పాకిస్తాన్ ఎన్నికలు: పీటీఐ ప్రజాదరణ 'సోషల్ మీడియా నీటిబుడగ' కాదని నిరూపించుకున్న ఇమ్రాన్ ఖాన్

ఇమ్రాన్ ఖాన్

ఫొటో సోర్స్, REUTERS

    • రచయిత, కైరోలైన్ డేవిస్
    • హోదా, లాహోర్ నుంచి బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్ ఎన్నికల్లో ప్రజాతీర్పు కొంత స్పష్టంగానూ, మరోవైపు కొంత సంక్లిష్టంగానూ కనిపిస్తోంది.

ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్) గుర్తుతో పోటీ చేసేందుకు అవకాశం లేకపోవడంతో, ఆయన మద్దతుదారులు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీచేసి మెజార్టీ సీట్లు సాధించారు.

అయితే, ఎన్నికలకు ముందు రేసులో ముందంజలో ఉందని భావించిన నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ (పాకిస్తాన్ ముస్లిం లీగ్ - నవాజ్) అతిపెద్ద పార్టీగా అవతరించిందని చెప్పుకోవచ్చు.

ఈ ఎన్నికలతో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఉన్న ప్రజాదరణ కేవలం సోషల్ మీడియాలో నీటిబుడగ కాదని, పార్టీకి నిజమైన, అంకితభావం కలిగిన మద్దతుదారులు ఉన్నారని నిరూపితమైంది.

పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్‌‌ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడవ్వడమే కాకుండా, జైలుపాలయ్యారు. (అవినీతికి పాల్పడ్డారనే కేసులో మూడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అదే కాకుండా ఇటీవల మరో కేసులో మరింత కాలం జైలు శిక్ష పడింది.) అంతేకాకుండా అక్షరాస్యత తక్కువగా ఉన్న దేశంలో ఎన్నికల వేళ ఆయన పార్టీ గుర్తు క్రికెట్ బ్యాట్‌ను కూడా బ్యాలెట్ నుంచి తొలగించారు.

పాకిస్తాన్ ఎన్నికలు

ప్రతికూల పరిస్థితులు

2022లో ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత, రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు నమోదు చేశారని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు.

అంతేకాకుండా, పీటీఐ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచార ర్యాలీలు చేసుకోలేకపోయారు. కొందరు నేతలు జైలులో ఉన్నారు, మరికొందరు రహస్యంగా పోటీ చేశారు.

ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నిస్తే, పోలీసులు వారిని బెదిరించి తీసుకెళ్లారని పీటీఐ చెబుతోంది. అయితే, ఈ ఆరోపణలను అధికారులు కొట్టిపారేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, పీటీఐకి చెందిన అభ్యర్థులు ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీ చేసి ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు.

పీఎంఎల్-ఎన్ పార్టీకి దేశంలోనే శక్తివంతమైన సైన్యం మద్దతు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాల్లో ఆ పార్టీ రెండోస్థానంలో ఉంది.

అలాగే, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) మూడో స్థానంలో ఉంది.

పాకిస్తాన్ ఎన్నికలు

సమాధానాలు దొరకాల్సిన ప్రశ్నలు..

ఫలితాల అనంతరం ఏం జరగబోతుందనేది ఈ సమయంలో అత్యంత క్లిష్టమైన ప్రశ్న.

ఎన్నికల ఫలితాలను వివిధ పార్టీల అభ్యర్థులు సవాల్ చేస్తున్నందున రానున్న రోజుల్లో ఫలితాలు మారే అవకాశం ఉంది. ఇక్కడ గమనించాల్సింది కేవలం ఇదొక్కటి మాత్రమే కాదు.

స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన వారు అధికారికంగా ఎన్నికల ఫలితాలు ప్రకటించిన మూడు రోజుల్లోపు ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలి లేదా స్వతంత్రంగానే ఉండాల్సి ఉంటుంది.

దీనికి ఇమ్రాన్ ఖాన్ పార్టీ త్వరలోనే పరిష్కారం కనుగొనాల్సి ఉంది.

స్వతంత్ర అభ్యర్థులపై కన్నేసిన ఇతర రాజకీయ పార్టీలు కూడా ఒక్కొక్కరిని తమవైపు లాక్కోవడం ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకోవాలని చూస్తున్నాయి.

పీఎంఎల్-ఎన్ కూడా నేషనల్ అసెంబ్లీలో కావాల్సిన మెజార్టీ సాధించేందుకు కూటమి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ విడుదలయ్యే అవకాశం లేనందువల్ల పార్టీకి ఎవరు నాయకత్వం వహించాలనేది కూడా పీటీఐ నిర్ణయించుకోవాల్సి ఉంది.

నవాజ్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

తెరవెనుక..

పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలతో అతిపెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

గతంలో సైన్యానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు, ఈసారి సైన్యం మద్దతు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఎన్నికల్లో విజయం సాధించారు.

ఈ పరిణామాల తర్వాత శక్తివంతమైన పాకిస్తాన్ సైన్యంతో ఆయన సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?

సంక్లిష్టంగా ఉండే పాకిస్తాన్ రాజకీయాలపై తెరవెనక విషయాల ప్రభావం ఉంటుందని తరచూ చెబుతుంటారు. రాజకీయ సమీకరణాలు, పరిణామాలు, పొత్తులు, ఇంకా ఇతర పాత శత్రుత్వాలు ప్రభావితం చేస్తాయి.

మొత్తమ్మీద చూస్తే, ఎన్నికల ఫలితాలు అంచనాలను తారుమారు చేశాయి. ముందుగా ఊహించినట్లుగా ఎన్నికల ఫలితాలు లేవని కచ్చితంగా చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)