దెయ్యాలు వచ్చి వింత వింత ముగ్గులు వేస్తున్నాయని జనం హడలిపోతున్న ఆ ఊరిలో అసలేం జరుగుతోంది?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
‘వీధిలోకి ఎవరైనా వస్తే ధైర్యం చేసి బయటకు రావడం, లేదంటే తలుపులేసుకుని ఇంట్లోనే కూర్చోవడం. ఇరవై రోజులుగా ఇదే పరిస్థితి. నాకు ఇద్దరు పిల్లలున్నారు. భయంతో వణికిపోతున్నాం.’
కాకినాడ జిల్లా కాండ్రకోట గ్రామంలో దెయ్యాలున్నాయంటూ జరుగుతున్న వీడియో ప్రచారాలకు భయపడిన ఓ మహిళ ఆందోళన ఇది.
కాకినాడ జిల్లా పెద్దాపురం సమీపంలోని కాండ్రకోట, పరిసర ప్రాంతాల్లో దెయ్యాలు తిరుగుతున్నాయంటూ ఇటీవల విపరీతంగా ప్రచారం జరిగింది.
ఇలాంటి వాటిని నమ్మవద్దని పోలీసులు, జనవిజ్ఞాన వేదిక సభ్యులు ప్రచారం చేస్తున్నారు. కానీ, ప్రజల్లో మాత్రం ఆందోళన అలాగే ఉంది.

భయంభయంగా గ్రామస్తులు
‘దెయ్యం’ భయంతో కొందరు ఇప్పటికే గ్రామాలు వదిలి వెళ్లిపోయారు. ఇంకొందరు చీకటిపడిన తర్వాత బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మరికొందరు నిద్రపోకుండా తెల్లవార్లూ కాపలా కాస్తున్నారు.
వింత శబ్దాలు చేస్తున్నట్టు, అక్కడక్కడా వింత వింత ముగ్గులు వేస్తున్నట్టు, చీకట్లో నగ్నంగా పరిగెడుతున్నట్టు ఉన్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఊళ్లోకి దెయ్యం వచ్చిందని చాలామంది నమ్మడం మొదలు పెట్టారని, మీడియా కథనాలు కూడా వాటికి తోడు కావడంతో ఈ ఆందోళనలు మరింత పెరిగాయని కాండ్రకోటకు చెందిన నందీశ్వర రావు అనే గ్రామస్తుడు చెప్పారు.
‘‘సెల్‌ఫోన్లలలో వీడియోలు చూపిస్తూ అక్కడ దెయ్యం ఇక్కడ గోడ దూకిందని భయపెట్టే ప్రచారం జరుగుతోంది. మా తాతలు తాతల కాడనుంచి ఇక్కడ అలాంటివి ఏమీ లేవు. అయినా భయం సృష్టించారు.’’ అని నందీశ్వరరావు అన్నారు.

అర్థరాత్రి గస్తీలు
కాండ్రకోట గ్రామంలో చాలామంది రాత్రిళ్లు నిద్రపోవాలంటేనే భయపడుతున్నారు. యువకులు, వృద్ధులు సైతం కర్రలు పట్టుకుని రాత్రంతా గ్రామంలో తిరుగుతూ కాపలా కాస్తున్నారు.
భయపడే వాళ్లు భయపడుతున్నా, దెయ్యం ప్రచారాన్ని చాలామంది కొట్టిపారేస్తున్నారు. మరికొందరు మాత్రం ఊళ్లో దుష్టశక్తులు పోవాలంటూ యాగం చేశారు. జనవిజ్ఞానవేదిక గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది
‘‘ఓ నల్లముసుగు వేసుకున్న వ్యక్తి గోడ పక్కన కూర్చోవడం తాము చూశామని, ఎవరని అడిగితే పారిపోయాడని ఓ ఇద్దరు గ్రామస్తులు చెప్పారు. దెయ్యమయితే మాయవ్వాలి. పారిపోవాల్సిన పనిలేదు. పొలంలో చెట్టు దగ్గర ఎవరో కూర్చుని ఉన్నాడని, కొంతమంది అక్కడకు వెళ్లగానే పారిపోయాడనీ చెబుతున్నారు. కొన్ని వీడియోలు చూపిస్తున్నారు. ఇవన్నీ క్రియేట్ చేసినవి. దీని నుంచి వాళ్లు ఏం ఆశిస్తున్నారో తెలియదు. ప్రజలు రాత్రిపూట తిరగకుండా చేస్తున్నారు.’’ అని జేవీవీ జిల్లా అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్ అన్నారు.

అవగాహన కార్యక్రమాలు
పోలీసులు కూడా గ్రామంలో తిరుగుతూ ప్రజల భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
‘ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మా సిబ్బంది రాత్రిపూట కూడా తిరుగుతున్నాం. సెల్ ఫోన్లలో సాగుతున్న ప్రచారాలను నమ్మకండి. ఏదైనా ఇబ్బంది ఏర్పడితే డిపార్ట్ మెంట్ దృష్టికి తీసుకొస్తే స్పందిస్తాం.’’ అని పెద్దాపురం పోలీస్ సబ్‌ఇన్ స్పెక్టర్ రవి కుమార్ అన్నారు.
కాండ్రకోట చుట్టు పక్కల గ్రామాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారమవుతున్న వీడియోలు, ఫోటోలు పాతవని తేలింది.
ఇవి కూడా చదవండి:
- అయోధ్య: సెక్యులరిజం గీత చెరిగి పోతోందా, లౌకికవాదంపై రాజ్యాంగం, కోర్టులు ఏం చెప్పాయి..
- కుమారీ ఫుడ్ కోర్టు: తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింత చర్చ, రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునే వరకు ఎందుకు వెళ్లింది?
- రజినీకాంత్‌ను ‘సంఘీ’ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, తమిళనాడులో జరుగుతున్న రగడ ఏంటి?
- రూ.40 లక్షల ఇన్సూరెన్స్ కోసం శ్మశానం నుంచి శవాన్ని తెచ్చి ఎలా దొరికి పోయాడంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









