, ఆమెను పాఠశాల నుంచి బహిష్కరించారు. తన కూతుర్ని పాఠశాల నుంచి బహిష్కరించడం చట్టవిరుద్ధమని ఆమె తండ్రి బోలాట్ ముసిన్ నమ్మారు. మత విశ్వాసాలను పాటించడాన్ని నిషేధిస్తున్న పాఠశాల అంతర్గత ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఆయన కేసు వేశారు. తన కూతుర్ని తిరిగి పాఠశాలలో చేర్చుకోవాలని, తమకు కలిగిన నైతిక నష్టాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

‘‘ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కావాలి. మతపరమైన వ్యక్తులుగా మేం ఏం చేయాలో మాకు సరైన మార్గదర్శకాలు ఇవ్వండి. ‘మా సమాజంలో జీవించాలనుకుంటే మీ మత విశ్వాసాలను వదిలేయండి’ అనే ఒక్క అవకాశమే ఇవ్వడం మా పట్ల అన్యాయంగా ప్రవర్తించడమే’’ అని ఆయన అన్నారు.

అనెల్యాను బహిష్కరించడం గురించి మాట్లాడటానికి కరగండలోని ఎన్‌ఐఎస్ పాఠశాల అధికారులు నిరాకరించారు.

ఎన్‌ఐఎస్‌ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత అనెల్యా తల్లిదండ్రులు ఒక రష్యన్ ట్యూటర్‌ను నియమించారు. పాఠశాలకు వెళ్లడానికి అనెల్యా హెడ్‌స్కార్ఫ్ తీసేయాలని అనుకుంటే ఆమెకు మద్దతుగా ఉంటామని ఆమె తండ్రి చెప్పారు.

‘‘నాకు తెలిసిన చాలా మంది, ‘హెడ్‌స్కార్ఫ్ తీసేయ్, అదేమంత పెద్ద విషయం కాదు. మళ్లీ పాఠశాలకు వెళ్లు. స్కూల్లో చదువుకోవడం ఎంత మంచిదో ఆలోచించు’ అని అన్నారు. కానీ, స్కార్ఫ్ అనేది నాలో ఒక భాగం’’త అని అనెల్యా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)