రష్యా: పుతిన్ విమర్శకుడు, ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైల్లో మృతి.. ప్రభుత్వం ఏం చెప్పింది?

నావల్నీ

ఫొటో సోర్స్, Reuters

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ ఆర్కిటిక్ సర్కిల్‌లోని జైలులో మరణించినట్లు జైళ్ల శాఖ తెలిపింది.

అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే నాయకుడిగా ఆయనకు పేరు ఉంది.

వివిధ కేసుల్లో దోషిగా తేలిన నావల్నీ 19 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆ కేసులు రాజకీయ ప్రేరేపితమనే విమర్శలు ఉన్నాయి.

నావల్నీ వయసు 47 ఏళ్లు. ఆయన 1976 జూన్ 4న రష్యాకు పశ్చిమాన ఉండే బ్యూటిన్ గ్రామంలో పుట్టారు.

ఆయన 1998లో మాస్కోలోని ఫ్రెండ్‌‌షిప్ ఆఫ్ ద పీపుల్స్ యూనివర్శిటీలో న్యాయశాస్త్రం చదివారు.

నావల్నీ 2010లో అమెరికాలో ఏడాదిపాటు యేల్ వరల్డ్ ఫెలోగా ఉన్నారు.

ఆయన 2021లో జైలు పాలయ్యారు. అంతకుముందు భార్య యూలియాతో కలిసి ఆయన మాస్కోలో నివసించేవారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నావల్నీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే నాయకుడిగా అలెక్సీ నావల్నీకి పేరు ఉంది. (ఫైల్ ఫోటో)

నావల్నీ మరణానికి కారణమేంటి?

నావల్నీని 2023 చివర్లో రష్యాలోనే అత్యంత కఠినమైన జైళ్లలో ఒకటిగా పరిగణించే ఆర్కిటిక్ పీనల్ కాలనీకి తరలించారు.

నావల్నీ మరణానికి కారణాలపై యమలో-నేనెట్స్ జిల్లాలోని ప్రిజన్ సర్వీస్ విచారణ జరుపుతున్నట్లు టాస్ వార్తా సంస్థ తెలిపింది.

శుక్రవారం వాకింగ్ అనంతరం నావల్నీ అస్వస్థతకు గురయ్యారని ప్రిజన్ సర్వీస్ తెలిపింది. నావల్నీ స్పృహ కోల్పోయారని, అత్యవసర వైద్య బృందం వెంటనే ఆయనకు చికిత్స చేసిందని, అయినా ఫలితం లేకపోయిందని చెప్పింది.

"ఆయన చనిపోయినట్లు అత్యవసర వైద్యులు ప్రకటించారు. మృతికి కారణాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని చెప్పింది.

నావల్నీ మృతిపై ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని ఆయన తరపు న్యాయవాది లియోనిడ్ సోలోవియోవ్ రష్యన్ మీడియాకు తెలిపారు.

నావల్నీ

ఫొటో సోర్స్, Getty Images

నావల్నీ ధైర్యానికి అంతర్జాతీయ సమాజం ప్రశంస

నావల్నీ మృతి వార్తలు వెలువడిన వెంటనే, ఆయన ధైర్యాన్ని అంతర్జాతీయ సమాజం ప్రశంసించింది.

రష్యా అణచివేతను ప్రతిఘటించినందుకు నావల్నీ తన ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చిందని ఫ్రాన్స్ వ్యాఖ్యానించింది.

నావల్నీ మరణానికి రష్యా అధికార యంత్రాంగానిదే బాధ్యతని నార్వే వ్యాఖ్యానించింది.

చెల్యాబిన్స్క్ నగర పర్యటనలో ఉన్న అధ్యక్షుడు పుతిన్‌కు నావల్నీ మృతి సమాచారం అందజేసినట్లు ఆయన అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవా తెలిపారు.

వీడియో క్యాప్షన్, పుతిన్ అణచివేత వల్లే ఆయన చనిపోయారన్న ఫ్రెంచ్ మంత్రి స్టెఫన్ సెజౌర్న్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)