ఖతార్: మరణశిక్ష ఎదుర్కొన్న ఇండియన్ నేవీ మాజీ అధికారుల విడుదల వెనక ఎవరున్నారు, పాకిస్తాన్‌లో చర్చ ఎందుకు?

ఫొటో సోర్స్, Getty Images
ఎనిమిది మంది భారత నౌకా దళ మాజీ అధికారులను ఖతార్ విడుదల చేసింది. అంతకు ముందు వీరికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. వారిపై గూఢచర్యం చేశారనే ఆరోపణలున్నాయి.
2022 ఆగస్టులో నేవీ మాజీ అధికారులు అరెస్టయ్యారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ ఎనిమిది మంది మాజీ అధికారులకు ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది.
వారిలో కెప్టెన్ నవతేజ్ గిల్, సౌరభ్ వశిష్ఠ, కమాండర్ పూర్ణేందు తివారీ, అమిత్ నాగ్‌పాల్, ఎస్కే గుప్తా, బీకే వర్మ, సుగుణాకర్ పాకాల, నావికుడు రాగేష్ ఉన్నారు.
ఆ తర్వాత మరణశిక్షను మూడు నుంచి 25 ఏళ్ల జైలు శిక్షకు తగ్గించారు.
ఖతార్ ఎమిర్ ఆదేశాల మేరకు నేవీ మాజీ అధికారులను విడుదల చేసినట్లు సోమవారం ఉదయం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
నేవీ మాజీ అధికారులు విడుదలైన అనంతరం భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా విడుదల చేసిన ప్రకటనలో, యూఏఈ పర్యటన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 15న ఖతార్‌లో పర్యటిస్తారని పేర్కొన్నారు.
ఇది భారత్ సాధించిన దౌత్య విజయంగా భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌లోనూ చర్చ
మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులను విడుదల చేయడంపై పాకిస్తాన్‌లోనూ చర్చ జరుగుతోంది.
"ప్రధాని మోదీ తన స్థాయి మేరకు చేశారు. దుబాయ్‌లో జరిగిన కాప్-28 సదస్సు సందర్భంగా ఖతార్ ఎమిర్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలో భారతీయుల విడుదల అంశాన్ని లేవనెత్తారు'' అని భారత్‌లో పాకిస్తాన్ హైకమిషనర్‌గా గతంలో పనిచేసిన అబ్దుల్ బాసిత్ అన్నారు.
''ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేసిన కేసులో ఈ ఎనిమిది మంది భారతీయులను ఖతార్‌లో అరెస్టు చేశారు. విచారణ అనంతరం వారికి మరణశిక్ష విధించారు. అయితే, భారత్ దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తూ చివరికి విజయం సాధించింది.'' అన్నారాయన.
"ఇది భారత్‌కు అద్భుతమైన దౌత్య విజయంగా భావిస్తున్నా" అన్నారు బాసిత్.
''భారత్ తన పౌరుల గురించి శ్రద్ధ వహిస్తుందని స్పష్టమైంది. ఖతార్ కూడా భారత్ మాట విన్నది. గత 10 నుంచి 15 ఏళ్లలో భారత్ ప్రభావం పెరిగింది. మన శత్రుదేశం నుంచి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చని నేను చెప్పాలనుకుంటున్నా. అందుకు భారత్ ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. ఈ మొత్తం వ్యవహారంలో మోదీ పెద్దన్న పాత్ర పోషించారు.''
''భారత్‌కు ఇలాంటి నెట్‌వర్క్‌లు ప్రతిచోటా ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో భారత్ సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్-భారత్ మధ్య సహకారం చాలా బలంగా ఉంది. భారత్ నెట్‌వర్క్ చాలా వరకూ విస్తరించి ఉంది. అందులో గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి'' అని అబ్దుల్ బాసిత్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు ఎలా సాధ్యమైంది?
హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, నేవీ మాజీ అధికారులను విడుదల చేయించేందుకు భారత అధికారుల బృందం చాలా రోజులుగా ఖతార్‌లో ఉంది.
భారతీయుల విడుదలకు సంబంధించిన చర్చల్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా మరికొందరు అధికారులు కీలక పాత్ర పోషించారని ఆ కథనంలో రాశారు.
ఈ విషయం గురించి డోభాల్ పలుమార్లు ఖతార్ వెళ్లినట్లు ఈ కథనం పేర్కొంది.
దుబాయ్‌లో జరిగిన కాప్-28 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తేనీని కూడా కలిశారు.
ఖతార్‌లోని భారతీయ కమ్యూనిటీ గురించి వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు ప్రభుత్వం తెలియజేసింది.
ఆ తర్వాత, ఎనిమిది మంది నేవీ మాజీ అధికారులలో ఏడుగురు భారత్‌కు తిరిగొచ్చారు.
కమాండర్ పూర్ణేందు తివారీ కుటుంబం ఖతార్‌లో నివసిస్తోంది. తివారీ తన కుటుంబాన్ని కలిసేందుకు దోహాలో ఉన్నారు. త్వరలోనే భారత్‌కు తిరిగి వస్తారు.
తివారీకి 2019లో 'ప్రవాసీ భారతీయ సమ్మాన్' పురస్కారం కూడా పొందారు. దహ్రా గ్లోబల్‌లో పనిచేసే సమయంలో, ఖతార్ నౌకాదళ సిబ్బందికి తివారీ శిక్షణ ఇచ్చేవారు.
భారత్‌కు తిరిగి వచ్చిన సమయంలో నేవీ మాజీ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ''మేం భారత్ తిరిగి రావడానికి 18 నెలలు వేచిచూశాం. ప్రధాన మంత్రికి కృతజ్ఞతలు. ఆయన జోక్యం, ఖతార్‌తో సంప్రదింపులతోనే ఇది సాధ్యమైంది'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖతార్‌తో భారీ ఒప్పందం
ఇటీవల గోవాలో 'ఇండియా ఎనర్జీ వీక్' జరిగింది. ఈ సందర్భంగా భారత్‌తో 20 ఏళ్ల పాటు ఎల్‌ఎన్‌జీ(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) విక్రయాలు, కొనుగోలు ఒప్పందం జరిగినట్లు ఖతార్ ఎనర్జీ ప్రకటించింది.
ఖతార్, భారత కంపెనీ పెట్రోనెట్ మధ్యనున్న ఒప్పందాన్ని 20 ఏళ్లపాటు పొడిగించారు.
ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఎగుమతిదారు. ఇటీవల అమెరికాను కూడా ఖతార్ అధిగమించింది.
ఖతార్ ఏటా 77 ఎంటీపీఏ (మిలియన్ టన్స్ పర్ ఇయర్) గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. దానిని 2027 నాటికి 126 ఎంటీపీఏకి పెంచాలని భావిస్తోంది. తద్వారా అమెరికా ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న ఆసియా, యూరప్ మార్కెట్‌లో తన పట్టు నిలుపుకోవచ్చు.
రెండు దేశాల మధ్య 20 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం ఉందని, భారత్‌లో ఖతార్ ముఖ్యమైన పెట్టుబడిదారు అని క్వాత్రా చెప్పారు.
ఖతార్‌లో నివసిస్తున్న 8,40,000 మంది భారతీయులు రెండు దేశాలను కలిపే అనుసంధానకర్తలు. ఈ పరిస్థితుల్లో ప్రధాని మోదీ ఖతార్ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యే దిశగా చర్చలు జరిగే అవకాశం ఉంది.
నేవీ మాజీ అధికారులను విడుదల చేసినందుకు భారత్ కృతజ్ఞతలు తెలిపే సమయంలో, ప్రధాని మోదీ ఈ విషయాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారని, వారి విడుదల కోసం అన్ని ప్రయత్నాలు చేశారని క్వాత్రా తెలిపారు.
నేవీ మాజీ అధికారులపై వచ్చిన ఆరోపణల గురించి ఖతార్, భారత్ ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. వారి విడుదలకు సంబంధించిన షరతుల గురించి కూడా ఎక్కడా తెలియజేయలేదు.
గూఢచర్యం ఆరోపణలపై వారిని అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఖతార్ - భారత్ మధ్య సంబంధాలు
భారత్, ఖతార్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఖతార్‌లో ఎనిమిది లక్షల మందికిపైగా భారతీయులు పనిచేస్తున్నారు.
2022 జూన్‌లో ఒక టీవీ షోలో బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్త గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో ఇరుదేశాల మధ్య కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.
ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, భారత అధికార పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఆ సమయంలో భారత్ నుంచి 'క్షమాపణ' డిమాండ్ చేసిన మొదటి దేశం ఖతార్. ఈ విషయంపై భారత రాయబారిని పిలిపించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నుపుర్ శర్మ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో ఆగ్రహ వాతావరణం సృష్టించాయని ఖతార్ తెలిపింది.
అయితే, నుపుర్ శర్మను పార్టీ నుంచి బీజేపీ సస్పెండ్ చేసింది. నుపుర్ శర్మపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు బీజేపీ చేసిన ప్రకటనను ఖతార్ స్వాగతించింది.
భారత్ స్పందిస్తూ, ''దేశ సాంస్కృతిక వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వమనే బలమైన సంప్రదాయాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవం ఇస్తుంది. కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది'' అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- ఉషాకిరణ్ ఖాన్: ప్రేమ రంగుల్ని, పల్లె జీవితాన్ని అక్షరాల్లో బంధించిన రచయిత
- ముక్కు యుద్ధం: ‘శత్రు రాజ్యంలోని ప్రజల ముక్కులు కోసి మూటకట్టి మైసూర్ మహారాజుకు పంపించారు’
- పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చి అరెస్టైన తమ పౌరుడిని విడుదల చేయాలని కోరిన బ్రిటన్
- బీజేపీ 'వైట్ పేపర్' x కాంగ్రెస్ 'బ్లాక్ పేపర్': ఆర్థిక వ్యవస్థ ఎవరి పాలనలో ఎలా ఉంది?
- సీత కోసం ప్రత్యేక ఆలయం... అక్కడే హనుమంతుడి ఆకారంలో పర్వతం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














