ఉషాకిరణ్ ఖాన్: ప్రేమ రంగుల్ని, పల్లె జీవితాన్ని అక్షరాల్లో బంధించిన రచయిత

ఉషాకిరణ్ ఖాన్

ఫొటో సోర్స్, SPECIAL ARRANGEMENT

ఫొటో క్యాప్షన్, ఉషాకిరణ్ ఖాన్
    • రచయిత, నివేదిత
    • హోదా, బీబీసీ కోసం

చివరిసారిగా ఆమెను చూశాను. శవపేటికలో నిశ్చలంగా, ప్రశాంతంగా కనిపించారు.

తడి కళ్లతో తదేకంగా ఆమెను చూస్తూనే ఉన్నా. జ్ఞాపకాలన్నీ తడుముతున్నాయి. చిన్నగా గాలి వీచింది. ఆమె మళ్లీ కళ్లు తెరుస్తుందేమో అని ఒక్కసారిగా అనిపించింది. కానీ, నిస్తేజం ఆవరించింది. బయట చీకటి పడుతోంది.

నా కళ్లు అసంకల్పితంగా తెరుచుకున్నాయి. నిజంగానే ఆమె వెళ్లిపోయారు. ఆమె నిష్క్రమణంతో హిందీ, మైథిలి భాషా సాహిత్య ప్రపంచంలో పూడ్చలేని వెలితి ఏర్పడింది.

సాహిత్య ప్రపంచంలో పద్మశ్రీ ఉషాకిరణ్ ఖాన్ తనదైన ముద్ర వేశారు. సమాజంలోని అనేక అంశాలపై సవివరంగా రాసిన మహిళ ఆమె. చివరిరోజుల్లోనూ ఆమె రచన మానుకోలేదు.

‘‘మీరు ఇంతలా ఎలా రాయగలుగుతారు?’’ అని నేను అప్పుడప్పుడు ఆమెను ప్రశ్నించేదాన్ని. దానికి ఆమె నవ్వుతూ బదులిచ్చేవారు. ‘‘రాయడం ఒక అభ్యాసం. రచయిత తన జీవితమంతా ఈ అభ్యాసాన్ని సాధన చేస్తూనే ఉండాలి’’ అని ఆమె చెప్పేవారు.

ఆమె చేసిన చాలా రచనలు ప్రతి గ్రామానికీ, ఇంటికీ చేరుకున్నాయి. నిజ జీవిత కథలన్నీ గ్రామాల్లోనే ఉంటాయని ఆమె నమ్మేవారు.

ఆమె చాలా రాశారు. పిల్లల గురించి రాశారు. నాటికలు, కథలు, వ్యాసాలు, నవలలు, ఆర్టికల్స్ రాశారు.

ఉషాకిరణ్ ఖాన్

ఫొటో సోర్స్, SPECIAL ARRANGEMENT

ఫొటో క్యాప్షన్, రచయిత ఆజ్ఞేయ్‌తో ఉషాకిరణ్ ఖాన్

సాహిత్య ప్రపంచంతో పరిచయం

ఆమెతో నాకు చాలా దగ్గరి పరిచయం ఉంది. గాంధేయవాది అయిన తండ్రి, తల్లి ఆమెను సాహిత్యపు ప్రపంచానికి పరిచయం చేశారు.

వారింటికి ఎంతోమంది సాహితీవేత్తలు వచ్చి వెళ్తుండేవారు. విప్లవకారులు ఆమె మనస్సుపై గొప్ప ప్రభావం చూపారు.

చిన్న వయస్సులోనే వివాహం జరిగింది. ఇంటి పనులు చేసుకుంటూనే ఆమె చదువు కొనసాగించారు. ప్రొఫెసర్‌గా చరిత్ర పాఠాలు చెప్పారు. రచన పట్ల ఆసక్తితో ఆమె రాయడం మొదలుపెట్టారు. ఇది అంత సులభం కాదు. కానీ, అంకితభావం అలా ఉండేది. ఆమె రాస్తూనే ఉండేవారు.

అనేక సంస్థల్ని ఏర్పాటు చేశారు. సాహిత్యంతో పాటు సంస్కృతి పట్ల ఆమెకు విపరీతమైన ఆసక్తి. చాలా నాటికలు రాశారు. నాటక సంస్థలతో భాగస్వాములయ్యారు. ‘‘హీరో డోమ్’’ వంటి నాటికలు చాలా ప్రాచుర్యం పొందాయి.

‘‘ఆయామ్ (आयाम)’’ సంస్థను ఏర్పాటు చేసి, సాహిత్య అభిలాష ఉన్న మహిళల కోసం కొత్త ప్రపంచాన్ని సృష్టించారు.

‘‘ఆయామ్’’ సంస్థ ఏర్పాటుకు ముందు ఆమె నన్ను ఇంటికి పిలిచారు. రాయడం-చదవడం తెలిసిన మహిళలందర్నీ ఏకం చేయాలనుకుంటున్నట్లుగా నాతో చెప్పారు. అలా ఈ సంస్థ ఏర్పడింది.

అన్ని రకాల భావజాలాలు ఉన్న మహిళలకు ఆ సంస్థ ద్వారాలు తెరుచుకొనే ఉంటాయి. చదవడం, రాయడం పట్ల ఆసక్తి ఉండాలన్నది మాత్రమే ఆ సంస్థలో చేరేందుకు షరతు. ఆయామ్‌కు తొలి కో ఆర్డినేటర్‌గా నా పేరును ప్రతిపాదించారు. నా భావాలు భిన్నమైనవని తెలిసినప్పటికీ నన్ను కో ఆర్డినేటర్‌ చేశారు. ఈ సంస్థ వేదికగా మేమంతా రోహిత్ వేముల గురించి పలు కవితలు రాశాం. నినాదాలు చేశాం.

ఉషాకిరణ్ ఖాన్

ఫొటో సోర్స్, SPECIAL ARRANGEMENT

స్నేహం, ఆత్మీయత...

ఉషా అక్క నాకు స్నేహితురాలు, ఆప్తురాలు. కష్టాల్లో ఎప్పుడూ వెన్నంటే ఉంటారు. నా జీవితంలో ఇలాంటి ఆత్మీయ వ్యక్తుల్ని చాలా అరుదుగా చూశాను.

ఆమె భర్త రామచంద్ర ఖాన్‌కు దైవభక్తి ఎక్కువ. దీనికి ఆమె చాలా భిన్నం. ఈశ్వరుడిని ఆమె నమ్ముతారు. కానీ, ఈ పూజా విధానాలపై ఆమెకు ఆసక్తి లేదు.

ఆమెకు సంబంధించిన చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని అలాగే గుర్తు పెట్టుకోవాలని నేను అనుకుంటున్నా.

ఆమె రచనలతో నాకు అనుబంధం ఉంది. ఆమె కథలు, నవలల్లోని పాత్రల్ని నేను అనుభవిస్తూనే ఉన్నా. వాటితో నాది విడదీయరాని బంధం.

ప్రతీ పాత్ర మిమ్మల్ని తమతో ప్రయాణించేలా చేస్తుంది. ఈ కథల ద్వారా మనం జీవితాన్ని చాలా దగ్గరగా చూడొచ్చు. అనేక అంశాలపై ఆమె రచనలు ఉన్నాయి. సెక్స్ వంటి అంశాలపై కూడా ఆమె రాశారు.

‘‘పీడా కే దంశా’’ అనేది అలాంటి ఒక కథ. ఇందులో మొత్తం నైతిక ప్రమాణాలను తిరగరాశారు. ఈ కథలోని ఒక పాత్ర పేరు విపిన్. ‘‘నా జీవితం మొత్తాన్ని నీతోనే గడిపాను. ఇప్పుడు ఒక్కసారి అనూషతో పడుకోవాలనుకుంటున్నా’’ అని తన భార్యతో విపిన్ చెబుతాడు.

విపిన్ భార్య పాత్రధారి అయిన శాంత బదులిస్తూ, ‘‘విపిన్, మీ ఇమేజ్ చెడిపోతుంది’’ అని అంటారు.

మధ్యతరగతి ప్రజల్లో విలువలు, సంబంధాలు ఎలా మారిపోయాయో భార్యభర్తల మధ్య జరిగిన ఈ సంభాషణ తెలుపుతుంది. ఆమె కథల్లో ప్రేమలోని విభిన్న రంగుల్నిమీరు చూడొచ్చు.

ఉషాకిరణ్ ఖాన్

ఫొటో సోర్స్, SPECIAL ARRANGEMENT

పల్లె భాష సువాసన

‘‘అహుల్ కి వాపసీ’’ వంటి కథలు ప్రేమను ఒక కొత్త లయతో, భావంతో నింపుతాయి. ఆమె రాసిన చాలా కథలు కోసి ప్రాంత గ్రామ కథల్లా ఉంటాయి. ఆమె రచనల్లో పల్లెటూరి భాషా పరిమళం ఉంటుంది.

యాస, సామెతల కారణంగా ఇతరుల కన్నా ఆమె కథలు విభిన్నంగా ఉంటాయి.

ఆమె రచనలన్నీ జీవితంలో నుంచి పుట్టినవే. కథలు, నవలలు వేర్వేరు రంగుల్ని కలిగి ఉంటాయి. ఈ రంగులన్నీ ఆకాశంలో మేఘాల్లాగా కథల ప్రపంచంలో చెల్లాచెదురుగా ఉన్నాయి.

ఆమె కథలు చదివి నిస్తేజంగా ఉన్న నా విద్యార్థులు చలించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ కథలన్నీ సాహిత్యపు ప్రపంచంలో మెరుస్తున్నాయి. ఉషా అక్కా ఎప్పుడూ మన జ్ఞాపకాల్లోనే ఉంటారు. ఇక్కడ నాకొక వాక్యం గుర్తుకొస్తుంది. ‘‘జ్ఞాపకాల్లో నీ తోడుగా లేనిదెప్పుడు (కబ్ యాద్ మే తెరా సాథ్ నహీ).

రంగులతో నిండిన, అత్యంత సున్నితమైన ఉషాకిరణ్‌కు ఇదే నా చివరి వందనం. సాహితీ లోకానికి ఆమె చేసిన సేవలను ప్రపంచం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది.

రచయిత్రి ఉషాకిరణ్ ఖాన్ ఆదివారం (11 ఫిబ్రవరి, 2024) కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)