నరేంద్ర మోదీ: ‘మూడోసారి అధికారం ఎందుకు అడుగుతున్నామంటే...?’

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీ

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం రాబోయే 100 రోజుల పాటు పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.

ఆదివారం దిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ మహాసభలో ఆయన మాట్లాడారు. బీజేపీ మూడో సారి అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు.

ప్రభుత్వ పథకాలు, విజయాలను సామాన్య ప్రజలకు చేరవేసి వారి విశ్వాసాన్ని పొందాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లకు పైగా గెలుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే, మూడోసారి అధికారం అడుగుతున్నది, అనుభవించడానికి కాదని, దేశాన్ని అభివృద్ధి చేయడానికేనని మోదీ స్పష్టంచేశారు.

వచ్చే ఐదేళ్లలో భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని మోదీ తెలిపారు. ఇదే సందర్భంగా కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని కాపాడేందుకు పార్టీ కార్యకర్తలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీ తన ప్రసంగంలో అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు, బలహీన వర్గాల గురించి కూడా ప్రస్తావించారు.

బీజేపీ జాతీయ మహాసభ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ఆదివారం దిల్లీలో బీజేపీ జాతీయ మహాసభ జరిగింది.

'మోదీ మరోసారి అధికారంలోకి వస్తారని ఇతర దేశాలకూ తెలుసు'

బీజేపీ పాలనలోని విధానాలు, విజయాలను మోదీ కొనియాడారు. తన హయాంలో దేశం ఆర్థికాభివృద్ధిలో కొత్త ఒరవడులు సృష్టించిందని ఆయన తెలిపారు.

"ఇవాళ ఈ రాజకీయ పార్టీలన్నీ 'అభివృద్ధి చెందిన భారతదేశం' అనే వాగ్దానం ఇవ్వడానికి భయపడుతున్నాయి. బీజేపీ, ఎన్‌డీఏ మాత్రమే ఆ కలలు కన్నాయి. 2047 నాటికి 'అభివృద్ధి చెందిన భారతదేశం' సాధించేలా కృషి చేస్తాం" అని ప్రధాని అన్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో 11వ స్థానం నుంచి ఐదో స్థానానికి తీసుకొచ్చామని, ఇప్పుడు మూడో స్థానానికి తీసుకువస్తామని ఆయన చెప్పారు.

''ప్రస్తుతం మనం ఐదో స్థానంలో ఉన్నాం, ఇంత అభివృద్ధి జరుగుతోంది, మూడో స్థానంలో ఉంటే ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో ఆలోచించండి. కొత్త ఉద్యోగాల కల్పన, ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాం'' అని మోదీ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని కూడా ప్రధాని ప్రశంసించారు.

మేలో ఎన్నికలు జరగాల్సి ఉందని, అయితే, ఇతర దేశాల నుంచి ఆహ్వానాలు అందడం ఇప్పటికే ప్రారంభమైందని మోదీ చెబుతున్నారు.

''2014లో నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మోదీకి గుజరాత్ బయట అనుభవం లేదని విమర్శించేవారు. విదేశాంగ విధానం గురించి కూడా చాలా మాట్లాడారు. ఇటీవల యూఏఈ, ఖతార్‌లను సందర్శించాను. ఆయా దేశాలతో మన సంబంధాలు ఎంత బలంగా మారాయో ప్రపంచం చూస్తోంది. ఐదు అరబ్ దేశాలు ఇండియాకు అతిపెద్ద గౌరవాన్ని ఇచ్చాయి. ఇది ప్రధాని మోదీకి కాదు, మొత్తం 140 కోట్ల మంది భారతీయులకు గౌరవం'' అని మోదీ అన్నారు.

"ఎన్నికలు ఇంకా జరగనేలేదు, కానీ జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇతర దేశాల నుంచి ఆహ్వానాలు వచ్చాయి. అంటే మోదీ మాత్రమే అధికారంలోకి వస్తారని వారికి తెలుసు" అని అన్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

ఐదు శతాబ్దాల నిరీక్షణకు తెర

అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ 'మనం ఐదు శతాబ్దాల నిరీక్షణకు తెరదించాం' అని అన్నారు.

శతాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించామన్నారు.

''గుజరాత్‌లోని పావగఢ్‌లో 500 సంవత్సరాల తర్వాత జెండా (మతపరమైన) ఎగిరింది. ఏడు దశాబ్దాల తర్వాత కర్తార్‌పూర్ సాహిబ్‌కు మార్గం అందుబాటులోకి వచ్చింది" అన్నారు మోదీ.

ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 గురించీ ప్రస్తావించారు.

"ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఆర్టికల్ 370 నుంచి దేశానికి స్వేచ్ఛ లభించింది" అని వ్యాఖ్యానించారు మోదీ.

సోనియా, మల్లికార్జున ఖర్గే

ఫొటో సోర్స్, NOAH SEELAM/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే (ఫైల్)

టార్గెట్ కాంగ్రెస్

విపక్షాలను ముఖ్యంగా కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ టార్గెట్ చేశారు. 'కాంగ్రెస్‌ నుంచి దేశ భవిష్యత్తును, పౌరులను రక్షించడం ప్రతి బీజేపీ కార్యకర్త బాధ్యత' అని మోదీ అన్నారు.

అస్థిరత సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని, వివిధ కారణాలతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

"కాంగ్రెస్ దేశ బలగాల నైతిక స్థైర్యం దెబ్బతీసి అతి పెద్ద పాపం చేసిందని, భారత భద్రత, వ్యూహాత్మక శక్తిని దెబ్బతీయడంలో అది ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు" అని ప్రధాని మోదీ ఆరోపించారు.

రక్షణ రంగంలో ఏదైనా జరిగినా, సైన్యం ఏదైనా సాధించిందని చెప్పినా కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తిందని అన్నారు.

ఐదేళ్ల క్రితం మన వైమానిక దళానికి రాఫెల్ వంటి విమానాలు రాకుండా చేయడానికి తప్పుడు ప్రచారం చేశారని మోదీ ఆరోపించారు. 'ఇపుడు హెచ్ఏఎల్ మార్కెట్ చూడండి' అని తెలిపారు.

"ఈ వ్యక్తులు సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు సైన్యం శౌర్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. వైమానిక దాడి విజయవంతమైందని రుజువు చేయాలని డిమాండ్ చేశారు" అని గుర్తుచేశారు.

"కాంగ్రెస్ చాలా గందరగోళంలో ఉంది. ఒక వర్గమేమో మోదీని తీవ్రంగా ద్వేషించండి, వ్యక్తిగత ఆరోపణలు చేయండని. మరొక వర్గం మోదీని ద్వేషించడం మానేయండి, ఇది కాంగ్రెస్‌కు నష్టమని అంటోంది. దీనర్థం కాంగ్రెస్ దాని సమస్యలపై మాతో పోరాడకూడదు" అని మోదీ అన్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, ANI

అధికారం ఎందుకు అడుగుతున్నామంటే?

గత పదేళ్లలో తమ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేసిందని, ఇంకా చేయాల్సింది ఉందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

''నేను నా సంతోషం కోసమో, కీర్తి కోసమో బతకడం లేదు. పదవులు అనుభవించడానికి బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలని కోరడం లేదు. మా సొంత ఇంటి కోసమే ఆలోచించి ఉంటే దేశంలోని కోట్లాది మంది పేదల కోసం ఇళ్లు కట్టేవాళ్లం కాదు. కోట్లాది మంది పిల్లల సంక్షేమం, భవిష్యత్తు కోసమే బతుకుతున్నాం'' అన్నారు మోదీ.

తమ ప్రభుత్వం మహిళలు, వెనుకబడిన వర్గాలపై శ్రద్ధ చూపిందని, ఇంతకు ముందు వారి గురించి ఎవరూ ఆలోచించలేదని మోదీ తెలిపారు. 'మేం వారిని పూజించాం కూడా' అని అన్నారు.

"మహిళల పోషకాహారం కోసం ప్రచారం చేశాం. గర్భధారణ సమయంలో వారికి అవసరమైన పోషకాహారం అందేలా పథకాన్ని తీసుకొచ్చాం. అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు మరణశిక్షలను నిర్ణయించాం. మరుగుదొడ్డి సమస్య గురించి ఎర్రకోటపై మాట్లాడిన మొదటి భారత ప్రధానిని నేను" అన్నారు మోదీ.

ఈ కథనం ప్రచురించే సమయానికి కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు మోదీ వ్యాఖ్యలపై ఎలాంటి కామెంట్ చేయలేదు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)