స్లీప్ డివోర్స్: జంటలే కానీ ఒంటరిగా పడుకుంటారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫెర్నాండా పౌల్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీసు
చాలా మంది జంటలు తమలో ఒకరు గట్టిగా గురకపెట్టినప్పుడు వేరే గదిలో పడుకోవాలని అనుకుంటున్నారు.
కోవిడ్-19 మహమ్మారి తర్వాత చాలా జంటలు ఇలా వేరుగా పడుకునే అలవాటు మొదలైంది.
గురక అనేది భరించలేనిదిగా అనిపించింది.. సెసిలియా(పేరు మార్చాం) అసలు నిద్రపోలేకపోయారు.
తన భాగస్వామిని పక్కకు తిప్పేందుకు ఆయనను గట్టిగా నెట్టారు. దీంతో, ఆయన గురకతీయడం ఆపుతారని ఆమె భావించారు.
కానీ, ఆమె చేసిన ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు.
35 ఏళ్ల ఈ మహిళ ఇక దీన్ని భరించేందుకు సిద్ధంగా లేరు. అందుకే, ఆమె ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకే గదిలో కలిసి పడుకోకూడదని అనుకున్నారు.
‘‘నా పనిపై దృష్టిసారించలేకపోతున్నాను. రోజంతా నాకు అలసటగా అనిపిస్తుంది. రెండు మూడు రాత్రులు ఓర్చుకోవడమైతే ఫర్వాలేదు. కానీ, దీర్ఘకాలికంగా అయితే, మీరు భరించలేరు’’ అని బీబీసీతో చెప్పారు సెసిలియా.
‘‘ఇది అంత తేలికైన నిర్ణయం కాదు. ఇది మా హృదయాలను గాయపరిచింది. కానీ, ఎప్పుడైతే మేం నిద్రపోగలుగుతున్నామని అనిపించిందో, అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది’’ అని చెప్పారు.
సెసిలియా, 43 ఏళ్ల ఆమె భాగస్వామి ఇద్దరూ ‘‘స్లీప్ డివోర్స్’’ అనే విధానాన్ని అనుసరిస్తున్నారు.
‘‘స్లీప్ డివోర్స్ అనేది మొదట మామూలుగా పాటించారు. కానీ, ఒంటరిగా పడుకున్నప్పుడు బాగా నిద్రపోతున్నామని ఆ జంటలు భావిస్తున్నాయి’’ అని అమెరికాలోని మెక్లీన్ ఆస్పత్రిలోని మానసిక వైద్య నిపుణులు స్టెఫనీ కాలియర్ తెలిపారు.
ఈ ట్రెండ్ కచ్చితంగా బాగా పాపులర్ అవుతుందని ఆమె అన్నారు. మిలీనియల్స్‌లో ఈ ట్రెండ్ బాగా పెరుగుతోంది.
ఫ్యాషన్, బ్యూటీ పాడ్‌కాస్ట్ ‘లిప్‌స్టిక్ ఆన్ ది రిమ్’లో మాట్లాడిన ప్రముఖ అమెరిక నటి కామెరూన్ డియాజ్ తను, తన భర్త ఒకే గదిలో నిద్రపోమని చెప్పారు.
వేరువేరు పడకగదులు ఉండటాన్ని సాధారణంగా తీసుకోవాలని తాను అనుకుంటున్నానని అన్నారు.
కామెరూన్ డియాజ్ వెల్లడించిన ఈ విషయంపై సోషల్ మీడియాలో వేల కొద్ది స్పందనలు వచ్చాయి. దీని తర్వాత మీడియాలో పలు కథనాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
మంచి నిద్ర కోసం అప్పుడప్పుడు కానీ నిత్యం కానీ భాగస్వామితో కాకుండా వేరే గదిలో పడుకుంటున్నట్లు అమెరికాలో నిర్వహించిన ఓ అధ్యయనం తేల్చింది. 2023లో అమెరికా అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్(ఏఏఎస్ఎం) చేపట్టిన ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో మూడోవంతు మంది చెప్పారు.
ఈ ట్రెండ్ ప్రస్తుతం మిలీనియల్స్‌లో కనిపిస్తుందని ఈ అధ్యయనం వెల్లడించింది.
సర్వేలో పాల్గొన్న సుమారు సగం శాతం మంది అంటే 43 శాతం మిలీనియల్ రెస్పాండెంట్లు తమ భాగస్వామితో కాకుండా వేరుగా పడుకుంటున్నారు.
ఇతర వయసుల వారు, అంటే 1965 నుంచి 1980 మధ్యలో పుట్టిన జనరేషన్ ఎక్స్ వారు 33 శాతం, 1997 నుంచి 2012 మధ్య పుట్టిన జనరేషన్ జెడ్ గ్రూప్ వారు 28 శాతం, చివరిగా 1946 నుంచి 1964 మధ్యలో పుట్టిన వారు 22 శాతం వేరువేరు గదుల్లో పడుకునేందుకు మొగ్గుచూపుతున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది.
‘‘ఎందుకు యువతరం ఇలా చేస్తుందో కచ్చితమైన కారణం తెలియనప్పటికీ, దానికి కూడా కారణాలు ఉండొచ్చన్నారు. ఇది సాంస్కృతిక మార్పుగా మారింది. ‘ఒకవేళ నేను మంచిగా నిద్రపోతే, నాకు బాగా అనిపిస్తుంది. దీనికోసం ఎందుకు వేరుగా నిద్రపోకూడదు?’’ అని ప్రశ్నిస్తున్నారని స్టెఫానీ కాలియర్ అన్నారు.
ప్రాచీన కాలంలో, జంటలు వేరువేరు గదుల్లో నిద్రపోవడం సాధారణమేనని చరిత్రకారులు చెప్పారు.
చరిత్ర చూస్తే.. ఈ విధానం క్రమంగా మారుతూ వచ్చింది.
‘‘మాట్రిమోనియల్ బెడ్(డబుల్ బెడ్)’’ అధునాతన విధానం అని కొందరు చరిత్రకారులు తెలిపారు. ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో నివసించడానికి ప్రజలు వెళ్లినప్పుడు పారిశ్రామిక విప్లవం తరువాత దీని వాడకం పెరిగినట్లు చెప్పారు.
19వ శతాబ్దానికి ముందు, పెళ్లయిన జంటలు వేరువేరు గదుల్లో పడుకోవడం సాధారణంగా ఉండేదని తెలిపారు.
సామాజిక ఆర్థిక స్థాయిలు అత్యధికంగా ఉన్నప్పుడు ఇది చాలా సాధారణంగా ఉండేదని చిలీలోని కాథలిక్ యూనివర్సిటీకి చెందిన మెడికల్ స్కూల్ సామ్నాలజిస్ట్(నిద్ర సమస్యలపై చికిత్స అందించే నిపుణులు) పాబ్లో బ్రాక్‌మాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
దీని వల్ల ప్రయోజనాలేంటి?
వేరు గదుల్లో నిద్రపోవాలని భావిస్తున్న జంటలకు కొన్ని ప్రయోజనాలు ఉంటున్నాయని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు.
గాఢంగా నిద్రపోవడాన్ని అలవరుచుకోవడమే ప్రధాన ప్రయోజనమని చెప్పారు. ఒక మనిషి మెరుగైన జీవనానికి మంచి నిద్ర చాలా అవసరమని డాక్టర్ కాలియర్ చెప్పారు.
‘‘ఒకవేళ ఒక వ్యక్తి సరిగ్గా నిద్రపోకపోతే, వారి రోగనిరోధక శక్తి నుంచి శరీర అవయవాల పనితీరు వరకు ప్రతిదానిపై ప్రభావం చూపుతుంది. అంతేకాక, త్వరగా కోపం వస్తుంది. సహనం ఉండదు. కొంత డిప్రెషన్‌కు లోనవుతారు’’ అని ఆమె వివరించారు.
‘‘స్లీప్ డివోర్స్’’ అనేది భాగస్వామితో మెరుగైన, ఆరోగ్యకరమైన రీతిలో సంబంధాలను కొనసాగించేందుకు ఉపయోగపడుతుండొచ్చని మానసిక వైద్య నిపుణులు భావిస్తున్నారు.
‘‘సరిగ్గా నిద్రపోని జంటలను మనం చూస్తే వారు ఎక్కువగా వాదించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా చిరాకు పడుతుంటారు. కొన్నిసార్లు సహనం కోల్పోతుంటారు’’ చెప్పారు.
ఒంటరిగా నిద్రపోయినప్పుడు కొంతమందికి బాగా నిద్రపడుతుంది.
ఈ విషయాన్ని ఏఏఎస్ఎం అధికార ప్రతినిధి, పల్మనాలజిస్ట్ సీమా ఖోస్లా కూడా అంగీకరించారు.
‘‘సరైన నిద్ర లేకపోవడంతో మీ మూడ్‌ను దెబ్బతీస్తుంది. సరిగ్గా నిద్రపోని వారు వారి భాగస్వామితో ఎక్కువగా వాదించే అవకాశాలున్నాయి. నిద్రలో అంతరాయాలు వారి సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపేందుకు కూడా కారణం కావొచ్చు’’ అని తెలిపారు.
‘‘స్లీప్ డివోర్స్’’పై ఏఏఎస్ఎం కూడా తన అధ్యయనాన్ని ప్రారంభించింది.
‘‘ఆరోగ్యానికి, సంతోషానికి మంచి నిద్ర చాలా అవసరం. తమ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవనం కోసం వేరుగా నిద్రపోవడాన్ని కొందరు జంటలు ఎంపిక చేసుకోవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు’’ అని వివరించారు.
తన భాగస్వామితో కలిసి వేరు గదిలో నిద్రపోవడంతో తన జీవితం మెరుగైన విధంగా మారినట్లు సెసిలియా చెప్పారు.
‘‘ఇది చాలా సౌకర్యవంతంగా అనిపిస్తుంది. మంచి నిద్రపోగలుగుతున్నానన్నది నిజం. బెడ్‌పై ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఇతరులకు ఇబ్బంది అనిపిస్తుందేమో అనే భయం లేకుండా నేను బెడ్‌పై అటుఇటూ తిరగలుగుతున్నాను’’ అని ఆమె తెలిపారు.
‘‘మీ భాగస్వామి లేచిన సమయానికి నువ్వు లేవాల్సిన పని లేదు. నీకు కావాల్సినప్పుడు లేదా నచ్చినప్పుడు లేవొచ్చు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
వేరే గదిలో నిద్రపోవడం వల్ల కలిగే ఇబ్బందులేంటి?
వేర్వేరు గదుల్లో పడుకోవాలంటే అదనంగా బెడ్, అదనంగా గది కావాల్సి ఉండటం ఎక్కువ మంది ఎదుర్కొనే ప్రధాన సమస్య. చాలా మంది జంటలకు ఇలాంటి అవకాశం ఉండకపోవచ్చు.
ఒకవేళ అలా సాధ్యమైనా, ఈ నిర్ణయం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు పడతాయి.
కొన్ని జంటల్లో ఇది సాన్నిహిత్యం పోయేలా చేసే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
‘‘సంబంధం, ఆత్మీయత కాస్త దెబ్బతినొచ్చు. కానీ, అంత తీవ్రమైనదిగా కాదు. ప్రయోజనాలే అత్యధికంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను’’ అని సెసిలియా చెప్పారు.
ఫుల్ టైమ్ ఉద్యోగం చేసే వ్యక్తులకు భాగస్వామితో కలిసి నిద్రపోయేటప్పుడు ఉండే క్షణాలు చాలా అమూల్యమైనవి అని డాక్టర్ కాలియర్ తెలిపారు.
‘‘డ్రీమ్ బాండ్’’ను కొన్ని జంటలు క్రియేట్ చేసుకుంటున్నారు.
‘‘స్లీప్ డివోర్స్’’ జంటలందరికీ పనికి వచ్చేది కాదని డాక్టర్ బ్రాక్‌మాన్ అన్నారు.
జంటలు కలిసి పడుకున్నప్పుడు కొన్ని బయోలాజికల్ ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా కలిసి నిద్రపోయే వారు, వారు ఒకే దగ్గర పడుకున్నప్పుడు మాత్రమే నిద్రలోని దశలను పూర్తిగా అనుభవించగలుగుతారని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయని సామ్నాలజిస్ట్‌లు చెప్పారు. దీని వల్ల మీ నిద్రా క్వాలిటీ పెరుగుతుందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఒకవేళ ‘‘స్లీప్ డివోర్స్’’ను ప్రయత్నించాలని జంటలు నిర్ణయించినప్పుడు, కొన్ని సూచనలు పాటించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.
‘‘కొందరికి ఒంటరిగా పడుకోవాలనిపించదు. ఇద్దరికీ ఈ విషయంపై ఒకే రకమైన ఒప్పందం కుదరాలి. ఈ నిర్ణయాన్ని ఇద్దరు కలిసి తీసుకోవాలి’’ అని డాక్టర్ కాలియర్ తెలిపారు.
ఈ విషయాన్ని డాక్టర్ బ్రాక్‌మాన్ కూడా అంగీకరించారు.
‘‘గురకతీయడం, నిద్రలో నడవడం, కాళ్లు వేయడం వంటి సమస్యలున్న వ్యక్తికి ఇది కష్టంగా అనిపించవచ్చు. ఎందుకంటే, కొందరికి వేరువేరు బెడ్లపై నిద్రపోవడం ఇష్టం ఉండదు. సాధారణంగా, పురుషులు ఇలా నిద్రపోయేందుకు అంత ఆసక్తి చూపించరు’’ అని చెప్పారు.
కొన్ని దేశాల్లో ఈ ట్రెండ్ పెరుగుతున్న నేపథ్యంలో అధ్యయనాలు ఏం సూచిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా ఆ కుటుంబాలదే హవా, ఎవరు వారు, ఏయే సీట్లు...
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- గ్రేట్ వాల్ ఆఫ్ చైనా: 5 అపోహలు, అసలు నిజాలు
- రిటైర్మెంట్ ప్లానింగ్: గ్యారంటీ వడ్డీ స్కీములు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది మంచిది?
- బెల్లం తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














