దేశంలో పంటలకు కనీస మద్దతు ధర అవసరం లేదా? రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కావాల్సిన వేరే పద్ధతులేంటి

ఫొటో సోర్స్, ABHINAV GOYAL/BBC
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
23 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) హామీ సహా పలు డిమాండ్లతో రైతులు దిల్లీ సరిహద్దులో వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పప్పుధాన్యాలు, నూనె గింజలు, మొక్కజొన్న, పత్తి వంటి పంటలు పండిస్తే ప్రభుత్వరంగ సంస్థలు ఐదేళ్ల వరకు ఎంఎస్‌పీ ధరకు కొనుగోలు చేస్తాయని కేంద్ర ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది. దీనిని రైతు సంఘాలు తిరస్కరించాయి.
ప్రభుత్వ ప్రతిపాదనతో ప్రయోజనం లేదని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు.
అందుకే తమ డిమాండ్‌ల సాధన కోసం ఫిబ్రవరి 21 నుంచి రైతు సంఘాలు దిల్లీకి పాదయాత్ర చేయనున్నట్లు తెలిపాయి.
దీంతో పోలీసు బలగాలను భారీగా మోహరించి, రైతులను దిల్లీ బయటే అడ్డుకున్నారు.

ఫొటో సోర్స్, ANI
ఎంఎస్‌పీ అనేది పాత ఆలోచనా?
దేశం తీవ్రమైన ఆహార ధాన్యాల కొరత సమస్య ఎదుర్కొంటున్న 1960ల కాలం నాటి ఆలోచన ఎంఎస్‌పీ అని వ్యవసాయ, ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఆ సమయంలో రైతులు ఎక్కువ పంటలు పండించేలా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎంఎస్‌పీ విధానాన్ని అమలు చేసింది. ఇప్పుడు 'మిగులు ఆహారం' కాలమొచ్చింది, ఎంఎస్‌పీ అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
1964-65లో వరికి మొదటగా ఎంఎస్‌పీ ఇచ్చారు. అప్పట్లో వరి క్వింటాల్‌కు రూ.33.50 నుంచి రూ.39గా నిర్ణయించారు, 1966-67లో గోధుమలకు క్వింటాల్‌కు రూ.54గా ఇచ్చారు.
అయితే, ఆహార భద్రత విషయంలో దేశం ఇప్పుడు స్వయం సమృద్ధి సాధించిందని విశ్లేషకులు అంటున్నారు.
కాబట్టి దాని పాత్ర ముగిసిందని, ఈ వ్యవస్థ శాశ్వతంగా కొనసాగదంటున్నారు.
కాగా, 23 పంటలను ఎంఎస్‌పీతో కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ గ్రౌండ్ లెవల్‌లో గోధుమలు, వరి మాత్రమే కొనుగోలు చేస్తున్నారనే వాదనలున్నాయి.
అధికారిక సమాచారం ప్రకారం 2021-22 సంవత్సరానికి ముందు మూడేళ్లపాటు దేశంలో 1,340 లక్షల టన్నుల ధాన్యాన్ని ఎంఎస్‌పీ ప్రకారం కొనుగోలు చేశారు.
ఇందుకోసం ప్రభుత్వం రూ.2.75 లక్షల కోట్లు వెచ్చించింది. దేశంలో అదనపు ధాన్యం నిల్వ ఉంది, స్టోరేజీకి స్థలం లేకపోవడం వల్ల పెద్ద మొత్తంలో ధాన్యం పాడైపోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎంఎస్‌పీకి మద్దతుగా, వ్యతిరేకంగా వాదనలు
కేంద్రం రైతుల నుంచి అవసరమైన దానికంటే ఎక్కువ ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని వ్యవసాయ ఆర్థిక నిపుణులు అంటున్నారు.
ఉదాహరణకు 2022లో 600 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది, కానీ జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం 350 లక్షల టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేస్తే సరిపోతుంది. భారతదేశంలో ఇంత ధాన్యం నిల్వ చేసే వ్యవస్థ లేదు. అందువల్ల, పెద్ద మొత్తంలో ధాన్యం వృథా అవుతోందని నిపుణులు చెబుతున్నారు.
వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) మాజీ ఛైర్మన్, ప్రొఫెసర్ అశోక్ గులాటి ఇటీవల సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌తో 'ది వైర్' వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పది శాతం మంది రైతులు మాత్రమే తమ పంటలను ఎంఎస్‌పీకి విక్రయిస్తున్నారని చెప్పారు.
ఏ 23 పంటలకు చట్టపరంగా ఎంఎస్‌పీ అడుగుతున్నారో, అది కేవలం వ్యవసాయ ఉత్పత్తిలో 27.8 శాతం మాత్రమేనని గులాటి చెప్పారు.
పంజాబ్, హరియాణా సహా ఆరు లేదా ఏడు రాష్ట్రాల్లో మాత్రమే బియ్యం, గోధుమలను ఎంఎస్‌పీపై కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఈ క్లబ్‌లో కొత్త రాష్ట్రాలని, తూర్పు భారతదేశంలో ఎక్కువ భాగం ఈ పద్దతికి దూరంగా ఉందని చెప్పారు.
అయితే అశోక్ గులాటీ వాదనతో ఆర్థికవేత్త అరుణ్ కుమార్ ఏకీభవించడం లేదు.
"ప్రభుత్వం 23 పంటలకు ఎంఎస్‌పీని నిర్ణయిస్తుంది, అయితే ఇది గోధుమ, వరి రెండు పంటలకు మాత్రమే వర్తిస్తోంది.
ఇదే సమస్యకు కారణం. అందుకే రైతులు చట్టపరమైన హామీని కోరుతున్నారు. ప్రభుత్వం ఇలా చేస్తే రెండు పంటలకే ప్రాధాన్యం ఇచ్చే ఆనవాయితీ ఆగుతుంది. ఇది పంటలలో వైవిధ్యాన్ని తీసుకురాగలదు. గోదాముల్లో అవసరానికి మించి ధాన్యమూ ఉండదు'' అని అరుణ్ కుమార్ బీబీసీతో అన్నారు.
“రైతులకు ఎంఎస్‌పీ ఇవ్వడం ద్వారా వారికి ఎందుకు సబ్సిడీ ఇవ్వాలి అనే ప్రశ్న ప్రభుత్వ వర్గాల్లో తరచుగా తలెత్తుతోంది. 2022లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రూ. 14 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఓఈసీడీ రిపోర్టు చెబుతోంది. రైతులు సొసైటీకి సబ్సీడీకి ఇస్తున్నారని, కానీ, సొసైటీ గానీ, ప్రభుత్వం గానీ రైతులకు ఎలాంటి సబ్సిడీ ఇవ్వడం లేదు'' అని తెలిపారు.
రాజ్యాంగంలో వాగ్దానం చేసినట్లుగా 'తలసరి జీవన వేతనాన్ని' ప్రభుత్వం నిర్ధరిస్తే, డిమాండ్, సరఫరా సమస్యలు కూడా భారీ ప్రభావాన్ని చూపుతాయని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
గోదాముల్లో అంత ధాన్యం ఉంచాల్సిన అవసరం ఉండదని, ప్రజల వినియోగం పెరిగి పండ్లు, కూరగాయలు, ధాన్యాలు ఎక్కువగా తినగలుగుతారని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటి?
పంటలకు కనీస మద్దతు ధరతో పాటు స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఆ నివేదిక ప్రకారం రైతులు తమ పంటల ధరకు ఒకటిన్నర రెట్లు పొందాలి. కానీ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో ఎంఎస్‌పీపై గ్యారంటీ లేదు.
వరి, గోధుమలను మాత్రమే కాకుండా వైవిధ్యమైన పంటలు సాగుచేయాలని కేంద్రం రైతులకు సూచించింది.
రైతులను పప్పుధాన్యాలు పండించాలని మంత్రుల కమిటీ కోరిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
ఇది పప్పు ధాన్యాల దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వారి అభిప్రాయం. దీనిద్వారా దేశీయ ఉత్పత్తి ద్వారానే పప్పుధాన్యాల డిమాండ్‌ను తీర్చవచ్చు.
పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో నీటి మట్టం నిరంతరం పడిపోతున్న సమస్యకు దీనితో ముగింపు చెప్పొచ్చు.
మొక్కజొన్న, చిక్కుడు, పత్తి వంటి పంటల సాగుకు రైతులు వెనుకాడుతున్నారని రైతు ప్రతినిధులు అంటున్నారని పీయూష్ గోయల్ తెలిపారు.
ఈ పంటలను ఎంఎస్‌పీకి కొనుగోలు చేయకపోతే భారీ నష్టాలు తప్పవని రైతులు భావిస్తున్నారని ఆయన అన్నారు.
రైతులు మొక్కజొన్న లేదా పప్పుధాన్యాలు పండిస్తే నేషనల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీసీఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ (ఎన్ఏఎఫ్ఈడీ)లు సాయం చేస్తాయని, ఐదేళ్లు ఒప్పందం కుదుర్చుకుంటాయని మంత్రుల కమిటీ రైతులకు ప్రతిపాదించింది. దీని కింద ఈ పంటలను ఎంఎస్‌పీకి కొనుగోలు చేస్తుంది. కొనుగోలుపై ఎటువంటి పరిమితి ఉండదు.
ఇక పత్తి కొనుగోలు కోసం 'కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' రైతులతో ఇదే ఒప్పందం కుదుర్చుకోనుంది.

ఫొటో సోర్స్, ANI
రైతులు ఏమంటున్నారు?
పంటల వైవిధ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
అయితే అది ప్రభుత్వ భవిష్యత్తు వ్యవహార శైలిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
కేంద్ర మంత్రులతో జరిగిన చర్చల్లో భారతీయ కిసాన్ యూనియన్ ఏక్తా (సిధుపూర్) అధ్యక్షుడు జగ్జిత్ సింగ్ దల్లెవాల్ పాల్గొన్నారు.
బీబీసీతో జగ్జిత్ సింగ్ మాట్లాడుతూ "అన్ని పంటలకు ప్రభుత్వం ఎంఎస్‌పీ హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అలా చేస్తే పంటల సాగు దానికదే జరుగుతుంది. దీనిపై ప్రభుత్వానికి ఆందోళన అవసరం లేదు'' అని అన్నారు.
పప్పులు, నూనె గింజలు అమ్మడం వల్ల రైతుకు ఎక్కువ లాభం వస్తుందంటే వరి, గోధుమలు ఎందుకు పండిస్తాడని ఆయన ప్రశ్నిస్తున్నారు.
''ప్రభుత్వం, ఈ దేశంలోని మేధావులు పంటల వైవిధ్యాన్ని కోరుకుంటున్నారు, ఇది మంచి విషయమే. అయితే రైతులు తమ పంటలను ఎంఎస్‌పీకి విక్రయిస్తారనే హామీని పొందాలి'' అని ఆయన తెలిపారు.
"ప్రభుత్వ హామీ లేకపోతే రైతు పంట విక్రయం కాదు. అప్పుడు ఎంఎస్‌పీకి ఏ పంటనైతే కొనుగోలు చేస్తారో దానివైపే రైతు మొగ్గు చూపుతాడు" అని జగ్జిత్ సింగ్ అభిప్రాయపడ్డారు.
కంపెనీల దయాదాక్షిణ్యాలకు రైతులను వదిలిపెట్టలేమని జగ్జిత్ సింగ్ అంటున్నారు.
''గతంలో వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీల అభ్యర్థన మేరకు రైతులు బంగాళదుంపలు, టమోటాలు, బాస్మతి వరి సాగు చేశారు. కంపెనీలు పంటను కొంటామని వాగ్దానం చేస్తాయి, కానీ ఒప్పందాలను కంపెనీలు తుంగలో తొక్కడంతో రైతులు నష్టపోతున్నారు'' అని గుర్తుచేశారు.
"ప్రభుత్వ ఏజెన్సీలు సేకరణ బాధ్యత తీసుకోవాలి. రైతులు పండించిన మొత్తం పంటను ఈ ఏజెన్సీలు నిర్ణీత ధరకు కొనుగోలు చేయాలి. ఇది జరిగితే పంటల వైవిధ్యీకరణ జరుగుతుంది'' అని సూచించారు జగ్జిత్ సింగ్.
రైతుల ఆదాయం ఎలా పెరుగుతుంది?
ఎంఎస్‌పీ చట్టబద్ధమైన హామీ రైతులకు నష్టం చేకూరుస్తుందని ప్రొఫెసర్ అశోక్ గులాటి అంటున్నారు.
ఒకవేళ స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తే, పంటల ధరలు పెరిగి ఆహార పదార్థాల ధరలు 25 నుంచి 30 శాతం పెరుగుతాయని, దీంతో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం ప్రభుత్వానికి కష్టంగా మారుతుందన్నారు.
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు అనేక మార్గాలున్నాయని ఆయన అంటున్నారు. వీటిలో ప్రైస్ స్టెబిలిటీ ఫండ్ ఏర్పాటు ఒకటని తెలిపారు.
అంటే పంటల మార్కెట్ ధర ఎంఎస్‌పీ కంటే తక్కువగా ఉన్నప్పుడు, ప్రభుత్వం దానిని భర్తీ చేయాలి. ఈ వ్యవస్థ చైనాలో ప్రభావవంతంగా ఉందని గులాటీ చెప్పారు.
వరి, గోధుమ పంటలకు బదులు అధిక ధర వచ్చే పంటలను పండించేలా రైతులను ప్రోత్సహించాలని ఆయన తెలిపారు.
పండ్లు, కూరగాయలు, పశువులు, చేపల పెంపకానికి రైతులను ప్రోత్సహించాలని గులాటీ సూచించారు.
ఎంఎస్‌పీ వ్యవస్థ ఆధిపత్యమనేది వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలను నిరుత్సాహపరుస్తుందని 'వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ'లో సంస్కరణల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని వల్ల రైతులు ప్రభుత్వ వ్యవస్థపైనే ఆధారపడతారని, నష్టాలకు భయపడతారని తెలిపారు.
అందువల్ల ఎంఎస్‌పీకి బియ్యం, గోధుమల కొనుగోళ్ల నుంచి రైతులను విముక్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- అలెక్సీ నవాల్నీ: పుతిన్‌ను ఎదిరించిన నేతతో పెళ్లిపై యూలియా నవాల్నియా ఏమన్నారు?
- చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
- ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, క్యాష్ చేసుకోని బాండ్ల సొమ్మును 15 రోజుల్లో దాతలకు తిరిగి ఇచ్చేయాలి: సుప్రీం కోర్టు స్పష్టీకరణ
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- రేవంత్ రెడ్డి X కేసీఆర్: ముఖ్యమంత్రులు బూతులు మాట్లాడొచ్చా? నేతల దిగజారుడు భాషను ఎలా చూడాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














