హిందూ మహాసభకు, ముస్లిం లీగ్‌కు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన ఈ డాక్టర్ కథేంటి?

హిందూ మహాసభ

ఫొటో సోర్స్, MUNEEB AHMAD KHAN

ఫొటో క్యాప్షన్, హకీమ్ అజ్మల్ ఖాన్
    • రచయిత, వివేక్ శుక్లా , సీనియర్ పాత్రికేయులు
    • హోదా, బీబీసీ కోసం

దేశ రాజధాని దిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి పంచకుయా రోడ్ వైపు వెళుతున్నప్పుడు ఆర్కే ఆశ్రమ్ మెట్రో స్టేషన్‌కు కొద్ది దూరంలో శిథిలమైన ఒక తెల్లటి గేటు కనిపిస్తుంది. దాని బయట కాస్త హడావుడి కనిపిస్తుంది.

గేటు దాటి బస్తీ హసన్ రసూల్‌లోకి ప్రవేశించాలి. అక్కడ చిన్న చిన్న ఇళ్ళ ముందు సమాధులు కనిపిస్తాయి. ఇది శ్మశానమా లేక రెసిడెన్షియల్ ఏరియానా అన్నది కాసేపు అర్ధం కాదు.

అక్కడ అనేకమంది సమాధుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటారు. బయట అప్పడప్పుడు డప్పు వాయిద్యాలు వస్తుంటాయి. అలాగే అక్కడున్న ఇళ్ల నుంచి సంగీతం నేర్చుకుంటున్నట్లు రాగాలాపనలు వినిపిస్తూ ఉంటాయి.

ఒక పెద్దాయన్ను హకీమ్ అజ్మల్ ఖాన్ సమాధి ఎక్కడుందని అడిగాం. ఆయన చూపించారు.

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ముస్లిం లీగ్‌కు, హిందూ మహాసభలకు అధ్యక్షుడిగా పని చేసిన ఆ వ్యక్తి సమాధి చాలా నిరాడంబరంగా ఉంది. ఆయన పేరు మోసిన యునానీ వైద్యుడు కూడా. రోజూ వందలమంది ఆయన దగ్గర చికిత్సకు వస్తుండేవారు.

కొంతమంది ఆయన్ను 'మసీహ్-ఎ-హింద్' అని కూడా పిలిచేవారు. హకీమ్ అజ్మల్ ఖాన్ సమాధి ముందు ఒక మధ్య వయస్కురాలు కూర్చుని ఉంది. ఆమె పేరు ఫౌజియా.

"మేము హకీమ్ సాహిబ్ సమాధి బాగోగులను చూస్తుంటాం. ఇక్కడ కూర్చుని మేం ఖురాన్ ఖానీ, ఫతియా చదువుకుంటాం’’ అని ఆమె అన్నారు.

హకీమ్ సమాధిపై కొన్ని ఎండిన గులాబీ పువ్వులు పడి ఉన్నాయి. ‘‘హకీమ్‌ను స్మరించుకోవడానికి ఆయన కుటుంబ సభ్యులుగానీ, ప్రముఖులుగానీ ఎవరూ రారు’’ అని ఫౌజియా చెప్పారు.

అయితే, ఈ మాటలను హకీమ్ ముని మనవడు, సుప్రీంకోర్టు న్యాయవాది కూడా అయిన మునీబ్ అహ్మద్ ఖాన్ తోసిపుచ్చారు.

‘‘ఫిబ్రవరి 11న హకీమ్ జీ జయంతి ఉంటుంది. ఈ రోజున నేను, నా సోదరుడు, కుటుంబ సభ్యులు సమాధిని సందర్శిస్తాం. ఈ కాంపాండ్ మొత్తం మా కుటుంబానికి చెందినదే. మా కుటుంబంలోని అనేకమందిని ఇక్కడే ఖననం చేశాం. కానీ దీనిని కొందరు ఆక్రమించారు.’’ అని అహ్మద్ ఖాన్ అన్నారు.

ఈ ప్రాంతాన్ని ఆక్రమించింది కేర్‌ టేకర్‌గా చెప్పుకుంటున్న ఆ మహిళేనని ఆయన పరోక్షంగా సూచించారు.

గాంధీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

హకీమ్‌ను కలుసుకున్న గాంధీజీ

మునీబ్ అహ్మద్ ఖాన్ ప్రస్తుతం దిల్లీ-6 లోని లాల్ కువా‌లో ఉన్న షరీఫ్ మంజిల్ అనే భవనంలో ఉంటున్నారు. అది ఒకప్పుడు హకీమ్ అజ్మల్ ఖాన్ నివాసం.

ఈ ఇంట్లోనే మహాత్మా గాంధీ, కస్తుర్బా గాంధీలు ఏప్రిల్ 13, 1915లో హకీమ్ అజ్మల్ ఖాన్‌ను కలుసుకున్నారు.

ఏప్రిల్ 12, 1915న గాంధీ మొదటిసారి దిల్లీ వచ్చినప్పుడు కశ్మీరీ గేట్ వద్ద ఉన్న సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బస చేశారు.

ఏప్రిల్ 14న ఎర్రకోట, కుతుబ్ మినార్‌లను గాంధీ, కస్తూర్బాలకు చూపించడానికి హకీమ్ అజ్మల్ ఖాన్ తీసుకెళ్లారు. వాళ్లు అప్పుడు గుర్రపు బండి మీద వెళ్లి ఉంటారని కొందరు చరిత్రకారులు చెప్పారు. హకీమ్ ఇక్కడ గాంధీకి వైష్ణవ సంప్రదాయ భోజనం ఏర్పాటు చేసినట్లు చెబుతారు.

దిల్లీకి చెందిన చరిత్ర కారుడు ఆర్వీ స్మిత్ ఈ సంఘటనను వివరించారు. ‘‘దీనబంధు సీఎఫ్ ఆండ్రూస్ సూచన మేరకు దిల్లీలో గాంధీజీ తనకంటే ఆరేళ్లు పెద్దవాడైన హకీమ్ అజ్మల్ ఖాన్‌ను కలిశారు. ఆయన సూచన మేరకే దిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బస చేశారు. అదే కాలేజీలో సీఎఫ్ ఆండ్రూస్ విద్యాబోధన చేశారు. ఆండ్రూస్‌కు దిల్లీ బ్రదర్ హుడ్ సొసైటీతో అనుబంధం ఉండేది’’ అని స్మిత్ పేర్కొన్నారు.

హిందూ మహాసభ

ఫొటో సోర్స్, MUNEEB AHMAD KHAN

ముఖం చూసి రోగం తెలుసుకునే నిపుణుడు

హమ్‌దర్ద్ హాస్పిటల్, జామియా హమ్‌‌దర్ధ్ యూనివర్సిటీలను స్థాపించిన హకీమ్ అబ్దుల్ హమీద్, 1995లో కౌటిల్య మార్గ్‌లో తన నివాసంలో ఈ కథనం రాసిన రచయితతో మాట్లాడారు. స్త్రీల రుతుక్రమం, మూర్ఛ వ్యాధికి చికిత్సకు హకీమ్ అజ్మల్ ఖాన్ దగ్గర ప్రభావవంతంగా పని చేసే మందులు ఉండేవని ఆయన చెప్పారు.

ఆయన దగ్గర మందులు వాడిన తర్వాతే రాంపూర్ నవాబు బేగం మరణశయ్య నుండి బయటకు రాగలిగారని వెల్లడించారు. తొమ్మిదేళ్లపాటు ఆయన రాంపూర్ నవాబు దగ్గరే ఉన్నారు. చివరకు రాంపూర్‌లోనే మరణించారు.

ఆయన చాలా తెలివైనవారని దిల్లీలో ఆయన గురించి తెలిసిన అనేకమంది చెప్పేవారు. రోగి ముఖం చూడగానే ఆయన అనారోగ్యం ఏంటో చెప్పగలిగేవారని వాళ్లు వెల్లడించారు.

గాంధీజీతో అనుబంధం

మొదటిసారి కలుసుకున్నప్పుడే ఆయనకు గాంధీజీతో మంచి స్నేహం ఏర్పడింది. దిల్లీలో ఒక ఆసుపత్రిని స్థాపించాల్సిందిగా హకీమ్ అజ్మల్‌ ఖాన్‌కు గాంధీజీ సలహా ఇచ్చారు. దీనివల్ల ఇక్కడి వారికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అప్పటి వరకు అజ్మల్ ఖాన్ లాల్ కువాలోని క్లినిక్‌లోనే వైద్యం ప్రాక్టీస్ చేసేవారు.

తాను లాల్ కువా క్లినిక్‌ బయట వైద్యం చేస్తానని అజ్మల్ ఖాన్ ఎప్పుడూ ఊహించలేదు. గాంధీ సలహా ఆయనకు నచ్చింది. కరోల్‌ బాగ్‌లో ఒక కొత్త ఆసుపత్రి, కాలేజీ కోసం భూమి దొరికింది. 1921 ఫిబ్రవరి 13న తిబ్బియా కాలేజీని, ఆసుపత్రిని స్థాపించారు. దీనిని గాంధీయే ప్రారంభించారు.

హిందూ మహాసభ

ఫొటో సోర్స్, MUNEEB AHMAD KHAN

షరీఫ్ మంజిల్ నివాసం

హకీమ్ అజ్మల్ ఖాన్ పూర్వీకులు స్థాపించిన హవేలీ షరీఫ్ మంజిల్ 2020లో 300 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. దీనిని 1720లో నిర్మించారు. షరీఫ్ మంజిల్ దిల్లీలోని పురాతన కట్టడాలలో ఒకటిగా చెబుతారు.

ప్రస్తుతం హకీమ్ అజ్మల్ ఖాన్ ముని మనవడు హకీమ్ మస్రూర్ అహ్మద్ ఖాన్ అక్కడ తన కుటుంబంతో సహా నివసిస్తున్నారు.

గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి హకీమ్ అజ్మల్ ఖాన్ మద్దతు ఇచ్చారు. తర్వాత ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (భారత జాతీయ కాంగ్రెస్) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1921లో అహ్మదాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ పార్టీకి అధ్యక్షుడైన అయిదో ముస్లిం వ్యక్తి అజ్మల్ ఖాన్. అంతకు ముందు 1919లో ఆయన ముస్లిం లీగ్‌కు కూడా అధ్యక్షుడిగా వ్యవహరించారు.

1906లో ఢాకాలో జరిగిన ముస్లిం లీగ్ మొదటి సదస్సుకు ఆయన హాజరయ్యారు.

1920లో ఆల్‌ ఇండియా ఖిలాఫత్‌ కమిటీ చైర్మన్‌గా కూడా అజ్మల్ ఖాన్ పని చేశారు. హిందూ మహాసభ అధ్యక్షుడిగా కూడా పని చేశారని దిల్లీ ప్రభుత్వ వెబ్‌సైట్‌ చెబుతోంది.

షరీఫ్ మంజిల్‌ నుంచి మీర్జా గాలిబ్ మెమోరియల్ కూతవేటు దూరంలో ఉంటుంది. అప్పట్లో మీర్జా గాలిబ్‌కు సొంతంగా ఇల్లు లేదు. అద్దె ఇళ్లలోనే ఉండేవారు. హకీమ్ అజ్మల్ ఖాన్ తండ్రి హకీం గులాం మహమూద్ ఖాన్ అద్దెకు ఇచ్చిన ఇంట్లోనే ఆయన తన జీవితంలో చివరి ఆరు సంవత్సరాలు గడిపారు.

గాలిబ్‌ నుంచి కొద్దిపాటి అద్దెను మాత్రమే తీసుకునేవారు. గాలిబ్ మెమోరియల్ నిర్మించిన స్థలం హకీమ్ అజ్మల్ ఖాన్ తండ్రికి చెందినది.

ప్రస్తుత ఉద్యోగ్‌ భవన్‌కు ఆనుకుని ఉన్న సునేహ్రీ మసీదును 1920లో రిపేర్లు చేశారని చరిత్రకారుడు ఆర్వీ స్మిత్ వెల్లడించారు.

ఈ మసీదు రోడ్డుకు అడ్డంగా ఉందని, దీన్ని తొలగించాలని న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కోరడంతో ఇప్పుడది వార్తల్లో నిలిచింది. ఒకప్పుడు ఈ సర్కిల్‌ను హకీమ్ జీ‌ కా బాగ్ అని పిలిచేవారు. అక్కడున్న చిన్న తోటలో గోల్డెన్ మసీదు ఉంటుంది.

హిందూ మహాసభ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ

జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపన

జామియా మిలియా ఇస్లామియా వ్యవస్థాపకులలో హకీమ్ అజ్మల్ ఖాన్ ఒకరు. 1920 నవంబర్ 22న ఆయన దానికి మొదటి చాన్సలర్‌గా ఎన్నికయ్యారు. 1927లో మరణించే వరకు ఆ పదవిలోనే ఉన్నారు.

ఆ కాలంలో ఆయన విశ్వవిద్యాలయాన్ని అలీఘర్ నుండి దిల్లీకి మార్చారు. ఆర్థికంగా యూనివర్సిటీ ఎదుర్కొన్న అనేక సంక్షోభాల సమయంలో ఆయన విస్తృతంగా నిధులను సేకరించడమే కాకుండా, తరచూగా తన సొంత డబ్బును కూడా యూనివర్సిటీకి ఇచ్చేవారు.

గాంధీజీ ప్రోత్సాహంతోనే ఆయన జామియాను స్థాపించారని జామియా మిలియా ఇస్లామియా హిందీ విభాగం ప్రొఫెసర్ ఆసిఫ్ ఉమర్ అన్నారు.

వలస పాలనకు మద్దతిచ్చేవి, వలసపాలకుల చేతిలో ఉన్న అన్ని విద్యాసంస్థలను బహిష్కరించాలని గాంధీజీ అప్పట్లో పిలుపునిచ్చారు. దీంతో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఏర్పడింది. అప్పటి ఈ ఉద్యమంలో పాల్గొన్నవారిలో

హకీమ్ అజ్మల్ ఖాన్, డాక్టర్ ముఖ్తార్ అహ్మద్ అన్సారీ, అబ్దుల్ మజీద్ ఖాజాలాంటి ప్రముఖులు ఉండేవారు.

ప్రస్తుతం హకీమ్ అజ్మల్ ఖాన్ సమాధి దుస్థితి చూస్తుంటే దిల్లీలో తిబ్బియా కాలేజీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలను స్థాపించిన వ్యక్తిని దిల్లీ మరిచిపోయిందని అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)