అలెక్సీ నవాల్నీ: పుతిన్‌ను ఎదిరించిన నేతతో పెళ్లిపై యూలియా నవాల్నియా ఏమన్నారు?

యూలియా నవాల్నియా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాబర్ట్ గ్రీనల్
    • హోదా, బీబీసీ న్యూస్

సాధారణ జీవితం గడిపిన అలెక్సీ నవాల్నీ భార్య యూలియా నవాల్నియా, తాను జీవితంలో భార్యగా, తల్లిగానే ప్రధానపాత్ర పోషించాను కానీ, రాజకీయ నాయకురాలిగా కాదని గట్టిగా చెప్పారు.

కానీ, శుక్రవారం ఆమె భర్త మరణం, మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో న్యాయం కోసం ఆమె చేసిన భావోద్వేగపూరిత విజ్ఞప్తితో, రష్యా ప్రతిపక్షంలో ఆమె ప్రధాన వ్యక్తిగా కనిపిస్తున్నారు.

ఆమె ఎప్పుడూ భర్తకు తోడుగా నిలిచారు. 2020లో నోవిచోక్ నర్వ్ ఏజెంట్‌తో విషప్రయోగం జరిగినప్పుడు అలెక్సీ నవాల్నీని అత్యవసర చికిత్స కోసం రష్యా నుంచి బయటకు తీసుకెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. నోవిచోక్ - రసాయనాలతో కూడిన విషం, రసాయన యుద్ధం కోసం ఇలాంటి వాటిని ఆయుధాలుగా తయారుచేశారు, ఇవి నరాలపై పనిచేస్తాయి.

ఆమెను రష్యాలో ప్రతిపక్షానికి చెందిన ప్రథమ మహిళగా వర్ణించారు.

యూలియా నవాల్నియా

ఫొటో సోర్స్, Getty Images

అలాగే, క్రెమ్లిన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఈ నిరంతర పోరాటాన్ని ఆమె లేకుండా కొనసాగించలేనని గతంలో అలెక్సీ స్వయంగా చెప్పారు.

అందరికీ తెలిసిన వారి ప్రేమ కథ, ఇద్దరు పిల్లలతో కుటుంబ జీవనం, వారి మద్దతుదారులకు ప్రేరణగా నిలుస్తాయి.

సైంటిస్ట్ బోరిస్ అంబ్రోసిమోవా కూతురు యులియా అంబ్రోసిమోవా. ఆమె 1976లో మాస్కోలో జన్మించారు.

ఎకనమిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన యూలియా, బ్యాంకింగ్‌‌ను వృత్తిగా ఎంచుకున్నారు. అయితే, అలెక్సీ ప్రతిపక్ష నేతగా ఎదుగుతున్న సమయంలో, తమ ఇద్దరు పిల్లలను పెంచడం కోసం ఆమె ఉద్యోగాన్ని వదులుకున్నారు.

1998లో ఒక విహార యాత్రలో వాళ్లిద్దరూ తుర్కియేలో కలుసుకున్నారు. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. అలెక్సీ భవిష్యత్తులో రాజకీయాల్లో కీర్తిప్రతిష్టలు సాధిస్తారని అప్పట్లో ఎలాంటి అంచనాలూ లేవు.

2020లో రష్యన్ వీక్లీ సోబెసెడ్నిక్‌తో ఆమె మాట్లాడుతూ, "నేను ఓ మంచి న్యాయవాదిని, లేదా ప్రతిపక్ష నాయకుడిని పెళ్లి చేసుకోలేదు. నేను అలెక్సీ అనే యువకుడిని వివాహం చేసుకున్నాను'' అన్నారు.

అలెక్సీ నవాల్నీ

ఫొటో సోర్స్, Getty Images

నవాల్నియా మొదటి నుంచి అలెక్సీతోపాటు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది, 2000లోనే వారిద్దరూ లిబరల్ యబ్లొకో పార్టీలో సభ్యులు.

కానీ, 2020లో తన భర్తపై విషప్రయోగం జరిగే వరకూ ఆమె రాజకీయాలకు దూరంగా సాధారణ కుటుంబ జీవనం గడిపారు. అప్పుడప్పుడూ కొన్ని పబ్లిక్ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు ప్రసంగాలు చేశారు.

2020 ఆగస్టులో, సైబీరియన్ నగరమైన ఒమ్స్క్‌లో అలెక్సీ నవాల్నీ అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో ఆమె నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు లేఖ రాశారు. జర్మనీలో చికిత్స కోసం ఆయన్ను విడుదల చేయాలని కోరారు.

''మేం అక్కడ ఉన్న ప్రతీక్షణం, 'నేను ఆయన్ను బయటికి తీసుకురావాలి' అనుకున్నాను'' అని యురీ డుడ్ రూపొందించిన రష్యన్ డాక్యుమెంటరీలో ఆమె చెప్పారు.

జర్మనీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో నవాల్నీ రష్యా నుంచి బయటపడగలిగారు.

చికిత్స అనంతరం కొన్ని నెలల తర్వాత యూలియా తన భర్తతో కలిసి తిరిగి మాస్కోకు వచ్చారు. ఆ వెంటనే ఆయన్ను అరెస్టు చేశారు. ఆయన జీవితం ఎక్కువ కాలం కటకటాల వెనకే గడిచింది.

యూలియా నవాల్నియా

ఫొటో సోర్స్, EPA

ప్రజా జీవితంలో ప్రధాన పాత్ర పోషించడంపై ప్రస్తుతం ఆమెపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, అందుకు ఆమెకు అన్ని అర్హతలూ ఉన్నాయని యూలియాను సైద్ధాంతిక నిబద్ధత కలిగిన, భయం తెలియని మహిళ(ప్రిన్సిపుల్డ్ అండ్ ఫియర్‌లెస్‌)గా అభివర్ణించిన అమెరికా మాజీ రాయబారి మైకేల్ మెక్‌ఫాల్ చెప్పారు.

''యూలియా నవాల్నియా కంటే మెరుగైన భాగస్వామి నవాల్నీకి దొరకరు. ఆయన నమ్మిన మార్గంలో, సాహసంలో, ధైర్యంలో అన్నింట్లో ఆమె భాగం పంచుకున్నారు'' అని ఆయన అమెరికా నెట్‌వర్క్ ఎన్‌బీసీతో చెప్పారు.

''రష్యాలో ప్రజాస్వామ్య మద్దతుదారులు అభిమానించే విధంగా వారి ఇద్దరు పిల్లలను ఆమె పెంచి పెద్ద చేశారు, వారిని సంరక్షించారు. యూలియా తన భర్త ప్రాణాలు కాపాడారు, అందులో ఎలాంటి సందేహం లేదు.''

2020లో ఎన్నికలకు ముందు తన భర్త జైలుకెళ్లిన తర్వాత అధ్యక్ష అభ్యర్థిగా మారిన బహిష్కృత బెలారస్ ప్రతిపక్ష నేత స్వెట్లానా టికానోవ్‌స్కయా మార్గాన్ని తాను అనుసరించబోనని యూలియా నవాల్నియా ఇటీవల చెప్పారు.

కానీ, మ్యూనిచ్‌లో ఆమె చేసిన ప్రసంగం, సోషల్ మీడియాలో మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగాలు భావోద్వేగంతో కూడుకుని ఉన్నాయి. ఆమె తన మనసు మార్చుకునే అవకాశం ఉందని అవి సూచిస్తున్నాయి.

"మాకు కావాల్సింది స్వేచ్ఛాయుత, శాంతియుత, సంతోషకరమైన రష్యా. నా భర్త కలలుగన్న అద్భుతమైన రష్యా" అని ఆమె వీడియో సందేశంలో చెప్పారు.

"నేను మీతో కలిసి అలాంటి దేశాన్ని నిర్మించాలనుకుంటున్నా. అలెక్సీ నవాల్నీ కలలుగన్న దేశం" అంటూ ఆమె కొనసాగించారు.

"అదొక్కటే లక్ష్యం, మరోటి లేదు, ఆయన చేసిన ఈ గొప్ప త్యాగం వృథా పోదు.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)