భారత మాజీ నేవీ అధికారుల విడుదలలో షారుక్ ఖాన్ పాత్ర ఉందా? ఈయన పేరు ఎందుకు ట్రెండ్ అయ్యింది?

షారుక్ ఖాన్

ఫొటో సోర్స్, FRANCOIS NEL/GETTY IMAGES

ఖతార్ నుంచి 8 మంది భారత నౌకాదళ మాజీ సిబ్బంది విడుదలలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ పాత్ర ఉందనే ఊహాగానాలను ఆయన కార్యాలయం తోసిపుచ్చింది.

ఇది రెండు దేశాల మధ్య దౌత్యపరమైన అంశమని, భారత అధికారులు ఈ పని చేశారని షారుఖ్ ఖాన్ కార్యాలయం తెలిపింది.

గూఢచర్యం ఆరోపణలపై ఈ 8 మందికి ‘ఖతార్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్’ అక్టోబర్ 26న మరణ శిక్ష విధించింది. వారిలో కెప్టెన్ నవతేజ్ గిల్, సౌరభ్ వశిష్ఠ, కమాండర్ పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్‌పాల్, ఎస్ కే గుప్తా, బీకే వర్మ , సుగుణాకర్ పాకాల(విశాఖపట్నం), సెయిలర్ రాగేష్ ఉన్నారు. అనంతరం వారి మరణశిక్షను 25 సంవత్సరాల జైలు శిక్షకు తగ్గించారు.

అయితే, ఖతార్ ఎమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆదేశాల మేరకు సోమవారం వారిని విడుదల చేశారు. దీంతో వారు భారత్‌కు తిరిగి వచ్చారు. ఇదే సమయంలో నేవీ సిబ్బంది విడుదలలో షారుక్ ఖాన్ పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఈ మధ్యలో ఏం జరిగింది? షారుక్ ఖాన్‌కు, నేవీ సిబ్బంది విడుదలకు సంబంధమేంటి?

ఖతార్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఖతార్ నుంచి విడుదలైన నేవీ మాజీ అధికారులు భారత్‌కు చేరుకున్నారు.

అసలేం జరిగింది?

షారుక్‌ ఖాన్‌కు భారత్‌తో పాటు ఖతార్‌లో కూడా మంచి ఆదరణ ఉంది. ఇటీవల ఖతార్ వెళ్లి అక్కడి ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీని ఆయన కలిశారు. దోహాలో ఈ భేటీ జరిగింది. ఇదే సమయంలో భారతీయులను విడుదల చేయడానికి షారుక్ జోక్యం చేసుకున్నారని మాజీ ఎంపీ, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి మంగళవారం ఎక్స్(ట్విట్టర్‌)లో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్టు వైరల్‌గా మారింది.

మోదీ రెండు రోజుల యూఏఈ పర్యటనకు సంబంధించిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా, సుబ్రమణ్యస్వామి సోషల్ మీడియాలో స్పందిస్తూ- "సలహాదారుల వైఫల్యం అనంతరం షారుక్ ఖాన్‌ను జోక్యం చేసుకోవాలని మోదీ అభ్యర్థించారు. తర్వాత నేవీ అధికారులను అప్పగించడానికి ఖతార్ అంగీకరించింది" అని తెలిపారు. దీంతో షారుక్ ట్రెండింగ్‌లోకి వచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఈ నేపథ్యంలో షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.

ఖతార్‌లో అరెస్టైన మాజీ నౌకాదళ సిబ్బందిని విడుదల చేయడంలో షారుక్ ఖాన్ ప్రమేయం ఉందన్న వార్తల్లో నిజం లేదని, అది భారత ప్రభుత్వ అధికారుల పని అంటూ ఆ ప్రకటన పేర్కొంది. నేవీ సిబ్బంది క్షేమంగా తిరిగొచ్చినందుకు మిగతా భారతీయుల మాదిరే షారుక్ కూడా సంతోషంగా ఉన్నారని తెలిపారు.

షారుక్ ఖాన్ కొన్ని గల్ఫ్ దేశాల్లో చాలా పాపులర్. 2022లో ఆయనకు దుబాయ్‌ హ్యాపీనెస్ కార్డ్ కూడా ఇచ్చింది. దుబాయ్ పర్యాటక ప్రాంతాలకు షారుక్ ప్రచారకర్తగా ఉన్నారు.

దుబాయ్ తనకు రెండో ఇల్లు లాంటిదని ఆయన గతంలో వ్యాఖ్యానించారు. ఇటీవల దోహాలో జరిగిన ఆసియా ఫుట్‌బాల్ క్లబ్ ఫైనల్‌ కార్యక్రమానికి ఆయనను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు.

ఖతార్, ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

విదేశాంగ కార్యదర్శి ఏం చెప్పారు?

మాజీ భారత నౌకాదళ సిబ్బందిని ఖతార్ విడుదల చేసిన అనంతరం భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా మాట్లాడారు. యూఏఈ పర్యటన తర్వాత, ఫిబ్రవరి 14-15 తేదీలలో ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ సందర్శన ఉందన్నారు.

విదేశాల్లో ఇబ్బందుల్లో చిక్కుకున్న భారత పౌరులకు సంబంధించిన ప్రశ్నకు వినయ్ మోహన్ క్వాత్రా సమాధానమిస్తూ- “గత పదేళ్లు పరిశీలిస్తే భారతీయులు ఎప్పుడైనా ఎలాంటి సమస్యలో చిక్కుకున్నారని తెలిసినా, ప్రధాని చొరవతో ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించింది. అది కోవిడ్ సమయమైనా, సూడాన్‌లో హింస సమయంలోనైనా జరిగింది. ఇది భారత ప్రజల పట్ల ప్రధాని వ్యవహరించే విధానానికి నిదర్శనం'' అన్నారు.

"భారత పౌరులు ఎక్కడున్నా అది కేవలం విదేశీ వ్యవహారాల శాఖకే కాదు, భారత ప్రభుత్వానికి సంబంధించినది. భారతీయులకు సాధ్యమైన సాయం అందించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది" అని చెప్పారు.

షారుక్ ఖాన్

ఫొటో సోర్స్, ANDREW H. WALKER/GETTY IMAGES

దౌత్యమంటే పఠాన్ సినిమా కాదు: రాజ్‌దీప్ సర్దేశాయ్

ఖతార్‌లోని మాజీ నావికాదళ సిబ్బందిని విడుదల చేయడంలో షారుక్ పాత్ర ఉందంటూ సోషల్ మీడియాలో హాస్యాస్పద వార్త ఒకటి తిరుగుతోందని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ తెలిపారు.

"దౌత్యమంటే పఠాన్ సినిమా కాదు. తర్వాత ఏంటి? కెనడాతో సంబంధాలను మెరుగుపరచడంలో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషించారా'' అని ప్రశ్నించారు.

నౌకాదళ మాజీ సిబ్బంది విడుదల ఘనత దౌత్యవేత్తలకు, ప్రధాని మోదీకి, ఆయన ప్రభుత్వానికి ఇవ్వాలని రాజ్‌దీప్ అభిప్రాయపడ్డారు.

ఖతార్ నుంచి విడుదలై దిల్లీకి చేరుకున్న ఓ మాజీ నేవీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేం సురక్షితంగా భారత్‌కు చేరుకోవడం సంతోషం. దీనికి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబుతాం, ఎందుకంటే ఆయన వ్యక్తిగత జోక్యం లేకుండా ఇది సాధ్యం కాదు'' అన్నారు.

ఒప్పందాల్లో ముందడుగు

ఇటీవల గోవాలో ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భారత్‌తో ఎల్‌ఎన్‌జీ విక్రయాలు, కొనుగోలు ఒప్పందాన్ని 20 ఏళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ఖతార్ ఎనర్జీ ప్రకటించింది.

ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతిదారుగా ఉంది, అయితే ఇటీవల అమెరికా దానిని దాటేసింది. ఖతార్ ఏటా 77 ఎంపీటీఏ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తోంది.

2027 నాటికి 126 ఎంపీటీఏకి పెంచాలని ఖతార్ కోరుకుంటోంది. ఆసియా, యూరప్‌లలో ప్రవేశించడానికి అమెరికా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ ఉత్పత్తితో ఖతార్ తన పట్టును బలోపేతం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)