ఆంధ్రప్రదేశ్: ఇసుక తవ్వకాలపై హైకోర్టు ఏం చెప్పింది... కేంద్ర ప్రభుత్వ బృందాలు ఏం తేల్చాయి?

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌‌లో ఇసుక తవ్వకాలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ హైకోర్టుకు ఇటీవల తెలిపింది.

దీనికి సంబంధించిన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు సమర్పించనున్నట్లు ప్రకటించింది.

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ నివేదికను తయారు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో నదీగర్భాల్లో ఇసుకను తవ్వడంతోపాటు ఒకే సంస్థ గుత్తాధిపత్యంలో ఇది నడుస్తున్నట్లు కూడా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కోర్టుకు తెలిపింది.

ఈ నేపథ్యంలో అమరావతి సమీపంలోని ఇసుక రీచ్‌లతో పాటుగా గుంటూరు జిల్లా గుండుమేడ ఇసుక రీచ్‌లను బీబీసీ పరిశీలించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు

భారీ యంత్రాలతోనే తవ్వకాలు

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలను జగన్ ప్రభుత్వం జేపీ పవర్ వెంచర్స్ సంస్థకు అప్పగించింది.

ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరిపి టన్నుకు రూ. 375 ధర చొప్పున తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానిపై నిర్వహణ ఛార్జీల నిమిత్తం అదనంగా రూ. 100 వరకూ వసూలు చేయవచ్చని ప్రభుత్వం నిబంధన పెట్టింది.

కానీ బీబీసీ పరిశీలించిన రీచ్‌లలో ప్రభుత్వం చెప్పిన ధరకు వినియోగదారునికి ఇసుక లభించడం లేదు.

అదనంగా వందల రూపాయలు వసూలు చేస్తున్నారు.

అమరావతి సమీపంలోని ఇసుక ర్యాంపులో టన్నుకి రూ. 600 చొప్పున వసూలు చేస్తున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది.

ఇక జేపీ పవర్ వెంచర్స్ సంస్థ పేరుతో కాకుండా ఇతర పేర్లతో రశీదులు ఇస్తున్నారు.

ఇక నదీగర్భంలో ఇసుక తవ్వకాలకు భారీ యంత్రాలను వాడకూడదు. అయినా పెద్ద పెద్ద ఎక్స్‌కవేటర్లతో ఇసుక తోడటం కనిపించింది.

పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను తోడి భారీ వాహనాల్లో రవాణా చేస్తున్నారు.

నదీగర్భంలో వాహనాల రాకపోకలకు కట్టలూ నిర్మించారు. నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి దారులు ఏర్పాటు చేసుకున్నారు. వరదల సమయంలో నదీ ప్రవాహానికి ఆ కట్టలు ఆటంకంగా మారే ప్రమాదం ఉంది.

నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వడం వల్ల నదిలో పెద్దపెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. ఈతకు వెళ్లిన పిల్లలు లోతు తెలియక ఇటువంటి గోతుల్లో పడి చనిపోయిన సందర్భాలున్నాయి. కృష్ణా నదిలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.

"పెద్ద పెద్ద యంత్రాల సహాయంతో నదీ గర్భాన్ని కొల్లగొడుతున్నారు. టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తున్నారు. వాటివల్ల నదీ ప్రవాహాల్లో వేగం, దిశ కూడా మారిపోతున్నాయి’’ అని పర్యావరణ‌వేత్త రమేష్ కుమార్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తరలిస్తున్న లారీలు

స్టాక్ పాయింట్ల నుంచే అని చెబుతూ

ప్రస్తుతం ఇసుక తవ్వకాలు జరపడం లేదని, స్టాక్ పాయింట్లలో నిల్వ చేసిన ఇసుకను మాత్రమే తరలిస్తున్నామంటూ ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది.

కానీ బీబీసీ పరిశీలించినప్పుడు అమరావతి, గుండిమేడ వద్ద నది మధ్యలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడే ఇసుకను ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లలో లోడ్ చేస్తున్నారు.

స్టాక్ పాయింట్ వద్ద ఇసుక తక్కువగా ఉండటంతో తవ్వుతున్నామని జేపీ వెంచర్స్ ప్రతినిధులుగా చెప్పుకొంటున్నవారు బీబీసీకి తెలిపారు.

జేపీ పవర్ వెంచర్స్ మాత్రమే ఇసుక తవ్వకాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ అందుకు విరుద్ధంగా అనేక చోట్ల సబ్ కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాల్లో పెత్తనం చేస్తున్నట్టు బీబీసీ పరిశీలనలో కనిపించింది. అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులే ఇసుక తవ్వకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇటీవల మల్లాది సమీపంలోని ఇసుక రీచ్‌లో తవ్వకాలను కవర్ చేయడానికి వెళ్లిన ఈనాడు విలేకరి మీద దాడి జరిగింది.

ఈ ఘటనలో వైఎస్సార్సీపీ నేతల మీద ఫిర్యాదులు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదైంది.

సామాన్యులు ఎదురుచూడాల్సిందే

సహజంగా గోదావరి, కృష్ణా వంటి ప్రధాన నదుల్లో వరదల సీజన్ లో మినహా ఏడాదికి ఏడెనిమిది నెలల పాటు ఇసుక తవ్వకాలు జరుగుతాయి.

ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణా నదిలో కొద్ది రోజులు మినహా ఏడాది పొడవునా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.

గోదావరిలో కూడా స్వల్ప విరామం మినహా ఇసుక తవ్వకాలకు వరదల వల్ల ఆటంకం కలగలేదు.

అయినప్పటికీ సామాన్యులకు మాత్రం ఇసుక అందుబాటులో ఉండడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఏపీలోని ఇసుక ర్యాంపుల నుంచి తవ్విన ఇసుక తరలిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

"ఇసుక కావాలంటే దళారీలనే ఆశ్రయించాలి. నేరుగా ఎవరైనా ర్యాంపు వద్దకు వెళ్లి ఇసుక కొనుగోలు చేయవచ్చంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అది ఆచరణలో లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అదనంగా రెండు, మూడు వందల వేసి ఇవ్వాలి. అందుకు తోడుగా సొంత వాహనాల్లో వెళ్లి ఇసుక తెచ్చుకుందామన్నా సాధ్యం కాదు. వారు నిర్ణయించిన వాహనంలోనే, వాళ్లకు నచ్చిన సమయంలో ఇసుక వేస్తారు" అని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం నేత కాటమరాజు అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక తవ్వకాలు

అనుమతుల్లేని చోట కూడా తవ్వకాలు

రాష్ట్రవ్యాప్తంగా అనుమతులున్న ఇసుక ర్యాంపులు 110 ఉన్నాయి.

వాటికి తోడుగా డీ సిల్టింగ్ పాయింట్ల పేరుతో బోట్స్‌మెన్ సొసైటీలు వంటివి నిర్వహించే మరో 42 పాయింట్లు ఉన్నాయి.

ఇసుక రీచ్ ల ద్వారా 77 లక్షల టన్నులు, డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా 90లక్షల టన్నుల ఇసుక తవ్వుకునేందుకు పర్యావరణ అనుమతులున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

2021 నుంచి ఈ కాలంలో సుమారు 7 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపినట్టు . దాని ద్వారా ప్రభుత్వానికి రూ. 2500 కోట్ల వరకూ ఆదాయం వచ్చిందని వెల్లడించింది.

చంద్రబాబు

ఫొటో సోర్స్, Getty Images

గతంలోనూ

ఏపీలో ఇసుక తవ్వకాల మీద గతంలోనే ఎన్జీటీ సీరియస్ అయ్యింది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏపీ ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిందంటూ రూ. 100 కోట్ల జరిమానా కూడా విధించారు.

ఏపీలోని ఇసుక రీచ్‌లకు మంజూరయిన ఈసీలు( ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్) 2023 సెప్టెంబర్ లో రద్దు చేసింది. సియా సెమీ మెకనైజ్డ్ పద్ధతుల్లో తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇసుక తవ్వకాలకు కొత్తగా ఈసీలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్జీటీ, ఏపీ హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కృష్ణా నదిలోని ఇసుక రీచ్‌ల వెంబడి వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి. వందలాది లారీలతో నిత్యం తవ్వకాలు సాగుతున్నాయి.

చివరకు పల్నాడు జిల్లా కలెక్టర్ స్వయంగా రీచ్ ని సందర్శించి, తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించిన కొన్ని గంటలకు మళ్లీ అదే రీచ్ లో తవ్వకాలు ప్రారంభించారు.

క్షేత్రస్థాయిలో బీబీసీ దృష్టికి వచ్చిన విషయాలను మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, అక్రమాలను నియంత్రించేందుకు తాము ప్రయత్నిస్తున్నామంటూ గుంటూరు జిల్లా అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి అన్నారు.

‘‘ఎన్జీటీ ఆదేశాలు పాటిస్తున్నాం. ఇసుక దందాని అడ్డుకుంటున్నాం. ఎస్ఈబీ నిఘా ఉంది. రూ. 2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాలున్నాయి. ఎస్ఈబీ ఇప్పటి వరకు 18వేల కేసులను నమోదు చేసింది. 6.36 లక్షల టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నాం. కొందరికి శిక్షలు పడ్డాయి. కాబట్టి నిబంధనలు అనుసరించే విషయంలో

ఫిర్యాదులకు సకాలంలో స్పందించే యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తున్నాయి’’ అని ఆయన వివరించారు.

ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నయానే కేంద్ర పర్యావరణ, అటవీశాఖ వాదనతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. నియంత్రణకు చర్యలు తీసుకున్నామని, ఇసుక అక్రమ తవ్వకాలు సాగడం లేదంటూ విచారణ సందర్భంగా హై కోర్టుకు తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)