బుమ్రా నం.1 టెస్ట్ బౌలర్: కపిల్ దేవ్‌‌కూ సాధ్యం కాని అరుదైన ఘనతను ఈ పేసర్ ఎలా సాధించాడు?

బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శారద మియాపురం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జస్‌ప్రీత్ బుమ్రా, ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా నిలిచిన భారత తొలి పేసర్.

ఈ ర్యాంకుతో బుమ్రా ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా నిరూపించుకున్నాడు.

దాదాపు 44 ఏళ్ల క్రితం భారత దిగ్గజం కపిల్ దేవ్ అగ్రస్థానానికి దగ్గరగా వచ్చాడు. కానీ, నంబర్‌ వన్ ర్యాంకును అందుకోలేకపోయాడు. 1979-80 ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కపిల్ దేవ్ నంబర్-2 స్థానంలో నిలిచాడు.

టెస్టుల్లో కపిల్ దేవ్ అందుకోలేకపోయిన ఘనతను ఇప్పుడు బుమ్రా సాధించాడు.

విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి బుమ్రా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి 881 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఒక భారత పేస్ బౌలర్ ఐసీసీ ర్యాంకుల్లో తొలి స్థానంలో నిలవడం ఇదే ప్రథమం.

ఈ క్రమంలో టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో నంబర్‌ వన్ స్థానంలో ఉన్న భారత అగ్రశ్రేణి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (841 పాయింట్లు)ను బుమ్రా వెనక్కి నెట్టాడు. 2023 మార్చి నుంచి అశ్విన్ మొదటి ర్యాంకులో ఉన్నాడు.

దీనికంటే ముందు టెస్టుల్లో బుమ్రా సాధించిన అత్యుత్తమ ర్యాంకు మూడు.

కపిల్ దేవ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1979-80 ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కపిల్ దేవ్ నంబర్-2 స్థానంలో నిలిచాడు.
బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో 9 వికెట్లు తీసిన బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది

బుమ్రా యార్కర్

ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టు హైదరాబాద్‌లో, రెండో టెస్టు విశాఖపట్నంలో జరిగాయి. విశాఖ టెస్టులో బుమ్రా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో బుమ్రా ఓ అద్భుత ఇన్‌స్వింగింగ్ యార్కర్‌తో ఓలీ పోప్ మిడిల్, లెగ్ స్టంప్స్‌ను ఎగరగొట్టిన తీరు కేవలం స్పెషల్ కేటగిరీ బౌలర్లకు మాత్రమే సాధ్యమవుతుందని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించారు.

తాను చూసిన అత్యుత్తమ యార్కర్లలో ఇదొకటని ఆయన చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 1

భారత్ నుంచి నాలుగో బౌలర్

విశాఖ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 45 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇది పదోసారి.

34 టెస్టుల్లోనే బుమ్రా పదిసార్లు ఇలా ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.

విశాఖ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 46 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా తొమ్మిది వికెట్లు తీయడం ద్వారా టెస్టుల్లో వేగంగా 150 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా మరో రికార్డును అందుకున్నాడు.

హైదరాబాద్ టెస్టులోనూ బుమ్రా ఆరు వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుతానికి ఈ సిరీస్‌లో భారత్ తరఫున బుమ్రానే అత్యధిక వికెట్లు తీశాడు. 10.67 సగటుతో 15 వికెట్లు దక్కించుకున్నాడు. అయితే హైదరాబాద్ టెస్టులో 28 పరుగులతో భారత్ ఓడిపోయింది.

ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో ఇప్పటివరకు నలుగురు భారత బౌలర్లు మాత్రమే మొదటి ర్యాంకులో నిలిచారు.

అందులో నాలుగో బౌలర్, తొలి పేసర్ బుమ్రా. బుమ్రా కంటే ముందు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్ సింగ్ బేడీ నంబర్‌వన్ బౌలర్లుగా నిలిచారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది, 2

బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

విభిన్న బౌలింగ్ యాక్షన్, గాయాలు

బుమ్రా బౌలింగ్ యాక్షన్ విభిన్నంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా తక్కువ రనప్‌తో బుమ్రా ఎక్కువ పేస్‌ను సాధించగలిగాడు. కానీ, దీనివల్ల సమస్య ఏంటంటే, ఇది వెన్నెముక సమస్యలకు కారణం అవుతుంది.

ఈ బౌలింగ్ యాక్షన్‌తో బుమ్రా ఎక్కువ కాలం బౌలింగ్ చేయడం సాధ్యం కాదని అతను అంతర్జాతీయ కెరీర్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి విశ్లేషకులు భావించారు.

వయస్సు, ఫిట్‌నెస్ కారణంగా తొలి అయిదేళ్ల కాలంలో బుమ్రా ఇబ్బందులు ఎదుర్కోలేదు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌లో చాలా విజయవంతం అయ్యాడు. ఈ మధ్య కాలంలో కూడా అతను గాయాల పాలయ్యాడు. అయితే, అవి తీవ్ర గాయాలు కాదు.

2018లో ఎడమ చేయి బొటనవేలి గాయం కారణంగా ఇంగ్లండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు, 2 టెస్టులకు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకొని మూడో టెస్టులో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

2019లో బుమ్రా లోయర్ బ్యాక్‌ స్ట్రెస్ ఫ్రాక్చర్ సమస్యతో బాధపడ్డాడు. రొటీన్ రేడియాలజీ స్క్రీనింగ్‌లో ఈ సమస్యను గుర్తించారు. నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు.

బ్రిటన్‌లో చికిత్స తీసుకొని తర్వాత భారత్-న్యూజీలాండ్‌ సిరీస్‌తో మళ్లీ జట్టులోకి వచ్చాడు.

బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

వెన్నునొప్పి నుంచి కోలుకొని వరల్డ్‌ కప్‌లో సత్తా

2022లో వెన్నునొప్పి బుమ్రాను తీవ్రంగా బాధించింది. దీని కారణంగా చాలా కాలం పాటు ఆటకు దూరమయ్యాడు. ఈ సమస్య నుంచి కోలుకోవడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని తొలుత అనుకున్నారు. కానీ, దీన్నుంచి కోలుకోవడానికి దాదాపు 12 నెలల సమయం పట్టింది.

ఈ నొప్పి కారణంగా 2022 టీ20 ప్రపంచ కప్‌తో పాటు ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌కు బుమ్రా దూరమయ్యాడు.

2023 మార్చిలో వెన్నునొప్పికి శస్త్రచికిత్స జరిగింది. తర్వాత నాలుగు నెలల పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్ సెంటర్‌లో గడిపిన బుమ్రా, ఆగస్టులో ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్‌గా మళ్లీ జట్టులోకి పునరాగమనం చేశాడు.

అప్పటి నుంచి నిలకడగా రాణిస్తూనే ఉన్నాడు.

2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్‌లో జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో 11 ఇన్నింగ్స్‌లలో బుమ్రా 20 వికెట్లు పడగొట్టాడు.

ఆ టోర్నీలో బుమ్రా ప్రదర్శన గురించి మాట్లాడుతూ- ‘‘అతను తరానికొక్కడు’’ అని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసించాడు

అన్ని ఫార్మాట్లు ఆడగల నైపుణ్యాలు, మ్యాచ్‌లోని ప్రతీ దశలో ప్రభావం చూపగల సామర్థ్యాలు బుమ్రాకు ఉన్నాయని ద్రవిడ్ కితాబిచ్చాడు. అతనో మ్యాచ్ విన్నర్ అని చెప్పాడు.

పునరాగమనం చేసి బుమ్రా రాణించడం చూస్తుంటే చాలా బాగుందని కోచ్ సంతోషం వ్యక్తంచేశాడు.

గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేయడం సంతోషంగా ఉందని చెప్పడం కంటే చాలా ఉపశమనంగా ఉందనడం బాగుంటుందని బుమ్రా అన్నాడు. అనుకున్నదాని కంటే కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పాడు.

ఆ తర్వాత బుమ్రా టెస్టుల్లోనూ స్థిరంగా వికెట్లు పడగొట్టాడు.

2023 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ మొదలు, తాజాగా జరిగిన విశాఖపట్నం టెస్టు వరకు ఆడిన మొత్తం ఏడు టెస్టుల్లో బుమ్రా మొత్తం 27 వికెట్లు పడగొట్టాడు.

బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

నా శక్తియుక్తులన్నీ వాడతా: బుమ్రా

విశాఖ టెస్టులో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన తర్వాత బుమ్రా మాట్లాడుతూ- తాను నంబర్ల గురించి పట్టించుకోనన్నాడు. నంబర్ల గురించి పట్టించుకుంటే ఒత్తిడి పెరుగుతుందని చెప్పాడు.

‘‘భారత్ మ్యాచ్ గెలిచేందుకు నా వంతుగా కృషి చేయడం సంతోషంగా ఉంది. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడే సమయంలో మొదటి నేను నేర్చుకున్న తొలి డెలివరీ యార్కర్ వేయడం.

వికెట్లు తీయాలంటే యార్కర్ మాత్రమే మార్గమని నేను అనుకునేవాడిని. ఓలీ పోప్‌కు అందుకే యార్కర్ సంధించాను.

పేస్ బౌలింగ్ దళానికి నేను నాయకుడిని కాదు. కానీ, మేం సంధి దశలో ఉన్నాం. ఇతర పేసర్లకు మార్గనిర్దేశం చేయడం నా బాధ్యత.

ప్రతీ వికెట్ విభిన్నంగా ఉంటుంది. వికెట్ తీసేందుకు నా శక్తియుక్తులన్నీ వాడాల్సి ఉంటుంది’’ అని బుమ్రా చెప్పాడు.

వీడియో క్యాప్షన్, కపిల్ దేవ్‌‌కు సాధ్యం కాని అరుదైన ఘనతను బుమ్రా ఎలా సాధించాడు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)