ఈ ఉపగ్రహం భూమి వైపు దూసుకొస్తోంది.. ఇది ఎక్కడ పడనుంది?

ఫొటో సోర్స్, ESA
ఓ యూరోపియన్ ఉపగ్రహం భూమి వైపు దూసుకొస్తోంది. ఇది బుధవారం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేశారు.
అంతరిక్షం నుంచి భూమి పర్యవేక్షణకు ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించింది. దీని పేరు ఈఆర్ఎస్-2.
2011లోనే ఈ ఉపగ్రహం పనిచేయడం ఆగిపోయింది. అప్పటి నుంచి ఇది భూమికి దగ్గరగా రాసాగింది. ఇది ఏ క్షణంలోనైనా నియంత్రణ కోల్పోయి భూవాతావరణంలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు.
అయితే భూ ఉపరితలం చేరుకోకమునుపే ఇలాంటి ఉపగ్రహాలు దగ్దమైపోతాయని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.
ఇలాంటి ఉపగ్రహాలు సాధారణంగా రెండు టన్నుల బరువు ఉంటాయి.
భూ వాతావరణంలోకి ప్రవేశించకముందే ఉపగ్రహంలోని చాలా భాగాలు కాలిపోతాయని, మిగిలిన శకలాలు పడినా నష్టం పెద్దగా వాటిల్లక పోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఉపగ్రహ శకలాలు ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా పడే అవకాశం ఉంది.
కానీ భూమిపైన అధికభాగం సముద్రాలే కాబట్టి, ఇలాంటి ఉపగ్రహాలు అక్కడే పడే అవకాశమే ఎక్కువ.
‘‘భూమిపైకి తిరిగొచ్చే ఈ ఉపగ్రహ శకలాలు రేడియో ధార్మిక పదార్థాల్లాంటి విషపూరితమైనవి కావనే విషయాన్ని గమనంలోకి తీసుకోవడం చాలా ముఖ్యం’’ అని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఎర్త్ అబ్జర్వేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ విభాగానికి చెందిన మిర్కో అల్బానీ చెప్పారు.
భూ వాతావరణంలోకి ప్రవేశించే వాటిల్లో కాలిపోని ఉపగ్రహ అంతర్గత పానెళ్ళు, కొన్ని లోహ భాగాలు ఉంటాయి.

ఫొటో సోర్స్, ESA
ఉపగ్రహాలకు ‘తాత’
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒకే విధమైన రెండు ఎర్త్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను (ఈఆర్ఎస్), 1990ల్లో ఈఆర్ఎస్-1, ఈఆర్ఎస్-2 పేరుతో ప్రయోగించింది.
ఆ సమయంలో అవి అత్యంత అధునాతన ఉపగ్రహాలు. భూమి, సముద్రాలు, గాలిలో జరిగే మార్పులను కొలిచే పరికరాలను వాటిల్లో అమర్చారు.
వరదల సమాచారాన్ని, సముద్రాలు, ఖండాల ఉష్ణోగ్రతలు, భూకంపాల వల్ల కలిగే మార్పుల సమాచారాన్ని ఈ ఉపగ్రహాలు సేకరించేవి.
సూర్యుడి నుంచి అతినీల లోహిత కిరణాలు భూమిపైన పడకుండా అడ్డుకునే ఓజోన్ పొర పనితీరును పర్యవేక్షించే సామర్థ్యం కూడా ఈఆర్ఎస్-2కు ఉండేది.
భూమిని పర్యవేక్షించే ఉపగ్రహాలకు ఈ రెండు తాతల్లాంటివని ఐరోపాలో పిలుచుకునేవారు.
వీటిల్లో భూమిపైకి ముందుగా దూసుకు వస్తున్న ఉపగ్రహం ఈఆర్ఎస్–2.

ఫొటో సోర్స్, AIRBUS
అంతరిక్ష వ్యర్థాలతో ప్రమాదం
ఈఆర్ఎస్ ఉపగ్రహాలు ప్రయోగించిన సమయంలో అంతరిక్ష వ్యర్థాల గురించి కఠినమైన మార్గదర్శకాలేవీ లేవు. కానీ ఇప్పడు అంతరిక్షంలో ఎలాంటి వ్యర్థాలనూ వదిలివేయకూడదనే కొత్త విధానాన్ని ఈపీఏ తయారు చేసింది.
దీంతో ఉపగ్రహాలు పనిచేయడం మానేసిన నాటినుంచి ఐదేళ్ళలోపు వాటిని ధ్వంసం చేయాల్సి ఉంటుంది.
అలాగే భవిష్యత్తులో ప్రయోగించే ఉపగ్రహాలను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేలా అదనపు ఇంధనాన్ని నింపాల్సి ఉంటుంది.
ఇప్పుడు ప్రపంచమంతటా ఉపగ్రహ ప్రయోగాలు పెరిగాయి. దీంతో అవి ఒకదానితో మరొకటి ఢీకొట్టే ప్రమాదం కూడా ఉంది.
అందుకే వాటిని సురక్షితంగా వెనక్కి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు పరిశోధకులు.
భూమికి 780 కిలోమీటర్ల పైన ఈఆర్ఎస్2ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈఆర్ఎస్2లో మిగిలి ఉన్న ఇంధనం కారణంగా 2011లో దానిని భూమికి 570 కిలోమీటర్ల దూరానికి తీసుకురాగలిగారు. దీనివల్ల ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించి 15 ఏళ్లలోపు పేలిపోతుందని అంచనా వేశారు. ఇప్పడీ అంచనా నిజం కాబోతోంది.
అదే సమయంలో ఈఆర్ఎస్ -1ను భూమిపైకి సురక్షితంగా తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ దాంతో సంబంధాలు తెగిపోవడంతో సాధ్యపడలేదు.
ప్రస్తుతం ఇది భూమిపైన 700 కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో పరిభ్రమిస్తోంది.
ఇది పూర్తిగా భూ వాతావరణంలోకి వచ్చి ధ్వంసమవడానికి మరో 100 ఏళ్ళు పట్టొచ్చు.
అంతరిక్షంలో చెత్త పేరుకుపోవడం పెరిగిందని, వాటిని కచ్చితంగా తొలగించాలని, అంతరిక్ష రక్షణ కోసం పనిచేస్తున్న సెక్యూర్ వరల్డ్ ఫౌండేషన్ గ్రూపు చెప్పింది.
అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాల వల్ల కొత్త ఉపగ్రహాలకు ముప్పు ఉందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి :
- ఉపవాసం చేస్తే బరువు తగ్గుతారా? ఫాస్టింగ్తో శరీరంలో ఏం జరుగుతుంది?
- రూ.2,800 కోట్ల జాక్పాట్ తగిలిన వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన లాటరీ కంపెనీ
- గ్రేట్ నికోబార్: భారత ప్రభుత్వ 74 వేల కోట్ల ప్రాజెక్ట్ ఆ తెగకు మరణ శాసనంగా మారనుందా
- దేశంలో పంటలకు కనీస మద్దతు ధర అవసరం లేదా? రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కావాల్సిన వేరే పద్ధతులేంటి
- మూత్రాన్ని బకెట్లలో పట్టుకుని ప్రజలు దంతాలు, దుస్తులు శుభ్రం చేసుకునే రోజుల్లో దానిపై పన్ను వేసిన రోమన్ చక్రవర్తులు... అసలేమిటీ చరిత్ర?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














