యశస్వీ జైస్వాల్: బేస్‌బాల్‌లా క్రికెట్ బంతిని బాదేస్తూ మరో డబుల్ సెంచరీ చేసిన 'జస్‌బాల్'

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, సంజయ్ కిషోర్
- హోదా, బీబీసీ హిందీ
క్రికెట్‌లో బంతిని బేస్‌బాల్ ఆటగాడిలా బాదేయడాన్నే బజ్ బాల్ గేమ్ అంటున్నారు. న్యూజీలాండ్ క్రికెటర్ మెక్ కల్లమ్ అలా ఆడేవాడని అనేవారు. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్‌ను బజ్‌బాల్ క్రికెట్ అని పొగిడేస్తున్నారు. ఈ బజ్‌బాల్‌కు తాజాగా ఇండియా నుంచి దీటైన సమాధానం వచ్చింది. ఆ సమాధానం పేరే 'జస్‌బాల్'.
అవును. ఇంగ్లండ్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తూ మళ్ళీ వారు పుంజుకునే ప్రసక్తే లేకుండా చేస్తున్న ఆటగాడు యశస్వీ జైస్వాల్. విశాఖలో డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న ఈ కుర్రాడు రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ దుమ్ముదులిపాడు.
ఈ టెస్ట్ మ్యాచ్‌లో యశస్వీ 214 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అంతకముందు మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 322 పరుగుల ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
నాలుగోరోజు మొదలయ్యాక 430 పరుగుల వద్ద భారత్ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
వరుస డబుల్ సెంచరీలతో యశస్వీ పేరు మారుమోగుతోంది.
ప్రస్తుత క్రికెట్ రోజుల్లో టెస్ట్ మ్యాచ్‌ల్లో వేగాన్ని, క్లాస్‌ను ఒకే ఆటగాడిలో చూడటం అరుదైపోయింది.
యశస్వీ జైస్వాల్‌లా టీ 20లను, టెస్ట్ మ్యాచ్‌లను సమన్వయం చేసుకోగల మరో ఆటగాడిని చూడటం కష్టమే.
రాజ్‌కోట్‌లో ఇంగ్లండపై యశస్వీ తన ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా మొదలుపెట్టాడు. అతను మొదట 39 బంతులలో 9 పరుగులే చేశాడు. తరువాత తనదైన లయను అందుకున్నాకా పవర్ హిట్టింగ్‌కు దిగాడు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
స్పిన్నర్లకు చుక్కలు
ఇంగ్లండ్ జట్టులో అనుభవజ్ఞుడైన జేమ్స్ అండర్సన్ లక్ష్యంగా జైస్వాల్ చేలరేగిపోయాడు. 27వ ఓటర్లో అండర్సన్ బౌలింగ్‌లో ఓ సిక్సు, రెండు ఫోర్లు బాదాడు. ఆ తరువాత ఆఫ్ స్పిన్నర్ టామ్ హార్టీ బౌలింగ్‌లో లాంగాన్‌లో సిక్సర్ కొట్టి అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
జైస్వాల్ దూకుడును ఎలా కట్టడి చేయాలో ఇంగ్లండ్ బౌలర్లకు అర్థం కాలేదు. యశస్వీ జైస్వాల్ విధ్వంసం నుంచి జో రూట్, రేహన్ అహ్మద్ లాంటివారు కూడా తప్పించుకోలేకపోయారు.
జై స్వాల్ బంతి ఎలా వస్తోందనే దాంతో సంబంధం లేకుండా సిక్సులు బాది టీ20 ని మరిపించాడు. ఇలా టెస్ట్ కెరీర్‌లో 122 బంతుల్లో యశస్వీ తన మూడో సెంచరీ నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో అతనికిది వరుసగా రెండో సెంచరీ. విశాఖ పట్నం టెస్ట్‌లో అతను ద్విశతకం (209 పరుగులు) సాధించిన సంగతి తెలిసిందే.
ఇక నాలుగోరోజు కూడా యశస్వీ అదే దూకుడు చూపించాడు. 96 ఓవర్ లో రూట్ బౌలింగ్‌లో సింగిల్ తీసి జైస్వాల్ డబుల్ సెంచరీ పూర్తి చేసకున్నాడు. తరువాత మరో రెండు సిక్సులు బాదాడు.
యశస్వీ జైస్వాల్ ఆడే రివర్స్ స్వీప్, స్వీప్ షాట్లు చూడముచ్చటగా ఉంటాయి. ‘‘ యశస్వీ సెంచరీల తరువాత సెంచరీలు కొడుతున్నాడు. స్పిన్నర్లతో ఎలా ఆడుకోవాలాలో అలాగే అడుతున్నాడు.’’ అని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
100 అలా... 200 ఇలా..
యశస్వీ జైస్వాల్ 39వ ఓవర్ చివరి బంతిని బౌండరీ దాటించి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను మొత్తం 133 బంతులు ఎదుర్కొని, 104 పరుగులు సాధించాడు. ఇందులో 9 ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి .
సెంచరీ తరువాత యశస్వీ వెన్ను నొప్పి కారణంగా మైదానాన్ని వీడాడు.
సెంచరీ కొట్టాకా యశస్వీ డేవిడ్ వార్నర్‌లా గాల్లోకి ఎగురుతూ సంబరాలు చేసుకున్నాడు. బహుశా అతని వెన్ను నొప్పికి ఇదే కారణమై ఉండొచ్చు.
ఇక నాలుగోరోజు ఆట మొదలయ్యాక యశస్వీ ఎక్కడా తడబాటు లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఐదు ఫోర్లు, ఏడు సిక్సులతో 90.68 స్ట్రైక్ రేటుతో డబుల్ సెంచరీ పూర్తిచేసుకన్నాడు.
విరాట్ కొహ్లీ తరువాత ఇంగ్లండ్ పై ఒకే సిరీస్‌లో 400 పరుగులు పైగా చేసిన రెండో ఆటగాడిగా యశస్వీ నిలిచాడు.
2018లో విరాట్ 593 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 2021లో 368 పరుగులు సాధించాడు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
హైదరాబాద్‌లో ‘జస్‌బాల్‘
హైదరాబాద్‌లో జరిగిన టెస్ట్‌లో మొదటిరోజున జైస్వాల్ 70 బంతులలో 76 పరుగులు చేశాడు.
ఆ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఇయాన్ మోర్గాన్, దినేష్ కార్తిక్, హర్షా భోగ్లే లాంటివారు టెస్ట్ నుంచి టీ 20కి, టీ 20 నుంచి టెస్ట్ క్రికెట్ లోకి మారి లయ అందుకోవడం సులభమా కాదా అనే విషయం చర్చిస్తున్నారు.
యశస్వీ 2023 జులై 12న టెస్ట్ అరంగ్రేటం చేశాడు. అప్పటి నుంచి అతను 13 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
టెస్టులో వేగంగా మూడు శతకాలు సాధించిన వారిలో అతను సంయుక్తంగా ఏడో ర్యాంకును పంచుకుంటన్నాడు.
ఈ విషయంలో అతను మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్ సరసన నిలిచాడు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
దూకుడైన ఆటగాడా?
దేశీయ వైట్ బాల్ క్రికెట్ లో యశస్వీ దూకుడైన ఆటగాడనే పేరు సంపాదించుకున్నాడు. 2019లో విజయ్ హజరే ట్రోఫీలో డబుల్ సెంచరీ ద్వారా యశస్వీ పేరు మారుమోగింది.
ఆ ట్రోఫీలో జైస్వాల్ 113, 22, 122, 203, 60 పరుగులు చేశాడు.
దక్షిణాఫ్రికాలో 2020లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై చేసిన అపూర్వమైన సెంచరీ చేసి ఆకట్టుకోవడమే కాక, ప్లేయర్ ఆప్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.
ఐపీఎల్ మొదటి సీజన్ అంత బాగా ప్రారంభం కాలేదు కానీ. క్రమంగా జైస్వాల్ లయను అందుకున్నాడు. కిందటేడాది 163.61 స్ట్రైక్ రేటుతో రాజస్థాన్ రాయల్స్ తరపున 625 పరుగులు చేశాడు.
జోస్ బట్లర్ తో కలిసి అతను ఇన్నింగ్స్ ఆరంభించేవాడు. వీరి జోడి అత్యంత ప్రమాదకరమైనదిగా పేరు పొందింది.
అలాగే జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే 50 పరుగులుచేసి, వేగంగా అర్థశతకం బాదిన రికార్డు సాధించాడు.
యశస్వీ 2019లో రంజీ మ్యాచ్‌లు ఆడటం మొదలు పెట్టాడు. 2021-22లో వరుసగా మూడు సెంచరీలు బాది ముంబాయిని ఫైన్సల్‌కు చేర్చాడు.
అందుకే అతనికి వన్డేలు, టీ20ల కంటే ముందే టెస్ట్ క్రికెట్ క్యాప్ ధరించే అవకాశం వచ్చింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
పానీపూరి అమ్మి, ఆకలితో అలమటించి...
ఉత్తరప్రదేశ్‌లోని బాదోహి జిల్లాలో సురియావాన్ గ్రామానికి చెందిన యశస్వీ తండ్రి ఓ చిన్న హార్డ్ వేర్ దుకాణం నిర్వహించేవాడు.
యశస్వీకి క్రికెట్ పై ఉన్న ఆరాధన వల్ల 11 ఏళ్ళ వయసులోనే ముంబాయికి వచ్చేశాడు. అక్కడ ఒంటరి పోరాటం చేశాడు. ఓ డైరీలో కొన్నిరోజులు పనిచేశాడు. చాలా సంవత్సరాలు యశస్వీ ముంబాయిలోని ఆజాద్ మైదాన్‌లోని ముస్లిం యునైటెడ్ టెంట్‌లో నివసించాడు.
ఇక్కడ అతను రాత్రి పూట వంటవాడిగా పనిచేస్తూ, పగలంతా క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. దీంతోపాటు అతను పానీపూరీ కూడా అమ్మేవాడు.
చివరకు కష్టేఫలి అనే నానుడికి యశస్వీ నిదర్శనంగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి :
- కేజీ బేసిన్: కాకినాడ తీరంలో తొలిసారిగా చమురు వెలికితీత...భారతదేశపు చమురు అవసరాలను ఇది తీర్చగలదా?
- విశాఖపట్నం: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎందుకు కదలట్లేదు...
- ‘నాది అప్పుడే పుట్టిన శిశువులను కాపాడే అరుదైన ‘నియో’ రక్తమని తెలిసిన రోజు ఎలా అనిపించిందంటే
- ’తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














