విమానం ల్యాండ్ అయిన 10 నిమిషాల్లోనే తొలి బ్యాగును అందించాలి: కేంద్రం

బ్యాగేజీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, విమానాశ్రయాల్లో బ్యాగుల డెలివరీ ఆలస్యమవుతుండటంపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
    • రచయిత, చెరిలాన్ మోలాన్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబై

విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన 10 నిమిషాల్లోనే ప్రయాణికులకు బ్యాగులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని భారత్‌లోని ప్రముఖ విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ల్యాండింగ్ తర్వాత 10 నుంచి 30 నిమిషాల లోపల ప్రయాణికుల లగేజ్ వారికి అందించాలని చెప్పింది.

ఫిబ్రవరి 26లోగా తమ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా చర్యలు తీసుకోవాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.

విమానాశ్రయాల్లో బ్యాగేజీ డెలివరీ ఆలస్యమవుతుండటం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) ఏడు విమానయాన సంస్థలకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

ప్రయాణికుల బ్యాగులను తాము నిర్దేశించిన సమయం లోపల అందించేలా అవసరమైన చర్యలను తీసుకోవాలని ఎయిరిండియా, విస్తారా, ఇండిగో, ఆకాశ, స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలను బీసీఏఎస్ ఆదేశించింది.

భారత్‌లో ఆరు ప్రధాన విమానాశ్రయాల్లో విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఎంత సమయం లోపల లగేజీ బ్యాగులను డెలివరీ చేస్తున్నాయో పర్యవేక్షించిన తర్వాత, పౌర విమానయాన శాఖ ఈ ఆదేశాలను జారీ చేసింది.

ఏడు విమానయాన సంస్థలకు చెందిన 3,600 విమానాల కార్యకలాపాలను ఈ శాఖ పర్యవేక్షించింది. విమానయాన సంస్థలపై ఈ సమీక్ష జనవరిలో ప్రారంభమైందని, ఈ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుందని శాఖ తన ప్రకటనలో తెలిపింది.

బ్యాగేజీ డెలివరీ విషయంలో అన్ని విమానయాన సంస్థల పనితీరు మెరుగైనప్పటికీ, తమ తప్పనిసరి మార్గదర్శకాలకు తగినట్టుగా మెరుగుపడలేదని తెలిపింది.

తమ మార్గదర్శకాల మేరకు, విమానం ఆగిన 10 నిమిషాల వ్యవధిలో బ్యాగేజీ బెల్ట్ వద్దకు తొలి బ్యాగ్ రావాలని, చివరి బ్యాగును 30 నిమిషాల్లో అందించాలని చెప్పింది.

విమానాశ్రయాల్లో బ్యాగేజీ డెలివరీ బాగా ఆలస్యమవుతోందని ప్రయాణికుల నుంచి పదేపదే ఫిర్యాదులు వస్తున్నాయి.

కొన్నిసార్లు ప్రయాణికుల బ్యాగులు గంట వరకు ఆలస్యమవుతున్నాయి. బ్యాగేజీ బెల్టులో సాంకేతిక సమస్యలతో వేచిచూసే సమయం మరింత పెరుగుతోంది.

విమాన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు పౌర విమానయాన శాఖ గత కొన్ని నెలలుగా పలు చర్యలు తీసుకుంటోంది. విమాన ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు, ల్యాండింగ్ సమయాన్ని మెరుగుపరిచేందుకు విమానాలను తగ్గించాలని గత వారమే ముంబైలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)