పులికాట్: రోడ్డు వేస్తేనే ఓటేస్తామని ఆ 24 గ్రామాల ప్రజలు ఎందుకంటున్నారు?

అమరావతి
ఫొటో క్యాప్షన్, ఆసుపత్రికి వెళ్లేలోగా దారిలోనే ప్రసవించిన అమరావతి
    • రచయిత, తులసి ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

పేర్నాడు, దామరాయి, కొరిడి.. ఇవి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రస్తుతం తిరుపతి జిల్లాలోకి వచ్చిన సూళ్లూరుపేట నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలు.

శ్రీహరికోటకు కూతవేటు దూరంలో ఉన్న ఈ మూడు గ్రామ పంచాయతీలు పులికాట్ సరస్సు మధ్యలో ఒక దీవిలా ఉంటాయి.

ఈ పంచాయతీల్లో మొత్తం 24 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 6 వేల మంది నివసిస్తున్నారు.

తరాలుగా వీళ్లంతా ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. రోడ్డు కోసం కొన్నేళ్లుగా వీరు పోరాడుతున్నారు.

ఎన్నికలొచ్చే ప్రతిసారీ రోడ్డు వేస్తేనే ఓటు వేస్తాం అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఈ గ్రామాలకు పక్కా రోడ్డు వేయలేదు.

అటకానితిప్ప రోడ్డు
ఫొటో క్యాప్షన్, అటకానితిప్ప రోడ్డు

శ్రీహరికోటతోపాటు పులికాట్ సరస్సులోని అన్ని గ్రామాలకు సమీపంలో ఉండే ఒకే ఒక పట్టణం సూళ్లూరుపేట.

ఏ పనికైనా వీళ్లు సూళ్లూరుపేట వెళ్లాలి. సూళ్లూరుపేట వెళ్లాలంటే వీరు మొదట పులికాట్ సరస్సును దాటుకుని ‘సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)’ సమీపంలోని అటకానితిప్పకు చేరుకోవాల్సి ఉంటుంది.

అటకానితిప్ప వెళ్లాలంటే 8.6 కిలోమీటర్ల దూరం ఒక సన్నని రోడ్డులో ప్రయాణించాల్సి ఉంటుంది.

పులికాట్ సరస్సులోంచి ఉన్న ఈ సన్నని మట్టి రోడ్డుపై రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే తప్పుకోవడం కూడా చాలా కష్టం.

పైగా దారి పొడవునా గోతులు. పులికాట్ సరస్సు నీటి అలలకు రోడ్డు నిత్యం కోతకు గురవుతూ మరింత చిక్కిపోతోంది.

ఆ మార్గంలో వెళ్తే ప్రాణాలతో చేరుకోగలమా అన్నంత భయమేస్తుందని పేర్నాడు గ్రామానికి చెందిన నాగరాజు ‘బీబీసీ’తో చెప్పారు.

‘నేను అపాచీలో పనిచేస్తాను. రోజూ ఇక్కడి నుంచే డ్యూటీకి వెళ్తాను. ఉదయం 5 గంటలకు లేచి బైక్‌పై వెళ్లాలి. బస్సులు సమయానికి రావు, ఆటోలో వెళ్దామంటే ప్రాణాలు ఉంటాయి అనే నమ్మకం లేదు. అందుకే ఉదయం 5 గంటలకే బైక్‌లో వెళ్తాను. బైక్‌లో వెళ్లాలంటే 40 నిమిషాల ముందే బయల్దేరాలి. 9 కిలోమీటర్లు ఎర్రమట్టి రోడ్డు ఉంటుంది. రోడ్డంతా గుంతలే ఉంటాయి. అవతలికి చేరుకున్న తర్వాత హమ్మయ్య అనుకుంటాం’ అన్నారు నాగరాజు.

ఇక వర్షాకాలంలో పులికాట్ సరస్సు నిండిందంటే.. ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఆ సమయంలో అటకానితిప్ప వరకు వెళ్లాలంటే పడవలలో ప్రయాణించాలి.

బోల్తా పడిన బస్సు
ఫొటో క్యాప్షన్, బోల్తా పడిన బస్సు

‘రోడ్డు లేక ఎన్ని కష్టాలో’

మూడు గ్రామ పంచాయతీల నుంచి రోజూ చాలా మంది ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం బయటికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ రోడ్డు సరిగా లేకపోవడంతో నిత్యం ఇబ్బందులు పడుతుంటారు.

ఇన్నాళ్లూ ప్రభుత్వాలకు వినతులు చేసిచేసీ విసిగిపోయిన గ్రామస్థులు ఈసారి ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ గ్రామానికి రోడ్డు వచ్చినప్పుడే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.

ఈ మూడు గ్రామ పంచాయతీల్లో వైసీపీ, టీడీపీ సర్పంచులు కూడా ఉన్నారు. కానీ పార్టీలకు అతీతంగా వీరంతా కలిసి తమ గ్రామాలకు ఉన్న ఏకైక రోడ్డును తారు రోడ్డుగా నిర్మించినపుడే ఓట్లు వేయాలని నిర్ణయించారు.

తమ గ్రామానికి రోడ్డు మొదలయ్యే చోట వీళ్లు తమ సమస్య చెప్తూ ఒక భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

అందులో ‘రోడ్డు వేస్తేనే ఓటు వేస్తాం, అని పెద్ద పెద్ద అక్షరాలు ఉండడంతోపాటూ పక్కనే ‘పార్టీలు వద్దు రోడ్డే ముద్దు’ అని కూడా రాశారు.

ఇక పేర్నాడు, దామరాయి, కొరిడి గ్రామ పంచాయతీలు గత మూడు దశాబ్దాలుగా రోడ్డు కోసం వేచిచూస్తున్నాయని, రోడ్డు సరిగాలేకపోవడం వల్ల తాము ఎన్నో కష్టాలు ఎదుర్కుంటున్నామని ఆ ఫ్లెక్సీలో వారు వాటిని ఒక్కో పాయింట్‌లా వివరించారు.

గుంతల రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో ఎంతోమంది గాయపడ్డారని, కొందరు అవయవాలు కోల్పోతే, మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోయారంటూ ఆ రోడ్డులో జరిగిన కొన్ని యాక్సిడెంట్ల చిత్రాలను ఫ్లెక్సీలో పెట్టారు.

ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఏమైనా జరగచ్చని, లైట్లు లేకపోవడంతో చీకటి పడితే రోడ్డు కూడా అసలు కనిపించదని నాగరాజు చెప్పారు.

‘‘ఎదురుగా ఏదైనా బండి వస్తే మార్జిన్ ఉండదు. స్కిడ్ అయి పడిపోవచ్చు. కాళ్లు విరగొచ్చు, చేతులు విరగొచ్చు. గమ్యం చేరేవరకు నమ్మకం ఉండదు. రాత్రి 8:30కి అటకానితిప్పకు వస్తాం. ఇంటికి వచ్చేసరికి 9:30 అవుతుంది. ఆ చీకట్లో రోడ్డు సరిగా కనిపించక చాలాసార్లు బండితో కిందపడ్డాను. రాత్రిపూట అసలు ఆ గుంతలు కనిపించవు. అటవీప్రాంతం కాబట్టి ఎక్కడ లైటింగ్ కూడా ఉండదు. బైక్‌ హెడ్ లైట్ వెలుతురులోనే ప్రయాణించాలి’’ అన్నారు నాగరాజు.

రోడ్డుపై భారీ గుంత

అంబులెన్సులు కూడా రావు

సరైన రోడ్డు లేకపోవడంతో విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు సక్రమంగా వెళ్లలేకపోతన్నారని, వారికి విద్యాపరంగా ఎంతో నష్టం జరుగుతోందని, ఇక గ్రామ పంచాయతీల్లో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులు కూడా సమయానికి చేరుకోలేక పోతున్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

రోడ్డు సరిగాలేకపోవడం వల్ల గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే వైద్యులు, వైద్య సిబ్బంది గైర్హాజరు అవుతున్నారని, అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 104, 108 వాహనాలు తమ గ్రామాలకు రాలేమని కచ్చితంగా చెప్పేశాయని ఆ బోర్డులో వివరించారు.

గర్భిణులను ఆసుపత్రులకు తీసుకువెళ్లే సమయంలో వారు దారి మధ్యలోనే ప్రసవించిన ఘటనలు ఎన్నోసార్లు జరిగాయని చెబుతున్నారు.

తాను నిండు గర్భిణిగా ఉన్న సమయంలో రోడ్డు కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు దామరాయికి చెందిన బాలింత అమరావతి చెప్పారు.

‘‘నేను గర్భిణిగా ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న పేర్నాటి హాస్పిటల్‌కు నడుచుకుంటూ వెళ్లేదాన్ని. నొప్పులు వచ్చాక సూళ్లూరుపేట పెద్దాసుపత్రికి వెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే అటకానితిప్ప వరకు వస్తే అక్కడి నుంచి తీసుకెళ్తామని చెప్పారు. నేను అటకానితిప్ప చేరకముందే దారిలోనే ప్రసవమైంది’’ అని అమరావతి తెలిపారు.

రోడ్డు

‘రోడ్డు కారణంగా జీతాలు తగ్గుతున్నాయి’

కూలి పనులకు వెళ్లేవారు, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు సమయానికి విధులకు చేరుకోలేక జీతం కోతలు పోను అందే అరకొర వేతనాలతో జీవితాలు నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అపాచీ పరిశ్రమలో లెదర్ కటింగ్ డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్న నాగరాజు రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఒక్క నెల కూడా తాను పూర్తిగా వేతనం అందుకోలేదని చెప్పారు.

‘‘10 వేల జీతానికి 9 వేలే అందింది. దాన్లో కూడా 5000 బైక్ రిపేర్లకే ఖర్చవుతోంది. ఒక రోజు టైర్ పోతుంది. ఇంకొకరోజు బ్రేక్ వైర్లు తెగుతాయి. ఇంకొక రోజు చెయిన్ పోతుంది. నాకు వచ్చే జీతంలో సగం దానికే పెట్టాల్సి వస్తుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇలాగే పోవాలి బతకాలి ఇంకే పని చేతకాదు. అపాచీలోనే చేయాలి అనే ఉద్దేశంతో కష్టమో నష్టమో వెళ్లాల్సి వస్తుంది. అక్కడ పనికంటే, ఈ రోడ్‌లో వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. రాత్రి ఇంటికి వచ్చేసరికి బ్యాక్ పెయిన్. మరుసటి రోజు ఉదయాన్నే లేవలేకపోతున్నాను. కష్టంగా ఉంది ఏదో బతికేస్తున్నాం అన్నట్టు బతుకుతున్నాం’’ అని అన్నారు.

బ్యానర్ మాత్రమే పెట్టి ఊరుకోకుండా మూడు గ్రామ పంచాయతీల ప్రజలు విడతలవారీగా అక్కడ ఆందోళనలు కూడా చేస్తున్నారు. తాము ఏ పార్టీలకు, కుల, మతాలకు వ్యతిరేకం కాదని, తమ సమస్యను పరిష్కరించిన వారినే తమ నాయకుడుగా భావిస్తామని వారు స్పష్టం చేశారు.

రోడ్డు

పేరు గొప్ప ఊళ్లు దిబ్బ

చంద్రయాన్-3తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న షార్ అంతరిక్ష కేంద్రం ఈ మూడు గ్రామ పంచాయతీల్లో ఒకటైన కొరిడి పరిధిలోకి వస్తుంది. కానీ తమ పంచాయతీకి సరైన రోడ్డు కూడా లేకపోవడంపై స్థానికులను బాధిస్తోంది.

‘‘ఇక్కడి నుంచి అంతరిక్షంలోకి రాకెట్లు పంపిస్తున్నారు. శ్రీహరికోటకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మేం మనుషులుగా ఇక్కడ జీవించలేకపోతున్నాం. వర్షాలు పడితే పులికాట్‌లో చిక్కుకుపోయి అజ్ఞాతంలో ఉన్నట్టు ఉంటాం. ఎవరైనా బోటు పంపిస్తే దానిలో వచ్చి నిత్యవసర సరకులు తీసుకొని వెళ్తాం. ఎన్నో కోట్ల వ్యయంతో షార్‌ని డెవలప్ చేస్తున్నారు. కానీ మా రోడ్డును పట్టించుకోకపోవడంతో మా పరిస్థితి దారుణంగా ఉంది. అందుకే, పార్టీలకు అతీతంగా మేమంతా ఆందోళనకు దిగాం అన్నారు’’ అని తిరుపాలు అనే స్థానికుడు అన్నారు.

సుబ్బమ్మ

సంబంధాలు కూడా రావడం లేదు

తనకు పెళ్లై 30 ఏళ్లవుతోందని.. అప్పటి నుంచి ఇక్కడ మట్టి రోడ్డునే చూస్తున్నానని దామరాయికి చెందిన సుబ్బమ్మ చెప్పారు.

రోడ్డు లేకపోవడం వల్ల ఊళ్లో యువతకు సంబంధాలు కూడా రావడం లేదన్నారామె.

‘‘ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లు సరిగా రావడం లేదు. బయట ఎక్కడికైనా పంపిద్దాం అనుకుంటే పిల్లలను తీసుకెళ్లడానికి వ్యాన్‌లు రావు. దీంతో పిల్లలు సరిగా స్కూల్‌కి వెళ్లలేకపోతున్నారు. ఇక ఈ రోడ్డు వల్ల సంబంధాలు కూడా రావడం లేదు. మా ఇల్లు, మా పిల్లలు నచ్చినా... మా రోడ్డు చూసి ఈ ఊరి సంబంధం చేసుకోలేం అని చెప్పేస్తున్నారు. నా ఇద్దరు బిడ్డలకి పెళ్లి కాలేదు. ఒక బిడ్డకి ఊర్లోనే పెళ్లయింది. సంబంధాలు ఎక్కడ నుంచి తీసుకురావాలి’’ అని సుబ్బమ్మ బీబీసీతో చెప్పారు.

ఒకప్పుడు శ్రీసిటీలో ఉద్యోగం చేసిన దామరాయికి చెందిన హేమలత తాను రోడ్డు సమస్య కారణంగా ఉద్యోగం మానేశానని ఇప్పుడు కుటుంబ పోషణ కోసం ఇంటిపట్టునే ఉంటూ టైలరింగ్ చేసుకుంటున్నానని చెప్పారు.

‘‘శ్రీ సిటీకి పనికి వెళ్లేదాన్ని. అక్కడ మూడు షిఫ్టులు ఉంటాయి. ఎ- షిఫ్ట్ వేస్తే అటకానితిప్ప దగ్గర తెల్లవారుజామున నాలుగు గంటలకే బస్సు ఉంటుంది. ఆ సమయంలో వెళ్లలేకపోయేదాన్ని అదే బి- షిప్ట్ అయితే అటకానితిప్ప వరకూ వచ్చేసరికి రాత్రి 12 అయ్యేది. ఆ సమయంలో ఇల్లు చేరుకోవడానికి కుదరదు. తర్వాత వేరే వాళ్ల వెహికల్‌లో వెళ్లేదాన్ని. వాళ్లు ఇంట్లో సమస్య వల్ల ఉద్యోగం మానేయడంతో రవాణా సమస్య వల్ల నిలిచిపోయాను.’’ అని అన్నారు హేమలత

డీఎఫ్ఓ శామ్యూల్

అటవీ అనుమతులే అడ్డంకా

ఎన్నో ఏళ్ల నుంచి రోడ్డు కోసం డిమాండ్ చేస్తుంటే, రక్షిత ప్రాంతం కాబట్టి అటవీ అనుమతులు తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతున్నాయని గ్రామ పంచాయతీ నేతలు చెబుతున్నారు.

దిల్లీకి వెళ్లి నేతలతో, అధికారులతో మాట్లాడినా ఇదే సమాధానం చెబుతున్నారని కొరిడి పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి వెంకటేశ్వర్లు బీబీసీతో చెప్పారు.

‘‘మొన్న నవంబర్‌లో వచ్చిన వరదల్లో చిక్కుకుని బయటకు రాలేకపోయినప్పటి నుంచి ఈ మూడు పంచాయతీల్లోని యువత 700 మంది కలిసి ఒక జట్టుగా ఏర్పడి దీనిపై పోరాడుతున్నారు. ఈ యువతను ముందుకు తీసుకెళ్లడానికి మేం కలిశాం’’ అని ఆయన చెప్పారు.

గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
ఫొటో క్యాప్షన్, గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

రాష్ట్ర ప్రభుత్వం ఏ చెబుతోంది

ఇది ఆ మూడు పంచాయతీల సమస్యే కాదని, 427 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన పులికాట్ సరస్సులోని చాలా గ్రామాలకి ఇలాగే రోడ్డు సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

మూడు పంచాయతీల బాధను తాము అర్థం చేసుకోగలమన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆ ప్రాంతం ఎకో సెన్సిటివ్ జోన్‌లోకి రావడం వల్లే అక్కడ ఏ పనులూ చేయలేకపోతున్నామని బీబీసీతో చెప్పారు.

‘‘గ్రామస్థులు ఎంతో బాధపడితే గాని ఎన్నికల్ని బాయ్‌కట్ చేయరు. అక్కడినుంచి అంబులెన్స్ సర్వీసులు గాని రవాణాకు గానీ, చాలా ఇబ్బందిగా ఉంది. మామూలుగా గ్రావెల్ రోడ్డు వేయడం వల్ల వర్షాలు కురిసినప్పుడు అవి కొట్టుకుపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. వర్షాలు వచ్చిన ప్రతిసారీ అవి కొట్టుకుపోతుంటాయి. ఓ వైపు స్వర్ణముఖి మరోవైపు కాళంగి రెండు నదులు ఉంటాయి కాబట్టి అక్కడ నీటి ప్రవాహం కూడా ఎక్కువ ఉంటుంది’’ అని ఆయన అన్నారు.

రోడ్డులాంటి ఏవైనా నిర్మాణాలు చేపట్టాలంటే, వన్యప్రాణులు, అటవీ శాఖకు సంబంధించిన విభాగాలు అభ్యంతరం చెబుతున్నాయని, ఈ సమస్యను పార్లమెంటులో ప్రస్తావించానని ఎంపీ గురుమూర్తి చెప్పారు.

‘‘పులికాట్ ముఖద్వారాలు ఇసుకతో క్లోజ్ అయిపోయాయి. దీంతో అది ఎక్కువ వరద ముంపునకు గురవుతుంది. రోడ్లు చిత్తడిగా ఉండటం వల్ల త్వరగా గుంతలు పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతులు పంపించాం. గోవా ఫౌండేషన్ వాళ్లకు ఇలాంటి కేసే ఉంటే, 2022 జూన్‌లో తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. దాని ఆధారంగా సంబంధిత కేంద్ర మంత్రితో మాట్లాడాను. అయితే దాన్ని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఒక కమిటీ వేసి ఆ కమిటీ అప్రూవల్ చేసిన తర్వాత రోడ్స్ వేసుకోవాలి అన్నారు’’ ఎంపీ గురుమూర్తి.

రోడ్డు సమస్యపై ముఖ్యమంత్రితో ఇప్పటికే మాట్లాడానని, ఆయన దీనిపై వివిధ శాఖలతో ఒక కమిటీని కూడా వేశారని ఎంపీ చెప్పారు. కానీ, ఎన్నికల హడావిడిలో ఆ ప్రక్రియ కాస్త నెమ్మదించిందని తెలిపారు.

మూడు పంచాయతీలకు రోడ్డు గురించి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్ నుంచి లిఖిత పూర్వక సమాధానం కూడా పొందానని చెప్పిన గురుమూర్తి, ఎన్నికల అనంతరం సంవత్సరంలో దానిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని వివరించారు.

నిరసన తెలుపుతున్న గ్రామస్థులు

గ్రామస్థుల కోరిక తీరే అవకాశం

అటకాని తిప్ప నుంచి పేర్నాడు వరకూ బీటీ రోడ్డు నిర్మించాలనే గ్రామస్థుల వినతులపై ఆర్ అండ్ బీ తమకు లేఖ రాసిందని, ఆ రోడ్డుకు అనుమతి వచ్చే అవకాశం ఉందని అటవీ శాఖ చెబుతోంది.

పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ కోసం ప్రత్యేకంగా పరివేశ్ వెబ్‌సైట్ ఓపెన్ చేయడం, అనుమతులను సరళీకరించడం వల్ల గ్రామస్థుల కోరిక తీరే అవకాశం ఉందని సూళ్లూరుపేట డీఎఫ్ఓ పి.శామ్యూల్ బీబీసీకి చెప్పారు.

‘‘అటకాని తిప్ప నుంచి పేర్నాడు వరకూ ఉన్న 8.6 కిలోమీటర్ల రోడ్డు అభయారణ్యంలో ఉంది. ఏటా ఆ రోడ్డును రిపేర్ చేసుకోడానికి అనుమతులు అడిగినపుడు మేం ఇస్తుంటాం. కానీ గ్రామస్థులు ఇప్పుడు బీటీ రోడ్డు కావాలని ధర్నా చేస్తున్నారు. ఇటీవలే వారి వినతుల ఆధారంగా ఆర్ అండ్ బీ నుంచి మా హెడ్ ఆఫీస్‌కు ఒక లెటర్ అందింది. అక్కడ నుంచి వారికి డీజీపీ సర్వే పర్మిషన్ వస్తే, దానిని సర్వే చేసిన అనంతరం పరివేశ్ పోర్టల్లో అప్‌లోడ్ చేస్తాం. ఆ తర్వాత ఆ గ్రామాలకు బీటీ రోడ్డు వేసేందుకు పర్మిషన్ వచ్చే అవకాశం ఉంది’’ అన్నారు.

అటకానితిప్ప నుంచి వేనాడు రోడ్డు కూడా ఇలాంటి స్థితిలోనే ఉందని, మొదట్లో జాతీయ వన్యప్రాణుల బోర్డ్ కేంద్రం పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ బీటీ రోడ్లు వేయడానికి అనుమతులు లభించలేదని, అందుకే అది కూడా ఆగిపోయిందని శామ్యూల్ చెప్పారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించడంతో, ఈ రోడ్ల సమస్యను పరివేశ్ పోర్టల్లో అప్ లోడ్ చేసే అవకాశం ఉందని.. అలా జరిగితే ఆయా గ్రామాల రోడ్డు సమస్యలుతీరుతాయని తాము ఆశిస్తున్నామని అటవీ శాఖ చెబుతోంది.

వీడియో క్యాప్షన్, ఈ రోడ్డు కారణంగా మా ఊళ్లో వాళ్లకి పెళ్లి కావట్లేదు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)