రైతుల నిరసన-చలో దిల్లీ: 2020-21 నాటి ఉద్యమానికి, ఇప్పటికీ తేడా ఏంటి?

- రచయిత, నవ్దీప్ కౌర్ గ్రేవాల్
- హోదా, బీబీసీ కోసం
పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల రైతు సంఘాల నాయకత్వంలో 'దిల్లీ చలో' రైతు ఉద్యమం మొదలైంది.
2020-21 రైతు ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది దీనిని 'కిసాన్ ఆందోళన్ 2.0' (రైతు ఆందోళన 2.0)గా పిలుస్తున్నారు.
అయితే, పోయిన సారి ఉద్యమంతో పోలిస్తే ఈ ఉద్యమం చాలా భిన్నమైంది.
మరింత విపులంగా చెప్పాలంటే, ప్రస్తుత రైతు ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న నాయకులు, ఉద్యమంపై ప్రభుత్వ వైఖరి, రైతుల డిమాండ్లలో కూడా పాత ఉద్యమంతో పోలిస్తే చాలా వ్యత్యాసాలున్నాయి.
కానీ, ఈ ఉద్యమాన్ని 2020-21 రైతు ఉద్యమానికి కొనసాగింపుగా లేదా తదుపరి దశగా పిలుస్తున్నారు.
ఈసారి రైతులు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమిస్తున్నారని రాజకీయ వ్యవహారాల నిపుణులు, ప్రొఫెసర్ మహ్మద్ ఖలీద్ అన్నారు.
''గతంలో జరిగిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈసారి ఎన్నికలు కూడా దగ్గరపడ్డాయి. కాబట్టి దీనిని త్వరగా పరిష్కరించకపోతే హరియాణా ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నష్టపోవచ్చు'' అన్నారాయన.
''ఈసారి రైతులు కూడా దృఢంగా ఉన్నారని అనుకుంటున్నా. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది, అది ప్రభుత్వానికి నష్టం కలిగించవచ్చు" అన్నారు.
''2020లో రైతులు దిల్లీ వైపు కదం తొక్కినప్పుడు అది కేవలం మూడు రోజుల కార్యక్రమం. కానీ అది ఆ తర్వాత ఏడాది వరకూ కొనసాగింది'' అని సీనియర్ జర్నలిస్ట్ జగ్తార్ సింగ్ అన్నారు.
ఈసారి రైతు సంఘాలు నిరవధిక ధర్నాను ప్రకటించాయని ఆయన అన్నారు.

అప్పుడేం డిమాండ్ చేశారు
''ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ - 2020 (వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం), ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ ఎస్యూరెన్స్ అండ్ అగ్రికల్చరల్ సర్వీసెస్ యాక్ట్ 2020 (ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతు ఒప్పంద చట్టం)'' ''ఎసెన్షియల్ కమోడిటీస్ ఎమెండ్‌మెంట్ యాక్ట్ 2020 (నిత్యవసర వస్తువుల సవరణ చట్టం)'' ఉపసంహరణ.
పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర
విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ
కాలుష్య చట్టాల నుంచి రైతులకు మినహాయింపు
2020-21 ఉద్యమం సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదన్న ఆగ్రహమే ప్రస్తుత ఉద్యమానికి కారణమైంది.

ఇప్పుడేం అడుగుతున్నారు?
స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు చట్టపరమైన కనీస మద్దతు ధర కల్పించాలి.
2013 భూసేకరణ చట్టం జాతీయ స్థాయి అమలు, భూ సేకరణలో రైతు లిఖితపూర్వక సమ్మతితో పాటు కలెక్టర్ నిర్ణయించిన ధరకు నాలుగు రెట్లు చెల్లించాలి.
విద్యుత్ సవరణ బిల్లు 2020ను ఉపసంహరించాలి.
ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) వ్యవసాయంతో అనుసంధానం చేయడం, రోజుకు రూ.700 చొప్పున ఏడాదికి 200 రోజుల ఉపాధి హామీ కల్పించాలి.
రైతులు, రైతు కూలీలకు పూర్తి రుణమాఫీ చేయాలి.
లఖింపూర్ ఖేరీ ఘటన బాధ్యులకు శిక్ష పడేలా చూడాలి.
2020-21 దిల్లీ కిసాన్ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలి.
రైతులు, కార్మికులకు వృద్ధాప్య పింఛన్ పథకం అమలు చేయాలి.
నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల తయారీ కంపెనీలు, వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు ఉండేలా చూడాలి.
పసుపు, మిరప, ఇతర సుగంధ ద్రవ్యాల సాగు ప్రోత్సాహానికి కమిషన్లు ఏర్పాటు చేయాలి.
ఆందోళనలు మొదలవడానికి ముందు రైతులతో ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు మాట్లాడిందని సూర్జిత్ సింగ్ ఫూల్ తెలిపారు. అయితే, డిమాండ్ల పరిష్కారంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆందోళన కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, ANI
ఉద్యమ నాయకత్వంలో మార్పు
2020-21 ఉద్యమం భారతీయ కిసాన్ యూనియన్, యునైటెడ్ కిసాన్ మోర్చా నేతృత్వంలో జరిగింది.
యునైటెడ్ ఫార్మర్స్ ఫ్రంట్ కింద దేశవ్యాప్తంగా 500లకు పైగా రైతు సంఘాలు ఇందులో పాల్గొన్నాయి.
ఇందులో పంజాబ్‌కి చెందిన భారతీ కిసాన్ యూనియన్-ఉగ్రహాన్ సహా 37 సంఘాలు ఉన్న యునైటెడ్ కిసాన్ మోర్చా లేదు
ప్రస్తుత దిల్లీ చలో ఉద్యమానికి యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వం వహిస్తున్నాయి.
యునైటెడ్ కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్) 2022లో యునైటెడ్ కిసాన్ మోర్చా నుంచి విడిపోయిన ఒక వర్గం.
ప్రస్తుత దిల్లీ చలో ఉద్యమంలో 200లకు పైగా సంస్థలు పాల్గొంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
గతంలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన ముఖ్యులు ఈసారి కనిపించడం లేదు.
ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్‌కు యునైటెడ్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.
''ఈసారి రైతు నాయకత్వం రెండుగా విడిపోయింది. గతంలో అలా జరగ లేదు. ఉద్యమంలో ఓ వర్గం ముందుంటోంది. గతం ఉద్యమ సమయంలో ముందున్న చాలా మంది రైతు నేతలు ఈసారి మౌనంగా ఉన్నారు'' అని సీనియర్ జర్నలిస్టు జస్పాల్ సిద్ధూ అన్నారు.
''ప్రభుత్వాలు కూడా రైతు నాయకత్వంలో చీలికలను ప్రోత్సహించవచ్చు'' అని ఆయన అన్నారు.
గతంలో పంజాబ్‌కు చెందిన రైతు నాయకుల్లో ఎక్కువ మంది వామపక్ష భావజాలంతో ఉండేవారని, ఈసారి నాయకులు శ్రీ అకల్ తఖ్త్ సాహిబ్‌లో ప్రార్థనలకు వెళ్లడం నాయకత్వ ధోరణిని తెలియజేస్తోందని సిద్ధూ చెప్పారు.
''గతంలో అన్ని రైతు సంఘాలు పాల్గొన్నాయి. కానీ, ఈసారి అందులో ఒక వర్గమే పిలుపునిచ్చింది. రెండు ఉద్యమాల మధ్య ప్రధాన వ్యత్యాసమేంటంటే, ఐక్యత, అనైక్యత'' అని జగ్తార్ సింగ్ అన్నారు.
ఈ రైతు సంఘాల సమూహంలో కొందరు నాయకులు చేరలేదన్నది నిజమే. కానీ ప్రజలు వారిపై ఒత్తిడి తెస్తారని ప్రస్తుత ఫ్రంట్ నాయకులలో ఒకరైన సూర్జీత్ ఫూల్ అంటున్నారు.

2020-21 ఉద్యమంలో కీలక నేతలు
జోగీందర్ సింగ్ ఉగ్రహన్ గత ఉద్యమ నాయకులలో ప్రముఖులు.
భారత సైన్యం నుంచి పదవీ విరమణ పొందిన తర్వాత ఆయన రైతు ప్రయోజనాల కోసం పనిచేయడం మొదలుపెట్టారు.
2002లో భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహన్)ను స్థాపించారు.
మాల్వా ప్రాంత రైతులను సమీకరించడంలో కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుత ‘దిల్లీ చలో’ కార్యక్రమంలో వారి యూనియన్ చేరలేదు.
భారతీయ కిసాన్ యూనియన్ వ్యవస్థాపక నాయకులలో ఒకరైన బల్బీర్ సింగ్ రాజేవాల్ గత ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు.
ఆ సమయంలో, కిసాన్ సంఘర్ష్ డిమాండ్ల జాబితాను సిద్ధం చేయడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈసారి వారు ఎక్కడా కనిపించడం లేదు.

గతంలో 30 రైతు సంఘాల కూటమిలో కీలకపాత్ర పోషించిన భారతీయ కిసాన్ యూనియన్ (దకోండ) నాయకుడు జగ్మోహన్ సింగ్ , ఇప్పుడు నాయకత్వ స్థానంలో కనిపించడం లేదు.
ఇక ముప్పై రైతు సంఘాల కూటమి సమన్వయకర్తగా వ్యవహరించిన రివల్యూషనరీ కిసాన్ యూనియన్ నాయకుడు దర్శన్‌పాల్ కూడా ప్రస్తుత ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నవారిలో కనిపించడంలేదు.
గతంలో జరిగిన ఉద్యమంలో ముందున్న హర్యానా మాజీ నేత రాకేశ్ టికాయత్ మాట్లాడుతూ ప్రస్తుత ‘చలో దిల్లీ’ కార్యక్రమం ఐక్య కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు కాదని చెప్పారు.
ప్రస్తుతం తానీ ఫ్రంట్‌లో మమేకం కాలేదని, కానీ వారి డిమాండ్లకు మాత్రం కచ్చితంగా మద్దతిస్తానని చెప్పారు. రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే వారి వెనుక ఉంటానన్నారు.
గతంలో రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కీలక నేతలలో హరియాణాకు చెందిన గురునామ్ సింగ్ చదుని కూడా ఒకరు. ఈయన కూడా తాను రైతుల డిమాండ్లకు మద్దతు ఇస్తున్నానని, కాకపోతే దేశంలోని అన్ని సంఘాలతో వ్యూహాత్మక సమావేశం జరిపి ఆహ్వానం పంపి ఉండాల్సిందంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఉద్యమం చేస్తున్న రైతులపై బలగాలను ప్రయోగించవద్దని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఫొటో సోర్స్, ANI
‘చలో దిల్లీ’ ఉద్యమ నేతలు వీరే
ప్రస్తుత ‘చలో దిల్లీ’ ఉద్యమానికి కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకుడు స్వరణ్ సింగ్ పాందర్ కూడా నాయకత్వం వహిస్తున్నారు.
2020-21 ఉద్యమ సమయంలో పాందర్ నేతృత్వంలోని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ ముందు వరుసలో కనిపించలేదు. కానీ దిల్లీలోని కుండీ సరిహద్దు వద్ద ప్రదర్శన నిర్వహించింది.
గత ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నేతలలో ఒకరైన జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ప్రస్తుత ‘చలో దిల్లీ’ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రముఖ నేతలలో ఒకరుగా ఉన్నారు.
దల్లేవాల్ మాట్లాడుతూ ‘‘ఇవి రైతుల డిమాండ్లు కావు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకు ఇచ్చిన హామీలు. వాటిని అమలు చేయాలని కోరుతున్నాం’’. అని చెప్పారు.
వీరే కాకుండా భారతీయ కిసాన్ యూనియన్ ( రివల్యూషనరీ) కు చెందిన సుర్జిత్ సింగ్ పూల్ ప్రసుత్త ఉద్యమంలో ముందున్నారు.
గతంలో సాగుచట్టాల రద్దు గురించి ప్రభుత్వంతో చర్చలు జరిపిన రైతులలో సుర్జీత్ సింగ్ కూడా ఉన్నారని ట్రైబ్యూన్ కథనం తెలిపింది.
వీరితోపాటు ప్రస్తుత ఉద్యమాన్ని హరియాణా నుంచి అభిమన్యు కోహర్, మధ్యప్రదేశ్ నుంచి శివకుమార్ కక్కా ముందుండి నడిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, BBC/ PRABHU DAYA
ప్రభుత్వ వైఖరి ఏంటి?
2020 - 21 లో జరిగిన రైతు ఉద్యమంతో పోల్చుకుంటే ప్రస్తుత ఉద్యమం పట్ల ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉంది.
కిందటిసారి దిల్లీ సరిహద్దుల వద్ద దీర్ఘకాల నిరసన చేపట్టాకా రైతు సంఘ నాయకులతో ప్రభుత్వం 12 సార్లు సమావేశాలు నిర్వహించింది. ఆ తరువాత మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. రైతులతో వరుసగా సమావేశాలు నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం చాలా సమయం తీసుకుంది.
అయితే ఈసారి ‘చలో దిల్లీ ’ కార్యక్రమం మొదలవ్వడానికి ముందే ప్రభుత్వం రైతు నాయకులతో రెండుసార్లు సమావేశమైంది. రైతులతో ఈ ఏడాది ఫిబ్రవరి 8న మొదటిసారి సమావేశం జరగగా, ఫిబ్రవరి 12న రెండో సమావేశం నిర్వహించారు.
దీంతోపాటు చండీగడ్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు రైతులతో సమావేశమయ్యారు. కానీ ఈ సమావేశం ఎటువంటి తుది నిర్ణయం తీసుకోకపోవడంతో ‘చలో దిల్లీ’ కార్యక్రమం యధావిధిగా జరపాలనే నిర్ణయానికే రైతులు కట్టుబడ్డారు.
ఈసారి ప్రభుత్వ వైఖరి గతంలో కన్నా కఠినంగా ఉందని సీనియర్ జర్నలిస్ట్ జస్పాల్ సిద్ధు చెప్పారు.
‘‘కిందటిసారి హరియాణా సరిహద్దు వద్ద కఠినంగా వ్యవహరించి ఉంటే రైతులు దిల్లీ సరిహద్దుల వద్ద ఏడాదిపాటు కూర్చుని ఉండేవారు కాదని ప్రభుత్వం భావించింది. దీంతో ఈసారి రైతులను సరిహద్దు దాటనివ్వకూడదని నిశ్చయించుకుంది. అందుకే మొదటిరోజే బాష్పవాయు ప్రయోగం, లాఠీ చార్జ్ చేయడం కనిపించింది.’’ అని ఆయన వివరించారు.
‘‘ ఈసారి రైతులు ఉద్యమించకముందే ప్రభుత్వం వారితో సమావేశమైంది. కానీ కిందటిసారి ఆందోళనల తరువాత ఎటువంటి చర్యలు తీసుకోవకపోవడం ప్రభుత్వ వైఖరిని చూపుతోంది. అయితే రైతులను దిల్లీ చేరుకోనివ్వకుండా బారికేడ్లు అడ్డుగా పెట్టడం కిందటిసారి కనిపించలేదు’’ అని సీనియర్ జర్నలిస్ట్ జగ్తార్ సింగ్ చెప్పారు.
‘‘బారికేడ్లు ఏర్పాటు చేయడం, బలగాలను ఉపయోగించి రైతులను అడ్డుకోవడమనేది దేశంలో ఇప్పటిదాకా జరిగిన ఉద్యమాలలో ఎన్నడూ చూడలేదు’’ అని వివరించారు.
‘‘హరియాణాలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తుంటే వారిని రైతుల్లా కాకుండా శత్రువుల్లా చూస్తున్నట్టనిపించింది’’ అని చెప్పారు.
డ్రోన్లను, బాష్పవాయుగోళాలను ప్రయోగించడమనేది మొదటిసారి చూస్తున్నామని మాజీ నేత సుర్జీత్ పూల్ చెప్పారు.
‘‘రైతులు 8గంటలపాటు ప్రభుత్వం ప్రయోగించిన బలగాలను ఎదుర్కొన్నారు. కిందటిసారి సాగు చట్టాలను రద్దు చేశారు. ప్రభుత్వం దానిని అవమానంగా భావించింది. కానీ ప్రభుత్వానికి చాలా అధికారం ఉంది. అది ఎవరినైనా ఎక్కడైనా ఆపేయగలదనే విషయాన్ని నమ్ముతున్నాం’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGE
తాత్కాలికంగా ఎర్రకోట బంద్
భద్రతా కారణాల వల్ల సోమవారం రాత్రి ఎర్రకోటను తాత్కాలికంగా మూసివేసి పర్యాటకులను ఎవరినీ అనుమతించలేదు.
కిందటిసారి వివిధ రాష్ట్రాల నుంచి దిల్లీకి రైతులు చేరుకున్నప్పుడు కూడా ఇటువంటి చర్యలు తీసుకోలేదు.
గతంలో 2020-21 ఉద్యమ సమయంలో జనవరి 26న రైతులు దిల్లీలోకి ప్రవేశించడంతోపాటు ఎర్రకోటవరకు రాగలిగారు.

ఫొటో సోర్స్, BKU EKTA
ప్రజల భాగస్వామ్యం
గతంలో రైతులు ప్రదర్శనగా దిల్లీ వైపు కదులుతుంటే కొందరు కళాకారులు కూడా వీరితోపాటు కలిశారు.
కొన్ని యువజనసంఘాలూ కనిపించాయి. కానీ ఈసారి వీరెవరూ ప్రముఖంగా కనపడలేదు.
కిందటిసారి ఈ ఉద్యమంలో సామాన్యులెవరూ మొదట్లో పెద్దగా పాలుపంచుకోలేదు. కానీ క్రమంగా వారి భాగస్వామ్యం పెరిగిందని సీనియర్ జర్నలిస్ట్ జగ్తార్ సింగ్ చెప్పారు.
ప్రభుత్వం గత ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదనే విషయం అందరికీ ప్రముఖంగా తెలియడంతో ఈసారి ఉద్యమ ఆరంభం నుంచే సామాన్యులు ఆసక్తిగా ఉన్నారని వారు భావించారు.
అయితే 2020 ఉద్యమ సమయంలో ఇప్పటికంటే ఎక్కువమంది జనం వచ్చారు. దీనికి కారణం అప్పట్లో అన్ని సంఘాలు ఏకతాటిపైన ఉద్యమించడమే.
ఈసారి కూడా శంభు, ఖానోరి సరిహద్దుల వద్ద అన్నదాతలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారని జగ్తార్ సింగ్ చెప్పారు.
మరోపక్క సీనియర్ జర్నలిస్ట్ జస్పాల్ సిద్ధూ మాట్లాడుతూ కిందటిసారి కంటే ఈసారి జనం తక్కువగా కనిపించడానికి కారణం ఫ్రంట్ నేతలు విడిపోవడమేనన్నారు.
‘‘నాయకత్వం విడిపోవడంతో ప్రజలు సందిగ్ధంలో పడిపోయారు. ఉత్తర ప్రదేశ్ నుంచి రైతులు రాలేదు. హరియాణాలోనూ విభజన కనిపించింది’’ అని చెప్పారు.
తమది రైతు అనుకూల ప్రభుత్వమని నమ్మించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకే ఉత్తరప్రదేశ్ రైతులు దిల్లీ వైపు చూడటం లేదని ప్రొఫెసర్ మహమ్మద్ ఖలీద్ చెప్పారు.
మరోపక్క ఐక్య కిసాన్ మోర్చా నేతలు ప్రస్తుత రైతు ఉద్యమంలో పాల్గొనడం లేదని బహిరంగంగా ప్రకటించి , ఫిబ్రవరి 16న గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపునివ్వడంతో ఈసారి జనం కదల్లేదని జస్పాల్ సిద్ధూ చెప్పారు.
‘‘మొదటి రోజు భద్రతా బలగాల చేతిలో 54 మంది రైతులు గాయపడ్డారని, వీరిని రాజ్‌పురా హాస్పటిల్‌లో చేర్చారని మాజీ నేత సుర్జీత్ సింగ్ పూల్ చెప్పారు.
రైతులు రోజంతా భద్రతా బలగాల దాడిని శాంతియుతంగా ఎదుర్కొన్నారు. ఇది వారి పట్ల దేశవ్యాప్తంగా సానుభూతి పెరిగేలా చేస్తుంది. తద్వారా ఫ్రంట్ బలోపేతమవుతుంది. ఈ రోజు సంఘటన తరువాత కిసాన్ మోర్చాకు మద్దతు పెరుగుతోంది.
ప్రస్తుత ఫ్రంట్‌లో భాగస్వాములు కాని సంఘాలపై ప్రజల ఒత్తిడి పెరుగుతోందని సుర్జీత్ సింగ్ పూల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- ప్రపంచంలోనే ‘అతిపెద్ద నౌక’ను సద్దాం హుస్సేన్ సైన్యం ఎలా ముంచేసిందంటే..
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- కేజీ బేసిన్: కాకినాడ తీరంలో తొలిసారిగా చమురు వెలికితీత...భారతదేశపు చమురు అవసరాలను ఇది తీర్చగలదా?
- కంటి శుక్లాలు ఎందుకొస్తాయి? ఆపరేషన్ తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు?
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














