పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చి అరెస్టైన తమ పౌరుడిని విడుదల చేయాలని కోరిన బ్రిటన్

జగ్తార్ సింగ్ జోహాల్‌

ఫొటో సోర్స్, PA MEDIA

ఫొటో క్యాప్షన్, జగ్తార్ సింగ్ జోహాల్‌

ఆరేళ్లుగా భారత్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ స్కాట్లాండ్ వ్యక్తి కేసు విచారణ వేగవంతం చేయాలని బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రి డేవిడ్ కామెరూన్ భారత ప్రభుత్వాన్ని కోరారు.

ఉత్తర భారతదేశంలో జరిగిన రాజకీయ హింసతో సంబంధం ఉందన్న ఆరోపణలతో బ్రిటన్ పౌరుడైన 37 ఏళ్ల జగ్తార్ సింగ్ జోహాల్ ఇండియాలో ఆరేళ్లుగా జైలులో ఉన్నారు.

జగ్తార్ సింగ్ జోహాల్ సోదరుడు గురుప్రీత్ సింగ్ జోహాల్ డేవిడ్ కామెరూన్‌ను కలిసిన తరువాత ఆయన ఈ మేరకు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

యూకే ప్రభుత్వంపై సోదరుడి ఆరోపణలు

అయితే.. కామెరూన్ నుంచి మరింత ఎక్స్‌పెక్ట్ చేశానని గురుప్రీత్ అన్నారు.

‘యూకే ప్రభుత్వం కనుక నిజంగా అనుకుంటే రేపే నా సోదరుడిని భారత్‌ నుంచి రప్పించగలదు’ అన్నారాయన.

‘నా సోదరుడి జీవితం మీ చేతుల్లో ఉంది అని నేను డేవిడ్ కామెరూన్‌తో అన్నాను’ అని గురుప్రీత్ చెప్పారు.

కామెరూన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కామెరూన్

చిత్రహింసలు పెట్టామన్నది అవాస్తవం: భారత్

కాగా ఈ కేసు పరిష్కారం కోసం తాము కట్టుబడి ఉన్నట్లు యూకే ప్రభుత్వం చెప్పింది.

మరోవైపు జగ్తార్ జీవితం విదేశీ వ్యవహారాల మంత్రి చేతుల్లో ఉందని ఆయన కుటుంబీకులు అంటున్నారు.

స్కాట్లాండ్‌కు చెందిన జగ్తార్ సింగ్ జోహాల్ తన పెళ్లయిన కొన్ని వారాలకే 2017 నవంబరులో భారత్‌లో అరెస్టయ్యారు.

భారత్‌లో ఆయన్ను అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు ఆయనకు కరెంట్ షాక్ ఇచ్చారని, పెట్రోల్ పోసి తగలబెట్టేస్తామని బెదిరించారని స్కాట్లాండ్‌కు చెందిన కొందరు ఎంపీలు ఆరోపించారు.

చిత్రహింసలు ఆపడానికి జగ్తార్ ఖాళీ పత్రాలపై సంతకాలు చేశారని, వీడియో స్టేట్‌మెంట్స్‌ను ఇచ్చారని వారు ఆరోపించారు.

అయితే, భారత్‌ ఈ ఆరోపణలను ఖండించింది.

జగ్తార్ సింగ్ జోహాల్ సోదరుడు గురుప్రీత్ సింగ్ జోహాల్

ఫొటో సోర్స్, GUPREET SINGH JOHAL

ఫొటో క్యాప్షన్, సోదరుడు గురుప్రీత్ సింగ్ జోహాల్‌‌తో జగ్తార్ సింగ్ జోహాల్

పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చి పోలీసులకు దొరికారు

2017 అక్టోబర్‌లో తన పెళ్లి కోసం జోహాల్ స్కాట్లాండ్ నుంచి భారత్‌కు వచ్చారు. పెళ్లి వీడియోల్లో జోహాల్ ఉత్సాహంగా బాంగ్రా డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటూ కనిపించారు.

పదిహేను రోజుల తర్వాత, తన భార్యతో షాపింగ్ చేస్తున్న సమయంలో జోహాల్‌ను పంజాబ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన వారి అదుపులోనే ఉన్నారు.

భారత్‌లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనల గురించి రాసినందుకు జోహాల్‌ను అరెస్ట్ చేశారని స్కాట్లాండ్‌లో నివసించే ఆయన సోదరుడు గుర్‌ప్రీత్ గతంలో చెప్పారు.

జగ్తార్‌పై ప్రస్తుతం రాజకీయ హింస, హత్య కుట్ర వంటి 8 అభియోగాలున్నాయి. కొందరు హిందూ నాయకుల హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలతో ‘ఉగ్రవాద వ్యతిరేక చట్టాల’ కింద ఆయన అరెస్టయ్యారు.

ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్‌తో ఆయనకు సంబంధాలున్నట్లు చార్జిషీట్లలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)