ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, క్యాష్ చేసుకోని బాండ్ల సొమ్మును 15 రోజుల్లో దాతలకు తిరిగి ఇచ్చేయాలి: సుప్రీం కోర్టు స్పష్టీకరణ

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని, దానిని రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచడం సమాచార హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.
2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్‌కు అందించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆదేశాలు జారీ చేశారు.
మూడు వారాల్లోగా ఈ సమాచారం ఎన్నికల కమిషన్‌కు అందజేయాల్సి ఉంటుంది. 2024 మార్చి 13లోగా ఈ సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లో ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీం కోర్టు కోరింది.
రాజకీయ పార్టీలు ఇంకా తీసుకోని, 15 రోజులలోపు చెల్లుబాటు ఉన్న ఎలక్టోరల్ బాండ్లను తిరిగి కొనుగోలుదారులకు ఇచ్చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయ్, జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గతేడాది నవంబర్‌లో తీర్పును రిజర్వ్ చేసి గురువారం నాడు తీర్పు చెప్పింది.
రాజకీయ పార్టీలు, సంస్థలకు వచ్చిన నిధుల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఇది ఆర్టికల్ 19(1)(a) ప్రకారం ఓటర్ల సమాచార హక్కును ఉల్లంఘించినట్లేనని పేర్కొంది.
పార్టీలు తమకు అందిన విరాళాల విరాలను అందించాల్సిన అవసరం లేకుండా ఈ స్కీమ్‌లో చేసిన చట్ట సవరణలను సవాల్ చేస్తూ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫామ్స్ (ఏడీఆర్)తోపాటు కాంగ్రెస్ పార్టీ నేత జయా ఠాకూర్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్టు), మరికొందరు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
సుప్రీంకోర్టు తీర్పును ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కొనియాడారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేస్తుందని ప్రశాంత్ భూషణ్ అన్నారు.
సుప్రీం కీలక వ్యాఖ్యలు
- దాతల వివరాలు చెప్పకుండా బాండ్లు తీసుకోవడం సమాచార హక్కును ఉల్లంఘించడమే
- క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఈ సవరణలు ఉన్నాయి.
- నల్లధనాన్ని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదు.
- వివరాలను గోప్యంగా ఉంచడం ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించడమే.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రభుత్వం కోర్టులో ఏం చెప్పింది?
సరైన బ్యాంకింగ్ మార్గాల రాజకీయ విరాళాల వల్ల బ్లాక్ మనీ ప్రభావం ఉండదని కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. అలాగే, దాతలపై రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రతీకారం తీర్చుకోకుండా వారి వివరాలను గోప్యంగా ఉంచడం కూడా అవసరమని ప్రభుత్వం వాదించింది.
ప్రభుత్వ వాదనలపై రాజ్యాంగ ధర్మాసనం అనేక ప్రశ్నలను లేవనెత్తింది. 'సెలెక్టివ్ అనానిమిటీ' ఉద్దేశపూర్వకంగా వివరాలు గోప్యంగా ఉంచడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, పార్టీలకు ఆర్థికంగా వెన్నదున్నుగా నిలిచే ప్రక్రియను చట్టబద్ధం చేస్తున్నారా అని ప్రశ్నించింది. దాతల వివరాలు తెలుసుకోవడం అధికార పార్టీకే సాధ్యమని, విపక్ష పార్టీలు అలాంటి సమాచారాన్ని పొందలేవని ధర్మాసనం పేర్కొంది.
అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అలాగే, కంపెనీలు తమ నికర లాభంలో గరిష్టంగా 7.5 శాతం మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాలుగా ఇవ్వాలనే షరతును తొలగించడంపై కూడా ధర్మాసనం ప్రశ్నలు సంధించింది.
ఏమిటీ ఎలక్టోరల్ బాండ్స్ ?
2018లో ఈ బాండ్లను ప్రవేశపెట్టారు. కాలపరిమితితో, వడ్డీ రహితంగా ఈ బాండ్ల విలువ రూ. 1000 నుంచి రూ. కోటి వరకు ఉంటాయి. వీటిని ప్రభుత్వ బ్యాంకుల నుంచి కొనుగోలు చేయొచ్చు. వీటిని ఏడాది పొడవునా నిర్దేశించిన సమయాల్లో విక్రయిస్తుంటారు.
ప్రజలతోపాటు సంస్థలు కూడా ఈ బాండ్లను కొనుగోలుచేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందించొచ్చు. ఆ పార్టీలు 15 రోజుల్లోగా వీటిని బ్యాంకులో జమచేసి డబ్బులను పొందే వీలుంటుంది. అయితే, కేవలం గత పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు పొందిన రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలే ఈ బాండ్లను పొందేలా నిబంధనలు తీసుకొచ్చారు.

ఫొటో సోర్స్, AFP
అక్రమ ఆదాయానికి కళ్లెం వేసేందుకు..
రాజకీయ పార్టీలకు నల్ల ధనం చేరకుండా అడ్డుకునేందుకు, పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకత కోసం ఈ బాండ్లను ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే, ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ఈ బాండ్లు మారాయని విమర్శకులు అంటున్నారు. ఈ బాండ్ల చుట్టూ గోప్యత సంకెళ్లు ఉన్నాయని వారు విమర్శిస్తున్నారు.
అసలు ఈ బాండ్లు ఎవరు కొంటున్నారు? ఎవరికి వీటిని ఇస్తున్నారు? లాంటి వివరాలను ప్రజల ముందు ఉంచడం లేదు, అందుకే వీటిని రాజ్యాంగ విరుద్ధమైనవని విమర్శలు వస్తున్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) విశ్లేషించింది.
‘‘అదే సమయంలో ఇక్కడ పూర్తిగా గోప్యత ఉందని అనుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ బ్యాంకుల దగ్గర అటు బాండ్లు కొంటున్నవారు, ఇటు తీసుకుంటున్న వారు.. ఇద్దరి వివరాలూ ఉంటున్నాయి. అంటే ప్రభుత్వం కావాలంటే ఈ వివరాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు. లేదా విరాళాలు ఇచ్చే వారిని ప్రభావితం కూడా చేయొచ్చు’’ అని కొందరు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
‘‘ఏదిఏమైనప్పటికీ అధికారంలో ఉండేవారికి ఈ బాండ్లు చాలా ప్రయోజనాలు ఇస్తాయి’’ అని ఏడీఆర్ సహ-వ్యవస్థాపకుడు జగ్‌దీప్ ఛోకర్ గతంలో బీబీసీతో అన్నారు.
2017లో ఈ బాండ్లను మొదట ప్రవేశపెట్టినప్పుడు, వీటి వల్ల ఎన్నికల్లో పారదర్శకత కొరవడుతుందని ఎన్నికల సంఘం వ్యాఖ్యానించింది. మరోవైపు అక్రమ నగదు రాజకీయాల్లోకి రాకుండా ఈ బాండ్లు అడ్డుకోలేవని కేంద్ర బ్యాంకు, న్యాయ మంత్రిత్వ శాఖలోని అధికారులతోపాటు కొందరు ఎంపీలు కూడా చెప్పారు.
‘ఎన్నికల బాండ్లతో ఓ అపారదర్శక విధానాన్ని ప్రభుత్వం చట్టబద్ధం చేసింది’’అని వాషింగ్టన్‌కు చెందిన కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన మిలన్ వైష్ణవ్ గతంలో వ్యాఖ్యానించారు.
‘‘దాతలు ఎంత మొత్తంలోనైనా తమకు నచ్చిన పార్టీకి విరాళాలు అందించుకోవచ్చు. ఇక్కడ ఏ వర్గమూ తమ వివరాలు బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు. దీన్ని పారదర్శక విధానంగా చెబుతున్నారు. నిజానికి ఇది పారదర్శకత అనే పదానికి కొత్త నిర్వచనంగా చూడొచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, SAM PANTHAKY
పారదర్శకత అవసరమే...
రాజకీయ పార్టీల ఆదాయ మార్గాల్లో పారదర్శకత అవసరమనే అంశంతో అందరూ ఏకీభవిస్తున్నారు. ఎన్నికలు నానాటికీ చాలా ఖరీదైనవిగా మారుతున్నాయి. వీటికి చాలా వరకు ప్రైవేటు విరాళాలే ఆధారం.
2019 సార్వత్రిక ఎన్నికల ఖర్చు దాదాపు 7 బిలియన్ డాలర్లు (రూ.5,72,59 కోట్లు)గా అంచనాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అంత మొత్తంలో ఎన్నికల కోసం ఖర్చు చేస్తోంది ఇక్కడే.
నానాటికీ ఇక్కడ ఓటు హక్కు పొందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో 90 కోట్ల మంది ఓటు హక్కు కోసం రిజిస్టర్ చేసుకున్నారు. 1952లో ఇది కేవలం 4 లక్షలు మాత్రమే. అంటే ఓటర్లకు చేరువయ్యేందుకు అభ్యర్థులు మరింత ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. చాలాచోట్ల మూడంచెల వ్యవస్థ (గ్రామ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం) అమలులో ఉంది. అంటే ఇక్కడ మూడంచెల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఏటా సమర్పిస్తుంటాయి.. కానీ
రాజకీయ పార్టీలు ఏటా ఎన్నికల సంఘానికి తమ ఆదాయం, ఖర్చుల వివరాలు సమర్పిస్తుంటాయి. ఇక్కడ ‘‘అన్‌నోన్ సోర్సెస్’’ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది. దీని కిందే బాండ్ల వివరాలను కూడా చూపిస్తుంటారు. అయితే, 70 శాతం వరకు ఆదాయం ఇలానే వస్తోందని ఏడీఆర్ చెబుతోంది. ఈ బాండ్లతో ఇప్పటివరకు తీసుకొచ్చిన సంస్కరణలు దశాబ్దాల వెనక్కి వెళ్లిపోయాయని ఆ సంస్థ వాదించింది.
పారదర్శకత విషయంలో ఈ విధానం చాలా మెరుగ్గా ఉందని బీజేపీ వాదించింది. ఇది వరకు రాజకీయ పార్టీల ఆదాయం మొత్తం సూట్‌కేసుల ద్వారా చేతులు మారేదని, ఇలాంటి వాటికి దీనితో చెక్ పడుతుందని బీజేపీ అంటోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








