ఎస్. జైశంకర్: రష్యా విషయంలో భారత్ 'స్మార్ట్' అని అమెరికా విదేశాంగ మంత్రితో ఎందుకన్నారు?

ఫొటో సోర్స్, THOMAS TRUTSCHEL/PHOTOTHEK VIA GETTY IMAGES
రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినప్పటికీ, రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు.
తమ ముందున్న ఎన్నో అవకాశాలను దృష్టిలో ఉంచుకుని భారత్ 'స్మార్ట్'గా నిర్ణయం తీసుకుందని, దానిపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం, యుక్రెయిన్ యుద్ధం వంటి అంశాలతో పాటు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సందర్భంగా నిర్వహించిన ప్యానెల్ చర్చలో జైశంకర్ మాట్లాడారు.
ఇందులో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జర్మన్ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్ కూడా ఉన్నారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం తర్వాత కూడా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ''అందులో తప్పేముంది, ఎందుకు దానిని ఓ సమస్యగా చూడాలి? నేను తెలివైన వాడినైతే, నాకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు, మీరు నన్ను అభినందించాలి. అయినా అది ఇతరులకు ఎలా సమస్య అవుతుంది? నేను మాత్రం సమస్య అని అనుకోవడం లేదు, ముఖ్యంగా ఈ విషయంలో. ప్రతి దేశానికి సొంత అవసరాలు, సొంత సమస్యలు ఉంటాయని తెలియజేయాలని అనుకున్నాం'' అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS/ALY SONG
రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఏమన్నారు?
''వివిధ దేశాలతో బహుముఖ సంబంధాలను కొనసాగించడం కష్టమైన పని. ఆయా దేశాలతో వారి సంబంధాలకు గత చరిత్ర కూడా కీలకం. అమెరికా, జర్మనీ మధ్య సంబంధాలకు కూడా అలాంటి చరిత్రే ఉంది. వారి ప్రయోజనాలకు అనుగుణంగానే పరస్సర సంబంధాలు మొదలయ్యాయి'' అన్నారు జైశంకర్.
''అది మా విషయంలో కొంచెం భిన్నంగా ఉంటుంది. ఎలాంటి భావోద్వేగాలకు తావులేకుండా వ్యాపారం చేయాలనుకుంటున్నాం. మేం మెరుగైన సంబంధాల కోసం ప్రయత్నిస్తాం, అన్నింటినీ విశ్వసిస్తాం. కానీ, రెండు దేశాలంటే రెండు వేర్వేరు ప్రాంతాలు. అభివృద్ధి విషయంలోనూ దేశాల మధ్య తేడా ఉంటుంది, ఆయా దేశాల ప్రయోజనాలూ వేర్వేరుగానే ఉంటాయి. దేశాలతో సంబంధాల విషయంలో అవన్నీ పరిగణలోకి వస్తాయి'' అని జై శంకర్ అన్నారు.
''జీవితం చాలా క్లిష్టమైనది, అందరికీ ఒకే పరిస్థితులు ఉండవు. మంచి స్నేహితులు కొన్ని అవకాశాలు ఇస్తారని, తెలివైన భాగస్వాములు వాటిలో కొన్నింటిని వాడుకుని, మిగిలిన వాటిని వదిలేస్తారన్న ఆంటోని బ్లింకెన్ వాదనతో ఏకీభవిస్తున్నా. కానీ, అన్నింటినీ అవతలి వాళ్లు చూస్తున్న కోణంలోనే చూడడం సాధ్యం కాదు. ఆ యుగం ఇప్పటికే ముగిసిపోయిందని అనుకుంటున్నా'' అన్నారు.
ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారు, మీరు ఎప్పుడైనా, ఏదైనా చేయడం మీ మిత్రదేశం అమెరికా దృష్టిలో సరైనదేనా? అని జైశంకర్‌ని సూటిగా ప్రశ్నించారు.
జైశంకర్ అలా మాట్లాడుతున్న సమయంలో, అమెరికా విదేశాంగ మంత్రి ఆయన్ను చూసి నవ్వుతూ ఉన్నారు.
అంతకుముందు అమెరికా విదేశాంగ శాఖ ఈ విషయంపై స్పందిస్తూ ''భారత్‌పై ఎలాంటి ఆంక్షలు విధించబోవడం లేదు, ఎందుకంటే, భారత్‌తో సంబంధాలు అమెరికాకి చాలా ముఖ్యం. అదేకాకుండా యుద్ధం ఆపాలని భారత్ కూడా కోరింది'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరి
రెండేళ్ల కిందట, యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై 2022 డిసెంబర్‌లో యూరోపియన్ యూనియన్ కూడా దాదాపు నిషేధం విధించింది.
యుద్ధాన్ని ఆపేయడం గురించి, ఇరుదేశాల మధ్య చర్చల గురించి భారత్ ప్రస్తావించింది. కానీ, రష్యాతో సంబంధాలపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇప్పటికీ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. ఇటీవల రూపాయి-రూబుల్‌లో కూడా వ్యాపారం జరుగుతోంది.
భారత్ అనుసరిస్తున్న ఈ వైఖరిపై చాలాసార్లు ప్రశ్నలు వచ్చాయి, స్వతంత్ర వైఖరి అవలంబిస్తోందనే అభిప్రాయం ఏర్పడింది.
2022 డిసెంబర్‌లో భారత పర్యటన సందర్భంగా బేర్‌బాక్ ఈ విషయాన్ని లేవనెత్తారు. దానికి జైశంకర్ సమాధానమిస్తూ, గత తొమ్మిది నెలల్లో యూరోపియన్ యూనియన్ కొనుగోలు చేసిన చమురులో ఆరో వంతు మాత్రమే భారత్ కొనుగోలు చేసిందని చెప్పారు.
చైనా-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా 'బ్రిక్స్' ఆవిర్భావం పశ్చిమ దేశాలకు సవాల్‌గా మారిందా? అనే ప్రశ్నకు జైశంకర్ స్పందిస్తూ.. అది ఎలా మొదలైందన్నదే ముఖ్యమని ఆయన అన్నారు.
''పశ్చిమ దేశాల ఆధిపత్యం బలంగా ఉన్న సమయంలో ఇది ప్రారంభమైంది. జీ7 ప్రపంచంలోని ఏడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమూహం. ఈ జీ7లో భాగస్వాములు కాకపోయినా, అందులో పాలుపంచుకోవాలని భావిస్తున్న దేశాలు చాలా ఉన్నాయి. అందుకు కొంత సాయంగా కూడా ఉండగలవు.
అలాంటి దేశాల సమాహారమే 'బ్రిక్స్'. ఎందుకంటే, ఇందులో భాగస్వామ్య దేశాలు భౌగోళికంగా ఒకదానికొకటి చాలా దూరంగా ఉన్నాయి, కానీ, ఇందులో చర్చించిన అంశాలు వాటిని ఒక్కటి చేశాయి'' అన్నారు.
''పాశ్చాత్యేతర, పాశ్యాత్య వ్యతిరేకత మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భారత్ పాశ్చాత్యేతర దేశం, కానీ పాశ్చాత్య దేశాలతో బలమైన సంబంధాలున్నాయి. అయితే, అది ఆ సమూహంలోని అన్ని దేశాలకూ వర్తించాల్సిన అవసరం లేదు'' అన్నారు జైశంకర్.
''బ్రిక్స్ విషయానికి వస్తే, జీ7 ఎలా జీ20గా మారిందనే విషయాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, అందులోని 13 అదనపు దేశాల్లో ఐదు బ్రిక్స్‌లో సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇందులో సభ్యదేశాల మధ్య జరిగే చర్చలు జీ20 వృద్ధికి దోహదం చేస్తాయి. అది మాకు సాయపడింది'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జైశంకర్ ప్రకటనకు బ్లింకెన్ సమాధానం
వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమూహం బ్రిక్స్. ఇందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా ఉన్నాయి.
2050 నాటికి మాన్యుఫ్యాక్చరింగ్, సేవలు, ముడిసరుకుల రంగాల్లో ప్రధాన సరఫరాదారులుగా మారతాయని నిపుణులు అంచనా వేస్తున్న దేశాలివి. బ్రిక్స్ ద్వారా రష్యా, చైనాలు పాశ్చాత్య దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేయాలనుకుంటున్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి.
జైశంకర్ ప్రకటనను ఆంటోనీ బ్లింకెన్ తోసిపుచ్చారు. దేశాలు వేర్వేరు గ్రూపులుగా విడిపోయే ప్రపంచం మాకొద్దని ఆయన అన్నారు.
"ప్రతి ఒక్కరికీ విభిన్నమైన సవాళ్లు ఉంటాయి, అవి వారి గతాన్ని బట్టి తలెత్తుతాయి. అయినా, మనందరం కలిసి పనిచేయడం చాలా ముఖ్యం" అని ఆయన అన్నారు.
జీ20, ఏయూకేయూఎస్ వంటి ఇతర గ్రూపుల్లో భారత్, అమెరికా కలిసి ఉండటం గురించి ప్రస్తావిస్తూ, "పరిస్థితి తీవ్రతను బట్టి, విభిన్న లక్ష్యాలతో వేర్వేరు గ్రూపుల్లో ఉండటం అవసరం" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్ - హమాస్ సమస్యపై ఏమన్నారు?
చర్చలో మానవ హక్కుల అంశం లేవనెత్తగా, గాజాలో జరుగుతున్న విధ్వంసాలను చోద్యం చూస్తున్న పాశ్చాత్య దేశాలు, మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నాయనే ప్రశ్న ఉత్పన్నమైంది.
''ఇది ద్వంద్వ ప్రమాణాలకు సంబంధించి ప్రశ్న. గాజాలో ఏం జరుగుతుందో ఒకసారి చూస్తే, అక్కడ తక్షణం కాల్పుల విరమణ అసవరం. దాని ద్వారా అక్కడ చిక్కుకుపోయిన చిన్నారులను తరలించవచ్చు'' అని బేర్‌బాక్ అన్నారు.
''దానికి మరో కోణం కూడా ఉంది. అక్టోబర్ 7న జరిగిన దాడిలో చాలా మంది కిడ్నాప్ అవడంతో పాటు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో హమాస్ అధీనంలో ఉన్న వ్యక్తులను కూడా రక్షించాల్సి ఉందని అర్థం చేసుకోవాలి.
ఇజ్రాయెల్ భద్రతాపరమైన ఆందోళనలను పరిగణలోకి తీసుకోకుండా, కాల్పుల విరమణ కోసం ఒత్తిడి చేయాలని పట్టుబట్టలేం. హమాస్ మరోసారి నిలదొక్కుకోవడంతో పాటు పౌరులను కవచాలుగా వాడుకోవడాన్ని మేం అంగీకరించలేం.'' అన్నారామె.
పరిస్థితి తీవ్రత గురించి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడారు. ఇలాంటి అమానవీయ ఘటనలను మనం వ్యతిరేకించాలని అన్నారు.
"ఇజ్రాయెల్ భద్రత మాకు ముఖ్యం, మేం దానికి మద్దతు ఇస్తున్నాం. అయితే, అవసరమైన వారికి సాయం అందాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ ఉండాలని కూడా మేం కోరుకుంటున్నాం" అని ఆయన అన్నారు.
జైశంకర్ ఈ అంశంపై భారత్ వైఖరిని స్పష్టం చేస్తూ, "అక్టోబర్ 7న జరిగింది టెర్రరిస్టు దాడి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండోది, ఇజ్రాయెల్ ప్రతీకార చర్య గురించి మాట్లాడితే, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు కట్టుబడి ఉండాలి" అని అన్నారు.
''బందీలను విడుదల చేయడం చాలా ముఖ్యం, అలాగే దాడులు చేయని ప్రాంతం 'హ్యుమానిటేరియన్ కారిడార్' కూడా అవసరం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి'' అన్నారు.
రెండు దేశాల ప్రతిపాదనను ఉద్దేశిస్తూ అదొక ఆప్షన్ కాదు, అవసరం అని ఆయన అన్నారు.
చాలా దేశాలు ఈ ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో దానిని ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా-యుక్రెయిన్ యుద్ధం
ప్రపంచం రెండు ధృవాలుగా విడిపోవడంపై రష్యా-యుక్రెయిన్ యుద్ధాన్ని ఉదహరిస్తూ, ''తమకు లభించిన వాటాతో సంతోషంగా లేని దేశాలు ఉన్నాయని మాకు తెలుసు, కానీ వారు ఇతరుల వాటాను కూడా కోరకుంటున్నట్లే'' అని అన్నాలీనా బేర్‌బాక్ అన్నారు.
ఇరుదేశాలు పరస్పర గౌరవంతో చర్చలు జరపాలని, తమ పరిస్థితులను కూడా పరిశీలించుకోవాలని బేర్‌బాక్ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను ప్రతిఒక్కరూ గౌరవించాల్సిందేనని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు.
అంతర్జాతీయ భద్రత విషయం చర్చకు వచ్చిననప్పుడు, ''మేం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు'' అనే ప్రశ్నలు తలెత్తడంతో, ''అందరూ మీతో ఏకీభవించాల్సిన అవసరం లేదు'' అని యూరప్ అర్థం చేసుకుందని, యూరప్ వైఖరి మారిందని ఆమె అన్నారు. అయితే, గతాన్ని మర్చిపోయి అందరూ కలసికట్టుగా ముందుకు సాగడం ముఖ్యం అన్నారామె.

ఫొటో సోర్స్, REUTERS
అమెరికా - చైనా సంబంధాలు
చైనాతో కొనసాగుతున్న వాణిజ్య వివాదం, దాని కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తత గురించి అడిగిన ప్రశ్నకు, చైనా, అమెరికా మధ్య శత్రుత్వం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అంగీకరించారు.
''చైనాతో కలిసి పనిచేయాల్సిన చాలా విషయాలున్నాయి. ఉదాహరణకు ఫెంటానిల్ సమస్య లాంటివి'' అని ఆయన అన్నారు.
చైనాతో బాధ్యతాయుతమైన సంబంధాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. "గత ఆరు, ఏడు నెలలుగా చైనాతో చర్చలు జరుపుతున్నాం. ఇరుదేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయని భావిస్తున్నా'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?
- నరేంద్ర మోదీ: ‘మూడోసారి అధికారం ఎందుకు అడుగుతున్నామంటే...?’
- భారత్ వర్సెస్ ఇంగ్లండ్: మూడో టెస్టులో బద్ధలైన రికార్డులివే
- విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎందుకు కదలట్లేదు... తప్పు రాష్ట్రానిదా, కేంద్రానిదా?
- ఎలక్టోరల్ బాండ్లను వ్యతిరేకిస్తూనే ప్రతిపక్షాలు ఆ విరాళాలను ఎందుకు తీసుకున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














