భారత్ వర్సెస్ ఇంగ్లండ్: మూడో టెస్టులో బద్ధలైన రికార్డులివే

భారత క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత క్రికెట్

టెస్టు చరిత్రలో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు రికార్డు గెలుపును నమోదు చేసింది. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో నెగ్గింది.

2021లో న్యూజిలాండ్‌పై సాధించిన 372 పరుగుల విజయమే ఇప్పటివరకు భారత్‌కు అత్యధికం.

ఇవేకాకుండా ఈ టెస్టులో చాలా కొత్త రికార్డులు ఈ టెస్టు‌లో నమోదయ్యాయి. ఓపెనర్ యశస్వీ జైస్వాల్, అశ్విన్‌లు కూడా రికార్డులను సాధించారు. అంతేకాదు ఇంగ్లండ్ కూడా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

యశస్వీ జైస్వాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యశస్వీ జైస్వాల్

వసీం అక్రమ్ రికార్డును సమం చేసిన జైస్వాల్

శనివారం ఆటలో 104 పరుగుల వద్ద రిటైర్డ్‌హర్ట్‌‌గా వెనుదిరిగిన జైస్వాల్ ఆదివారం ఆటలో బ్యాటింగ్‌కు వచ్చాడు.

ఈ క్రమంలో జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశారు. అండర్సన్ బౌలింగ్‌లో జైస్వాల్ వరుసగా మూడు సిక్సర్లు బాదడం ఇన్నింగ్స్‌కే హైలైట్‌.

ఈ క్రమంలో 231 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. సర్ఫరాజ్‌తో కలిసి అయిదో వికెట్‌కు 87 బంతుల్లో‌నే శతక భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు.

ఇన్నింగ్స్ డిక్లేర్ చేసే వరకు క్రీజులో నిలబడి వీరిద్దరు అభేద్యంగా 172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ క్రమంలో జైస్వాల్ టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డులు నమోదుచేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును సమం చేశాడు యశస్వీ.

ఈ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 12 సిక్సర్లు కొట్టాడు. 1996లో జింబాబ్వేపై ఒకే ఇన్నింగ్స్‌లో వసీం అక్రమ్ 12 సిక్సర్లు కొట్టాడు. ఆ మ్యాచ్ లో వసీం 257 పరుగులు చేశాడు.

కాగా, భారత్ తరఫున ఈ రికార్డు అంతకుముందు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (8 సిక్సర్లు) పేరిట ఉంది.

ఇంగ్లండ్ క్రికెట్ టీం

ఫొటో సోర్స్, Getty Images

ఇంగ్లండ్‌కు చేదు రికార్డు

పరుగుల పరంగా ఇంగ్లండ్‌కు ఇది రెండో అతిపెద్ద ఓటమి. అంతేకాకుండా, టెస్టు చరిత్రలో పరుగుల పరంగా ఇది ఎనిమిదో అతిపెద్ద విజయం.

బజ్‌బాల్ అంటూ టెస్టు క్రికెట్‌ను కొత్తగా ఆడుతున్న ఇంగ్లిష్ జట్టుకు ఈ రికార్డు కలవరపెట్టేదే.

ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం ఉన్నా దాదాపు రెండు రోజుల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓటమి నుంచి బయటపడే అవకాశం ఆ జట్టుకు ఉన్నా, భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఇంగ్లండ్ స్కోరు బోర్డు మందకొడిగా నడుస్తుండగా, ఆ జట్టు బ్యాటర్లు ఒక్కొక్కరు పెవిలియన్ బాట పట్టారు.

ఒక దశలో 50 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు వంద పరుగులలోపే ఆలౌటవుతుందని అంతా భావించారు. చివరకు 122 పరుగులకు ఆలౌటై 434 పరుగుల భారీ తేడాతే ఓడింది. రెండో అతిపెద్ద ఓటమితో చేదు రికార్డును ఖాతాలో వేసుకుంది ఇంగ్లండ్.

రవిచంద్రన్ అశ్విన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రవిచంద్రన్ అశ్విన్

అశ్విన్ ఖాతాలోనూ రికార్డు

ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో 500 వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లండ్ బ్యాటర్ జాక్ క్రాలీని అవుట్ చేసి, అశ్విన్ టెస్టు క్రికెట్లో 500 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు.

500 వికెట్లు సాధించిన రెండో భారతీయుడు, ప్రపంచవ్యాప్తంగా 9వ క్రికెటర్ అశ్విన్.

ఇప్పటికే మాజీ కెప్టెన్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించాడు.

అశ్విన్ 99 టెస్టుల్లో 25,714 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)