గుల్‌బదన్: ఒట్టోమాన్ సుల్తాన్‌ను ఎదిరించిన మొఘల్ యువరాణి కథ...

మొఘల్ యువరాణి

ఫొటో సోర్స్, JUGGERNAUT BOOKS

    • రచయిత, షెర్లిన్ మోలెన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సుమారు 450 ఏళ్ల కిందట అరబ్ ప్రపంచాన్ని ఏలుతున్న ఓ చక్రవర్తిని ఎదిరించిన యువరాణి కథ ఇది.

1576 నాటికి భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం అత్యున్నత దశలో ఉంది. అదే సమయంలో అరబ్ ప్రపంచం ఒట్టోమాన్ సామ్రాజ్యపు పాలనలో ఉంది. ఇక్కడ భారతదేశానికి అక్బర్ చక్రవర్తి కాగా, ఒట్టోమాన్‌ను సుల్తాన్ మురాద్ అలీ పరిపాలిస్తున్నాడు.

అదే కాలంలో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఒక యువరాణి మక్కా-మదీనాలకు ఒక అపూర్వమైన ప్రయాణాన్ని సాగించారు.

ఆ రోజుల్లో భారతదేశం నుంచి ఒక మహిళ హజ్ యాత్రకు వెళ్లడం అదే తొలిసారి. ఇస్లాం మతానికి సంబంధించి ఐదు కీలకమైన అంశాలలో హజ్ యాత్ర ఒకటిగా చెబుతారు.

ఆమె మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ కుమార్తె గుల్‌బదన్ బేగం, 53 సంవత్సరాల వయస్సులో ఫతేపూర్ సిక్రీలోని సౌకర్యవంతమైన రాణి వాసాన్ని వదులుకుని ఆరేళ్లపాటు తీర్థయాత్రలు చేయాలని నిర్ణయించుకున్నారు గుల్‌బదన్.

అయితే, ఈ ప్రయాణాన్ని గుల్‌బదన్ బేగం ఒంటరిగా ఏమీ సాగించలేదు. తనతో పాటు రాణి వాసానికి చెందిన కొంతమంది మహిళలను కూడా తీసుకుని వెళ్లారు.

అయితే, అపూర్వమైన, అద్భుతమైన ప్రయాణంగా చెప్పాల్సిన యాత్రకు సంబంధిన వివరాలు మాత్రం చరిత్ర రికార్డుల్లో లేవు.

రాణివాసపు గౌరవ మర్యాదల పేరిట అప్పటి రాజప్రసాదంలోని పురుష చరిత్రకారులు ఈ యాత్ర వివరాలను రికార్డు చేసి ఉండకపోవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.

మొఘల్ యువరాణి

ఫొటో సోర్స్, RANA SAFVI

చరిత్రలో లేని మహిళ సాహస యాత్ర

గుల్‌బదన్ చేసిన ఈ యాత్రను చరిత్రకారిణి, రచయిత రూబీలాల్ తన పుస్తకం ‘వాగాబాండ్ ప్రిన్సెస్: ది గ్రేట్ అడ్వెంచర్స్ ఆఫ్ గుల్‌బదన్'లో సవివరంగా రాశారు.

ఆమె సాగించిన ఈ ప్రయాణంలో సాహసాలతోపాటు తిరుగుబాటు స్వభావం కూడా కనిపిస్తుందని రూబీలాల్ రాశారు.

గుల్‌బదన్ బేగాన్ని మొఘల్ సామ్రాజ్యంలో మొట్టమొదటి, ఒకే ఒక చరిత్రకారిణిగా కూడా పరిగణిస్తారు.

ఆమె తన జీవితానుభవాలను తన పుస్తకం ‘హుమాయున్ నామా’లో రాశారు. అయితే, అది కూడా అసంపూర్ణంగా దొరుకుతోంది. ఈ పుస్తకంలో చాలా పేజీలు ఇప్పుడు అస్తిత్వంలో లేవు.

గుల్‌బదన్ బేగం అపూర్వ యాత్రపై పుస్తకం రాయడానికి ముందు పర్షియన్, మొఘల్ సామ్రాజ్యాలకు సంబంధించి అనేక రాత ప్రతుల(మాన్యుస్క్రిప్ట్)ను రూబీలాల్ పరిశోధించారు.

‘‘ఆ రోజుల్లో ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి రాసిన పుస్తకాలను అనేక కాపీలు తయారు చేయడం సర్వసాధారణం. కానీ, గుల్‌బదన్ రాసిన పుస్తకానికి సంబంధించి ఒక్క కాపీ కూడా అందుబాటులో లేదు.’’అని రూబీలాల్ అన్నారు.

‘‘ అంత సాహసోపేతమైన ఆమె యాత్ర గురించి సరైన వివరాలు దొరకలేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు’’ అని ఆమె అన్నారు.

మొఘల్ యువరాణి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్

రాజభోగాలకు దూరంగా...

గుల్‌బదన్ బేగం 1523లో కాబూల్‌లో పుట్టారు. ఆమె తల్లి దిల్దార్ బేగం బాబర్ మూడో భార్య. గుల్‌బదన్ పుట్టిన సమయంలో బాబర్ కాబూల్‌లో లేరు. భారతదేశంపై దండెత్తే ప్రయత్నాల్లో ఉన్నారు.

యుద్ధం మొదలైన తర్వాత బాబర్ ఇంటికి వచ్చి పోవడం బాగా తగ్గింది. గుల్‌బదన్‌కు అప్పుడప్పుడు మాత్రమే తండ్రిని చూసే అవకాశం కలిగేది.

అయితే, రాజప్రసాదంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులతో ఆమె తరచూ సమావేశమవుతుండేవారు.

తండ్రి బాబర్, సవతి సోదరుడు హుమయూన్, మేనల్లుడు అక్బర్‌లతో కూడా ఆమె తరచూ సమావేశాలు జరిపేవారు.

రాజకుటుంబంలోని పురుషులు సామ్రాజ్యాల విస్తరణకు యుద్ధాలు చేస్తుంటే, గుల్‌బదన్ రాణివాసంలో శక్తివంతమైన మహిళల నీడన పెరిగారు. బాబర్ తల్లి, అత్తలు, అక్కచెల్లెల్లు, భార్యలు, వారి కూతుళ్లతో ఆమె గడిపారు.

ఈ మహిళలు రాజప్రసాదంలో కీలకమైన పాత్ర పోషించారు. వారంతా రాజు, యువరాజులకు అత్యంత నమ్మకస్తులుగా, సలహాదారులుగా వ్యవహరించేవారు.

గుల్‌బదన్ చిన్నతనం నుంచి ప్రయాణాలంటే ఆసక్తి చూపేవారు. బాబర్ తన సామ్రాజ్యాన్ని ఆగ్రాకు విస్తరించిన తర్వాత కాబూల్ నుండి ఆగ్రాకు ప్రయాణించిన మొదటి మొఘల్ మహిళ గుల్బదన్ బేగం. అప్పుడామె వయసు ఆరు సంవత్సరాలు.

తమ కుటుంబాన్ని అఫ్గాన్ రాజు షేర్ షా సూరి భారతదేశం నుంచి తరిమేసినప్పుడు ఆమె వివాహితగా కాబూల్‌కు తిరిగి వచ్చారు.

యుద్ధాల కారణంగా ఆమె తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుండేది. ఈ ప్రయాణాలు నెలల తరబడి కొనసాగేవి. గుల్‌బదన్ బేగం రాజకుటుంబానికి చెందిన ఇతర మహిళలతో కలిసి కొండలు, గుట్టలు, అడవులను దాటుకుంటూ ప్రమాదకరమైన ప్రయాణాలు చేసేవారు.

‘‘మొఘల్ రాణివాసపు స్త్రీలకు సంచార జీవితానికి అలవాటు పడ్డారు. నిత్యం కొత్త ప్రాంతాలకు వెళ్లాల్సి రావడం, వారి భర్తలు యుద్ధాలలో పోరాడుతుంటే, తాత్కాలిక శిబిరాలలో నివసించడం అలవాటు చేసుకున్నారు’’ అని రూబీ లాల్ అన్నారు.

బహుశా ఈ ప్రయాణపు అలవాటు కారణంగానే తాను మక్కా యాత్రకు వెళతానని మేనల్లుడు అక్బర్‌ను అనుమతి కోరి ఉండొచ్చని రూబీలాల్ అన్నారు.

గుల్‌బదన్ బేగం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అక్బర్

అక్బర్‌ను ఒప్పించి....

అప్పట్లో అక్బర్ భారతదేశం మొత్తం మీద మొఘలు సామ్రాజ్యపు జెండా ఎగరేయాలని కలలుగంటున్నారు. ఈ క్రమంలో ఆయన తనను తాను పవిత్రమైన వ్యక్తిగా చూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అంతేకాదు, మొఘల్ మహిళలు అంత:పురం నాలుగు గోడల మధ్యే ఉండాలని నిర్ణయించిన మొదటి మొఘల్ చక్రవర్తి కూడా అక్బరే.

‘‘చక్రవర్తి తప్ప మరెవరికీ అంతఃపురంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. అందమైన కన్యలు ఈ అంతఃపురంలో ఉండేవారు. ఒక విధంగా మొఘల్ చక్రవర్తి తనను తాను దేవుడినని భావించేవారు." అని రూబీలాల్ రాశారు.

అయితే, తన జీవితంలో ఏర్పడిన ఈ స్తబ్దత గుల్‌బదన్ బేగంను ఇబ్బంది పెట్టింది.

తాను హజ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నట్లు 1576 అక్టోబరులో ఆమె అక్బర్‌‌కు చెప్పారు. తాను అక్కడికి వస్తానని దేవుడికి మొక్కుకున్నట్లు వెల్లడించారు.

అందుకు అంగీకరించిన అక్బర్ ఆమె ప్రయాణం కోసం సలీమీ, ఇలాహి అనే రెండు విలాసవంతమైన వాహనాలను వాడుకునేందుకు అనుమతి ఇచ్చారు.

దీంతో ఆమె, ఆమెతోపాటు కొందరు రాణివాసపు మహిళలు తాము దేవుడికి విరాళంగా ఇవ్వాలనుకున్న బంగారు, వెండి నగలను పెట్టెల్లో పెట్టుకున్నారు. వీటితో పాటు పెద్ద మొత్తంలో నగదు, భారీగా దుస్తులను కూడా సర్దుకున్నారు.

‘‘ఈ మహిళల కాన్వాయ్ అప్పటి మొఘల్ రాజధాని ఫతేపూర్ సిక్రీ వీధుల గుండా వెళుతున్నప్పుడు, వారిని చూడటానికి వీధుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు వేచి చూశారు." అని రూబీలాల్ రాశారు.

కానీ, ఈ ప్రయాణం ప్రమాదాలతోనే ప్రారంభమైంది. మక్కాకు సముద్ర మార్గం పోర్చుగీసు వారి ఆధీనంలో ఉంది. అప్పట్లో ముస్లింల ఓడలను దోచుకోవడం, తగులబెట్టడం వంటి దుశ్చర్యలకు దిగేవారు పోర్చుగీసువారు.

ఇక ఇరాన్ గుండా సాగే భూమార్గం అత్యంత ప్రమాదకరం. ఈ దారిలో ప్రయాణికులపై దాడి చేసి దోచుకునే దొంగల ముఠాలు ఉండేవి.

ఈ కారణంగా, గుల్‌బదన్, ఆమెతో పాటు బయలుదేరిన మహిళలు దాదాపు ఏడాదిపాటు సూరత్‌ పోర్టులోనే ఉండి పోవాల్సి వచ్చింది. పోర్చుగీసు వారి నుంచి ప్రమాదం లేదని తెలిసిన తర్వాతనే వారు తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి వచ్చింది.

సుమారు నాలుగు వారాలపాటు పడవ ప్రయాణం తర్వాత జెడ్డా చేరుకున్నారు. అక్కడి నుంచి నాలుగు రోజులపాటు కఠినమైన ఎడారిలో ఒంటెపై స్వారీ చేస్తూ మక్కా చేరుకున్నారు.

గుల్‌బదన్ బేగం

ఫొటో సోర్స్, WIKIMEDIA COMMONS

ఫొటో క్యాప్షన్, ఒట్టోమాన్ సుల్తాన్ మురాద్ అలీ

సుల్తాన్ మురాద్‌పై తిరుగుబాటు

మక్కా చేరుకున్న తర్వాత వారి యాత్రలో మరో కీలకమైన పరిణామం జరిగింది. ఆమె, ఆమెతోపాటు వచ్చిన మహిళలు అక్కడే నాలుగేళ్ళు ఉండాలని నిర్ణయించుకున్నారు.

‘‘వారు ఎంత సంతోషంగా అంత:పురాన్ని విడిచి వచ్చారో, అంతే సంతోషంగా ఈ ప్రవాసంలో ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకున్నారు’’ అని రూబీలాల్ రాశారు.

అక్కడ గుల్‌బదన్ బేగం, ఆమెతోటి రాజవాణపు స్త్రీలు మక్కాలో ఇస్తున్న కానుకలపై అక్కడ చర్చ మొదలైంది.

మొఘల్ సామ్రాజ్యపు యువరాణిగా గుల్‌బదన్ బేగం చేస్తున్న దానధర్మాలు ఒట్టోమాన్ సామ్రాజ్య సుల్తాన్ మురాద్‌కు కోపం తెప్పించాయి. ఎందుకంటే, ఇక్కడ రాజకీయంగా అక్బర్ ప్రాభవం పెరుగుతుందని ఆయన ఆందోళన చెందారు.

గుల్‌బదన్ బేగం, ఆమెతోపాటు ఉన్న రాణివాసపు స్త్రీలు ఈ ప్రాంతాన్ని వదలిపోవాలని ఒట్టోమాన్ సుల్తాన్ నాలుగుసార్లు ఆదేశాలు జారీ చేశారు. కానీ, ప్రతిసారీ ఈ ఆదేశాలను గుల్‌బదన్ తిరస్కరించారు.

‘‘ఇది ఒక మొఘల్ మహిళ తిరుగుబాటు. ఒక అపూర్వమైన సంఘటన. ఆమె తన స్వాతంత్ర్యం విషయంలో ఎంత పట్టుదలగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.’’ అని రూబీ లాల్ రాశారు.

గుల్‌బదన్ బేగం మొండి వైఖరిపై విసిగిపోయిన సుల్తాన్, టర్కిష్ భాషలో ఆమెను ఉద్దేశించి ఒక మాటను ప్రయోగించారు. ఇది అక్బర్‌కు కూడా కోపం తెప్పించింది.

చివరకు అయిదో ఆదేశం తర్వాత గుల్‌బదన్ బేగం 1580లో, సహచర మహిళలతో కలిసి అరబ్ ప్రాంతాన్ని విడిచి వచ్చారు.

రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 1582లో ఫతేపూర్ సిక్రీ చేరుకున్నారు.

తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె అదే ఆత్మ గౌరవంతో జీవించారు. ఆమెను ‘నవాబ్’గా గుర్తించారు అక్బర్. అక్బర్‌నామా రచనలో సహకరించాల్సిందిగా అక్బర్‌ ఆమెను కోరారు.

గుల్‌బదన్ బేగం చేసిన ఈ యాత్ర వివరాలు అక్బర్‌ నామాలో సవివరంగా ఉన్నాయి. కానీ, అతను అరబ్‌ ప్రపంచంలో గడిపిన సమయం, సుల్తాన్ మురాద్ చేసిన బహిష్కరణ ఆదేశాలు, దానికి సంబంధించిన సంఘటనల గురించి మాత్రం ప్రస్తావించలేదు.

ఇందులోనే కాదు, మరెక్కడా ఈ ప్రస్తావన కనిపించదు.

వీడియో క్యాప్షన్, జహంగీర్ నుంచి నిజాం రాజుల దగ్గరికి వచ్చిన 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)