హార్దిక్ పాండ్యాను కాదని రోహిత్‌ శర్మకు మరోసారి టీ20 కెప్టెన్సీ ఇవ్వడానికి కారణం ఇదేనా?

భారత క్రికెట్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ (ఫైల్)
    • రచయిత, విమల్ కుమార్
    • హోదా, బీబీసీ హిందీ కోసం

2023 డిసెంబర్ 25. దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు సెంచూరియన్‌లో జరిగిన మీడియా సమావేశంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను నేను (విమల్ కుమార్) కలిశాను.

టెస్టు సిరీస్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత 2024 జూన్‌లో జరగబోయే ప్రపంచ కప్‌ టోర్నీకి భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎవరుంటారని అడగాలనుకున్నాను.

ఎందుకంటే ఆ సమయంలో కెప్టెన్సీ చర్చనీయాంశమైంది. రోహిత్ శర్మ స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఉంటాడని వార్తలు వస్తున్నాయి.

రోహిత్ దగ్గరికి అలాంటి ప్రశ్నలు వచ్చిన ప్రతీసారి అతను వాటిని పక్కనపెట్టేశాడు. పదేపదే విలేఖరులు అలా అడగడంతో రోహిత్ స్పందిస్తూ- ''మీరు అడగాలనుకున్నది నాకర్థమైంది, త్వరలో మీకు సమాధానం తెలుస్తుంది'' అన్నాడు.

కానీ, 50 రోజుల తర్వాత గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు బీసీసీఐ సెక్రటరీ జై షా దీనిపై స్పష్టత ఇచ్చారు.

అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటాడని చెప్పడమే కాకుండా బార్బడోస్‌లో జరిగే ఫైనల్లో భారత్ గెలుస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు.

జై షా ఈ విషయం చెబున్నప్పపుడు, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులతోపాటు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అక్కడే ఉన్నారు.

అయితే, కొన్ని నెలల క్రితం ఇదే టీ-20 కెప్టెన్సీ గురించి అడిగితే, బీసీసీఐ సెక్రటరీ సమాధానం చెప్పలేదు. కెప్టెన్ గురించి నిర్ణయించడానికి అంత తొందరేమిటని ప్రశ్నించారు కూడా.

నిజానికి, భారత క్రికెట్‌లో టీ20 ప్రపంచ‌ కప్ కెప్టెన్సీ విషయం ఆసక్తికర మలుపులు తిరిగింది.

జై షా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, బీసీసీఐ కార్యదర్శి జై షా

2022 టీ20 ప్రపంచ కప్ ఓటమితో మొదలు

2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో టీమిండియా ఓడిన తర్వాత, ఇక టీ20లో భారత జట్టు తరపున విరాట్ కోహ్లీ, రోహిత్‌లకు దారులు మూసుకుపోయాయనే అనుకున్నారు.

జట్టులో చోటు గురించి ఈ సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. ఇలాంటి సున్నితమైన విషయాల గురించి, అటు బీసీసీఐ గానీ, ఇటు ఆటగాళ్లు గానీ స్పందించలేదు.

రోహిత్ టీ20 కెప్టెన్సీపై నీలినీడలు కమ్ముకున్నాయి.

కానీ, కథ ఒక్కసారిగా మారింది. 2023 వన్డే ప్రపంచ‌ కప్‌లో భారత్ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది, టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది.

రోహిత్ కెప్టెన్‌గా మాత్రమే కాకుండా ఓపెనర్‌గానూ సత్తా చాటాడు. రోహిత్ స్ట్రైక్ రేట్ చూసి అతను కెప్టెన్‌గా కాకపోయినా ఓపెనర్‌గా వెస్టిండీస్‌కు వెళతాడనే చర్చ ఊపందుకుంది.

హార్దిక్ పాండ్యా

ఫొటో సోర్స్, ANI

ముంబయిలోకి పాండ్యా ఎంట్రీతో మలుపు

ఆ సమయంలో పాండ్యా కూడా టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. అయితే వన్డే ప్రపంచకప్ టోర్నీ మధ్యలో గాయపడి వైదొలిగాడు పాండ్యా. తర్వాత ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.

ఇదే సమయంలో ఐపీఎల్ జట్టైన ముంబయి ఇండియన్స్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబయి కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించి, పాండ్యాను ఎంపిక చేశారు.

బీసీసీఐకి చీఫ్ సెలక్టర్‌గా ఉన్న అజిత్ అగార్కర్, భారత్ టీ20 కెప్టెన్సీ విషయంలో డైలమాలో ఉన్నారు. ఆయన కూడా దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.

అజిత్ అగార్కర్ (ఫైల్)

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అజిత్ అగార్కర్ (ఫైల్)

మరి రెండు నెలల్లో జరగబోయే ప్రపంచకప్ కోసం ఎలాంటి వ్యూహాలు రచించాలి? ఎవరితో చర్చించాలి?

ఈ విషయమై కోచ్ ద్రవిడ్‌తో సెలక్టర్ అగార్కర్ పలు సందర్భాల్లో చర్చించి ఉండవచ్చు. అదే సమయంలో కెప్టెన్‌గా రోహిత్‌నే కొనసాగించాలని అగార్కర్ గట్టిగానూ చెప్పలేరు. ఎందుకంటే అప్పటికి కెప్టెన్సీ పాండ్యాకు ఇస్తారా, లేదా అనేది తేలలేదు.

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన వెంటనే ప్రతి ఆటగాడు మరో రెండు నెలల పాటు ఐపీఎల్‌లో లీనమవుతారు.

మే రెండో వారం నుంచి టీమిండియా ఆటగాళ్లు క్రమంగా వివిధ గ్రూపులుగా కరీబియన్ గడ్డపైకి వెళ్లనున్నారు. దీంతో జట్టు వ్యూహాలు రచించడానికి ఇబ్బందులు తలెత్తవచ్చు.

రాహుల్, రోహిత్

ఫొటో సోర్స్, Getty Images

డ్రెస్సింగ్ రూంలో బాస్

మరి ప్రపంచ‌ కప్ కోసం జట్టు ప్రణాళిక బాధ్యతలను ఎవరు భుజానికెత్తుకుంటారు? ఇంత తక్కువ సమయంలో రోహిత్‌ను మించిన ఆటగాడు టీమిండియాలో దొరకడం కష్టం.

పాండ్యాకు మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో ముంబయి జట్టుకు కెప్టెన్‌గా బాధ్యత, ఆ తర్వాత టీమిండియాకు వచ్చే ప్రపంచ కప్‌లో మొదటిసారి నాయకత్వం రెండూ భిన్నమైనవి.

గత రెండేళ్లలో ద్రవిడ్‌తో రోహిత్ పనితీరు బాగుంది. గత ఏడాది కాలంలో అగార్కర్‌తో కూడా మంచి ఫలితాలు సాధించాడు.

ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్‌ని కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటిస్తే దాని వల్ల లాభమే తప్ప నష్టముండదు.

ఇక ఐపీఎల్ సమయంలో కొత్త కెప్టెన్ పాండ్యా నేతృత్వంలో రోహిత్ ఆడినప్పుడు అతడి అహం దెబ్బతినదు, ఎందుకంటే ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అతనే బాస్.

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, PANKAJ NANGIA

వ్యూహాలకు అవకాశం

వచ్చే రెండు నెలలు భారత జట్టు ప్రణాళికలపై ద్రవిడ్, అగార్కర్‌లతో రోహిత్ మాట్లాడగలడు, వ్యూహాలు రచించగలడు, కఠిన నిర్ణయాలూ తీసుకోగలడు.

అయితే ఐపీఎల్ జట్టు కెప్టెన్‌‌గా ఉన్న పాండ్యాతో టీ20 ప్రపంచ కప్ టోర్నీ చర్చలు జరపడం ద్రవిడ్, అగార్కర్‌లకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు.

ఐసీసీ ట్రోఫీ గెలవడం కంటే పెద్దదేమీ లేదని రోహిత్ ఇంతకుముందే చెప్పాడు.

నిరుడు డిసెంబరు 25 మధ్యాహ్నం సెంచూరియన్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ పూర్తయ్యాక రోహిత్ లిఫ్ట్ వైపు వెళుతుండగా, నేను కూడా వెళ్లాను.

రోహిత్ నా వైపు చూస్తూ.. ''ఇది నీ పని అని నాకు తెలుసు (క్లిష్టమైన ప్రశ్నలు అడగడం). కానీ నేను 15 ఏళ్లుగా భారత్ కోసం ఆడుతున్నా, అలాంటి ప్రశ్నలకు ఎలా బదులివ్వాలో నాకు తెలుసు'' అని చెప్పాడు.

సెంచూరియన్‌లో రోహిత్ చెప్పిన మాటలు నా మనస్సులో నిలిచిపోయాయి.

"హే మ్యాన్.. మేం చాలా కష్టపడ్డాం, మాకు పెద్ద విజయం కావాలి" అని రోహిత్ అన్నాడు.

"మనం ఎంత కష్టపడితే మనకు అంత పెద్ద విజయం కావాలి, కుర్రాళ్లందరూ నిరాశతో ఉన్నారు, వాళ్లు జట్టు కోసం ఏదైనా చేయగలరు, మేం గెలవాలి, దేశానికి, జట్టుకు గౌరవం తీసుకురావాలి" అని రోహిత్ అన్నాడు.

రోహిత్ మాటలు భారత జట్టు సభ్యులు విని, 2007లో మహేంద్ర సింగ్ ధోనీ సాధించిన ఘనతనే రోహిత్ సాధించేలా చేస్తారేమో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)