పుతిన్ బద్ధ వ్యతిరేకి అయిన అలెక్సీ నావల్నీ అప్పట్లో ‘పాయిజన్ అటాక్’ నుంచి ప్రాణాలతో ఎలా బయటపడ్డారు?

నావల్నీ

ఫొటో సోర్స్, Getty Images

జైల్లో రష్యా ప్రతిపక్ష నేత, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడు అలెక్సీ నావల్నీ మృతికి రష్యా ప్రభుత్వం బాధ్యత వహించాలని నార్వే డిమాండ్ చేస్తోంది.

రష్యా అణచివేతను ప్రతిఘటించినందుకు నావల్నీ తన ప్రాణాలనే కోల్పోవాల్సి వచ్చిందని ఫ్రాన్స్ అంటోంది.

ఆర్కిటిక్ సర్కిల్‌లోని జైలులో శుక్రవారం వాకింగ్ అనంతరం నావల్నీ అస్వస్థతకు గురయ్యారని, అనంతరం స్పృహ కోల్పోయారని, అత్యవసర వైద్య బృందం వెంటనే ఆయనకు చికిత్స చేసిందని, అయినా ఫలితం లేకపోయిందని రష్యా అధికారులు చెబుతున్నారు.

ఇంతకూ ఎవరీ అలెక్సీ నావల్నీ? జైలులో ఎందుకున్నారు? ఆయన మృతికి రష్యా ప్రభుత్వమే కారణమనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి?

అలెక్సీ నావల్నీ

ఫొటో సోర్స్, REUTERS

పుతిన్‌పై నావల్నీ పోరాటం

1976 జూన్ 4న మాస్కోకు పశ్చిమాన ఉన్న బుటిన్ అనే గ్రామంలో నావల్నీ జన్మించారు

మాస్కోకు 100 కి.మీ (62 మైళ్లు) దూరంలో ఉన్న ఓబ్నిన్స్క్‌లో ఆయన పెరిగారు.

1998లో మాస్కోలోని ఫ్రెండ్‌షిప్ ఆఫ్ పీపుల్స్ యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు నావల్నీ.

ఆయన భార్య పేరు యూలియా. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

నావల్నీ రష్యా ప్రతిపక్షంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి. అధ్యక్షుడు పుతిన్‌‌కు బద్ధ వ్యతిరేకి.

దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న పుతిన్ పార్టీ అవినీతిని నావల్నీ బట్టబయలు చేశారని మద్దతుదారులు చెబుతారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా రష్యా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించగలిగే సత్తా నావల్నీకి ఉంది.

అలెక్సీ నావల్నీపై విష ప్రయోగం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, 2020 ఆగస్టులో నావల్నీ విమానంలో సైబీరియా నుంచి మాస్కో తిరిగివస్తుండగా స్పృహ కోల్పోయారు. చికిత్స కోసం జర్మనీకి తరలించారు.

విష ప్రయోగం.. జర్మనీలో చికిత్స

2020 ఆగస్టులో నావల్నీపై విషప్రయోగం జరిగింది. దీనికోసం నోవిచోక్ అనే నర్వ్ ఏజెంట్ (నాడీకణ వ్యవస్థపై ప్రభావం చూపే పదార్థం)ను ఉపయోగించారని దర్యాప్తులో తేలింది.

ఆయన విమానంలో సైబీరియా నుంచి మాస్కో తిరిగివస్తుండగా స్పృహ కోల్పోయారు. చికిత్స కోసం ఆయన్ను అత్యవసరంగా జర్మనీకి తరలించారు. అక్కడే ఆయన చికిత్స తీసుకున్నారు. అలా ఆయన ‘పాయిజన్ అటాక్’ నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.

2021లో జర్మనీ నుంచి తిరిగి వస్తున్న సమయంలో నావల్నీని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ కుట్ర అని, ఇది ప్రభుత్వం పనేనని ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది.

2021 జనవరిలో నావల్నీ రష్యాకు తిరిగిరావడం ప్రతిపక్షశ్రేణులకు కొంత ఊరటనిచ్చింది. కానీ, వెనువెంటనే మోసం, కోర్టు ధిక్కారం కేసులో నావల్నీని పుతిన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.

జర్మన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘించారనే కారణంతో మొదట రెండున్నర ఏళ్లు జైలులో ఉంచారు.

ఆ తర్వాత మోసం, కోర్టు ధిక్కారం కింద అదనంగా మరో తొమ్మిదేళ్లు జైలు శిక్ష విధించారు.

రష్యాలో ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తున్న సమయంలో ఆయనపై ఈ కేసు విచారణ ప్రారంభమైంది.

యుక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన ఏడాది తర్వాత, చాలా మంది ప్రముఖ ప్రతిపక్ష నేతలను మాస్కో బహిష్కరించింది.

జైలులో ఉంటూనే ఈ నేరాలన్నింటినీ చేశారని ఆరోపిస్తూ ప్రాసిక్యూటర్లు అభియోగాలను మోపారని నావల్నీ చెప్పారు.

తన మీద అసలు ఏ విషయంలో ఆరోపణలు చేస్తున్నారో కనుక్కోవడం అసాధ్యమని నావల్నీ చెప్పారు.

తీవ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం, ప్రజల్లో తీవ్రవాద కార్యకలాపాలను వ్యాప్తి చేయడం, నాజీ భావాజలాన్ని పునరుద్ధరించడం లాంటి నేరారోపణలతో నావల్నీపై కేసులు పెట్టారు.

మొత్తంగా వివిధ కేసుల్లో దోషిగా తేలిన నావల్నీ 19 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమనే విమర్శలు ఉన్నాయి.

రష్యా

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, గతంలో పుతిన్ వ్యతిరేక నిరసనల సందర్భంగా నావల్నీకి మద్దతుగా రోడ్లపైకి వచ్చిన ప్రజలు

రష్యా విడిచిన అనుచరులు

నావల్నీ జీవిత కథ ఆధారంగా చిత్రీకరించిన 'నావల్నీ' సినిమా ఈ ఏడాది ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఆస్కార్ గెలుచుకుంది.

నావల్నీ ప్రధాన రాజకీయాస్త్రం 'యాంటీ-కరప్షన్ ఫౌండేషన్' (ఎఫ్‌బీకే) సంస్థ. ఇది బహిర్గతం చేసిన పలు అంశాలను ఆన్‌లైన్‌లో లక్షల మంది వీక్షించారు.

2021లో రష్యా ప్రభుత్వం ఎఫ్‌బీకేను అతివాద సంస్థగా పేర్కొంది. నావల్నీపై అవినీతి కేసులు వేసింది. అవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న అవినీతి ఆరోపణలని నావల్నీ చాలాసార్లు ఖండించారు.

నావల్నీ సహచరులు పలువురు భద్రతాధికారుల ఒత్తిడికి లొంగిపోయారు. ఎఫ్‌బీకే మాజీ హెడ్ ఇవాన్ జ్దానోవ్, ఎఫ్‌బీకేలో ప్రముఖ లాయర్ లియుబోవ్ సోబోల్ సహా కొందరు విదేశాలకు పారిపోయారు.

రష్యావ్యాప్తంగా నావల్నీ కార్యాలయాల ఉన్నతాధికారుల్లో చాలా మంది దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు.

నావల్నీ కుడి భుజంగా పేరుగాంచిన లియోనిడ్ వోల్కోవ్ కూడా 2019లో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటూ రష్యా విడిచి పారిపోయారు.

జైల్లో అలెక్సీ నావల్నీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జైల్లో అలెక్సీ నావల్నీ

కొత్త జైలులో మృతి

నావల్నీని మెలెఖోవో నుంచి ఉత్తర రష్యాలోని యామెలో నెనెట్స్ జిల్లాలో ఉన్న ‘‘పోలార్ వోల్ఫ్ కాలనీ’’గా పేరున్న ఖార్ప్ ఐకే-3 పీనల్ కాలనీ జైలుకు 2023 చివర్లో తరలించారు.

రష్యాలోని ఈ జైలును అత్యంత కఠినమైన వాటిల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడి ఖైదీల్లో చాలా మంది తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు.

‘‘ఈ కాలనీ చాలా దూరంలో ఉంటుంది. అక్కడికి వెళ్లడం చాలా కష్టం. అక్కడికి వెళ్లి నావల్నీ బాగోగులు తెలుసుకోవడం లాయర్లకు కూడా కష్టమే’’ అని 2023 డిసెంబర్ 25న అలెగ్జీ అధికార ప్రతినిధి కిరా యార్మిష్ తెలిపారు.

ఇప్పుడు ఇదే జైలులో నావల్నీ మరణించారు.

వీడియో క్యాప్షన్, పుతిన్ అణచివేత వల్లే నావల్నీ చనిపోయారన్న ఫ్రాన్స్

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)