చంద్రగిరి నది: వంద కేజీల బరువుండే అత్యంత అరుదైన మంచి నీటి తాబేలును గుర్తించిన పరిశోధకులు

జంతువులు

ఫొటో సోర్స్, PA MEDIA

ఫొటో క్యాప్షన్, దక్షిణ, ఆగ్నేయాసియాలోని నదీతీర ప్రాంతాల్లో ఈ తాబేళ్లు కనిపిస్తాయి

అత్యంత అరుదైన తాబేలు జాతిని భారత్‌లో గర్తించారు.

‘కాంటర్స్ జెయింట్ సాఫ్ట్ షెల్ తాబేలు’కు పైభాగంలో మెత్తని డొప్ప ఉంటుంది. భారీ పరిమాణంలో ఉండే ఇవి సాధారణంగా దాక్కుని ఉండే స్వభావం కలిగి ఉంటూ రహస్య స్థావరాలలో ఉంటాయి.

ఇలాంటి జాతి తాబేలు ఆవాసాన్ని ఇంగ్లండ్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్‌మౌత్ బృందం కేరళలో గుర్తించింది.

దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియా నదీతీరాల్లో కనిపించే ఈ జాతులు అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఉన్నాయి.

ఈ అరుదైన తాబేలును కేరళలోని చంద్రగిరి నది ఒడ్డున గుర్తించారు.

''ఈ జాతి చాలా అరుదు, రహస్యంగా ఉండే స్వభావం ఉంటుంది. ఇవి చాలా కాలంగా జీవసంరక్షకుల్లో ఆసక్తిని పెంచడంతో పాటు ఆందోళనకు గురిచేశాయి'' అని పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీ ప్రతినిధి అన్నారు.

పరిరక్షణ

ఫొటో సోర్స్, PA MEDIA

ఫొటో క్యాప్షన్, ఈ తాబేళ్లను అంతరించిపోతున్న జీవజాతుల్లో పేర్కొన్నారు

''భారత్‌లోని జీవవైవిధ్యం నేపథ్యంలో కాంటర్ తాబేలు ఉనికి గురించి అప్పుడప్పుడూ మాత్రమే వినిపించేది'' అని పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్‌కి చెందిన డాక్టర్ ఫ్రాంకోయిస్ కబాడా - బ్లాంకో అన్నారు.

ఇవి ఎక్కడున్నాయో వెతకడానికి అనేక ప్రయత్నాలు చేసినా అవన్నీ విఫలమయ్యాయి. అయితే, ఈ పరిశోధన బృందం సంప్రదాయ పర్యావరణ విధానాలను అనుసరిస్తూ విలక్షణ మార్గాన్ని ఎంచుకుంది. స్థానికుల సాయం, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తాబేలు స్థావరాన్ని గుర్తించగలిగారు.

స్థానికులు తెలిపిన విషయాలు, అక్కడి వ్యక్తుల సాయంతో పరిశోధకుల బృందం ఈ తాబేలు జాతి ఆవాసాన్ని గుర్తించగలిగిందని డాక్టర్ కబాడా బ్లాంకో చెప్పారు.

పరిరక్షణ

ఫొటో సోర్స్, PA MEDIA

ఫొటో క్యాప్షన్, తాబేళ్ల ఆవాసాన్ని గుర్తించేందుకు పరిశోధకుల బృందం స్థానికుల సాయం తీసుకుంది

ఈ ప్రయత్నం ఆడ తాబేలు గూడు సంరక్షణతో పాటు వరదల నుంచి దాని గుడ్లను రక్షించేందుకు దోహదం చేసింది. ఆ తర్వాత పొదిగిన పిల్లలను నదిలోకి వదిలారు.

మంచినీటిలో ఉండే ఈ కాంటర్ జెయింట్ సాఫ్ట్‌షెల్ తాబేళ్లు దాదాపు ఒక మీటరు (3 అడుగులు) కంటే ఎక్కువ పొడవు, 100 కేజీలకు పైగా బరువు ఉంటాయి.

పరిశోధన బృందం ప్రస్తుతం తాబేళ్లను గుర్తించిన ప్రాంతానికి సమీపంలో కమ్యూనిటీ హేచరీ, నర్సరీ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)