భారత సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా రైతు సైన్స్ కాంగ్రెస్... వ్యవసాయాన్ని ఈ సదస్సు ఆదుకొంటుందా?

ఫొటో సోర్స్, Getty Images
భారత సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా రైతు సైన్స్ కాంగ్రెస్ శుక్రవారం ప్రారంభమైంది.
దేశం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలతో వివిధ దేశాలకు చెందిన సైన్స్ ప్రముఖులతో ఏటా నిర్వహించే 'భారత సైన్స్ కాంగ్రెస్' మొదలైంది.
బెంగళూరులోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం(యూఏఎస్‌బీ) వేదికగా ఈ నెల ఏడో తేదీ వరకు ఐదు రోజులపాటు సాగే ఈ 107వ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
రసాయనశాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం పొందిన జర్మనీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టెఫాన్ హెల్(2014), ఇజ్రాయెల్ శాస్త్రవేత్త అడా ఇ.యోనథ్ (2009) సదస్సులో పాల్గొంటున్నారు.
ఆహార భద్రతకు పర్యావరణ అనుకూల వ్యవసాయం, ఆహార, పోషక భద్రత కోసం పంటలను మెరుగుపరచడం, క్యాన్సర్ ఔషధ ఆవిష్కరణల్లో సవాళ్లు, అవకాశాలు, కృత్రిమ మేధ(ఏఐ), గ్రామీణ జనాభాలో వ్యాధుల వ్యాప్తి, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణాభివృద్ధి, ఇతర అంశాలపై ఈ వైజ్ఞానిక సదస్సులో చర్చలు ఉంటాయి.

ఫొటో సోర్స్, PTI
'శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతో గ్రామీణాభివృద్ధి'పై సదస్సు దృష్టి కేంద్రీకరిస్తుందని, భారత సైన్స్ కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా రైతు సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారని 'పీఐబీ' తెలిపింది.
6న రైతు సైన్స్ కాంగ్రెస్‌లో ఏం చర్చిస్తారు?
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం సమీకృత వ్యవసాయం, వ్యవస్థాపకత(ఎంట్రిప్రెన్యూయర్‌షిప్)లో రైతుల వినూత్న విధానాలు, వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం, ప్రకృతి పరిరక్షణ, రైతు సాధికారత, వ్యవసాయ రంగ సమస్యలు, విధానపరమైన అంశాలు సహా అనేక విషయాలపై ఈ నెల 6న జరిగే రైతు సైన్స్ కాంగ్రెస్ చర్చించనుంది.
రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్), వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం(యూఏఎస్) శాస్త్రవేత్తలు, నిపుణులు, వినూత్న విధానాలతో వ్యవసాయానికి మేలు చేసిన రైతులు పాల్గొననున్నారు.
'మాటలు సరే, చర్యలు ఏవీ?'
ఒకప్పుడు సైన్స్ కాంగ్రెస్‌లో వ్యవసాయం గురించి చర్చించేవారు కాదని, దాదాపు దశాబ్ద కాలంగా ఈ రంగానికి కొంత సమయం కేటాయిస్తూ వస్తున్నారని ఐసీఏఆర్, ఇక్రిశాట్‌లలో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా సేవలందించిన డాక్టర్ కె.పూర్ణచంద్రరావు చెప్పారు.
వ్యవసాయ రంగాన్ని ఆదుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవడం లేదని, ఒట్టి మాటలు చెబుతున్నారని, అందువల్ల రైతు సైన్స్ కాంగ్రెస్ లాంటి కార్యక్రమాలతో రైతులకు ఒరిగేదేమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన గతంలో సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొన్నారు.
'రైతుల ఆదాయం రెట్టింపు' అనే మాటను ప్రభుత్వమే అపహాస్యం చేసిందని పూర్ణచంద్రరావు బీబీసీతో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఇలాగైతే రైతుల ఆదాయం రెట్టింపు కావడానికి 35 ఏళ్లు పడుతుంది'
రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చాన్నాళ్లుగా చెబుతున్నారని, అది సాకారమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని, ఈ దిశగా చర్యలే లేవని ఆయన చెప్పారు.
రైతుల ఆదాయంలో వార్షిక పెరుగుదల రెండు శాతం కూడా లేదని, ఈ నామమాత్రపు పెరుగుదలతో రైతు ఆదాయం రెండింతలు కావాలంటే 35 ఏళ్లు పడుతుందని ఆయన తెలిపారు. రైతుల ఆదాయం గణనీయంగా పెరగాలంటే వ్యవసాయ ఖర్చులు తగ్గాలని, ఉత్పాదకత పెరగాలని, గిట్టుబాటు ధరలు ఉండాలని, ఇందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని వివరించారు.
కనీస మద్దతుధరలను పేరుకు ప్రకటిస్తున్నా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని, ఫలితంగా పప్పు ధాన్యాలు లాంటి పంటలు పండించే రైతులకు ప్రయోజనం దక్కడం లేదని పూర్ణచంద్రరావు చెప్పారు.
ప్రభుత్వ విధానాల్లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, వ్యవసాయమంటే చిన్నచూపు ఉందని, దేశంలో ఆహార ధాన్యాల కొరత లేనంత కాలం వ్యవసాయ సంక్షోభం గురించి పాలకులు పట్టించుకోరని ఆయన విచారం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, PRAKASH SINGH
'పరిశోధనలపై కొరవడిన శ్రద్ధ'
వ్యవసాయ రంగ పరిశోధనలపైనా ప్రభుత్వాలకు ఏ మాత్రం శ్రద్ధ లేదని పూర్ణచంద్రరావు విమర్శించారు. వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి(వ్యవసాయ జీడీపీ)లో కనీసం రెండు శాతం ఈ రంగంలో పరిశోధనల కోసం వెచ్చించాలని చాలా కాలంగా ప్రభుత్వం చెబుతోందని, ఆచరణకు వచ్చేసరికి కేటాయింపులు 0.6 శాతం దాటడం లేదని చెప్పారు.
దేశ జీడీపీలో కనీసం రెండు శాతం నిధులను అన్ని రంగాల్లో పరిశోధనలు-అభివృద్ధి(ఆర్ అండ్ డీ)కి కేటాయించాలని ప్రభుత్వం చెబుతూ వస్తోందని, కానీ కేటాయింపులు ఒక్క శాతంలోపే ఉంటున్నాయని ఆయన తెలిపారు. అమెరికా, ఐరోపాలోని అభివృద్ధి చెందిన దేశాల్లో పరిశోధనలకు జీడీపీలో రెండు నుంచి ఐదు శాతం వరకు నిధులను కేటాయిస్తున్నారని ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, AFP
సైన్స్ కాంగ్రెస్‌లో భాగంగా మహిళా సైన్స్ కాంగ్రెస్, బాలల సైన్స్ కాంగ్రెస్ కూడా జరుగనున్నాయి.
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగంలో వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న మహిళలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి, వారి విజయాలను, అనుభవాలను పంచుకొనేందుకు అవకాశం కల్పించడం మహిళా సైన్స్ కాంగ్రెస్ ఉద్దేశం.
ఈ రంగంలో మహిళల పాత్రను పెంచడానికి, వారి ప్రతిభాసామర్థ్యాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి చేపట్టాల్సిన చర్యలను, విధానాలను సిఫార్సు చేస్తూ ఈ సదస్సు ఒక దార్శనిక పత్రాన్ని రూపొందించనుంది. ఈ నెల 5, 6 తేదీల్లో ఈ సదస్సు జరుగనుంది.
పిల్లల సైన్స్ కాంగ్రెస్ ఈ నెల 4, 5, 6 తేదీల్లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబెల్ పురస్కార గ్రహీతలతో మాట్లాడే అవకాశం లభించనుంది.
ఇవి కూడా చదవండి:
- అమెజాన్‌కు రిలయన్స్ జియోమార్ట్ పోటీ ఇవ్వగలదా
- ‘నరేంద్ర మోదీ తరంగాలు’: విద్యావేత్తల వ్యాఖ్యలపై శాస్త్రవేత్తల అసహనం
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- కృత్రిమ మేథస్సు ప్రమాదవశాత్తూ మనల్నే అంతం చేసేస్తుందా, ఎలా?
- విజన్ 2020: అబ్దుల్ కలాం, చంద్రబాబు లక్ష్యాలు ఏంటి? వాటిలో ఎన్ని నెరవేరాయి?
- 2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం: మోదీ కల నిజమయ్యేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








