తిరుపతి: ఎస్వీ జూ పార్క్‌లో సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి మృతి

- రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
- హోదా, బీబీసీ కోసం
తిరుపతి ఎస్వీ జూ పార్కులో సింహం ఎన్‌క్లోజర్లోకి దూకిన ఒక వ్యక్తిపై లోపల ఉన్న సింహం దాడి చేసింది. ఈ దాడిలో ఆ వ్యక్తి మృతి చెందారు.
మృతుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుజ్జర్‌గా గుర్తించారు.
ఫిబ్రవరి 15న గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ప్రహ్లాద్ సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకినట్లు అధికారులు చెబుతున్నారు.
ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వెంటనే లోపల ఉన్న సింహం దాడి చేయడంతో ప్రహ్లాద్ చనిపోయినట్లు తెలిపారు.
ప్రహ్లాద్ సింహం ఎన్‌క్లోజర్‌లోకి ఎందుకు దూకారు? ఆత్మహత్య ఉద్దేశం ఏమైనా ఉందా? లేదా మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో దూకారా? అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అసలేం జరిగింది?
ఎస్వీ జూలో గురువారం ఓ మోస్తరు రద్దీ ఉంది.
జూ పార్కులో ఉన్న సింహాల ఎన్‌క్లోజర్‌లో మూడు సింహాలు ఉంటాయి. వాటిలో రెండు మగవి, ఒకటి ఆడది. ఆడ సింహం పేరు సుందరి. మగ సింహాల పేర్లు కుమార్, దొంగలపూర్.
సెక్యూరిటీ బోనులో ఉండే 3 సింహాల్లో ఒక సింహాన్ని విజిటర్స్ సందర్శనార్థం ఎన్‌క్లోజర్‌లోకి వదులుతారు. మరుసటి రోజు మరో సింహాన్ని, ఆ తర్వాతి రోజు మరోదానిని వదులుతారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకూ సందర్శకులు వీక్షించేందుకు వీలుగా ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు.
గురువారం రెండు సింహాలు బోనులో ఉండగా, దొంగలపూర్ అనే ఒక సింహాన్ని మాత్రమే ప్రజల సందర్శనార్థం ఎన్‌క్లోజర్‌లోకి వదిలారు.

మధ్యాహ్నం 2.30 సమయంలో ప్రహ్లాద్ ఎన్‌క్లోజర్ పైకెక్కి లోపలకి దూకేసినట్లు చెబుతున్నారు. ఎన్‌క్లోజర్ 8 అడుగుల ఎత్తు ఉంటుంది.
''జూ పార్క్ వైద్యులు, సిబ్బంది ఉండే ఒక చిన్న షెడ్డు లాంటి నిర్మాణం దగ్గరికి అతను వెళ్లారు. అక్కడి గేటు ఎక్కి లోపలికి దిగిన తర్వాత, ఆ షెడ్డు పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ పైకెక్కి సింహాలకు ఆహారం వేసే ప్రాంతం నుంచి లోపలికి దూకారు'' అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రహ్లాద్ లోపలికి దూకగానే ఎన్‌క్లోజర్‌లోని మగ సింహం దొంగలపూర్ అతనిపై దాడి చేసింది. మెడను నోటకరవడంతో అతను చనిపోయారు. ఈ దాడిలో అతని బట్టలు కూడా పూర్తిగా చిరిగిపోయాయి.

డ్రైవింగ్ లైసెన్స్‌తో వివరాలు
మృతుడి ప్యాంట్ జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతను ప్రహ్లాద్ గుజ్జర్ అని, రాజస్థాన్‌కు చెందిన వాడని గుర్తించారు.
మృతుడి జేబులో ఉన్న ఫోన్ నంబర్లకు కాల్ చేయడం ద్వారా అతను డ్రైవర్ అని, రెండు నెలల కిందట ఇంటి నుంచి వచ్చేసినట్లు తెలిసిందని తిరుపతి రూరల్ సీఐ తహీం అహ్మద్ చెప్పారు.
‘‘మృతుడి దగ్గర ఉన్న ఫోన్ నంబర్స్ ద్వారా వారిని కాంటాక్ట్ చేసినప్పుడు, అతను రాజస్థాన్ వాసి అని తెలిసింది. డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలల కిందట జీవనోపాధి కోసం ఇంటి నుంచి వచ్చేశాడని అతని కుటుంబ సభ్యులు చెప్పారు. కేర్ టేకర్స్, డాక్టర్లు, సింహాలకు ఆహారం ఇచ్చే వాళ్లు ఉండే షెడ్డు గేటును దూకేసి లోపలికి వెళ్లాడు. దానిని గమనించిన సిబ్బంది అరుస్తుండగానే పరిగెత్తుకుని వచ్చి రెస్ట్ రూమ్ దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ పైకెక్కి కంచె పైనుంచి లోపలికి దూకేశాడు’’ అని ఆయన చెప్పారు.

అతను ఎందుకు లోపలికి దూకారనే వివరాలు దర్యాప్తులో తేలుతాయని పోలీసులు చెబుతున్నారు.
‘‘ఎప్పుడూ ఎన్‌క్లోజర్‌కు లాక్ వేసి ఉంచుతారు. సందర్శకులు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయరు. అతను అలా చేయడానికి కారణం అతని మానసిక స్థితా? లేక వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా? అనేది తెలుసుకుంటున్నాం. దీనిపై అతని కుటుంబ సభ్యులను విచారిస్తే కానీ ఒక నిర్ధారణకు రాలేం. సిబ్బంది ఆపేలోపే దూకేశాడు. తర్వాత జూ అధికారుల నుంచి మాకు సమాచారం వచ్చింది.’’ అని సీఐ చెప్పారు.
సెల్ఫీలు, వైరల్ వీడియోల మోజులో ఇలా చేశారా? అనే సందేహాలపై కూడా తిరుపతి పోలీసులు స్పందించారు.
‘‘అతను సెల్ఫీ కోసం వెళ్లినట్లు అనిపించడం లేదు. ఎందుకంటే, అతని ఫోన్ ఇప్పటి వరకూ ట్రేస్ కాలేదు. అతని దగ్గర జేబులో ఒక చీటీ ఆధారంగా ఫోన్ నంబర్లు గుర్తించాం. అతని దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతను ప్రహ్లాద్ అని గుర్తించాం. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత, ఏం జరిగిందో తెలుసుకుంటాం'' అని సీఐ తహీం అహ్మద్ చెప్పారు.

'వద్దని వారిస్తున్నా దూకేశాడు'
ప్రహ్లాద్ గుజ్జర్ సింహాల ఎన్ క్లోజర్ వైపు వెళ్తున్నప్పుడు జూ సిబ్బంది అతన్ని అడ్డుకోడానికి ప్రయత్నించారని అక్కడి వారు చెబుతున్నారు. లోపలికి వెళ్లొద్దని గట్టిగా అరుస్తూ వారించే ప్రయత్నం చేశామని, ఈలోపే అతను లోపలికి దూకేశాడని అంటున్నారు.
అతను విజిటర్‌లానే వచ్చారని, ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదని జూ పార్క్ క్యూరేటర్ సెల్వం బీబీసీకి చెప్పారు.
‘‘విజిటర్‌లాగే లోపలికి వచ్చాడు. సింహాల ఎన్‌క్లోజర్ దగ్గర, నైట్ హౌస్ దగ్గర అక్రమంగా లోపలికి ప్రవేశించాడు. అక్కడ ఉన్న సిబ్బంది ఆగమని చెబుతున్నా, వారిస్తున్నా వినకుండా నైట్ హౌస్ పక్కన ఉన్న ఫెన్సింగ్ పైకెక్కి లోపలికి దూకేశాడు’’ అని చెప్పారు.
‘‘ఆ సమయంలో అక్కడ ఒక మగ సింహం విజిటర్స్ కోసం ఎన్‌క్లోజర్‌లో ఉంది. లోపలికి దూకిన అతన్ని చూడగానే దాడి చేసింది. ఆ సమయంలో మా సిబ్బంది, స్టాఫ్ డాక్టర్లు దానిని అడ్డుకోడానికి చాలా ప్రయత్నించారు. కానీ, అది అతన్ని ఎన్‌క్లోజర్ లోపలికి తీసుకెళ్లి పోయింది. ఆ సింహాన్ని లోపల బంధించిన తర్వాత పోలీసులు, అందరూ వచ్చారు. ఈ ఘటనపై ప్రస్తుతం కేసు నమోదైంది. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు.

తమ జూలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని సెల్వం చెప్పారు. ఆ వ్యక్తి కావాలనే లోపలికి దూకాడు కాబట్టే తాము కాపాడలేకపోయామని ఆయన అన్నారు.
సింహాలు ఉన్న చోట జనం పక్కకు వెళ్తేనే వారిస్తుంటామని, అతన్ని కూడా వెళ్లొద్దని వారించామని, కానీ పరిగెత్తుకుంటూ వెళ్లి దూకడం వల్ల ఇలా జరిగిందని సిబ్బంది చెబుతున్నారు.
మరోవైపు, ఇది జూ అధికారుల వైఫల్యమేనని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఎస్వీ జూ చుట్టుపక్కల ఎక్కడా కెమెరాలు లేవని, కెమెరాలు ఉండుంటే సీసీ టీవీలో చూసి అతన్ని ముందే ఆపేందుకు అవకాశం ఉండేదని జూ పార్క్ పక్కనే ఉన్న పుదిపట్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ బడి సుధా యాదవ్ ఆరోపించారు.
జూ పార్క్‌లో కొంతభాగం పుదిపట్ల పంచాయతీ పరిధిలోకి, మిగిలిన భాగం అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది.
జూలో సింహం మనిషి రక్తాన్ని రుచిచూసింది కాబట్టి, జూ సిబ్బంది మరింత అప్రమత్తం కావాలని ఆయన సూచించారు. జూలో సెక్యూరిటీని మరింత పెంచి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి:
- దామోదరం సంజీవయ్య: సీఎం పదవి చేపట్టినా కులం పేరుతో అవమానాలు తప్పలేదా?
- పులికాట్: రోడ్డు వేస్తేనే ఓటేస్తామని ఆ 24 గ్రామాల ప్రజలు ఎందుకంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా ఆ కుటుంబాలదే హవా, ఎవరు వారు, ఏయే సీట్లు...
- పీవీ నరసింహారావుకు భారతరత్న: ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
- తెలంగాణ తల్లి, తెలుగు తల్లి, ఆంధ్ర మాత... భాషా రాష్ట్రాల్లో ఈ విగ్రహాల సంప్రదాయం ఎప్పుడు మొదలైంది, ఎలా మారుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














