పరీక్షల్లో ‘చీటింగ్’ను అరికట్టేందుకు తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల ఫలితం ఉంటుందా... అసలు ఈ చట్టంలో ఏముంది?

విద్యార్థులు

ఫొటో సోర్స్, DIPANKAR

ఫొటో క్యాప్షన్, కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ పరీక్షా కేంద్రాల్లోకి బుక్‌లు, నోట్స్ తీసుకెళ్లిన విద్యార్థులు
    • రచయిత, నిఖిలా హెన్రీ
    • హోదా, బీబీసీ న్యూస్

భారత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రభుత్వ కాలేజీల్లో సీటు పొందేందుకు నిర్వహించే పరీక్షల్లో మోసాలను అరికట్టేందుకు పార్లమెంట్ కఠినతరమైన సరికొత్త చట్టాన్ని ఆమోదించింది.

భారత పార్లమెంట్ మంగళవారం ఆమోదించిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024 కింద పరీక్షలో మోసానికి పాల్పడేలా సహకరిస్తే మూడు నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకు జైలు శిక్ష పడనుంది.

అంతేకాకుండా, 10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు.

పరీక్ష రాసే వారిపై నేరుగా ఈ కొత్త చట్టం జరిమానాలను విధించదు. బదులుగా, సంబంధిత టెస్టింగ్ అథారిటీలు నిర్ణయించిన నిబంధనల ప్రకారం వారికి శిక్షలు విధిస్తారు.

కేంద్ర ప్రభుత్వం, దాని పరీక్షా సంస్థలు నిర్వహించే చాలా పరీక్షలకు ఈ చట్టం వర్తిస్తుంది. దీని కింద అన్ని నేరాలూ నాన్-బెయిలబుల్.

సీనియర్ పోలీసు అధికారులు ఈ మోసాలను విచారిస్తారు.

విద్యార్థుల నిరసన

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రశ్నపత్రాల లీక్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

‘‘పరీక్షల్లో అవకతవకలను, మోసాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన తొలి చట్టం ఇదే. ఈ చట్టం ఉన్నతమైన పారదర్శకతను, నిష్పాక్షికతను, విశ్వసనీయతను తీసుకొస్తుంది’’ అని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

కఠినతరమైన శిక్షలు ఒక్కటే ఈ సమస్యను పరిష్కరించవని విమర్శకులు అంటున్నారు. భారతీయ నేర చట్టాల కింద ఇప్పటికే ఇవి శిక్షార్హమైనవిగా ఉన్నాయని చెప్పారు.

‘‘ఈ కొత్త చట్టం కూడా అసమర్థమైనదిగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే, విద్యార్థులు ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు, కోచింగ్ కేంద్రాలు వారికి రహస్యంగా సహకరిస్తాయి ’’ అని టీఎస్‌పీఎస్‌సీ మాజీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు.

దేశంలో ప్రముఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో సీటు పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో మోసాలకు పాల్పడుతున్న ఒక రష్యన్ హ్యాకర్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ 2022లో అరెస్ట్ చేసింది. ఈ హ్యాకర్ ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కోసం పనిచేశారనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలకు, ఉన్నత కాలేజీల్లో అడ్మిషన్లకు పెద్ద ఎత్తున పోటీ ఉంటుండటంతో భారత్‌లో ప్రభుత్వ పరీక్షల్లో మోసాలు విపరీతంగా పెరుగుతున్నాయి. విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండడం, వాటికి లక్షల మంది పోటీపడుతుండడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి.

యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్‌సీ) నిర్వహించిన పరీక్షకు గత ఏడాది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, అక్కడున్నది కేవలం వెయ్యి ఖాళీలే.

ఐఐటీల్లో అడ్మిషన్ల కోసం జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) నిర్వహించే పరీక్షకు 15 వేల సీట్ల కోసం లక్షల మంది హాజరయ్యారు.

పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలను పరిగణనలోకి తీసుకున్న పలు రాష్ట్రాలు ఈ మోసాలను అరికట్టేందుకు పలు చట్టాలను అమలు చేస్తున్నాయి.

రాజస్తాన్ రెండేళ్ల క్రితం యాంటీ-చీటింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా 1998, 1997 నుంచి ఇలాంటి చట్టాలనే అమలు చేస్తున్నాయి. గత ఏడాది గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా మోసాలను అరికట్టే చట్టాలను ప్రవేశపెట్టాయి.

ఈ చట్టాలు ఉన్నప్పటికీ, ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు చీటింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ కేసులు వాటి పరిమిత ప్రభావాన్ని ఎత్తి చూపుతున్నాయి.

భారత్‌లో ప్రశ్నాపత్రం లీక్ కేసులు క్రమానుగతంగా నమోదవుతూ, అవి పరీక్షల రద్దుకు దారి తీస్తున్నాయి.

గత ఐదేళ్లలో 15 రాష్ట్రాలలో నిర్వహించిన ఉద్యోగ నియామకాల పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్‌లలో 41 కేసులు రికార్డు అయినట్లు గుర్తించామని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రిక ఇన్వెస్టిగేషన్‌ పేర్కొంది.

దిల్లీలో సివిల్ సర్వీసు ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చిన విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో సివిల్ సర్వీసు పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు

‘‘శిక్ష కఠినంగా ఉండటం మాత్రమే మోసాల ముప్పును తగ్గించేందుకు వన్ స్టాప్ సొల్యుషన్ కాదు’’ అని భారత పోలీసు సర్వీసులో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేసిన జాకబ్ పున్నూస్ తన పదవీ విరమణకు ముందు తెలిపారు.

పరీక్షా కేంద్రాలలో భద్రతను పెంచడం ద్వారా మోసాలను అరికట్టవచ్చని పున్నూస్ చెప్పారు. మాస్ సర్వైలెన్స్ డిజిటల్ టెక్నాలజీని వాడుతూ, పరీక్ష రాస్తున్న విద్యార్థులను పర్యవేక్షించడం ద్వారా మోసాలను అరికట్టడం సాధ్యమవుతుందని తెలిపారు.

యువత డిజిటల్ టెక్నాలజీని వాడుతూ పరీక్షల్లో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు భారత్‌లో పెరుగుతున్నాయి.

రాజస్తాన్‌లో తాము వేసుకున్న చెప్పులకు బ్లూటూత్ డివైజ్‌లను పెట్టుకుని, పరీక్షా కేంద్రంలో మోసాలకు పాల్పడుతూ పట్టుబడ్డారు కొందరు. ఇండియన్ కస్టమ్స్ సర్వీసు ఎగ్జామినేషన్‌లో మోసాలకు పాల్పడేందుకు బ్లూటూత్ ఇయర్‌ఫోన్లను వాడుతూ తమిళనాడులో 30 మంది అభ్యర్థులు అరెస్ట్ అయినట్లు పలు రిపోర్టులు వచ్చాయి.

మోసాలను అరికట్టేందుకు తీసుకొచ్చిన చట్టాలు ఈ ఘటనలతో అసమర్థమైనవిగా నిరూపితమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. పరీక్షలకు ఆటంకం కలిగించే వ్యవస్థీకృత నేరగాళ్ల వల్ల ఇది జరుగుతుందన్నారు.

మోసాలకు అవకాశం కల్పించే వ్యక్తులకు రాజకీయ సంబంధాలు కూడా ఉంటున్నాయని చెబుతున్నారు. కర్నాటకలో పోలీసు నియామకాలకు జరిగిన పరీక్షలో ఒక అధికార పార్టీ నేత పెద్ద ఎత్తున చీటింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గత ఏడాది విచారణ జరిగింది. ఈ విచారణలో 65 మంది అరెస్ట్ అయ్యారు.

భారత్‌లో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ పరీక్షా ఫలితాలపై వివాదం కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం రైల్వే నియామకాల పరీక్షా ఫలితాలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జరిగిన నిరసనల్లో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలతో ఆ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. కేవలం 35,200 పోస్టుల కోసం ఈ పరీక్షలో 7 లక్షల మంది అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశారు.

‘‘ఈ కొత్త చట్టం కూడా మోసాలు చేయడంలో ఎలాంటి ఇబ్బందిని, ఆటంకాన్ని కలిగించదు. ఎవరైనా పట్టుబడితే, కఠినమైన శిక్షలు మాత్రమే వేస్తుంది’’ అని ఘంటా చక్రపాణి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)