ఎలక్టోరల్ బాండ్లను వ్యతిరేకిస్తూనే ప్రతిపక్షాలు ఆ విరాళాలను ఎందుకు తీసుకున్నాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజకీయ పార్టీలు విరాళాల రూపంలో తీసుకొనే ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే, ఆ బాండ్లను వ్యతిరేకించే పార్టీలు కూడా వాటిని స్వీకరించడం సమంజసమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటుపై దాఖలైన వ్యాజ్యాన్ని పరిశీలించిన భారత అత్యున్నత న్యాయస్థానం.. ఆ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పునిచ్చింది.
కేంద్రం జనవరి 2018లో ఈ ఎలక్టోరల్ బాండ్స్ పద్దతి ప్రవేశపెట్టింది. దీని కింద ఏ భారతీయ పౌరుడైనా, కంపెనీ అయినా బాండ్లను కొనుగోలు చేయవచ్చు, వాటిని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు.
అనంతరం రాజకీయ పార్టీలు ఈ బాండ్లను నగదుగా మార్చుకోవచ్చు.
ఎలక్టోరల్ బాండ్‌లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ బాండ్లను రూ. 1,000, రూ. 10,000, రూ. 1,00,000, రూ. 10,00,000, రూ. 1,00,00,000 ఇలా కొనుగోలు చేయవచ్చు. బాండ్ కొనుగోలు చేసిన 15 రోజుల్లోపు రిజిస్టర్ అయిన, గత ఎన్నికల్లో కనీసం ఒక శాతం ఓట్లను పొందిన రాజకీయ పార్టీలకు వీటిని ఇవ్వొచ్చు. ఈ బాండ్ పేపర్లపై కొనుగోలుదారు పేరు ఉండదు. ఈ బాండ్లను ప్రతి సంవత్సరం జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో బ్యాంకు శాఖలలో అందుబాటులో ఉంటాయి. వాటిని కొనుగోలు చేయడానికి ఆయా నెలల్లో పది రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. భారత పార్లమెంట్ ఎన్నికలు జరిగే సంవత్సరాల్లో అదనంగా 30 రోజులు ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
బాండ్లపై వ్యతిరేకత ఎందుకు?
ఈ విధానం కింద 2018 జనవరి నుంచి 2024 జనవరి వరకు రూ.16,518 కోట్ల విలువైన బాండ్లు అందాయి.
వీటిలో అధికార భారతీయ జనతా పార్టీకే ఎక్కువ నిధులు వచ్చాయని పలు రిపోర్టులు చెబుతున్నాయి.
అయితే, ఆయా పార్టీలకు ఈ బాండ్లు ఎవరు చెలిస్తున్నారో తెలియకపోవడంతో నగదును లాండరింగ్ చేసేందుకు ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి.
ఎస్‌బీఐ బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంకు కావడంతో దాని సమాచారాన్ని ప్రభుత్వం పొందే అవకాశం ఉన్నందున, బడా కంపెనీలు ప్రతిపక్ష పార్టీలకు డబ్బు ఇవ్వడానికి విముఖత చూపుతాయన్నది మరో ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా ఈ బాండ్ల ద్వారా పొందిన డబ్బును సంబంధిత రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రయోజనాల కోసమే ఉపయోగిస్తాయనే దానికి ఎటువంటి హామీ లేదా పర్యవేక్షణ లేదు. ఈ బాండ్ల ద్వారా డబ్బులు పొందే పార్టీ దానితో ఏది కావాలంటే అది చేసుకొనే వీలుంది. దీంతో ఈ బాండ్ వ్యవస్థపై దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ విధానాన్ని నిషేధించింది.
మొదట్లో ఈ విధానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ పద్ధతిలో విరాళాలు అందుకోబోమని సీపీఎం ప్రకటించింది. ఈ విధానంపై కేసు వేసిన వారికి ఆ పార్టీ మద్దతు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏ పార్టీకి ఎన్ని నిధులు వచ్చాయి?
2017లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు ద్వారా ప్రజాప్రాతినిధ్య చట్టం, ఆదాయపు పన్ను చట్టం, రిజర్వు బ్యాంక్ చట్టం, కంపెనీల చట్టాలలో సవరణలు చేసి ఈ ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టింది.
దీనిపై అప్పట్లో ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతర బ్యాంకులకు బాండ్లను జారీ చేసే బాధ్యతను ఇవ్వడం వల్ల ఆర్‌బీఐ అధికారం తగ్గుతుందని పేర్కొంది.
అంతేకాదు ఎన్నికల సంఘం కూడా దీన్ని వ్యతిరేకించింది. ఇది పారదర్శకత లేని, తిరోగమన చర్యగా పేర్కొంది. అయినప్పటికీ, ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది, అమల్లోకి తెచ్చింది.
భారత రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్‌లో దాఖలు చేసిన లెక్కల ప్రకారం 2018 నుంచి 2013 వరకు ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన రూ.16,518 కోట్లలో అధిక భాగం బీజేపీకే అందాయి.
బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.6,565 కోట్లు వచ్చాయి. మరో జాతీయ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ బాండ్ల ద్వారా రూ. 1,123 కోట్లు అందుకొంది.
తృణమూల్ కాంగ్రెస్ రూ.1,093 కోట్లు, బిజూ జనతాదళ్ రూ.774 కోట్లు, డీఎంకే పార్టీకి రూ. 617 కోట్లు కూడా వచ్చాయి. బీఆర్ఎస్‌కు రూ.384 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ)కి రూ.382 కోట్లు వచ్చాయి. టీడీపీ, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, యునైటెడ్ జనతాదళ్, సెక్యులర్ జనతాదళ్‌లకు దీని ద్వారా చాలా తక్కువ మొత్తం లభించింది

ఫొటో సోర్స్, AFP
విరాళాలపై ప్రతిపక్షాలేమంటున్నాయి?
ఈ బాండ్లను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఇలా నిధులు తీసుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, వైసీపీ, డీఎంకే ఈ బాండ్ల ద్వారా అత్యధికంగా విరాళం తీసుకోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడు ఆనంద్ శ్రీనివాసన్ స్పందిస్తూ.. మారిన నిబంధనలనుసారం వెళ్లకూడదనడం సరైన వాదన కాదని అంటున్నారు.
‘‘రూల్స్ మార్చింది వాళ్లే. దాని ప్రకారమే గేమ్ ఆడాలి, లేదంటే వదిలేయాలి. కాంగ్రెస్ అలా వదిలేయదు. ఈ నిబంధనల ప్రకారమే కార్పొరేట్ల నుంచి విరాళం పొందగలరని చెప్పాక, ఇంకేం చేయగలం? లేకపోతే, కార్పొరేట్ల నుంచి విరాళాలు పొందలేం" అన్నారు.
బాండ్ల విధానంపై కోర్టులో కేసులు వేశారు, కానీ, తీర్పు వచ్చే వరకు కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్లకుండా ఉండలేదు కదా? అని ప్రశ్నించారు ఆనంద్ శ్రీనివాసన్.
''బాండ్లు పూర్తిగా తప్పని కోర్టు తేల్చేసింది. అయితే గత ఐదేళ్లలో జరిగిన తప్పులకు బాధ్యులెవరు? కేంద్ర ఆర్థిక మంత్రి లేదా ప్రధాని రాజీనామా చేస్తారా? ఈ నిబంధన తీసుకొచ్చిన బీజేపీని ప్రశ్నించే బదులు మీడియా అంతా ప్రతిపక్షాలను ప్రశ్నిస్తోంది’’ అని ఆనంద్ శ్రీనివాసన్ చెప్పారు.
అయితే, డీఎంకే పొందిన విరాళాలలో ఎన్నికల బాండ్ల ద్వారానే 90 శాతానికి పైగా నిధులు అందుకుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై శుక్రవారం మీడియా ముందు ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యవస్థతో పాటే ముందుకెళ్లాలి: సీనియర్ జర్నలిస్టు పన్నీర్ సెల్వన్
రాజ్యాంగ విరుద్ధమైన చట్టం తీసుకొచ్చిన వారిని ప్రశ్నించకుండా ప్రతిపక్షాన్ని విమర్శించడం సరికాదని సీనియర్ జర్నలిస్టు ఎ.ఎస్. పన్నీర్ సెల్వన్ అభిప్రాయపడ్డారు.
‘‘ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని చాలా రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఆ సంస్కరణ వచ్చే వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదా? పోటీ చేసినంత మాత్రాన ఆ విధానంలో సమస్య లేదని కాదు. ఉదాహరణకు గవర్నర్ పదవి అవసరం లేదన్నది డీఎంకే వైఖరి. కానీ, ఆ పార్టీ ముఖ్యమంత్రులందరూ గవర్నర్ల ద్వారానే ప్రమాణ స్వీకారం చేశారు, దీనిని మరో విధంగా చూడలేం. ఇవన్నీ వ్యవస్థలో జరగాల్సినవి. అలాగే కార్పొరేట్ల నుంచి విరాళాలు తీసుకోవాలంటే ఇదొక్కటే మార్గం అని చెప్పిన తర్వాత ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది?’’ అని పన్నీర్‌సెల్వన్ అన్నారు.
''ఎలక్టోరల్ బాండ్ కాకుండా మరో విధంగా విరాళాలు తీసుకోకూడదా? కేంద్ర ప్రభుత్వం ఎలా చెబితే కార్పొరేట్ కంపెనీలు ఆ మార్గాన్ని అనుసరిస్తాయి. భారత్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలాగే జరుగుతోంది. కేంద్రానికి వ్యతిరేకంగా ఏ కంపెనీ ముందుకెళ్లదు'' అని అభిప్రాయపడ్డారు పన్నీర్ సెల్వన్.
ఇవి కూడా చదవండి:
- ఎజియావో: మనుషుల యవ్వనం కోసం గాడిదలను చంపేస్తున్నారు
- నరేంద్ర మోదీ నుంచి‘‘బ్రాండ్ మోదీ’’ వరకు..
- ప్రపంచంలోనే ‘అతిపెద్ద నౌక’ను సద్దాం హుస్సేన్ సైన్యం ఎలా ముంచేసిందంటే..
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- కేజీ బేసిన్: కాకినాడ తీరంలో తొలిసారిగా చమురు వెలికితీత...భారతదేశపు చమురు అవసరాలను ఇది తీర్చగలదా?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














