పాకిస్తాన్: నా విజయం కోసం ‘రిగ్గింగ్’ చేశారంటూ గెలిచిన సీటును వదిలేసిన అభ్యర్థి

పాకిస్తాన్ ఎన్నికలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రిగ్గింగ్ వల్లే తాను గెలిచినట్టు హఫీజ్ నయీమ్ ఉర్ రహ్మాన్ చెప్పారు.
    • రచయిత, ఫ్రాన్సిస్ మావో
    • హోదా, బీబీసీ న్యూస్

పాకిస్తాన్‌లో గత వారం జరిగిన వివాదాస్పద ఎన్నికల్లో గెలిచిన ఓ అభ్యర్థి తన గెలుపు రిగ్గింగ్ వల్లేనంటూ ప్రకటన చేశారు.

తనను గెలిపించేందుకు పోలింగ్ రోజున రిగ్గింగ్ చేశారని ఆయన చెప్పారు.

కరాచీలోని పీఎస్ 129 అసెంబ్లీ స్థానం నుంచి జమియత్-ఎ-ఇస్లామీ కి చెందిన హఫీజ్ ఉర్ రహ్మాన్ గెలిచినట్టు అధికారులు ధృవీకరించారు.

అయితే తనకంటే స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయని, కానీ తరువాత వాటిని తగ్గించి చూపారని నయీమ్ ఉర్ రహ్మాన్ చెప్పారు. అందుకే తన సీటును వదులుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు.

పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ పై నిషేధం విధించడంతో ఆ పార్టీ ఆభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేశారు.

వీరిలో పీఎస్ 129 అసెంబ్లీ స్థానం‌ నుంచి పోటీ చేసిన సైఫ్ బారీ కూడా ఒకరు.

సోమవారం జరిగిన తన పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హఫీజ్ ఉర్ రహ్మాన్ మాట్లాడుతూ- ‘‘ఎవరైనా మమ్మల్ని అక్రమంగా గెలిపించాలని చూస్తే, మేం వాటిని అంగీకరించం’’ అని ప్రకటించారు.

పాకిస్తాన్ ఎన్నికలు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని నిరసనకు దిగిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుదారులు

ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి: రహ్మాన్

‘‘ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. ‘విజేత’కు గెలిచే అవకాశమివ్వాలి. అలాగే ఓడిపోయిన అభ్యర్థి కూడా ఓటమిని అంగీకరించాలి. దీనివల్ల ఎవరికీ అదనంగా ఏమీ రాదు’’ అని రహ్మాన్ చెప్పారు.

తనకు 26 వేల ఓట్లు వచ్చాయని, కానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన సైఫ్ బారీకి 31వేల ఓట్లు వచ్చాయని, తరువాత సైఫ్ బారీకి కేవలం 11 వేల ఓట్లే చూపారని హఫీజ్ నయీమ్ ఉర్ రహ్మన్ తెలిపారు. సైఫ్ బారీ, పీటీఐ మద్దతుతో పోటీ చేశారు.

అయితే రహ్మాన్ ఆరోపణలను పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది.

సైఫ్ బారీ ఓడిపోయినట్టుగా భావించి వెనుదిరగడంతో పీఎస్ 129 సీటు ఎవరు గెలిచారనే విషయం అస్పష్టంగా ఉంది.

కానీ ఈ ఘటనలు పాకిస్తాన్‌లో కిందటి గురువారం జరిగిన ఎన్నికల నిష్పాక్షికతపై సందేహాలు పెంచేలా చేశాయి.

పాకిస్తాన్ ఎన్నికలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అనేక ఆటంకాల నడుమ పీటీఐ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు

భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపణలు

పాకిస్తాన్ ఎన్నికలలో భారీగా అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

ఎన్నికల్లో పోటీచేసిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు హాని కలిగించడమే లక్ష్యంగా అక్రమాలు చేశారని చెబుతున్నారు.

కిందటేడాది ఆగస్టులో ఇమ్రాన్ ఖాన్ జైలుపాలయ్యారు.

ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ - ఇ- ఇన్సాఫ్‌పై అనర్హత వేటు వేశారు.

చివరకు పార్టీ ఎన్నికల గుర్తును కూడా రద్దు చేశారు.

దీంతో పీటీఐ అభ్యర్థులు అనివార్యంగా స్వతంత్రులుగా పోటీ చేయాల్సి వచ్చింది.

స్వతంత్ర అభ్యర్థుల జయకేతనం

ఎన్ని అవరోధాలు సృష్టించినా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుని ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు పలికారు.

265 మంది సభ్యులున్న పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పీటీఐ మద్దతు ఇచ్చిన 93 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.

అసెంబ్లీలో గెలిచిన వారిలో స్వతంత్ర అభ్యర్థులే ఎక్కువ. మిగిలిన ఏ పార్టీకి ఇన్ని సీట్లు రాలేదు.

తమ అభ్యర్థులు భారీ సంఖ్యలో సీట్లు గెలుచుకున్నారని, వారి మెజార్టీ కూడా ఎక్కువేనని పీటీఐ చెప్పింది.

ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పీటీఐ ఆరోపించింది. అలాగే జమియత్-ఎ-ఇస్లామీ అభ్యర్థి పీఎస్ 129 సీటును వదలుకోవడాన్ని స్వాగతించింది.

పాకిస్తాన్ ఎన్నికలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

సంకీర్ణ ప్రభుత్వం

పీటీఐ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలిచినప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ప్రత్యర్థి నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లీం లీగ్ (ఎన్), బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాయి.

కిందటి వారం జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్ ముస్లీం లీగ్‌ (ఎన్)కు 75 స్థానాలు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి 54 సీట్లు దక్కాయి.

సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎంక్యూఎం లాంటి చిన్న పార్టీలతోనూ జట్టు కట్టారు.

ఇవి కూడా చదవండి :

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)