యూథనేషియా: చేతిలో చెయ్యేసి మృత్యు ఒడిలోకి.. నెదర్లాండ్స్ మాజీ ప్రధాని జంట ఇలా ఎందుకు చనిపోయారు?

వాన్ దంపతులు

ఫొటో సోర్స్, NIEK TÖNISSEN / RADBOUD UNIVERSITY

నెదర్లాండ్స్‌ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అగ్ట్, ఆయన భార్య యుజినీ ఒకరి చేతిని మరొకరు పట్టుకొని మరణించారు. వీరివి కారుణ్య మరణాలు(యూథనేషియా).

వీరు ఫిబ్రవరి 5న చనిపోయారు. వీరి వయసు 93 ఏళ్లు.

''భయంలేనిది, స్ఫూర్తిదాయకమైనది'' అంటూ ది రైట్స్ ఫోరం సంస్థ, తన వ్యవస్థాపకుడు అయిన వాన్ మృతి గురించి ప్రకటన చేసింది. వాన్, యుజినీ ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో యూథనేషియాను ఎంచుకున్నారని తెలిపింది.

వాన్ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారు. చాలా సంవత్సరాలు ప్రభావవంతమైన పాత్ర పోషించారు.

వాన్‌కు 2019లో స్ట్రోక్‌ రావడంతో పూర్తిగా కోలుకోలేకపోయారు. అదే సమయంలో ఆయన భార్య యుజీనీ ఆరోగ్యం కూడా క్షీణించింది.

నెదర్లాండ్స్‌లో 2002 నుంచి యూథనేసియా, అసిస్టెడ్ సూసైడ్‌లను అనుమతిస్తున్నారు.

ఐరోపాలోని ఈ దేశంలో జంటలు యూథనేషియాను ఎంచుకొనే ధోరణి పెరుగుతోంది. చట్ట ప్రకారం- ప్రాణాంతకమైన మోతాదులో డ్రగ్ తీసుకొని ప్రాణాలు విడుస్తున్నారు.

2022లో నెదర్లాండ్స్‌లో జరిగిన దాదాపు 9,000 యూథనేసియాల్లో 29 జంటలు ఇలా మరణించారు.

వాన్ దంపతులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాన్ అగ్ట్ 1987లో జపాన్‌లో యూరోపియన్ యూనియన్ రాయబారిగా నియమితులయ్యారు.

ఏడు దశాబ్ధాల బంధం

వాన్, యుజీనీ ఇద్దరూ 70 ఏళ్లు కలిసి జీవించారు. వాళ్లిద్దరూ తూర్పు నెదర్లాండ్స్‌లోని నిజ్మెగెన్‌లో ఆర్ట్స్ విద్యార్థులుగా కలిశారు. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

1931లో జన్మించిన వాన్ క్యాథలిక్ పరిసరాల్లో పెరిగారు. ఆయన న్యాయశాస్త్రం చదివారు. వ్యవసాయ, మత్స్య, న్యాయశాఖల్లో ఆయన న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టారు.

ఆయన న్యాయ శాఖ మంత్రి (1971-72)గా, విదేశీ వ్యవహారాల మంత్రి (1982)గా పనిచేశారు. 1977 నుంచి 1982 మధ్య మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఆ తర్వాత జపాన్, యునైటెడ్ స్టేట్స్‌కు యూరోపియన్ యూనియన్ రాయబారిగా నియమితులయ్యారు.

వాన్ రాజకీయ జీవితంలో యుజీనీ క్రియాశీల పాత్ర పోషించారు. ఆయన వెన్నంటే నడిచి సలహాలు ఇస్తుండేవారు. స్థానిక, విదేశీ కార్యక్రమాల్లో ఆయనతో కనిపించేవారు.

వాన్, యుజీనీ ఒకరిపై మరొకరి ఇష్టాన్ని బహిరంగంగానే వ్యక్తపరిచేవారు, అభిమానులను పలకరిస్తూ ప్రజా జీవితంలో కనిపించేవారు.

వాన్ 2009లో ది రైట్స్ ఫోరంను స్థాపించారు. అనంతరం యుజీనిని కూడా ఆ సంస్థ వైపే నడిపించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి కోసం ఈ సంస్థ ప్రయత్నించింది.

పాలస్తీనా ప్రజల స్థితుగతులను, వారికి జరుగుతున్న అన్యాయాలపై వాన్ పలు వ్యాసాలు, రెండు పుస్తకాలు రాశారు. 2019లో వాన్‌ పక్షవాతం బారిన పడ్డారు. దాన్నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేకపోయారు.

వాన్ సృజనాత్మకత, ఏకాగ్రత, ప్రసంగాలు చేసే సామర్థ్యం తగ్గిపోవడంతో ఆయన నిరాశ చెందారని రైట్స్ ఫోరం తెలిపింది.

ఇదే సమయంలో యుజీని కూడా అనారోగ్యం బారిన పడ్డారు. బతికితే కలిసి బతకాలని, లేదంటే కలిసి చనిపోవాలని నిర్ణయించుకుని వారు యూథనేసియా నిర్ణయం తీసుకున్నారని రైట్స్ ఫోరం తెలిపింది.

ఇరువురినీ వారు మొదట కలుసుకున్న నిజ్మెగెన్‌లో ఖననం చేశారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలున్నారు.

వాన్‌‌కు నెదర్లాండ్స్ ప్రస్తుత తాత్కాలిక ప్రధాని మార్క్ రుట్టే నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డచ్ రాజ కుటుంబం, వాన్ వ్యక్తిత్వం, శైలిని ప్రశంసించింది.

వాన్ దంపతులు

ఫొటో సోర్స్, Getty Images

యూథనేసియా అంటే ఏమిటి?

పేషెంట్ చనిపోవాలని నిర్ణయించుకుని వైద్యుల సాయంతో స్వచ్ఛందంగా మరణించడమే యూథనేసియా.

అయితే, ఆ వ్యక్తికి తన నిర్ణయం పట్ల స్పృహ ఉండాలి. వారి కోరికను సహేతుకంగా, నిలకడగా వ్యక్తపరచగలగాలి.

నెదర్లాండ్స్‌లో 2002 నుంచి దీనిని అనుమతిస్తున్నారు. ఇది చట్టానికి లోబడే ఉంటుంది.

భరించలేని బాధలను అనుభవిస్తున్న పేషెంట్ల నుంచి, యూథనేసియా కోసం అభ్యర్థనలు వస్తుంటాయి.

యూథనేసియా ఎన్ని రకాలు?

యూథనేసియా రెండు రకాలు. యాక్టివ్ యూథనేసియాకు, పాసివ్ యుథనేసియాకు మధ్య తేడా ఉంటుంది.

ఒక వ్యక్తికి ఔషధాలు కానీ, ప్రాణాంతక ఇంజక్షన్ కానీ ఇవ్వడం వంటి చర్యల ద్వారా చనిపోవడానికి అనుమతిస్తే దానిని యాక్టివ్ యుథనేసియా అంటారు.

తీవ్రంగా జబ్బుపడిన ఒక రోగి దయనీయ స్థితికి ముగింపు పలకడానికి చికిత్సను ఆపేయడం, లేదా కృత్రిమ శ్వాస అందించే యంత్రాలు వంటి వ్యవస్థలను నిలిపివేయడం ద్వారా మరణానికి అనుమతిస్తే, దానిని పాసివ్ యుథనేసియా అంటారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)