‘దంగల్’ నటి సుహానీ భట్నాగర్ ప్రాణం తీసిన వ్యాధి లక్షణాలు ఏమిటి?

దంగల్, సుహానీ భట్నాగర్, అమీర్ ఖాన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సుహానీ భట్నాగర్, ( ఎడమవైపు) అమీర్ ఖాన్, జైరా వసీం. 2016 నవంబర్ నాటి చిత్రం

అమీర్ ఖాన్ సినిమా దంగల్‌లో చిన్ననాటి బబితా ఫోగట్‌గా నటించిన సుహానీ భట్నాగర్ తన 19వ ఏట చనిపోయారు.

డెర్మయోసైటిస్‌తో సుహానీ మరణించినట్లు ఆమె తండ్రి సుమిత్ భట్నాగర్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

ఫిబ్రవరి 7న సుహానీ భట్నాగర్‌ను దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆమెకు చికిత్స జరిగింది. అయితే ఆమెకున్న జబ్బు తీవ్రం కావడంతో ఫిబ్రవరి 16న ఆమె చనిపోయారు.

డెర్మయోసైటిస్ చాలా అరుదైన వ్యాధి. ఈ వ్యాధి సోకిన వారిలో కండరాలు బలహీనమవుతాయి. శరీరం మీద దద్దుర్లు ఏర్పడతాయి.

ఈ వ్యాధిని సరైన సమయంలో గుర్తించి, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే జబ్బు నయం అవుతుంది.

అయితే కొన్ని కేసుల్లో ఈ వ్యాధి శరీరంలోని కీలక అవయవాలకు సోకి రోగి ప్రాణాలు పోగుట్టుకునే అవకాశం ఉంది.

డెర్మయోసైటిస్ అంటే ఏమిటి?

దిల్లీలో చర్మవ్యాధి నిపుణురాలు అంజు జా ఏం చెబుతున్నారంటే- ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీని వల్ల మన శరీరంలోని రోగ నిరోధక శక్తి దాని మీదనే పోరాడటం మొదలు పెడుతుంది. దీని వల్ల శరీరంలో కొన్ని యాంటీబాడీలు ఏర్పడతాయి. అవి మన కండరాల మీద దాడి చేసి కండరాల్ని బలహీనం చేస్తాయి.

క్రమక్రమంగా ఇది శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది.

వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే.. “ వ్యాధి సోకిన రోగుల్లో రకరకాల సమస్యలు కనిపిస్తాయి. కొన్ని సార్లు చేతుల మీద దద్దుర్లు వస్తాయి. కనుబొమ్మల మీద వాపు వస్తుంది. బలహీనత ఆవరిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో తల దువ్వుకోవడానికి చేతులు పైకి లేపడానికి కూడా ఓపిక ఉండదు. నడుముల దగ్గర నొప్పిగా ఉంటే వ్యాధి సోకిన రోగికి కూర్చుకోవడం, నిల్చోవడం కూడా కష్టంగా అనిపించవచ్చు’’ అని డాక్టర్ అంజు జా వివరించారు.

డెర్మయోసైటిస్, సుహానీ భట్నాగర్

ఫొటో సోర్స్, Dr. Anju jha

ఫొటో క్యాప్షన్, డాక్టర్ అంజు జా, చర్మవ్యాధుల నిపుణులు

మొదటగా, మొహం మీద ఎరుపు లేదా ఊదా రంగులో మచ్చలు కనురెప్పల మీద వాపు, కీళ్లలో నొప్పులు లాంటి సమస్యలు మాత్రమే ఉంటాయి.

తర్వాతి రోజుల్లో కండరాల బలహీనత వల్ల ఈ వ్యాధి సోకిన వాళ్లకు కనీసం నడవడానికి కూడా కష్టమవుతుంది.

ఊపిరితిత్తుల కండరాలు కూడా పట్టేయడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది.

డెర్మయోసైటిస్ వల్ల గోళ్ల చుట్టూ వాపు ఏర్పడవచ్చు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డెర్మయోసైటిస్ వల్ల గోళ్ల చుట్టూ వాపు ఏర్పడవచ్చు

కారణాలు ఏమిటి?

డెర్మయోసైటిస్ రావడానికి కారణాలు ఏంటో స్పష్టంగా చెప్పలేము అని అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ చెబుతోంది. ఒక్కోసారి వారసత్వంగా కూడా రావచ్చు. పెద్దవాళ్లకు క్యాన్సర్ రావడం, ఇతర ఇన్ఫెక్షన్లు, ఔషధాల వాడకం, వాతావరణంలో మార్పుల వల్ల వచ్చే అలర్జీల వల్ల కూడా ఈ వ్యాధి సోకవచ్చు.

వ్యాధి సోకిన తర్వాత రక్తనాళాలు, కండరాలలో వాపు ఏర్పడుతుంది. దీంతో శరీరం మీద ఎరుపు లేదా ఊదా రంగు దద్దుర్లు ఏర్పడతాయి. వీటి వల్ల దురద, నొప్పి ఏర్పడుతుంది.

కొన్నిసార్లు దద్దుర్లు లేదా మచ్చలు మోచేయి, మోకాళ్లు, వేళ్ల మీద కూడా ఏర్పడవచ్చు. గోళ్ల చుట్టూ వాపు రావచ్చు. కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారడం, జుట్టు రాలడం వంటివి కూడా కనిపిస్తాయి.

ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉండి అవి తీవ్రంగా మారితే ఆహారాన్ని తీసుకోవడం కూడా సమస్యగా మారవచ్చు. గొంతు మారడం, అలసట, బరువు తగ్గడం, జ్వరం లాంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు.

కను బొమ్మలు, వాపు, డెర్మయోసైటిస్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, డెర్మయోసైటిస్ వల్ల కనుబొమ్మల్లో వాపు కనిపించవచ్చు

వ్యాధి నిర్ధరణ ఎలా?

పైన ప్రస్తావించిన వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు రోగిని భౌతికంగా పరీక్షించడం, గతంలో జబ్బుల చరిత్రను పరిశీలించడం ద్వారా ఈ లక్షణాలకు కారణాలేంటో గుర్తించాలి.

రక్త పరీక్ష, ఎలక్ట్రోమైలోగ్రామ్, బయాప్సీ సాయంతో వ్యాధిని నిర్ధరించుకోవచ్చని డాక్టర్ అంజు జా చెప్పారు.

ఈ వ్యాధి గురించి కచ్చితంగా తెలుసుకోవాలంటే కండరాలకు బయాప్సీ చెయ్యడం ఉత్తమమని ఆమె అన్నారు.

ఈ వ్యాధి ఎక్కువగా పిల్లలకు వస్తుందని,అది కూడా 5 నుంచి 14 ఏళ్ల మధ్యలో వస్తుందని, పెద్దవారిలో అయితే 40 ఏళ్ల తర్వాత వస్తుందని డాక్టర్ అంజు జా తెలిపారు.

పిల్లల్లో ఈ వ్యాధి వచ్చిందని గుర్తించే సరికే ఒక్కోసారి ఆలస్యం జరుగుతుందని, అప్పటికే వ్యాధి వల్ల శరీరం లోపల చాలా నష్టం జరుగుతుందని ఆమె అన్నారు.

సుహాని భట్నాగర్ విషయంలోనూ అలాగే జరిగి ఉండవచ్చని డాక్టర్ అంజు జా భావిస్తున్నారు.

చాలా సందర్భాల్లో శరీరానికి హాని కలిగించే రోగ నిరోధక శక్తిని నియంత్రించడానికి రోగ నిరోధక శక్తిని తగ్గించే మందులు ఇస్తుంటారు. దీని వల్ల రోగికి ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

లక్షణాల ఆధారంగా డెర్మయోసైటిస్‌కు చికిత్స

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, లక్షణాల ఆధారంగా డెర్మయోసైటిస్‌కు చికిత్స

చికిత్స ఏమిటి?

లక్షణాల ఆధారంగానే డెర్మయోసైటిస్‌కు చికిత్స అందించాలని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ నివేదిక చెబుతోంది.

కండరాల నొప్పి ఉంటే ఫిజికల్ థెరపీ ఇవ్వవచ్చు. శరీరం మీద దద్దుర్ల నివారణకు మందులు, ప్రతికూల రోగ నిరోధక శక్తిని బలహీనపరిచేందుకు ఔషధాలు వాడవచ్చు.

“డెర్మయోసైటిస్ మాత్రమే కాకుండా ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉంటే క్రమం తప్పకుండా ఔషధాలు తీసుకుంటూనే ఉండాలి. ఏదో ఒక రోజు మందులు వేసుకోగానే ఈ జబ్బు నయం అవుతుందని అనుకోవద్దు” అని డాక్టర్ అంజు జా చెప్పారు.

“మొదట వ్యాధి లక్షణాలేంటో తెలుసుకోండి. వ్యాధి నిర్ధరణ అయిన తర్వాత సరైన చికిత్స చేయించుకోవాలి. ఒక్కోసారి స్టెరాయిడ్లు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. స్టెరాయిడ్లు తీసుకోవడం గురించి ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. డెర్మటాలజిస్టు లేదా రుమటాలజిస్టును కలవడం మంచిది. ఆయన సూచనలతో మంచి వైద్యం చేయించుకుంటే డెర్మయోసైటిస్ నుంచి కోలుకోవచ్చు” అని ఆమె అన్నారు.

వీడియో క్యాప్షన్, సుహానీ భట్నాగర్: దంగల్ నటి ప్రాణం తీసిన ‘డెర్మయోసైటిస్‌’ లక్షణాలు ఏమిటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)