ముక్కు యుద్ధం: ‘శత్రు రాజ్యంలోని ప్రజల ముక్కులు కోసి మూటకట్టి మైసూర్ మహారాజుకు పంపించారు’

ముక్కు యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మయా కృష్ణన్
    • హోదా, బీబీసీ తమిళ్ కోసం

చరిత్రలో యుద్ధాల చుట్టూ అనేక కథలు ఉన్నాయి. కొన్ని రక్తపాతాన్ని వర్ణించే కథలైతే మరికొన్ని విచిత్ర ఘటనలను వివరించే కథలు.

అలాంటి ఒక విచిత్ర యుద్ధాన్ని మీకు పరిచయం చేసే కథనం ఇది.

నాయకర్‌లకు, మైసూరు సైన్యానికి మధ్య జరిగిన ఈ యుద్ధాన్ని ఇప్పుడు ఇంగ్లిష్‌లో 'నోస్-కట్'(ముక్కు కోత) అని పిలుస్తున్నారు. తమిళంలో దీన్ని 'మూక్కరు పట్టాన్' అని పిలుస్తున్నారు.

దీని వెనక ఒక క్రూరమైన చరిత్ర ఉంది.

ఈ ముక్కు యుద్ధం మదురై నాయకర్ దళాలకు, మైసూర్ సేనలకు మధ్య జరిగింది.

కోట

మైసూరు సేనలను తరిమికొట్టిన నాయకర్ సైన్యం

మదురైని పాలించిన నాయకర్ రాజులలో తిరుమలై నాయకర్ సుప్రసిద్ధుడు. ఈయన 1623 నుంచి 1659 వరకు పరిపాలన సాగించారు.

తిరుమలై నాయకర్‌కు మైసూరు రాజు చామరాజ వడియార్ మధ్య శత్రుత్వం కారణంగా 1625లో యుద్ధం జరిగింది. మైసూరు సేనలు దిండిగల్ చేరుకున్నాయి.

''అప్పుడు సేనాని రామబయ్యన్, కన్నివాడి పాలయకర్ రంగన్న నాయకర్‌ను వెంటబెట్టుకుని తిరుమలై నాయకర్ మైసూరు సేనలను శ్రీరంగపట్నం వరకూ వెంబడించి, ఓడించారు'' అని విల్లుపురానికి చెందిన స్కాలర్ రమేష్ చెప్పారు. ఆయన అన్నా ఆర్ట్స్ కాలేజీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

ప్రొఫెసర్ రమేశ్
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ రమేశ్

ఆ తర్వాత విజయనగర రాజు శ్రీరంగన్ -3 పాలనలో మదురై, తంజావూరు, సెంజిని ప్రాంతాలను పాలించిన నాయకర్‌ల సంయుక్త దళాలకు.. విజయనగర రాజు, మైసూరు రాజుల సంయుక్త దళాలకు మధ్య యుద్ధం జరిగింది.

ఈ యుద్ధంలో బీజపూర్ సుల్తాన్ సాయంతో నాయకర్ సైన్యం విజయనగర రాజ్యాన్ని ఓడించి స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంది. దీంతో మైసూరు రాజ్యానికి ఎదురుదెబ్బ తగిలిందని ప్రొఫెసర్ రమేష్ చెబుతున్నారు.

మొదటి ముక్కు యుద్ధం

కోసేసిన ముక్కులను సంచుల్లో పెట్టి రాజుకి పంపిన క్రూరమైన ఘటన మొదటి ముక్కు యుద్ధంలో జరిగింది.

మైసూరు రాజు నరసరాజన్ కంఠీరవ తన రెండు పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవడానికి, అలాగే విజయనగర రాజ్య పునఃస్థాపనకు 1656లో మదురై నాయకర్ రాజ్యంపై దండెత్తాడు.

''మైసూరు సేనాని కుంబయ్య నాయకత్వంలో కన్నడ సేనలు తిరుమలై నాయకర్ ఏలుబడిలో ఉన్న సత్యమంగళం ప్రాంతంలోకి ప్రవేశించి పురుషులు, మహిళలు, పిల్లలూ అందరిపై దాడి చేశాయి.

బాధితుల ముక్కులను, పైపెదవులతో సహా కోసేసి, వాటిని గోనె సంచుల్లో కట్టి మైసూరు రాజుకి పంపించారు.

అలా అనేక పట్టణాలపై దాడులు చేసిన మైసూరు సైన్యం దిండిగల్ తర్వాత మదురై వైపు దూసుకెళ్లింది'' అని రమేష్ తెలిపారు.

చరిత్ర

రఘునాథ సేతుపతి సాయం

మైసూరు సేనల ఆకస్మిక దాడితో కుంగిపోయిన తిరుమలై నాయకర్ అజ్ఞాతంలోకి వెళ్లి, ప్రజలను రక్షించేందుకు ఉన్న మార్గాల గురించి మంత్రులతో చర్చలు జరిపారు.

అదే సమయంలో అనారోగ్యం కారణంగా తిరుమలై నాయకర్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

మదురై ప్రజల ముక్కులు కోసే అవకాశం శత్రువులకు ఇవ్వకూడదని అనుకున్న నాయకర్ తన భార్య ద్వారా రామనాథపురానికి చెందిన రఘునాథ సేతుపతిని సాయం కోరారు.

హిస్టరీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

తరిమికొట్టిన మదురై సేనలు

"సేతుపతి రఘునాథ దేవర్ వెంటనే 25,000 మంది సైనికులను సమీకరించి మదురైకి బయలుదేరారు. ఆయనకు తిరుమలై నాయకర్ కుమారుడు కుమార ముత్తు జతచేరారు. ఈ సైనికులు మదురైకి, మైసూరు దళాలకు మధ్య రక్షణ గోడలా నిలిచారు.

సేతుపతి రఘునాథ దేవర్, నాలుకోట్టై జిల్లా అధిపతి మధియాళగె దేవర్, పడమత్తూరు జిల్లా అధిపతి పొయ్యారళగత్ దేవర్ వండియూర్‌లో విడిది చేశారు.

సేతుపతి సైన్యంలోని 25,000 మంది సైనికులు, మదురై నాయకర్ సైన్యంలోని 35,000 మంది సైనికులు కలిపి 60,000 మంది సైనికులు కన్నడ సైన్యం ముట్టడిని ఛేదించి, వారిని దిండిగల్ వైపు తరిమికొట్టారని హిస్టరీ ప్రొఫెసర్ రమేష్ చెప్పారు.

"మైసూర్ సైన్యం దిండిగల్ కోటలో తలదాచుకుంది. కొద్దిరోజుల వ్యవధిలోనే మరో 20,000 మంది సైన్యం మైసూర్ నుంచి వచ్చింది. సేతుపతి సైన్యం, సేనాని హంపయ్య నేతృత్వంలోని మైసూర్ సైన్యం తలపడ్డాయి."

చరిత్ర

కరువట్టు యుద్ధం

"ఈ భీకర దాడిలో రెండువైపులా కలిపి 12,000 మంది సైనికులు చనిపోయారు. వారి మృతదేహాలు రోజుల తరబడి అక్కడే పడివున్నాయి. కుళ్లిపోయాయి, ఎండిపోయాయి''

దిండిగల్‌లోని ఈ ప్రాంతాన్ని ఇప్పటికీ 'కరువట్టుప్పోట్టల్' అని పిలుస్తారు. సేతుపతి బలగాల దాడితో మైసూరు దళాలు చెల్లాచెదురయ్యాయి.

సేతుపతి సైనికులు వారిని మైసూరు వరకూ వెంబడించారు. అలాగే, నాయకర్ రాజ్యంలో ప్రజల ముక్కులు కోసేసిన సైనికుల ముక్కులను కోసేశారు.

చరిత్ర

'నోస్ వార్' విజయ స్మారక మండపం

విజయం సాధించి తిరిగి వచ్చిన సేతుపతికి మదురైలో రాజు తిరుమలై నాయకర్ ఘనస్వాగతం పలికారు. సేతుపతి మహరాజు విజయానికి గుర్తుగా మదురైలోని తాళ్లకులం వద్ద ఓ రాతి మండపం నిర్మించారు.

సేతుపతి గౌరవార్థం నిర్మించిన ఈ మండపానికి 'ముక్కరు పోర్ మండపం' అని పేరుపెట్టారు. ఆ హాలు ఇప్పటికీ మదురైలో ఉంది.

చరిత్రలోని అత్యంత క్రూరమైన యుద్ధ రూపాలలో ఈ ముక్కు యుద్ధం ఒకటి. ఈ యుద్ధ పద్ధతి శత్రువుల ముక్కులు, మీసాలు కత్తిరించి శాశ్వతంగా గుర్తుండిపోయేలా వారి ముఖాలను వికృతంగా మార్చడం. తిరుమలై నాయకర్‌పై మైసూరు రాజు నరసరాజ కంఠీరవకు ఉన్న తీవ్ర శత్రుత్వం కారణంగా ఈ యుద్ధం జరిగింది.

సాధారణంగా యుద్ధంలో శత్రు సైనికులను చంపేస్తుంటారు. కానీ మైసూర్ రాజు.. ''శత్రు దేశంలో ఎవరైనా ఎదురైతే వారి ముక్కు, పెదవిని కత్తిరించండి. మీకు బహుమతి ఇస్తాను'' అని తన సైన్యానికి చెప్పి పంపించారు అని ప్రొఫెసర్ రమేష్ వివరించారు.

''సైనికులు తెచ్చిన ముక్కులకు, వాటిలో పైపెదవితో పాటు మీసాలు ఉంటే ఇంకా పెద్ద బహుమతి ఇస్తాను'' అని ఆయన ప్రకటించిన తర్వాత మైసూరు సేనలు తిరుమలై నాయకర్ రాజ్యంలోని ప్రాంతాలపై పడి అక్కడి ప్రత్యర్థుల ముక్కులను కత్తిరించాయి.

''ఆ ముక్కులను మైసూరు రాజుకు అందజేసి తగిన బహుమతులు పొందారు. అందుకు ప్రతీకారంగా తిరుమలై నాయకర్ సేనలు సేతుపతి సైన్యంతో కలిసి మైసూరులోకి ప్రవేశించి శత్రువుల ముక్కులు కోసి మదురైకి పంపాయి’’ అని నోస్ వార్ జరిగిన తీరును ఆయన వివరించారు.

చరిత్ర
ఫొటో క్యాప్షన్, శాసనం

బేలూరు శాసనంలో..

సేలం జిల్లాలోని బేలూరులో దొరికిన ముక్కు యుద్ధ శాసనం గురించి సేలంకు చెందిన చరిత్రకారుడు, పాఠశాల ఉపాధ్యాయుడు కళైసెల్వన్ బీబీసీ తమిళ్‌‌కి వివరించారు.

సేలం జిల్లా బేలూరులోని అంగళమ్మన్ దేవాలయం సమీపంలోని ప్రైవేటు వ్యవసాయ భూమిలో కొన్నేళ్ల కిందట ఒక రాతిశాసనం బయటపడింది. దీని ఎత్తు 6 అడుగులు, వెడల్పు 2 అడుగులు. శాసనానికి నలువైపులా స్పష్టమైన రాతలు ఉన్నాయి.

దానిపై "ముక్కుతో పాటు మీసాలు" అని స్పష్టంగా రాసి ఉంది.

"శాసనంలో ముందు వైపు 29 లైన్లు, రెండో వైపు 29 లైన్లు, మూడో వైపు 41 లైన్లు, నాలుగో వైపు 32 లైన్లలో రాసి ఉన్నాయి. ముక్కు యుద్ధం గురించి సమాచారం తెలియజేస్తున్న మొదటి శాసనం ఇది" అని కళైసెల్వన్ చెప్పారు.

కళైసెల్వన్
ఫొటో క్యాప్షన్, కళైసెల్వన్

అందులో మైసూర్ రాజు కంఠీరవ, మదురై రాజు తిరుమలై నాయకర్ మధ్య జరిగిన హోరాహోరీ యుద్ధం గురించి స్పష్టమైన సమాచారం ఉంది.

తిరుమలై నాయకర్ నిరంతర దాడులతో ఆగ్రహించిన మైసూరు రాజు కంఠీరవ, నాయకర్ రాజ్యంలోని సత్యమంగళం ప్రాంతంలోని ప్రజలు, వారి సైనికుల పెదవులను కోసేసినట్లు ఈ శాసనంలో స్పష్టంగా ఉంది.

సేతుపతి సాయంతో నాయకర్ బలగాలు మైసూర్ దళాలను తరిమికొట్టడంతో పాటు వారి ముక్కులు కోసి ప్రతీకారం తీర్చుకున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు.

"ఈ యుద్ధం 1656లో జరిగిందని పరిశోధనలో వెల్లడైంది. ఆ సమయంలో బేలూరు ప్రాంతాన్ని పాలయకర్‌లు పాలించేవారు. అందువల్ల ముక్కు యుద్ధం గురించిన శాసనం ఈ ప్రాంతంలో వేసి ఉండవచ్చు. నాయకర్‌ల పాలన సేలం జిల్లా వరకూ విస్తరించింది'' అని శాసనం గురించి కళైసెల్వన్ వివరించారు.

వీడియో క్యాప్షన్, ‘శత్రు రాజ్యంలోని ప్రజల ముక్కులు కోసి మూటకట్టి మైసూర్ మహారాజుకు పంపించారు’

ఇవి కూడా చదవండి: