అస్సాం: స్థానిక ముస్లింల సర్వే అంటే 'మియా ముస్లింలు' ఎందుకు భయపడుతున్నారు?

- రచయిత, దిలీప్ కుమార్ శర్మ
- హోదా, బీబీసీ హిందీ కోసం
‘నేను బెంగాలీ మూలాలున్న ముస్లింను. కొందరు మమ్మల్ని మియా ముస్లింలు అంటారు. ప్రభుత్వం ఎవరిని స్థానిక ముస్లింలుగా పరిగణిస్తుందో మాకు తెలియదు. గోరియా, మోరియా ముస్లింల సర్వే గురించి ఊళ్లో కొందరు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ ముస్లింలను అశాంతికి గురిచేస్తున్నాయి’ అని 60 ఏళ్ల మొహమ్మద్ ఒమర్ ఆగ్రహంగా చెప్పారు.
అస్సాంలోని బోడోలాండ్ ప్రాంతం తముల్‌పూర్ జిల్లాలోని మారుమూల గ్రామమైన ధేపర్‌గావ్‌లో నివసించే మహమ్మద్ ఒమర్ అలీ తాపీ మేస్త్రీగా పనిచేస్తూ ఎనిమిది మంది కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో స్వదేశీ ముస్లింల ‘సామాజిక ఆర్థిక సర్వే’ గురించి గ్రామంలో జరుగుతున్న చర్చలు ఆయన్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
‘ప్రభుత్వం మాతో ఏం చేయాలనుకుంటుందో నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు ఎన్ఆర్‌సీలో మా పేర్లు చేర్చుకోవడానికి తిరగాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ స్వదేశీ పేరుతో మళ్లీ ముస్లింలను ఏమేం కాగితాలు అడుగుతారో తెలియడం లేదు’ అన్నారు ఒమర్.
‘పత్రాలు తనిఖీ చేస్తారని మేమేమీ భయపడడం లేదు. కానీ, ప్రతిసారీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనడాన్ని గురించి ఆందోళన చెందుతున్నాం. ఎన్ఆర్‌సీ సమయంలో పత్రాలు ధ్రువీకరణ కోసం నా పని మానుకుని 80 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చింది’ అని అప్పటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు ఒమర్.
‘ఇప్పుడు మా జీవితం కాగితాలపైనే ఆధారపడి ఉంది. వరదలొస్తే ఇక్కడి ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడం కంటే తమ ధ్రువీకరణ పత్రాలు కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు’ అన్నారాయన.

అస్సాంలోని స్థానిక ముస్లింల సామాజిక ఆర్థిక సర్వేకు ఆ రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఆమోదం పలికింది. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం అయిదు ముస్లిం వర్గాలను స్థానిక అస్సామీ ముస్లింలుగా గుర్తించింది.
గోరియా, మోరియా, జోలా, దేశీ, సయ్యద్ ముస్లింలే స్థానికులైన అస్సామీ ముస్లింలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తేల్చింది.
వీరిలో గోరియా, మోరియా, జోలా వర్గాలు స్థానిక తేయాకు తోటల ప్రాంతాల్లో స్థిరపడ్డారు. దేశీ ముస్లింలు దిగువ అస్సాంలో ఉంటారు. సయ్యద్ వర్గానికి చెందినవారినీ అస్సామీ ముస్లింలుగా పరిగణిస్తారు.
ఈ అయిదు వర్గాలకు చెందిన ముస్లింలకు బంగ్లాదేశ్(ఒకప్పటి తూర్పు పాకిస్తాన్) నుంచి వలస వచ్చిన చరిత్ర లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.
అయితే, ఈ సర్వేకు కేబినెట్ ఆమోదం దొరికాక బెంగాలీ మూలాలున్న ముస్లింలలో ఆందోళన మొదలైంది. గౌహతికి 62 కిలోమీటర్ల దూరంలోని ధేపర్‌గావ్‌లో సుమారు 500 ముస్లిం కుటుంబాలున్నాయి. వారిలో అత్యధికులు బెంగాలీ మూలాలున్న ముస్లింలు.
పుథీమారీ నది వరదల కారణంగా ఇక్కడి ప్రజల ఇళ్లు అనేక సార్లు నీట మునిగాయి. ఈ గ్రామానికి వెళ్లాలంటే సుమారు 2 కిలోమీటర్ల దూరం మట్టి రోడ్డుపై ప్రయాణించాలి. ఇది అక్కడి ప్రజల రోజువారీ కష్టాలకు ఉదాహరణ.
అస్సాంలోని బెంగాలీ మూలాలున్న ముస్లింలను మియా ముస్లింలు అంటారు. మియా ముస్లింలు అంటే తూర్పు పాకిస్తాన్(ప్రస్తుత బంగ్లాదేశ్) నుంచి వచ్చిన వారని అర్థం.
గతంలో వీరిని చరూవా అని, పోంపోమ్వా అని కూడా పిలిచేవారు. ఇప్పుడు మాత్రం మియా ముస్లింలనే అంటున్నారు. రాజకీయంగా విమర్శలు చేసేవారు మాత్రం బంగ్లాదేశీ అంటూ సంభోదిస్తుంటారు.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తనకు మియా ముస్లింల ఓట్లు అవసరం లేదని చెబుతుంటారు.
ధేపర్‌గావ్‌లో నివసించే 65 ఏళ్ల జావేద్ అలీ కూడా ఈ సర్వే గురించి ఆందోళన చెందుతున్నారు. ‘ఈ సర్వే అసలు ఉద్దేశం ఏంటో మాకు తెలియదు కానీ మమ్మల్ని ఇబ్బందులు పెట్టేందుకే చేస్తున్నారు అనిపిస్తోంది’ అన్నారాయన.
‘అల్లా ఒక్కరే అయినప్పుడు మమ్మల్ని ఇలా విభజించడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వ ఉద్దేశాలు తెలియనప్పుడు ఆందోళన కలగడం సహజమే’ అన్నారు అలీ.
మియా కమ్యూనిటీకి చెందిన 52 ఏళ్ల ముజిబుర్ రెహ్మాన్ తమను స్థానిక ముస్లింలుగా లెక్కించకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ‘మేం అస్సామీ ముస్లింలం, మా మాతృభాష అస్సామీ. అయినా మమ్మల్ని స్థానికులుగా పరిగణించడం లేదు. ఎన్ఆర్‌సీ అప్పుడు కూడా ఇంతే. ఇప్పుడూ మళ్లీ అదే చేస్తున్నారు’ అంటున్నారాయన.
51 ఏళ్ల ఇలసినీ బేగం గోరియా సమూహానికి చెందినవారు. కానీ, ఆమె మియా ముస్లింను పెళ్లి చేసుకున్నారు. ఏడుగురు పిల్లలతో ధేపర్‌గావ్‌లో నివసిస్తున్న ఆమె తమకు ఏ చిక్కులూ రాకూడదని కోరుకుంటున్నారు. ఆమె భర్త మధుమేహంతో బాధపడుతున్నారు.
అస్సాం ప్రభుత్వం ఈ అయిదు ముస్లిం సమూహాలను స్థానికులుగా గుర్తించేందుకు అస్సాం ప్రభుత్వం గతంలో ఆరు కమిటీలను వేసింది. ఈ కమిటీల సిఫారసుల ఆధారంగానే వీరిని స్థానికులుగా గుర్తించారు.

‘స్వదేశీ ముస్లింల సామాజిక ఆర్థిక సర్వే బాధ్యతను మైనారిటీ వ్యవహారాల డైరెక్టరేట్‌కు అప్పగించింది.
మైనారిటీ వ్యవహారాల విభాగం డైరెక్టర్ సయ్యద్ తాహిదుర్ రెహమాన్ దీనిపై ‘బీబీసీ’తో మాట్లాడుతూ... ‘మేం సర్వే కోసం ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించాం. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించాక సర్వే బృందం పని ప్రారంభిస్తుంది. మొదట ఒకట్రెండు జిల్లాలలో సర్వే ప్రారంభమవుతుంది’ అన్నారు.
ప్రస్తుతం స్థానిక ముస్లింలను గుర్తించేందుుక మాత్రమే ఇంటింటి సర్వే చేస్తామని చెప్పారు.
అయితే, స్థానిక ముస్లింలు, మియా ముస్లింల మధ్య వివాహాలు జరగడంతో మియా ముస్లింలకు సంబంధించిన సర్వే కూడా చేయాల్సి ఉంటుంది.
అస్సాంలో 2011 జనాభా లెక్కల ప్రకారం కోటీ 7 లక్షల మంది ముస్లింలున్నారు. అందులో 40 లక్షలకు పైగా స్థానిక ముస్లింలు ఉంటారని అంచనా. కానీ.. ఇంతవరకు స్పష్టమైన లెక్కలు ఎవరి దగ్గరా లేవు. స్థానిక ముస్లింల వస్త్రధారణ, జీవనశైలి బెంగాలీ మూలాలున్న ముస్లింల కంటే భిన్నంగా ఉంటాయి.
జోర్హాట్ జిల్లాలోని మరియానీ పట్టణానికి చెందిన జాకీర్ హుస్సేన్(పేరు మార్చాం) బీఏ విద్యార్థి. ఆయన బెంగాలీ ముస్లింల కంటే తనను తాను భిన్నమైనవాడినని భావిస్తారు.
‘మేం మొదటి నుంచి అస్సామీ ముస్లింలం. మమ్మల్నిబెంగాలీ ముస్లింలు అని ఎవరూ పిలవరు. ఈ సర్వే మాకు చాలా ముఖ్యమైనది. సర్వే వల్ల స్థానిక ముస్లింలను గుర్తించడం సులభమవుతుంది. అది మా ప్రగతికి దోహదపడుతుంది’ అన్నారు జాకీర్.
అస్సాం గోరియా-మోరియా-దేశీ జాతీయ పరిషత్ అధ్యక్షుడు నూరుల్ హక్ మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా స్థానిక ముస్లింలకు అన్యాయం జరుగుతోందని, ఇప్పుడు సర్వే తరువాత స్థానిక ముస్లింలకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.
‘మియా ముస్లింలు మమ్మల్ని ముస్లింలుగా చూడరు. మైనారిటీలకు ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే దానివల్ల మియా ముస్లింలే లాభపడుతున్నారు. బెంగాలీ ముస్లింలు సుమారు 70 లక్షల మంది ఉన్నందున రాజకీయ అధికారం వారికే దక్కుతోంది’ అన్నారాయన.
‘ఈ సర్వే స్వదేశీ ముస్లిలం కోసమే. బెంగాలీ మూలాలున్న ముస్లింలను ఇందులో చేర్చరు. అయితే.. మియా ముస్లింలలో ఒక వర్గం జోలాహా కమ్యూనిటీగా చెప్పుకొంటూ స్వదేశీ ముస్లింలుగా గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయం ప్రభుత్వానికి తెలియదు. దీనిపై శ్రద్ధ పెట్టాలి’ అన్నారు నూరుల్ హక్.

అయితే, బెంగాలీ మూలాలున్న ముస్లింలలో అస్సామీ సంస్కృతి పెంపొందించడానికి కృషి చేస్తున్న చార్ చపోరీ పరిషత్ అధ్యక్షుడు హఫీజ్ అహ్మద్ మాత్రం ఈ సర్వేను ముస్లింలను విభజించేందుకు చేస్తున్న రాజకీయంగా అభివర్ణించారు.
స్వదేశీ ముస్లింల కోసం చాలా ఏళ్లుగా వాదిస్తున్న గౌహతి హైకోర్టు సీనియర్ లాయర్ నెకిబుర్ జమాన్ మాట్లాడుతూ.. ‘ఇది సామాజిక ఆర్థిక సర్వే కాబట్టి ముస్లింలందరితో సర్వే చేస్తారు. స్వదేశీ ముస్లింల విషయానికొస్తే వారి పూర్వీకులకు సంబంధించిన పత్రాలు అడుగుతారు. గోరియా, మోరియా ముస్లింలను గుర్తించడం సులభమే కానీ దేశీ ముస్లింలు మాత్రం మియా ముస్లింలతో కలిసిపోవడం వల్ల గుర్తింపు కష్టం’ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
పూర్తిగా స్వదేశీ ముస్లింలను గుర్తించడానికే ఈ సర్వే అని బీజేపీ చెప్తోంది. బెంగాలీ మూలాలున్న ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది.
‘స్వదేశీ ముస్లింలకు కొన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం ఈ సర్వే చేస్తోంది. అందుకే ఈ సామాజిక ఆర్థిక సర్వే’ అని అస్సాం బీజేపీ నేత ప్రమోద్ స్వామి అన్నారు.
బీజేపీపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మియా ముస్లింలు భయపడాల్సిన పనే లేదని ఆయన అన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల వల్ల ముస్లిం సమాజంలోని మహిళలు చాలా లబ్ధి పొందుతున్నారని ఆయన చెప్పారు.
అస్సాం ప్రభుత్వ సర్వే నిర్ణయాన్ని బరాక్ లోయలో స్థిరపడిన కొన్ని ముస్లిం సమూహాలు గౌహతి హైకోర్టులో సవాల్ చేశాయి.
మణిపురి ముస్లింలు, అస్సాంలోని కఛార్ జిల్లాలో నివసించే పంగాల్, షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో ఉన్న కొన్ని ముస్లిం వర్గాలు ప్రభుత్వం పేర్కొన్న అయిదు స్థానిక ముస్లిం వర్గాల జాబితాలో లేవు. ఇది కూడా సర్వేకు న్యాయపరమైన అవరోధాలు తేవచ్చు.
ఇవి కూడా చదవండి:
- యశస్వీ జైస్వాల్: బేస్బాల్లా క్రికెట్ బంతిని బాదేస్తూ మరో డబుల్ సెంచరీ చేసిన 'జస్బాల్'
- గుల్బదన్: ఒట్టోమాన్ సుల్తాన్ను ఎదిరించిన మొఘల్ యువరాణి కథ...
- అలెక్సీ నావల్నీ: పుతిన్ ఆదేశాల మేరకే ఆయనను చంపేశారా, విమర్శకులు ఏమంటున్నారు?
- తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?
- కజఖ్స్తాన్: మీథేన్ గ్యాస్ మెగా-లీకేజి, కొన్ని నెలలుగా విస్తరిస్తున్న ప్రమాదాన్ని బయటపెట్టిన బీబీసీ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














